అమ్మే నాకు వరం... | Sakshi
Sakshi News home page

అమ్మే నాకు వరం...

Published Tue, Sep 13 2016 11:04 PM

అమ్మే నాకు వరం...

మా అమ్మ- కె. వరప్రసాద్‌రెడ్డి- పారిశ్రామికవేత్త
 
నేను పుట్టడం తనకు వరం అనుకుంది మా అమ్మ. అందుకే వరప్రసాదం అని పేరు పెట్టుకుంది. నిజానికి ఆమె కడుపున పుట్టడం భగవంతుడు నాకిచ్చిన గొప్ప వరం... ఈ మాటలన్నది శాంతాబయోటెక్స్ అధినేత, పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ వరప్రసాద్‌రెడ్డి.
 
‘‘అమ్మా! నీవే నేను- నేనే నీవు!!
నేను నీలోని అంతర్భాగాన్ని...
నువ్వు నాలో అంతర్వాహినివి...’’
అంటూ తల్లిని కళ్ల
ముందు ఆవిష్కరించుకున్నారాయన.
 
‘‘నవంబరు 17వ తేదీని నా జన్మదినం అని వేడుక చేస్తావు, కానీ అమ్మా! అది నువ్వు నాకు జన్మనిచ్చిన సుదినం. నువ్వు నాకు వేడుక చేయడం కాదమ్మా, నేను నీకు పండుగ చేయాల్సిన ఆనందకర సందర్భం. అందుకే ఈ రోజు మాతృవందనం చేసి నీ రుణం తీర్చుకుంటాను’’ అంటూ తల్లిని తలచుకుని గాద్గదికమయ్యేంతటి సున్నిత మనస్కులు. తల్లి కోడూరి శాంతమ్మ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ...
 
‘‘అమ్మకూ నాకూ మధ్య గురుబంధమే ఎక్కువ. మాది నెల్లూరు పట్టణానికి ఎనిమిది మైళ్ల దూరానున్న పాపిరెడ్డి పాళెం. నా ఐదవయేటనే చదువుకోసం నెల్లూరు పట్టణంలో ఉన్న మేనమామ సేతురామిరెడ్డి దగ్గరకు పంపించింది. బాగా ఊహ తెలిసిన తర్వాత కూడా నాకు అమ్మ మీద బెంగ ఉండేది. అమ్మను చూడకుండా ఓ వారం గడిస్తే యుగాలు గడిచినట్లు ఉండేది. రెండవ వారం ఇక ఆగలేక మా ఊరికెళ్లిపోయేవాడిని. అమ్మ దగ్గర ఉండేది ఒక్క పూట లేదా ఒక్క రోజు మాత్రమే. తిరిగి నెల్లూరుకి పంపించేసేది. ఇంట్లో ఆమె దగ్గర ఉన్నప్పుడు కూడా ‘‘ఏ పాఠాల నేర్చకున్నావు, ఆ పద్య కంఠతా వచ్చిందా లేదా’ అని గుర్తు చేసేది. శివాజీ వీరోచిత గాథలను, జిజియాబాయి పెంచిన తీరును ఎన్నిసార్లు చెప్పిందో లెక్కేలేదు. ఇప్పటికీ అవి గుర్తొస్తే ఒళ్లు రోమాంచితమవుతుంది. మార్కండేయ పురాణం, ధృవుడి కథలను చెప్పి లక్ష్యసాధనే ధ్యేయం అనే సందేశాన్ని నా రక్తంలో ఇంకింప చేసింది నా తల్లి.
 
వాచకమే నాది వాక్కు ఆమెదే!
ఎవరికైనా తొలి గురువు తల్లే. కానీ నాకు తొలి గురువు మాత్రమే కాదు నిన్నటి వరకు అంటే... ఆమె జీవించి ఉన్న చివరి రోజు వరకు నాకు దారి చూపించి నడిపించిన మార్గదర్శి ఆమె. ఆమె నేర్పించిన విలువలు, ఆమె అలవరిచిన క్రమశిక్షణ, ఆమె చూపించిన ధార్మిక పథమే నన్ను నడిపిస్తోంది.
 
ఉదయం నాలుగున్నరకు నేను స్నానం చేసి కిందకు వచ్చేటప్పటికే అమ్మ స్నానం, పూజ ముగించుకుని నా కోసం ఎదురు చూస్తుండేది. అలా ఓ రోజు నేను వెళ్లి పక్కన కూర్చోగానే ‘‘నిన్న శృతి కీర్తన చదివాను, ఆ పుస్తకం నువ్వు చదివావా’’ అన్నది. నాకు అవన్నీ చదివే తీరిక ఎక్కడిదమ్మా అనగానే ఆ పుస్తకంలో ఆమెకు నచ్చిన విషయాలను చెప్పడం మొదలు పెట్టింది. అలా ప్రతిరోజూ ఆ ముందు రోజు చదివిన పుస్తకం గురించి కానీ, టీవీలో చూసిన ఆధ్యాత్మిక ప్రవచనం గురించి తన అభిప్రాయాలు నాతో పంచుకునేది. ఆమెకు భక్తి మెండు. అలాగని గుడ్డిగా దేనినీ అనుసరించదు, అనుకరించదు. ప్రతి విషయాన్నీ తార్మికంగా విశ్లేషించేది.
 
