ఒకసారి అత్తరు ఒకసారి నెత్తురు | Sakshi
Sakshi News home page

ఒకసారి అత్తరు ఒకసారి నెత్తురు

Published Fri, Nov 14 2014 11:39 PM

ఒకసారి అత్తరు ఒకసారి నెత్తురు

పెద్దవాళ్లు ఏమంటారంటే రచయితలు అలెర్ట్‌గా ఉండాలి అని. ఏమో ఎవరికి తెలుసు. ఏ కథ ఎటు జారిపోతుంటుందో ఎవరికి తెలుసు. ఏ కథ ఎటు మాయమైపోతుందో ఎవరికి తెలుసు. పట్టుకోవాలి. కొన్ని కథలు కొన్ని స్థలాల్లో మాత్రమే పుడతాయి. పట్టుకోవాలి. కొన్ని కథలు కొన్ని సమయాల్లో మాత్రమే పుడతాయి. పట్టుకోవాలి.

ఉదాహరణ చూద్దాం.

అక్తర్ మొహియుద్దీన్ ప్రఖ్యాత కాశ్మీరీ రచయిత. కాశ్మీరీ భాషను ఉపయోగించి మొదటిసారి నవల రాసింది ఆయనే అని అంటారు. ఇప్పటివాడు కాదు. కాశ్మీర్ అనేది ఒక అందమైన లోయగా, మంచుపువ్వుగా, పూలగుచ్ఛంగా ఉన్నప్పుడు మొదలయ్యాడు. 1958 నాటికే సాహిత్య అకాడెమీ అవార్డ్ వరించేంత గట్టి కృషి చేశాడు.

అప్పట్లో ఆయన ఒక కథ రాశాడు. దర్జీ కథ.  పేరు ‘పెళ్లికూతురి పైజామా’. ఏం లేదు. ఇద్దరు చాలా ముసలి భార్యాభర్తలు. భర్త దర్జీ పని చేస్తుంటాడు. భార్య అతనికి వంట చేసి పెడుతూ ఉంటుంది. వారికి కొంతమంది పిల్లలు. మగపిల్లలు ఏనాడో పోయారు. ఆడపిల్లలు బతికి బట్టకట్టారు. వాళ్లకు పెళ్లిళ్లయ్యాయి. అల్లుళ్లకు ముసలితనం కూడా  వచ్చేస్తోంది.  మరి ఈ ముసలివాళ్లు ఏం చేస్తుంటారు? రోజూ ఒకటే పని. అతను కూనిరాగం తీస్తూ రోజూ ఏదో బట్ట కుడతాడు. ఆమె తోడుగా ఉంటూ మసలుతూ ఉంటుంది. అంతే. ఒకరోజు ఆమెకు ఏమీ తోచక పాత బట్టలు మూటగడుతూ ఉంటే ఆమె పెళ్లినాటి పైజామా ఒకటి బయటపడుతుంది. ఎర్రటి పైజామా. అంచుల్లో చిన్న నగిషీ అల్లిక. నిఖారోజు దానిని తొడుక్కుందట. చేతుల్లోకి తీసుకోగానే సిగ్గు ముంచు కొచ్చింది. భర్త అది చూశాడు. పెళ్లినాటి రోజును ఎవరు మాత్రం మర్చిపోతారు గనక. ఆ ఎర్ర పైజామాను గుర్తుపట్టాడు. ఏనాటి సరసమో... ఆ క్షణాన ఉబికి వచ్చింది. ఒకసారి వేసుకొని చూపించవా అన్నాడు. ఆమె సిగ్గుపడింది. ఉత్తుత్తి కోపానికి పోయింది. నా వల్ల కాదు బాబూ అని తల అడ్డంగా ఊపింది. ఊహూ. అతను వినలేదు. ఆమెను ఉత్సాహపరచడానికి హుషారుగా బజారుకు వెళ్లి మాంసం కొనుక్కు వచ్చాడు. కూనిరాగం మరికాస్త అందంగా అందుకున్నాడు. ఇక ఆమె పైజామా తొడుక్కుని తీరవలసిందే. తొడుక్కుంది. పండు ముసలి వయసులో మరోసారి పెళ్లికూతురిలా మారి సిగ్గుల మొగ్గయ్యి తల దించుకుంది. భర్త చాలా సంతోషపడ్డాడు. దగ్గరగా వచ్చి ఆమెను హత్తుకొని ఎత్తుకొని తిప్పినంత పని చేశాడు. ఎంత మంచి క్షణాలు అవి. ముసలితనాన్ని మాయం చేసి నవ ఉత్సాహాన్ని ఇచ్చిన క్షణాలు. ఇంతలో ఎవరో వచ్చారు. చూస్తే అల్లుడుగారు. అమ్మో అతనుగాని చూస్తే? ఆమె కంగారు పడింది. భర్త లెక్క చేయలేదు. చూస్తే ఏమిటోయ్? మనింటికి మనమే రాజు అని హాయిగా మరోసారి హత్తుకున్నాడు.

కథ ముగిసింది.

ఏమీ లేదనుకుంటాము కానీ ఏ క్షణంలో అయినా జీవితం ఎంతో కొంత ఆనందాన్ని ఇస్తూనే ఉంటుంది. లేకుంటే మనుషులు ఎప్పుడో పోయేవారు. అలాగే ఏ క్షణంలో అయినా ప్రేమ ఎంతో కొంత మిగిలే ఉంటుంది. లేకుంటే కూడా మనుషులు ఎప్పుడో రాలిపోయుండేవారు. భారీ టెండరు సాధించుకోవడమే ఆనందం అనకుంటారు కొందరు. భార్య ఎప్పటిదో పైజామాను ఒకసారి వేసుకొని కనిపించడం కూడా ఆనందమే అనుకుంటారు మరికొందరు. ఏం కథ ఇది!

కాని 2000 సంవత్సరంలో నేనొక దర్జీ కథ రాయాలనుకున్నప్పుడు ఇలాంటి ఆనందాలు నాకు కనపడలేదు. నేను చూడలేదు. నేను చూసింది వేరే. చినచేపను పెద చేప. మార్కెట్ ఏం చేస్తుందంటే ఒక బ్రాండ్‌ను సృష్టిస్తుంది. తర్వాత జనాన్ని ఆ బ్రాండ్‌కు బానిసలను చేస్తుంది. రెడీమేడ్ దుస్తుల తుఫాను కమ్ముకుంటున్న కాలంలో సొంతంగా బతుకుదామనుకునే ఒక సాధారణ దర్జీ జీవితంలో ప్రేమకు తావు లేదు. సంక్షోభానికి తప్ప. ఆ సంక్షోభమే నాకు కనిపించింది. అదే ‘న్యూ బాంబే టైలర్స్’ కథ అయ్యింది. వస్తువు ఒక్కటే. కాని స్థలం మారింది. కాలం మారింది. దాంతో కథ కూడా మారింది.

మరైతే ఏమిటి?

అక్తర్ మొహియుద్దీన్ ఆ తర్వాత కూడా ‘పెళ్లికూతురి పైజామా’ వంటి కథలే రాశాడా? స్థలం అలాగే ఉండి కాలం మారితే ఏమవుతుందో తెలుసా? 1990లో అక్తర్ మొహియుద్దీన్ స్వయంగా తన కొడుకునూ, అల్లుణ్ణి కాశ్మీర్ హింసలో కోల్పోయాడు. ఆ దుఃఖంతో ‘ప్రత్యేక కాశ్మీర్’ను డిమాండ్ చేసే హురియత్ కాన్ఫరెన్స్‌లో చేరాడు. ఉద్యమకారుడిగా మారాడు. కాశ్మీర్‌లోయ కల్లోలలోయగా మారడాన్నే తన కథా వస్తువుగా చేసుకున్నాడు. అప్పుడిక అతడి కథల్లో ముసలి భార్యాభర్తల సరదా సంతోషాలకు తావు ఉండదు.  ఒక రచయిత మీద స్థలకాలాలు చూపే మహిమ అలా ఉంటుంది.  అవి ఒక్కోసారి రచయితను పిండి అత్తరు తీస్తాయి.
 
మరోసారి నెత్తురు.  అదిగో ఈ రెండు సందర్భాల్లోనూ వివశులైన వాళ్లే ఆ వివశత్వాన్ని భరించలేక కథలు రాస్తుంటారు. రాసి వ్యక్తమవుతూ ఉంటారు.
 - ఖదీర్
 
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement