వాన జ్ఞాపకాలు ఎనిమ్ది | Sakshi
Sakshi News home page

వాన జ్ఞాపకాలు ఎనిమ్ది

Published Sun, Jul 10 2016 11:02 PM

వాన  జ్ఞాపకాలు ఎనిమ్ది

1. బడిగంటకు మబ్బు ముద్దు

 క్లాస్‌లో పాఠం ఆగిపోతుంది. అంతవరకూ గంభీరంగా పాఠం చెప్పిన మాస్టారు గడప దగ్గరకు వెళ్లి బయట కురుస్తున్న వానను చూస్తూ నిలబడి పైన ఆకాశం వంక చూసి ఇంకెంత వాన పడబోతుందో అన్నట్టుగా లెక్క వేస్తూ ఉంటాడు. పిల్లల తలలన్నీ కిటికీవైపు మళ్లుతాయి. బయట ప్లే గ్రవుండ్ తడుస్తూ ఉంటుంది. కచ్చితంగా ఒక వేప చెట్టు ఉంటుంది... అదీ తడుస్తూ ఉంటుంది. స్కూల్ అటెండర్ బాషా అంత వానలో గొడుగు వేసుకొని ఒక క్లాస్ నుంచి ఇంకో క్లాస్‌కు సర్క్యులర్ ఏదో తీసుకువెళుతూ ఉంటాడు. ఉండి ఉండి ఒక జల్లు జివ్వున కొట్టి క్లాస్‌రూమ్‌లో దూరి మళ్లీ కంగారుగా వెనక్కు వెళ్లిపోతుంది. పుస్తకాలన్నీ తడిసిపోతున్నాయన్న వంకతో పిల్లలు కెవ్వుకెవ్వున ఆటగా కేరింతలు కొడతారు. యూనిఫామ్స్ గ్యారంటీగా తడుపుకోవడానికి ఇంతకు మించిన అవకాశం ఉండదు. ఇక ఈ పూటకు బడిలేనట్టే. బయట గొడుగు విప్పి కుంపటి మీద విసనకర్ర విసురుతూ మొక్కజొన్న పొత్తులను కాల్చే ముసలవ్వ మనసులో మెదలుతుంది. వానతో పొత్తు... పొత్తుతో వాన... ఒక చిననాటి జ్ఞాపకం.

 

2.తడి సిన పోస్టర్
వాన పడితే జనం రారు అన్నది ఉత్త మాటే. రిలీజ్ రోజున ఎంత వాన ఉన్నా రావాల్సిన వాళ్లంతా వస్తారు. నిండాల్సిన క్యూలన్నీ నిండుతాయి. సినిమా హాలు పైకప్పున ఉన్న రేకుల మీద వాన జమాయించి కొడుతూ ఉంటుంది. బయట అంటించిన పోస్టర్ మీద హీరో సంగతి ఏమో కాని హీరోయిన్ తడిసి ముద్దవుతూ ఉంటుంది. అబ్బ... టికెట్ దొరికి లోపలికి దూరితే ఎంత వెచ్చన! కాళ్లు రెండూ దగ్గరకు చేర్చి సీటులో వొదిగి కూచుని బయట వాన పడుతూ ఉండగా లోన సినిమా చూడటం చాలా బాగుంటుంది. ఇంటర్వెల్‌లో ఆరుబయట క్యాంటిన్‌కు తడుస్తూ వెళ్లాలి. వేడి వేడి బజ్జీలను కాగితం పొట్లంలో చుట్టుకు రావాలి. గాజు గ్లాసులో డికాక్షన్ టీ దొరికితే అది అమృతం. దొరికిన వాటితో లోపలికి వచ్చి కాసింత తిని సినిమా చూస్తూ వెచ్చటి టీని గుక్క గుక్కా తాగడం నిన్న మొన్నటి జ్ఞాపకం.

 

3. మాట్లాడే కిటికీలు
వాన వస్తే కిటికీలకు మాటలు వస్తాయి. అవి టపాటపా మోతను చేస్తూ సంతోషంగా ఉన్నట్టు కనిపిస్తాయి. వాటి నోరు కట్టించాలని ఉంటుంది. కాని బిగించి పెడితే బయట వానను చూడలేమని బెంగగా ఉంటుంది. తమ్ముడో చెల్లాయో తడిసిన పాదాలతో అటూ ఇటూ పరిగెత్తి నేల మీద ముచ్చటైన ముద్రలు వేస్తారు. అమ్మ కయ్యిమంటుంది. ఊరుకో అని నాన్న ఆ అల్లరిని ఆహ్వానిస్తాడు. పలకరించడానికి వచ్చిన బంధువు తన గొడుగును వరండాలో మడిచి ఒక ధార గచ్చు మీద పారేలా చూస్తాడు. గుట్టు చప్పుడు కాకుండా అమ్మ వంటగదిలో దూరి మిగిలిన దోసెల పిండిలో ఉల్లిపాయలు తరిగి వేడి చిరుతిండికి సన్నద్దం అవుతుంది. శ్లాబ్ మీద నుంచి దూకుతున్న ధారకు బకెట్ పెట్టడం ఒక ఆట. పారే నీటిలో మడిచిన కాగితపు కత్తి పడవను విడవడం ఆట. పక్కన ఉన్న పాత తాటాకుల ఇల్లు ధైర్యం అభినయిస్తుంది. ఎదురుగా ఉండే పెంకుటిల్లు మాత్రం ఓడిపోయి రెండు మూడు వాన ధారలను ఇంట్లోకి రానిస్తుంది. తడవని మనుషుల జ్ఞాపకాలు తడుస్తుంటాయి. తడిసే ఇళ్ల అనుభవాలు తడుస్తుంటాయి. తడవడం బాగుంటుంది.

 

 4.రాజూ కూడా తడుస్తుంది
అది ఇంటి కుక్క కాదు. కాని రాజూ అని పేరు పెట్టి అప్పుడప్పుడు అన్నం పెడుతుంటే వచ్చి పోతుంటుంది. వాన కురిసినప్పుడు మాత్రం సొతంత్రంగా గేటు నెట్టుకొని వచ్చి ఒళ్లంతా పెద్దగా దులపరించుకుని ఒక మూలన నన్ను వదిలేయండ్రా బాబూ అని కూలబడుతుంది. పెరట్లోని కోడి ఒక మోస్తరు వాన వచ్చేవరకు లెక్కలేనట్టుగా షికార్లు చేస్తుంది. ఆ తర్వాత పంచన చేరి బుట్ట దగ్గరకు పిల్లలను తోలుతుంది. జామచెట్టు కొమ్మ తడుస్తుంది. కొమ్మన ఉన్న కాకి తడుస్తుంది. మేత ముగించుకుని రెడ్డి గారింటికి చేరుకుంటున్న బర్రెగొడ్ల మందలో ఒకటి కదలక మెదలక నిలుచుని వానలో తన కొమ్ములను తడుపుకుంటూ ఉంటుంది. చీమలు గోడను పట్టుకొని వేగం పెంచి కవాతు చేస్తూ పోతూ ఉంటాయి. చీకటి పడ్డాక కప్పలు కచేరీ మొదలపెడతాయి. సకల సృష్టి తడుస్తుంది. అక్షులు పక్షులు తడుస్తాయి. కిటికీలో నుంచి చేయి బయటకు చాపితే తెల్లటి మన హస్తరేఖలు కూడా తడుస్తాయి.

 

5.మడమలు ప్రాప్తమవుతాయి
దేవుడు చల్లగా చూస్తే కాలేజ్ వదిలే సమయానికే వాన పడుతుంది. చట్టాలు అరెస్టుల భయం లేకుండా అది ప్రతి ఆడపిల ్ల చేయి పట్టుకోవడానికి చూస్తుంది. ముంగురులు నిమురుతుంది. బుగ్గలు పుణుకుతుంది. నుదుటి బొట్టుకు చుక్కబొట్టు పెట్టడానికి ఉబలాట పడుతుంది. చుబుకాన జారుతుంది. కంఠాన ఆగనంటుంది. ఆడపిల్లలు భలే కిలాడీ పిల్లలు. వానకు అందకుండా పుస్తకాలు అడ్డం పెట్టుకుంటారు. వానకు చెందకుండా సైకిళ్లను పరుగుపెట్టిస్తారు. వాన ఎగుడు దిగుళ్లలోకి దూరకుండా గొడుగు విప్పి తమ శరీరానికి ఛత్రం పడతారు. కాని కింద పారే నీళ్ల ముందు వారు ఓడిపోతారు. అందమైన పావడాలను కొంచెం పెకైత్తి పట్టుకుని అంగలు వేస్తారు. అప్పుడు అబ్బాయిలకు వారి మడమలు ప్రాప్తమవుతాయి. అందమైన వాటి బరువు కింద తమ హృదయాలను పరుస్తారు. కొన్ని చితుకుతాయి. కొన్ని గెలుస్తాయి. తడిసే వానలో ఆడపిల్ల చేయి పట్టుకుని నడిచేవాడు ఆ పూటకు గ్రీకు చక్రవర్తిలా ఫీలైపోయి ఆ జ్ఞాపకాన్ని జన్మకు దాచుకుంటాడు.

 

6.ఖర్చులేని టోపీలు
వానకు ఆకలి ఎక్కువ. ముసురు పట్టిన సాయంత్రం కాకాహోటళ్లన్నీ క్రిక్కిరిసి పోతాయి. సాదా దోసె... ఊతప్పం... ఆవిరి కక్కే ఇడ్లీ... సాంబార్ ఇష్టపడని వాడు కూడా వేడివేడి ఆ ద్రవంలో స్పూన్ ముంచి గొంతును ఘాటు చేసుకుంటాడు. ఒంట్లో వేడి నింపుకుంటాడు. వేయించిన పల్లీల బండికి  గిరాకీ ఎక్కువ. ఇన్వర్టర్లు లేని కాలంలో పెట్రొమాక్స్ లైట్లే సలీసు ఇన్వర్టర్లు. కరెంటు లేని బజారులో కూడా తెలియని సందడి ఉంటుంది. గొడుగులు లేని వాళ్లంతా కొత్తకొత్త టోపీలు కనిపెట్టి కనిపిస్తారు. ఏ పూటకాపూట కొనుక్కునే దీనులు వాన పెరిగేలోగా నూకలతో ఇల్లు చేరాలని శెట్టిగారిని తొందర పెడుతుంటారు. వాన సాయంత్రాలు రేడియో వినబుద్ధి కాదు. గుడికి వెళ్లబుద్ధి కాదు. ఇంట్లో ఉండబుద్ధి కాదు. పుస్తకం ఉంటే సరే. వేడివేడి పకోడి ఉంటే సరే. అప్పుడు మూడో పార్ట్‌నర్‌గా వాన కలసి మన మూడ్ ఠీక్ చేస్తుంది. వాన ఒక్కోసారి బెంగ కూడా కలిగిస్తుంది. ఆ బెంగ తీయని నొప్పిలా కూడా ఉంటుంది. అవును.. ఇది తీయని జ్ఞాపకం.


7. వాయుగండం
బంగాళాఖాతం అనే మాట తరచూ వినపడటం మొదలవుతుంది. వాయుగుండం అనే మాట కూడా. రానున్న నలభై ఎనిమిది గంటలు... ఇరవై ఎనిమిద గంటలు... ఈ అర్ధరాత్రికే... తుఫాను తీరం దాటుతుందట. అప్పుడు మాత్రం ఊరు కొంచెం కంగారుగా వార్తలు వింటుంది. పశుగొడ్లను భద్రం చేసుకుంటుంది. బలహీనమైన ఇళ్లవారిని బలమైన ఇళ్లలోకి ఆహ్వానం పలుకుతుంది. తీరంలోని పల్లెల్లో ఉన్నవాళ్లు ఊరి బడుల్లో ఆసరా పొంది క్లాస్‌రూముల్లో కొత్త స్టూడెంట్లలా కనిపిస్తారు. ఆకాశం మాత్రం అప్పుడు ఎందుకనో చాలా మూసుకుని వస్తుంది. గాలి ఎక్సిలరేటర్‌ని తెగ తొక్కుతూ ఉంటుంది. చెట్ల చొక్కాలు లేచిపోతాయి. కరెంటు దీపాలు కొండెక్కుతాయి. స్తంభాలు వానకు సలాము చేస్తూ నేలకు ఒంగుతాయి. వాయుగుండం పెద్ద గండం. కాని ఆ బీభత్సంలో కూడా ఒక సౌందర్యం ఉంటుంది. అది భీతి గొలిపే సౌందర్యం.

 

8. అర్జునుడి రథం
వాన రాత్రుళ్లు పరమాద్భుతంగా ఉంటాయి. పప్పు, రొట్టెలు అంత రుచిగా ఎప్పుడూ అనిపించవు. చారు, అప్పడాలు కూడా. కరెంటు పోతుందేమోనన్న భయంలో అన్నాలు త్వరగా ముగించి అమ్మ వెచ్చటి పక్కలు సిద్ధం చేస్తుంది. కప్పుకోను మందపు దుప్పట్లు అందిస్తుంది. బయట వాన. పైన ఎక్కడో ఉరుములు. నానమ్మ అది అర్జునుడి రథచాలనం అని అబద్ధపు నిజం చెబుతుంది. అర్జునా.. ఫల్గుణా.. పార్థా... కిరీటీ... శ్వేతవాహనా... అని మంత్రమేదో చెప్పి జపించమంటుంది. లూజ్ కనెక్షన్ ఉన్న ట్యూబ్‌లైట్లలా మధ్య మధ్య మెరుపులు మెరిసి మాయమవుతుంటాయి. దుప్పటి వెచ్చగా కప్పుకుని పడుకుంటే బయట వాన ఆగకుండా జోకొడుతూ ఉంటుంది. అంత పెద్ద హోరు ఏదో తెలియని ఉత్తేజం కలిగిస్తుంది. వాన బాగా కురిస్తే ఫలానావారి చెట్టు బాదం కాయలు రాలి దొరుకుతాయని ఆశ. జామకాయలు నేలన పడతాయని ఆశ. వాన పంట ఇస్తుంది. పిల్లలకు ఇదిగో ఇలా కాయలు ఇస్తుంది. ఆ దశను దాటి వచ్చిన వారికి జ్ఞాపకాలు ఇస్తుంది. వాన అంకురాన్ని సృష్టిస్తుంది. సృష్టిని అంకురింప చేస్తుంది.  వాన ఆయుష్షు. వాన..  ఒక తలపుల కుమ్మరింత.

 - నెటిజన్ కిశోర్

Advertisement

తప్పక చదవండి

Advertisement