మనసున మనసై పోసాని కుసుమై... | Sakshi
Sakshi News home page

మనసున మనసై పోసాని కుసుమై...

Published Tue, Nov 26 2013 11:49 PM

మనసున మనసై పోసాని కుసుమై... - Sakshi

 పెళ్లికి ముందే పోసాని కృష్ణమురళి...
 కుసుమలతను బెదరగొట్టేశారు!!
 ‘నాకు కోపం ఎక్కువ, ఓకేనా?’ అన్నారు,
 ‘ఇప్పుడైతే ఏ హ్యాబిట్సూ లేవు...
 రేపెలా ఉంటానో నాకే తెలీదు, ఓకేనా?’ అన్నారు.
 ‘నాది టిపికల్ మైండ్, ఓకేనా?’ అన్నారు.
 ఇంకా ఏదో చెప్పబోయారు...
 కుసుమలత పట్టించుకోలేదు.  
 అన్నిటికీ ‘ఓకే... ఓకే... ఓకే’!
 ఇరవై రెండేళ్లు గడిచాయి.
 పోసాని... కుసుమకు చెప్పని విషయం లేదు.
 కుసుమ ‘ఓకే’ అనని సందర్భమూ లేదు.
 ఇద్దరికీ అలా కుదిరింది.
 పోసాని ఎప్పుడూ అంటుంటారు...
 ‘భార్య, పిల్లలు బాధపడే పని
 ఏ భర్తా చేయకూడదని’.
 భర్తకు ఈమాత్రం స్పృహ ఉంటే చాలదా..
 ఏ దాంపత్యమైనా
 ‘మనసే జతగా...’ సాగడానికి!!

 
 పోసాని కృష్ణమురళి పుట్టి పెరిగింది గుంటూరు జిల్లాలోని పెదకాకాని గ్రామం. ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిల్లో పెద్దవాడు కృష్ణమురళి. ఎం.ఫిల్ పూర్తిచేసి, సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టించుకున్నారు. బాల్యమంతా లేమిని, ఆ తర్వాత జీవనయానంలో ఎదురైన పరిస్థితుల వల్ల అభద్రతను చవిచూసిన పోసానికి ఆయన గురువు ‘నీకు ఒక మంచిసంబంధం చూశాను. ఆమె నీ భావాలకు తగిన అమ్మాయి’ అని చెప్పారట. ఆ అమ్మాయే కుసుమలత అంటూ తన అర్ధాంగిని పరిచయం చేశారు పోసాని.
 కృష్ణాజిల్లా వీరులపాడుకి చెందిన కుసుమలత ‘లా’ చేశారు. పెళ్లికి ముందు ఆమెను కలిసి ‘నాకు ఇప్పుడు ఎలాంటి చెడు అలవాట్లు లేవు. కాని రేపు ఉండవచ్చు. టిపికల్ మైండ్. తట్టుకోగలను అనుకుంటేనే పెళ్లికి ఒప్పుకో! అన్నాను’ అని కృష్ణమురళి చెబుతుంటే -‘ఓపెన్‌గా తన గురించి అంతగా చెప్పిన వ్యక్తిగా ఈయన మనస్తత్వం నాకు బాగా నచ్చింది. ఆ మాటల్లోని నిజాయితీ నమ్మకాన్ని కలిగించింది. అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను’ చెప్పారు కుసుమలత. కమ్యూనిస్టు భావాల గల కుటుంబ నేపథ్యాలు కావడంతో కొంతమంది పెద్దల సమక్షంలో (1992 అక్టోబర్ 30) రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు.
 
 హోటల్ నుంచే మొదలైన ప్రయాణం
 ‘పెళ్లికాగానే ఎవరింటికీ వెళ్లలేదు మేం. హోటల్‌లోనే బస. ఆ తర్వాత హైదరాద్‌లోని అమీర్‌పేటలో ఇల్లు అద్దెకు తీసుకున్నాం. ‘నాకు నువ్వు-నీకు నేను చాలు. భార్యాభర్తల మధ్య ఎంత దగ్గరి బంధువైనా సరే అడ్డుగా వస్తున్నారంటే ఆ బంధాలు అక్కర్లేనివి అని చెప్పేవాడిని. ఎందుకంటే లతకు అప్పటిదాకా పుస్తకపరిజ్ఞానమే తప్ప లోకం గురించి అంతగా తెలియదు. పెళ్లయ్యాక జీవితం ‘సున్నా’ నుంచి మొదలవుతుంది. అంతకు ముందు ఎలాంటి అలవాట్లు ఉన్నా అవి భాగస్వామికి ఇబ్బందిగా ఉన్నాయంటే వదిలిపెట్టుకోవాలి అని చెప్పేవాడిని. ఏది చెప్పినా స్నేహపూర్వకంగానే! నన్ను అర్థం చేసుకోవడానికి లతకు 5-6ఏళ్లు పట్టింది’ అన్నారు పోసాని.
 
 సహనమే ముఖ్యం
 మొదట అత్తింటివారికి పోసాని ఎంతమాత్రమూ అర్థంకాలేదట. ‘అల్లుడికి కోపం ఎక్కువ, అతిజాగ్రత్త, అభద్రత ఎక్కువ..’ కూతురు తట్టుకోలేకపోతోంది అని భావించారట. ఆ ఆలోచనతోనే కుసుమలతను పుట్టింటికి వచ్చేయమన్నారట. కాని లత అందుకు ఒప్పుకోలేదట. ‘ఈయన మనస్తత్వం మంచిది. ఎవరికీ హాని చేసే తత్త్వం కాదు. కోపం కూడా కారణం లేకుండా రాదు కదా! ఓపిక పట్టటమే సరైన మార్గం అనుకున్నాను. అదే అమ్మనాన్నలతో చెప్పాను. వాళ్లు ఇప్పుడు మా అల్లుడు బంగారం అంటుంటారు. మా తమ్ముడు, ఈయన క్లోజ్ ఫ్రెండ్స్‌లా ఉంటారు’ అని వివరించే లత ఇల్లాలికి సహనం ఎంత ముఖ్యమో గుంభనంగా తెలియజేశారు.
 
