పరి పరిశోధన

4 Feb, 2018 00:39 IST|Sakshi

సెల్‌ఫోన్‌ రేడియేషన్‌... ఎటూ తేల్చని అధ్యయనాలు
సెల్‌ఫోన్‌ వాడకంపై ఇప్పటికే బోలెడన్ని ఆందోళనలు ఉన్నాయా? రేడియేషన్‌తో రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని కొందరు.. అలాంటిదేమీ లేదని ఇంకొందరు చెబుతూ వచ్చారా? ఈ రెండు వాదనల్లో వాస్తవమేమిటో తెలుసుకునేందుకు నిర్వహించిన రెండు ప్రభుత్వ అధ్యయనాలు కూడా ఎటూ తేల్చలేకపోయాయి. గతంలో జరిగిన అనేక పరిశోధనలు ముప్పు ఏమీ లేదని చెబుతున్నప్పటికీ తాజా అధ్యయనం మాత్రం ఎలుకలపై విస్తృత స్థాయి ప్రయోగాలు నిర్వహించి మరీ ఈ విషయాన్ని ఇంకోసారి స్పష్టం చేసింది.

శక్తిమంతమైన రేడియోధార్మిక కిరణాలతో ఎలుకలను ఢీకొట్టించినప్పటికీ వాటి ఆరోగ్యంలో పెద్దగా మార్పేమీ రాలేదని, కొన్ని మగ ఎలుకల గుండెల్లో కణుతుల్లాంటివి ఏర్పడ్డాయని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త బాచర్‌ తెలిపారు. ఇప్పటివరకూ చాలామంది ఆందోళన వ్యక్తం చేసినట్లు సెల్‌ఫోన్‌ రేడియో ధార్మికతకు, మెదడులో కణుతులకూ ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. సాధారణ సెల్‌ఫోన్‌ వినియోగానికి చాలా ఎక్కువ రెట్లు రేడియోధార్మికతను ఉపయోగించినప్పటికీ ఎలుకల ఆరోగ్యానికి కలిగిన నష్టమేదీ కనిపించలేదని అన్నారు.

చెవులు మొలిపించిన చైనా శాస్త్రవేత్తలు..
మానవ అవయవాలను కృత్రిమ పద్ధతుల్లో తయారు చేసే విషయంలో చైనా శాస్త్రవేత్తలు ఓ ముందుడుగు వేశారు. కొంతమంది ఎంత పెద్దవారైనా వారి ఒక చెవి మాత్రం చిన్నగానే ఉండటం మనం గమనించే ఉంటాం. మైక్రోషియా అనే ఈ రకమైన సమస్యతో బాధపడుతున్న కొంతమంది పిల్లలపై చైనా శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేశారు. ముందుగా ఈ పిల్లల చిన్న చెవి నుంచి కొంత మృదు కణజాలాన్ని తొలగించారు.

ఆ తరువాత అక్కడ కణజాలం పెరిగేందుకు మూడు నెలలపాటు వేచి చూశారు. చెవి ఆకారంలో ఉండే జల్లెడలాంటి నిర్మాణంపైకి ఈ కణాలను చేర్చి ఎదుగుదలకు అవకాశం కల్పించినప్పుడు రెండు మూడు దశల్లో చెవి ఆకారం ఏర్పడింది. అప్పటికే పెరిగిన కణజాలం మొత్తాన్ని తొలగించడం లేదా సరిచేసిన తరువాత ఈ కొత్త చెవిని అక్కడ బిగించి కుట్లు వేశారు. మొత్తం ఐదుగురికి తాము ఇలా కృత్రిమంగా అభివృద్ధి చేసిన చెవులను అమర్చగా.. వారిలో ముగ్గురి చెవులు చక్కగా పెరిగాయని.. మిగిలిన ఇద్దరి చెవుల ఆకారంలో కొంత తేడా వచ్చిందని శాస్త్రవేత్తలు వివరించారు. కనీసం ఇంకో ఐదేళ్లపాటు వీరిని పరిశీలిస్తూంటామని, కృత్రిమ పద్ధతుల్లో చేర్చిన కణాలతో కేన్సర్‌ ముప్పు ఉండటం దీనికి కారణమని తెలిపారు.

అడవిపూల మొక్కలతో కీటక నాశినుల వాడకం తగ్గుతుందా?
కీటకనాశినుల అధిక వాడకంతో తినే ఆహారం కాస్తా విషమైపోతోంది. అదే సమయంలో రైతుకు ఆర్థిక భారం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో పంటపొలాల్లో  కొన్ని వరుసల్లో అడవిపూల మొక్కలను పెంచుకోవడం ద్వారా రైతులు కీటక నాశినుల వాడకాన్ని తగ్గించవచ్చునని తేల్చారు బ్రిటన్‌లోని సెంటర్‌ ఫర్‌ ఎకాలజీ అండ్‌ హైడ్రాలజీ శాస్త్రవేత్తలు. ఇంగ్లాండ్‌లోని దాదాపు 15 విశాలమైన పంట పొలాల్లో చేసిన ప్రయోగాల ద్వారా తాము ఈ విషయాన్ని మరింత క్షుణ్ణంగా అర్థం చేసుకోగలిగామని రిచర్డ్‌ పైవెల్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు.

అడవిపూల మొక్కలు సహజసిద్ధమైన కీటక నిరోధకాలుగా పనిచేస్తాయని తమ అధ్యయనం ద్వారా తెలిసిందని చూట్టూ మొక్కలు నాటడం కంటే పట్టీలు పట్టీలుగా అక్కడకక్కడా నాటడం మేలని రిచర్డ్‌ చెప్పారు. కీటకాలు తగ్గడంతో పంట దిగుబడులు కూడా పెరిగాయని చెప్పారు. పొలం మొత్తం విస్తీర్ణంలో రెండు శాతం మేర అడవిపూల మొక్కలు నాటి తాము పరిశీలనలు జరిపామని, 20 అడుగుల వెడల్పుతో వేసిన పూల మొక్కల పట్టీలతో ఎక్కువ ప్రయోజనం కలిగినట్లు గుర్తించామని వివరించారు.  

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా