Sakshi News home page

సలాం ఆపా

Published Sat, Dec 2 2017 9:01 AM

 Noura sheikh Special Story On women Empowerment - Sakshi

ఆపా అంటే అక్కయ్య అని అర్థం. నౌహిరా షేక్‌ వేలాది మంది మహిళలను ఒక అక్కలా ఆదుకుంటోంది. వారికి బతుకు బాట చూపిస్తోంది.

రోల్‌ మోడల్‌ మా నాన్న
చిన్నప్పటి నుంచి నేను మా నాన్న చేసే వ్యాపారాన్ని దగ్గరుండి చూసేదాన్ని. వ్యాపారంలో నష్టాలు వచ్చినా నిరుత్సాహ పడేవారు కాదు. ఈసారి పోయింది...
మళ్లీ నేను సాధిస్తానులే అబ్బా అనే వారు. ఈ గుణమే నాకూ వచ్చింది. నేను ఇంతమంది మహిళలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి నేడు అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారం చేస్తున్నానంటే మా నాన్న ద్వారా ఎంతో నేర్చుకోబట్టే!

ఇటీవల పాకిస్తాన్‌ ఉగ్రవాద దాడుల్లో మన జవాన్లు వీర మరణం పొందారు. దేశ రక్షణ కోసం ప్రాణాలర్పించిన అమరుల కోసం ఏదైనా చేయాలనే ఉద్దేశంతో వీర మరణం పొందిన అమరవీరుల కుటుంబాలకు ఆసరాగా నిలుద్దామని ప్రతి కుటుంబానికి నాలుగు లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు నౌహిరా షేక్‌. వీరజవాన్‌ల పిల్లల విద్య కోసం పతి నెల కొంతమొత్తం కేటాయిస్తున్నారు.
యాసిడ్‌ దాడుల్లో అందాన్ని, తమ శరీర ఆకృతిని కోల్పోయిన అమ్మాయిలకు వైద్యం చేయిస్తున్నారు.  
బంగారం వ్యాపారంతో పాటు పప్పులు, మసాలా దినుసులు, ఉప్పు, కారం వంటివి తయారు చేయించి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దాదాపు 20 వేల మంది ఉద్యోగులు వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్నారు. ఆమె మహిళల కోసం ప్రారంభించిన దుస్తులు, బంగారం, ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ వ్యాపారం ద్వారా ఆంధ్ర, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో దాదాపు 6 వేల కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడ్డాయి. ఇవన్నీ సాధించిన మహిళ నౌహిరా షేక్‌.
గత 20 ఏళ్లల్లో లక్షల మంది అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుతో పాటు వారిలో విద్య వ్యాప్తి కోసం శ్రమిస్తున్నారామె. దేశ, విదేశాల్లో ఒక సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ ఉమన్‌గా ఎదిగిన హిరా గ్రూప్‌ అధినేత్రి నౌహిరా షేక్‌ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అత్యధిక ఆస్తిపన్ను చెల్లించే వ్యాపారవేత్త కూడా... ఆమె పరిచయం.
‘‘మాది చిత్తూరు జిల్లా కల్లూరు మండలం పాలెం గ్రామం. మా తాత ముత్తాతల నుంచి మాది వ్యాపార కుటుంబం. మా తాత, మా నాన్న సీజనల్‌ వ్యాపారం చేసేవారు. ఎండాకాలంలో మామిడిపండ్ల వ్యాపారం. మామూలు రోజుల్లో బట్టల వ్యాపారం చేసేవారు. మా తాత మరణించిన అనంతరం నాన్న కల్లూరు మండలానికి వచ్చేశారు. అక్కడే వ్యాపారం చేసేవారు.

నా తపన అలా తెలిసింది నాన్నకు
మేము నలుగురు కూతుళ్లు, ముగ్గురు కుమారులు సంతానం.. ఆ రోజుల్లో అమ్మాయిల విద్య పట్ల అంత ప్రాముఖ్యత ఇచ్చేవారు కాదు. మా తమ్ముళ్లకు ఇంగ్లిష్‌ ట్యూషన్‌ కోసం ఇంటికి ఉపాధ్యాయుడు వచ్చేవారు. నాకు, మా చెల్లెళ్లకు కాకుండా మా తమ్ముళ్లకే చెప్పించేవారు. నేను పక్కనే ఉండి అంతా నేర్చుకునేదాన్ని. ఓసారి ఉపాధ్యాయుడు ఇంగ్లిష్‌లో బోధిస్తున్నారు. అటు ఉపాధ్యాయునికి... ఇటు నాన్నకు తమ్ముళ్లకంటే బాగా ఇంగ్లిష్‌పాఠాలు వినిపించాను. నా తపన అప్పుడు తెలిసింది మా నాన్నకు.

బాల్య వివాహం
ఆరో తరగతి వరకు చదివించి 13 ఏళ్లకే పెళ్లి చేశారు. వివాహం అనంతరం నన్ను అత్తగారింటికి పంపించలేదు. నేను ఇంట్లోనే ఉండేదాన్ని. ఆ సమయంలో చుట్టుపక్కల ఉన్న అందరూ అమ్మాయిలు, మహిళలను మా ఇంట్లోకి పిలిపించుకొని ధార్మిక, ప్రాపంచిక విద్యను నేర్చుకోవడంతో పాటు బోధించేదాన్ని. ఇలా రెండేళ్లు గడిచాయి. అనంతరం నన్ను అత్తగారింటికి పంపాలని మా కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. ‘నేను పై చదువులు చదువుతాను... అత్తారింటికి వెళ్లను...’ అని నాన్నను వేడుకున్నాను. ఈ క్రమంలో ఒత్తిళ్లు, గొడవలు జరిగాయి. ఇస్లాం ధర్మంలో మహిళల విద్య పట్ల ఎంతో ప్రాముఖ్యత ఉంది. అమ్మాయిలు కూడా చదువుకోవాలని మహ్మద్‌ ప్రవక్త ఎన్నో సందర్భాల్లో బోధించారు. మన ధర్మం కూడా అమ్మాయిల చదువును ప్రోత్సహిస్తుంటే మీరెందుకు మమ్మల్ని చదివించడం లేదు. అబ్బాయిల కంటే అమ్మాయిలే బాధ్యతాయుతంగా పని చేస్తారు అని వాదించేదాన్ని.

విద్య
 వ్యాపార రీత్యా మా నాన్న కల్లూరు నుంచి తిరుపతికి మకాం మార్చారు. పద్దెనిమిదేళ్ల వయసులో తోటి మహిళలతో ఉర్దూ అండ్‌ అరబిక్‌ డెవలప్‌మెంట్‌ సొసైటీ అనే సంస్థ రిజిస్టర్‌ చేశాం. ఆరుగురితో మొదలైన పాఠశాల ఆరునెలల్లో 100 మందికి చేరింది. బేసిక్‌ తెలుగు, ఇంగ్లిష్, గణితంతో పాటు ధార్మిక విద్య కూడా బోధించాను. నేను దూరవిద్య ద్వారా డిగ్రీ, అనంతరం ఎంబీఏ, పీహెచ్‌డీ చేశాను. ఈ రోజు దాదాపు 1000 మంది అమ్మాయిలు ఇందులో చదువుతున్నారు. ఇందులో దాదాపు 600 మందికి హాస్టల్‌ వసతితో సహా అన్ని వసతులను కల్పిస్తున్నాం. మా పాఠశాలల్లో చదివిన ఎంతోమంది అమ్మాయిలు ఇంజినీరింగ్, మెడిసిన్, ఎంబీఏ చేసి దేశవిదేశాల్లో స్థిరపడ్డారు. మరి కొందరు18 రాష్ట్రాల్లో సొంతంగా పాఠశాలలను ఏర్పాటు చే సి మహిళల విద్య కోసం కృషి చేస్తున్నారు.

20 ఏళ్ల ప్రయాణంలో కష్టాలు ఎన్నో...
స్కూల్‌ ప్రారంభించినప్పుడు ఎంతోమంది ఎగతాళి చేశారు. దేవుడు ఏది చేసినా నా మంచికే చేస్తాడని నాకు పూర్తి విశ్వాసం ఉంది. అన్నింటినీ ధైర్యంగా ఎదుర్కొన్నాను. ‘ఎప్పటికీ నిరాశపడవద్దు. దేవునిపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్లాలి’ అని చెప్పేవారు మా నాన్న. ఆ మాటే నన్ను నడిపిస్తోంది. – మహమ్మద్‌ మంజూర్‌

ముఖ్యమైన అవార్డులు
ఇందిరా ప్రియదర్శిని అవార్డు
దుబాయిలో ఇండియన్‌ బిజినెస్‌ ఐకాన్‌ అవార్డు
స్టార్‌డస్ట్‌ అవార్డ్‌.

Advertisement
Advertisement