ప్యాషన్ తోడుంటే విజయం మన వెంటే! | Sakshi
Sakshi News home page

ప్యాషన్ తోడుంటే విజయం మన వెంటే!

Published Sun, Aug 11 2013 10:36 PM

ప్యాషన్ తోడుంటే విజయం మన వెంటే!

 ‘ఫాలో యువర్ ప్యాషన్.. చూజ్ యువర్ కెరీర్...’ చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వేటలో ఉన్న చాలామంది యువతీయువకులకు వినిపించే గైడ్‌లైన్ ఈ వాక్యం. దిశానిర్దేశం చేసే పెద్దలైనా, సలహాలిచ్చే స్నేహితులైనా ఇదే మాట చెబుతారు. అలాగే ఎవరికి వారు కూడా ఇలాగే చేయాలనుకుంటారు. కానీ అందరికీ సాధ్యమయ్యే విషయం కాదిది. దానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. ఆసక్తి ఉన్న రంగంలో కెరీర్‌ను కొనసాగించడానికి తమ పరిస్థితులు సహకరించలేదని చాలామంది చెబుతుంటారు. అయితే ఎలాంటి పరిస్థితులు ఎదురైనా తమ ఆసక్తులను అభిమానంతో అనుసరించి అందులో కెరీర్‌ను కొనసాగించగలిగేవారు కూడా చాలామంది ఉంటారు. అలాంటివారి స్ఫూర్తితో ఆసక్తి ఉన్న రంగంలో ఉపాధిని సంపాదించుకున్నాడు అఖిల్ ఖత్రీ. అతడి కథ ఇది...
 
 ‘ఫాలో యువర్ ప్యాషన్.. చూజ్ యువర్ కెరీర్...’ ఈ గైడ్‌లైన్‌ను తన గుండె గదుల్లో రాసుకున్నాడు అఖిల్. చదివింది ఎంబిఏ హెచ్‌ఆర్ మేనేజ్‌మెంట్. ఆసక్తి ఉన్నది ఫొటోగ్రఫీలో. చిన్నప్పటి నుంచి కెమెరా దొరికితే చాలు, ఫోటో తీయడంలో చక్కటి క్రియేటివిటీ ప్రదర్శించేవాడు. ఆ క్రియేటివిటీ కూడు పెట్టదు... అనే అభ్రిపాయాన్ని ఏర్పరిచాయి పరిస్థితులు. దీంతో శ్రద్ధగా ఎంబిఏ చదువుకుని, హైదరాబాద్‌లోని డెలాయిట్ ఆఫీసులో హెచ్‌ఆర్ మేనేజర్‌గా ఉద్యోగం సంపాదించాడు.

మంచి ఉద్యోగం, ఐదంకెల జీతంతో అఖిల్  రాజీ పడిపోయే దశలో మనసులో ఉన్న ఫొటోగ్రఫీ ప్యాషన్ ఉండబట్టనీయలేదు. పాతికేళ్ల లోపు వయసులో వందలాదిగా క్లిక్ చేసిన ఫొటోలను ప్రతిరోజు తట్టిచూసుకునేవాడు. ఈ దశలో లభించిన చక్కటి అవకాశం అఖిల్‌కు తనకు ఆసక్తి ఉన్న రంగంలో ఉపాధిని కల్పించే మార్గంగా మారింది. ఒక అమెరికన్ వనిత ఆన్‌లైన్‌లో ప్రచురించే మ్యాగజీన్‌లో అఖిల్ తీసిన ఫొటోలు అచ్చయ్యాయి. వాటికి మంచి స్పందన వచ్చింది. ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్‌గా తన మ్యాగజీన్‌కు కంట్రిబ్యూట్ చేయవచ్చునని ఆమె అఖిల్‌కు ఆఫర్ ఇచ్చింది. దీంతో హెచ్‌ఆర్ మేనేజర్ అనే పరిధి నుంచి బయటకు వచ్చి తన కెమెరాకు పనిచెప్పాడు అఖిల్. ఎలాగూ తనకు ప్యాషన్‌గా ఉన్న రంగంలో చేస్తున్న ప్రయత్నం కాబట్టి.. అఖిల్‌కు కొత్తశక్తి వచ్చి చేరింది.

ఈ శక్తితో బెంగళూరులో వెడ్డింగ్, ఫ్యాషన్ ఈవెంట్‌లకు ఫొటోలు తీసే స్టూడియోను ఒకటి నెలకొల్పాడు. ఉన్నత విద్యార్హతతో, మంచి ఉద్యోగాన్ని వదిలి ఇలా ఫొటోగ్రాఫర్ కావడం గురించి కొంతమంది అఖిల్ విషయంలో సానుభూతి వ్యక్తం చేశారట. సెటైర్లు వేశారట. అయితే వాటిని లెక్కచేయక... ఫొటోగ్రఫీ ప్యాషన్ ఇస్తున్న మజాను ఆస్వాదించానని అఖిల్ అంటాడు. అలాగే తన ఆసక్తిని వ్యాపారంగా మార్చుకోవడంలో కూడా ఇతడు విజయవంతం అయ్యాడు.

అఖిల్ తీసే ఫొటోలకు మంచి గుర్తింపు వచ్చింది. వెడ్డింగ్, ఫ్యాషన్ ఈవెంట్లకు వాటి స్థాయిని బట్టి ఆరు వేల నుంచి 25 వేల రూపాయల వరకూ ఛార్జ్ చేస్తూ ఈ మొత్తాన్ని తన రోజువారి సంపాదనగా మార్చుకున్నాడు. తెలిసినవాళ్లు, స్నేహితులు ‘అన్‌సేఫ్’ అంటూ నిరుత్సాహ పరిచిన ప్రొఫెషన్‌లో తాను ఈ సక్సెస్‌ను సాధించడానికి కారణం తన తల్లిదండ్రులు, భార్య ఇచ్చిన ప్రోత్సాహమేనని అఖిల్ ఉద్వేగంగా చెబుతాడు.
 
 ఉన్నత విద్యార్హతతో, మంచి ఉద్యోగాన్ని వదిలి ఇలా ఫొటోగ్రాఫర్ కావడం గురించి కొంతమంది అఖిల్ విషయంలో సానుభూతి వ్యక్తం చేశారట. సెటైర్లు వేశారట. అయితే వాటిని లెక్క చేయక.. ఫొటోగ్రఫీ ప్యాషన్ ఇస్తున్న మజాను ఆస్వాదించానని అఖిల్ అంటాడు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement