నాకు నచ్చిన ఐదు పుస్తకాలు | Sakshi
Sakshi News home page

నాకు నచ్చిన ఐదు పుస్తకాలు

Published Mon, Nov 6 2017 1:30 AM

Rajgopal most liked 5books - Sakshi

పుస్తకాలు కొనడమే కాదు, చదవడం నా జీవితంలో భాగమైంది. 36 సంవత్సరాలు తెలుగు లెక్చరర్‌గా పని చేసిన నాకు పుస్తక పఠనం నిరంతర శ్వాస. విద్యార్థులకు పాఠాలు చెప్పడం కోసం, కవిగా నన్ను నేను అంచనా వేసుకోవడం కోసం చదువుతుంటాను. ఆధునిక సాహిత్యంలో నాకు నచ్చిన ఆణిముత్యాలు ఐదింటిని పేర్కొంటాను.

రాష్ట్రగానం (తుమ్మల సీతారామమూర్తి)
‘తెనుగులెంక’ తుమ్మల సీతారామమూర్తి ఆంధ్రజాతీయాభిమానానికి అక్షర సాక్ష్యం ఇది. మద్రాసు రాష్ట్రం నుండి విభజన కోరుతూ ఉవ్వెత్తున సాగిన ఆంధ్రరాష్ట్రోద్యమ నేప«థ్యంలో వెలువడిన కావ్యం. తెలుగు వారి పౌరుష ప్రతాపాలు వర్ణించి రాష్ట్ర సాధన కోసం పోరాట స్ఫూర్తిని రగిలించిన కావ్యం. ఉత్తమోత్తమ కవిత్వంతో నాలుకల మీద నర్తించే పద్యాలతో కాలాన్ని గెలిచిన కావ్యం.

కలలు– కన్నీళ్లు (ఆవంత్స సోమసుందర్‌)
కవి ఆవంత్స సోమసుందర్‌ స్వీయచరిత్ర. 90 ఏళ్ళ సుదీర్ఘ ప్రస్థానంలో సమకాలీన సాహిత్య, సామాజిక ఉద్యమాలకూ సంఘటనలకూ ప్రత్యక్షసాక్షి సోమసుందర్‌. ఆయా ఉద్యమాలతో అనుబంధమున్న సోమసుందర్‌ కవిగా తాను కన్న కలలు, కొన్ని సందర్భాలలో ఎలా కన్నీళ్ళు మిగిల్చాయో వాస్తవ దృష్టితో వర్ణించారు. కీర్తికోసం వెంపర్లాడే కవుల మనోగతాన్నీ, ఎదుటి కవుల ఎదుగుదలను సహించలేని అసూయనూ బొమ్మకట్టి చూపారు. సాహిత్యంలో సన్నగిల్లుతున్న విమర్శ దృష్టిని లోతుగా చర్చించారు. సమకాలీన కవులు, రచయితలతో ఉన్న సాన్నిహిత్యాన్నీ, వాళ్ళ సాహిత్య విశేషాలనూ సందర్భానుసారంగా విశ్లేషించారు.

గుండ్లకమ్మ చెప్పిన కథ
(డాక్టర్‌ నాగభైరవ కోటేశ్వరరావు)
పద్యానికి కాలం చెల్లిందని, ఆధునిక అభివ్యక్తికి పద్యం పనికిరాదనే కొత్తతరం కవుల వాదన సరికాదని చెప్పేందుకు నాగభైరవ ఈ కావ్యం రాశారు. ప్రకాశం జిల్లా అద్దంకి ప్రాంతంలో జనవ్యవహారంలో వున్న ఒక కథను స్వీకరించి, కల్పనను జోడించి, ‘అద్దడు–అంకి’ అనే ఇద్దరు ప్రేమికుల గాథను రసరమ్యశైలిలో చిత్రించారు. ప్రతి పద్యాన్ని ఒక శిల్పంగా మలిచారు.

విశ్వంభర (డాక్టర్‌ సి.నారాయణ రెడ్డి)
సి.నా.రె. కలం నుండి వెలువడిన ఆధునిక మానవేతిహాసం. సినారెకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చినందుకు ‘విశ్వంభర’ గొప్పకావ్యం కాలేదు; ‘జ్ఞానపీఠాన్ని’ గెలుచుకున్నందుకు గొప్పకావ్యమైంది. ఆది మానవుడి నుండి ఆధునిక మానవుడి దాక సాగిన మానవ జీవన పరిణామం, వికసించిన సంస్కృతి, మతాలు, సిద్ధాంతాలు, పాలన వ్యవస్థలు, మానవుడి నిరంతరాన్వేషణ, విజయాలు కథనాత్మకంగా వర్ణింపబడ్డాయి. మానవ జీవితంలోని అనంత జీవన సత్యాన్ని గ్రహిస్తే విశ్వంభర తత్త్వం తెలుస్తుంది. తెలుగులో ‘సంపూర్ణ వచన కథా కావ్యం’ కోసం కలలుగన్న కుందురి ్తకోరికను విశ్వంభరతో నెరవేర్చారు సినారె.

ఫిరదౌసి (గుఱ్ఱం జాషువా)
పారశీక కవి ఫిరదౌసి జీవితం ప్రధాన కథ. కవిగా ఎదగడానికి ఎన్నో అవమానాలు, తిరస్కారాలు, దూషణలు ఎదుర్కొన్న జాషువాలాగే ఫిరదౌసి కూడా గజినీ మహ్మద్‌ ఆస్థానకవిగా అగౌరవానికి గురవుతాడు, మోసగింపబడతాడు. పరాభవభారంతో కుంగి రగిలిన కవి హృదయం నుండి వెలువడిన భావజ్వాలే ‘ఫిరదౌసి’. తొలి పద్యం నుండి చివరి పద్యం దాక పద్యనిర్మాణంలో జాషువా చూపిన సరికొత్త శైలీ సంవిధానం, కథనం, కంట తడి పెట్టించే ముగింపు మనల్ని కవిత్వావరణంలోకి లాక్కెళ్ళుతాయి.


బీరం సుందర రావు

9848039080

Advertisement
Advertisement