ఓరుగల్లు | Sakshi
Sakshi News home page

ఓరుగల్లు

Published Fri, Oct 24 2014 11:15 PM

ఓరుగల్లు

చాళుక్యయుగంలో బాల్యం గడిచిన తెలుగు సాహిత్యం కాకతీయ యుగంలో నిండు యవ్వనాన్ని సంతరించుకొంది. కవిబ్రహ్మ తిక్కన సోమయాజి మహాభారతాన్ని పూర్తి చేస్తే, ప్రతాపరుద్రుని సామంతుడైన గోనబుద్ధారెడ్డి రంగానాథరామాయణం ద్విపదలో రచించాడు. ఓరుగల్లులో బమ్మెర పోతనామాత్యుడు ఆంధ్రమహాభాగవతాన్ని మనకందించాడు. ఆనాటి తెలుగు సంస్కృతికి కేంద్రబిందువై విలసిల్లిన ఏకశిలానగరం గురించి చెప్పాలంటే ఒక కథలో సాధ్యం కాదు.
 
ఓరుగల్లు తెలుగు ప్రజలనందరినీ ఏకఛత్రం కింద పరిపాలించిన కాకతీయుల రాజధాని నగరం. అసలుసిసలైన ఆంధ్రనగరి. ‘విగ్రహారాధకుల జన్నత్’ (హిందువుల పాలిట స్వర్గం) అని ప్రఖ్యాత పారశీక కవి అమీర్ ఖుస్రోచే కీర్తింపబడిన మహానగరం. ఏ దిక్కు చూసినా ఫౌంటెన్స్‌తో కూడిన తోటలు, వాటి లో అరటి, మామిడి, పనస చెట్లు. సంపెంగ, మల్లె, మొగలి పొదలు. నగరం చుట్టూ ఏడు కోటగోడలు. లోపలి రాతికోటలో రాజసౌధాలు. నగరం మధ్య స్వయంభూదేవుడి ఆలయం. దానికి నాలుగు దిక్కులా హంసశిఖరాలతో శిలాతోరణాల ద్వారా నాలుగు రాజవీధులు వెడలేవి. ఆ వీధులు బండ్లు, రథాలు, గుర్రాలు, కాలినడకన పోయేవారితో కిటకిటలాడేవట. మధ్యవీధిలో మాత్రం వేశ్యావాటికలు ఉండేవని క్రీడాభిరామం చెబుతుంది. అక్కలవాడ, భోగంవీధి, వెలిపాళ్లెం, మేదరవాడ, మొహరివాడ వంటి పేటలుగా నగరం విభజింపబడింది. కాకతమ్మ, మైలారదేవుడు, ఏకవీర ఆలయాలే కాక అనేక జైన, శివాలయాలు ఓరుగల్లులో ఉండేవి. నగరానికి పశ్చిమాన హనుమకొండ ప్రముఖ వాణిజ్యకేంద్రం. కాకతీయుల పూర్వరాజధాని.  దొంగైనాసరే దొరైనాసరే కళాకారుడి ప్రతిభకి తగిన ప్రతిఫలం కావాలంటే ఓరుగల్లుకే పోవాలని ప్రతీతి. దొంగతనం కూడా ఒక కళే! మన పూర్వీకులు చతుశ్షష్ఠి కళలలో దొంగతనాన్ని కూడా చేర్చారు.
 ‘గాలిచీరయు, నొల్కిబూడిద, గ్రద్దగోరును, గొంకియున్
 కోలయున్, వెలుగార్చు పుర్వులక్రొవి, ముండులబంతియున్
 మైలమందులు, కొయ్యకత్తెర, మారుగన్నపు కత్తియున్
 నీలిదిండులు, నల్లపూతయు, నేర్పుతోడుగ మ్రుచ్చులున్’

 అంటూ కొరవి గోపరాజు దొంగల పనిముట్లు వర్ణించాడు. వీటిలో గాలిచీర కన్నం వేసాక గాలి జొరకుండా మూయడానికి, పురుగులగొట్టం దీపాలు ఆర్పే పురుగులని గదిలోకి ఊదటానికి, ఇక కొక్కి, చెక్కకోసే రంపం, మత్తుమందు, నీలిబట్టలు, నల్లరంగు ఇలా మన సాహిత్యంలో దొంగలు నేర్చుకునేందుకు చాలా టెక్నిక్‌లు ఉన్నాయి.
 ఓరుగల్లు గురించి చెప్పిన ప్రతి కవీ ఆ నగరంలోని అక్కలవీధిని ప్రస్తావించక వదలలేదు. శ్రీనాథ కవిసార్వభౌముడు భోజనప్రియుడు. ఒక రూకకి అంటే పదిపైసలకి పూటకూళ్ళ ఇంట్లో పెట్టే భోజనాన్ని ఇలా వర్ణించాడు:
     కప్పురభోగి వంటకము, కమ్మని గోధుమపిండి వంటయున్
     గుప్పెడు పంచదారయును, క్రొత్తగ కాచిన ఆలనేయ్, పెసర
     పప్పును, గుమ్మునల్లనటి పండ్లును, నాలుగునైదు నంజులున్
     లప్పలతోడ క్రొంబెరుగు లక్ష్మణ వజ్జుల యింట రూకకున్

 ఇక క్రీడాభిరామంలో అక్కలవీధి పూటకూళ్ళ ఇళ్ళ ప్రస్తావన ఇలా ఉంది:
 ‘సంధివిగ్రహయానాది సంఘటనల
 బంధకీ జారులకు రాయబారి యగుచు
 పట్టణంబున నిత్యంబు పగలురేలు
 పూటకూటింటు వర్తించు పుష్పశరుడు’

 అంటే పూటకూళ్ళింట్లో దిగిన కస్టమర్లకి ఊళ్ళో వేశ్యలకి రాయబారం చేయటంలో మన్మధుడికి పగలూ రాత్రీ తీరిక ఉండేది కాదట. ఆనాటి నగరాల పోలీస్ వ్యవస్థకి కావల్సిన జీతభత్యాలకి ఒక్క వేశ్యాగృహాలపై పన్నులే సరిపోయేవి.
 ఇక కొరవి గోపరాజు రచించిన సింహాసన ద్వాత్రింశిక ఆనాటి మద్యపానప్రియుల పానగోష్ఠికాలని (మందుపార్టీలు) వర్ణిస్తుంది. కాదంబం, మాధవం, ఐక్షివం వంటి అనేక సారాయిలు పింగాణి, గాజు, ఇత్తడి, బంగారాలతో చేసిన పానీయ పాత్రలను వర్ణిస్తుంది. ఉదయం హాంగోవర్‌తో బాధపడకుండా సురబేధనం అనే మందుని వరంగల్లు సంతలో అమ్మేవారట!
 దేశం నలుమూలల నుండి వచ్చే దొరలకు, కోమట్లకు, పండితులకు సుష్టుగా భోజనం, శుభ్రమైన పడకా ఇచ్చి ఆదరించిన పూటకూళ్ళక్కల ఇళ్ళు నేటి హెల్త్ క్లబ్‌లు, బార్ అండ్ రెస్టారెంట్‌లతో కూడిన ఫైవ్‌స్టార్ హోటళ్లని మరిపించేవి.
 

Advertisement
Advertisement