ప్రతిరోజూ నా షెడ్యూల్ అడిగేది. ఆఫీసు కాగానే సాయంత్రం ఫలానా సాంస్కృతిక కార్యక్రమానికి, సాహిత్య సభకు వెళ్తున్నానని చెప్పగానే ‘రోజంతా బయటే గడిపేస్తావా, వ్యాపకాలు తగ్గించుకోకూడదూ’ అంటూనే నేను వెళ్లే సందర్భానికి తగినట్లు పౌరాణిక పద్యాలను ఊటంకిస్తూ చిరు ఉపన్యాసం ఇచ్చేది. నేను వాటిని పుక్కిటపెట్టుకుని ఆ సాయంత్రం ప్రసంగం చేసేవాడిని. రెండు వేల పద్యాలను కంఠతా నేర్చుకున్న ఆమె నన్ను రోజూ ప్రామ్టింగ్ చేసి పంపించేది.
 
ఆనందంతో కన్నీళ్లు!
హెపటైటిస్‌ను నివారించే వ్యాక్సిన్ విడుదల సందర్భంగా రేణుకాచౌదరి ‘ఈ వ్యాక్సిన్‌ను పేదవారికి కూడా అందుబాటులోకి తేవడం ద్వారా కోట్లమంది తల్లుల ఆశీర్వాదం అందుకుంటారు’ అని నన్ను ప్రశంసించారు. ఆ దృశ్యాన్ని టీవీలో చూసి నన్ను దగ్గరకు తీసుకుని ‘నా ఆశీస్సులే కాదు నాన్నా... నిన్ను కోట్ల మంది తల్లులు ఆశీర్వదిస్తార’ని కంటతడి పెట్టుకుంది అమ్మ.
 
కోపాన్ని చేతల్లో చూపించాలి!
శాంతాబయోటెక్ సంస్థ ప్రారంభించాలనేది పౌరుషం నుంచి పుట్టుకొచ్చింది. ఒక అంతర్జాతీయ సమావేశం తర్వాత జరిగిన సాధారణ చర్చలో కొత్త మందు కోసం రీసెర్చ్ చేయడం వంటివి భారతీయులకు అసాధ్యమనే ధోరణి వ్యక్తమైంది. అది నాకు చాలా కోపం తెప్పించింది. ఇండియాకు వచ్చి అమ్మానాన్నతో నా ఉద్దేశం చెప్పాను. ఇద్దరు ఆడపిల్లలు పెద్దవుతున్న సమయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని నా భార్య వసంత భయపడింది.

మా అమ్మ మాత్రం కోపం వచ్చినప్పుడు తిరిగి తిట్టడం కాదు, చేతల్లో సాధించి చూపించాలి అని... నాన్న పొలం అమ్మి డబ్బివ్వడానికి ప్రోత్సహించింది. ఎలక్ట్రానిక్స్ ఇంజనీర్‌నైన నేను నాకు సంబంధం లేని రంగంలోకి వస్తున్నానని తెలిసి కూడా ఏదైనా నేర్చుకోవాల్సిందే. అప్పుడు నేర్చుకోకపోతే ఇప్పుడు నేర్చుకుంటావు అన్నదామె. అలాగే మా కంపెనీలో ఇతర షేర్‌హోల్డర్‌లు సనోఫీ కంపెనీకి తమ వాటాలు అమ్మాలనుకున్నప్పుడు కూడా ‘కొత్త వాళ్లు వస్తే నువ్వు సంస్థను స్థాపించిన లక్ష్యంలోనే నడుస్తుందా’ అని అడిగింది. అప్పుడామెకు ‘మనం స్థాపించిన ధ్యేయానికి విఘాతం కలిగే పరిస్థితులు ఎదురైతే బయటకు వచ్చేస్తా’నని మాటిచ్చాను. ఈ ఏడాది మే 23 ఉదయం కొత్త యూనిట్ ప్రారంభం వాయిదా వేయవద్దని నా కర్తవ్యాన్ని నా చేత చేయించి మధ్యాహ్నం పరలోకానికి పయనమైంది.
 
నన్ను తల్లిని అమితంగా ప్రేమించే పుత్రుడు అనుకుంటారు. కానీ తల్లిని మనసుతో చూడడం, తల్లి మనుసును చూడడం నేర్చుకున్న ఏ కొడుకైనా తల్లిని అంతగానే ప్రేమిస్తాడు. ఎందుకంటే... అమ్మలాంటిది ఎవరంటే ఒక్క అమ్మ మాత్రమే. అమ్మ రుణం తీర్చుకోగలిగేది... అమ్మకు అమ్మైపుడితేనే. అది సాధ్యం కానిది. అందుకే ప్రతి బిడ్డా అమ్మకు అమ్మ స్థానంలోకి వెళ్లి ఆమె సేవ చేయాలి. అప్పుడు కొంతైనా ఆమె రుణం తీరుతుంది. అమ్మకు జేజేలు.
సంభాషణ: వాకా మంజులారెడ్డి

Advertisement
Advertisement