Sakshi News home page

అప్పట్లో అనర్థం... ఇప్పుడు ఆమోదం

Published Thu, Nov 2 2017 1:06 AM

 Now that approval is now approved - Sakshi

అరవయ్యేళ్ల కిందట కనుగొన్న ఒక మందు అప్పట్లో అనర్థం సృష్టించింది. ఫలితంగా ఆంక్షలకు గురైంది. అప్పట్లో ఆ మందు సృష్టించిన అనర్థం ఔషధ చరిత్రలోనే చీకటి అధ్యాయంగా పేరుమోసింది. కొన్నాళ్లకు అదే మందుకు మళ్లీ ఆమోదం లభించింది. జర్మన్‌ శాస్త్రవేత్తలు కనుగొన్న ‘థలిడోమైడ్‌’ అనే మందు 1957లో తొలిసారిగా మార్కెట్‌లోకి విడుదలైంది. అప్పట్లో దీనిని గర్భిణుల్లో తలెత్తే వేవిళ్ల బాధను నయం చేయడానికి వాడేవారు. ఎలాంటి ప్రిస్క్రిప్షన్‌ లేకుండానే దీనిని మందుల దుకాణాల్లో యథేచ్ఛగా అమ్మేవారు. అమ్మకాలు జోరందుకున్న కొద్ది నెలలకే దీని వల్ల తలెత్తిన అనర్థాలు వెలుగులోకి వచ్చాయి. ‘థలిడోమైడ్‌’ వాడిన మహిళలకు పుట్టిన శిశువులు అవయవ లోపాలతో పుట్టారు. అలా పుట్టిన వాళ్లలో అరవై శాతం మంది నెలల పసికందులుగా ఉన్నప్పుడే కన్నుమూశారు.

ఈ మందు దుష్ప్రభావాల ఫలితంగా అవయవ లోపాలతో పుట్టిన శిశువుల్లో దాదాపు పదివేల మంది మాత్రమే బతికి బట్ట కట్టగలిగారు. శాస్త్రవేత్తల అధ్యయనంలో ఈ అనర్థాలన్నింటికీ కారణం థలిడోమైడేనని తేలడంతో అంతర్జాతీయ ఔషధ నియంత్రణ సంస్థలు దీనిపై నానా ఆంక్షలు విధించాయి. తర్వాతి కాలంలో జరిపిన పరిశోధనల్లో ఈ మందు కొన్ని రకాల క్యాన్సర్‌ను సమర్థంగా నయం చేయగలదని నిర్ధారించడంలో ఈ ఔషధానికి మళ్లీ ఆమోదం లభించింది. 

Advertisement

తప్పక చదవండి

Advertisement