 నష్టమైనా కష్టమైనా ముందే వివరణ
 ఎదుటివారు ఎవరైనా సరే ‘రాజా’ అని సంబోధించే పోసాని తన శ్రీమతిని  ఒక్కోసారి ‘అమ్మా!’ అని కూడా సంబోధిస్తుంటారట. అదే చెబుతూ ‘సందర్భాన్ని బట్టి లతను రకరకాల పేర్లతో పిలుస్తుంటాను. తనని ఎలా పిలుస్తానన్నది లెక్క కాదు... ఎందుకంటే మా మధ్య మొదటి నుంచీ ఆకర్షణ కంటే ఆప్యాయత ఎక్కువ ఉంది. అదే మమ్మల్ని 22 ఏళ్ల పాటు కలిసి నడిచేలా చేసింది. నా చిన్నతనం నుంచి నేను ఎదుర్కొన్న పరిస్థితుల వల్ల నాలో భావోద్వేగాలన్నీ గడ్డకట్టుకుపోయాయి. ఇప్పుడిప్పుడే అవి కరగడం మొదలయ్యాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రవర్తన ఎలా ఉన్నా తట్టుకొని నిలబడింది తను. లతతో పెళ్లి కాకపోయి ఉంటే నా జీవితం ఏమై ఉండేదో..!’ అని పోసాని చెబుతుంటే చిరునవ్వులు చిందిం చారు లత. భార్యగా తనకు పంచే ప్రేమను చెబుతూ ‘రచయితగా, డెరైక్టర్‌గా, నటుడిగా, రాజకీయనాయకుడిగా.. ఈయన కొత్తగా ఏ పని మొదలుపెట్టినా ముందు నాకు తప్పక చెబుతారు. అందులో లాభనష్టాలు వివరిస్తారు. మా జీవన యానం మొదలైన నాటి నుంచి ఇప్పటివరకు ఎక్కడా ఏ లోటూ లేకుండా, నేను ఇబ్బంది పడకుండా చూసుకున్నారు’ అని మురిపెంగా చెప్పారు కుసుమలత.
 
 ఫిల్టర్ ఉండాల్సిందే!
 గ్లామర్ ప్రపంచంలో ఉండటం వల్ల భార్యకు తనపై వచ్చే అనుమానాల గురించి పోసాని ప్రస్తావిస్తూ ‘మా లతకు అనుమానం రావడం సహజమే. అయితే వాటిని ఖండించను. నిజాయితీగా క్లారిఫై చేస్తాను. భార్య, పిల్లలు బాధపడే పని ఏ భర్తా చేయకూడదు’ అన్నారు పోసాని. ‘ఈయన ఉన్నది ఉన్నట్టు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు’ అన్నారు కుసుమలత. ఆ మాటలకు పోసాని తల అడ్డంగా ఊపుతూ -‘ఏ ఆలూమగలు ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోలేరు. ప్రతి ఒక్కరిలోనూ ఒక ఫిల్టర్ ఉంటుంది. ఉండాలి. అన్నింటినీ వడబోసి మంచి అనుకున్న వాటినే భాగస్వామితో చెప్పాలి. కష్టమైనా అదే మంచిది. బంధాలు బలహీనపడకుండా ఉండాలంటే ఫిల్టర్ అవసరమే’ అన్నారు పోసాని నవ్వుతూ!
 
 ప్రవర్తనే ప్రధానం
 ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఉజ్వల్, ప్రజ్వల్. వారిద్దరూ డిగ్రీస్థాయికి వచ్చారు. వారి పెంపకంలో తాము తీసుకున్న నిర్ణయాల గురించి ప్రస్తావిస్తూ- ‘ఈయన పొరపాటున కూడా పిల్లలను కోప్పడరు. పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చినా ఏమీ అనరు కానీ, ప్రవర్తనలో మాత్రం తేడా రాకూడదు అంటారు. ఎందుకంటే ‘పరీక్షకు మరో ఆప్షన్ ఉంది. ప్రవర్తనకు మరో ఆప్షన్ ఉండదు కదా’ అంటారు. అదే నిజం అని నేనూ చెబుతుంటాను’ అన్నారు కుసుమలత.
 
 పోసాని కృష్ణమురళి రాజవైభవం కుసుమలత చిరునవ్వులో దాగుందని వీరి దాంపత్య బంధం తెలియజేస్తుంది.  దంపతులు స్నేహపూర్వకమైన ప్రయాణంలా జీవితాన్ని మలచుకోవాలని వీరి జీవనయానాన్ని బట్టి తెలుస్తుంది.
 
 లతకు నన్ను ప్రేమించడమే తెలుసు. తను నా అర్ధాంగి కాకుంటే నా జీవితం ఏమై పోయేదో అనుకుంటాను.
 - పోసాని
 నిజాయితీగా ఉంటారు. ఏ పని ప్రారంభించినా ముందు చర్చించి చేస్తారు. ఏ ఇబ్బంది రాకుండా చూస్తారు.
 - కుసుమలత
 
 - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
 

Advertisement
Advertisement