ఫండ్ కొనేటప్పుడు.. అమ్మేటప్పుడు | Sakshi
Sakshi News home page

ఫండ్ కొనేటప్పుడు.. అమ్మేటప్పుడు

Published Fri, Apr 18 2014 11:02 PM

ఫండ్ కొనేటప్పుడు.. అమ్మేటప్పుడు - Sakshi

బేసిక్స్
 
మ్యూచువల్ ఫండ్స్ గురించి విరివిగా ప్రచారం జరుగుతున్నా.. ఇంకా చాలా మందికి వీటి స్వరూపం తెలియదు. షేర్ల తరహాలోనే వీటిలో ఇన్వెస్ట్‌మెంట్ అనుకుంటారు. అందుకే షేరు లాగానే ఎంత తక్కువ రేటుకు కొనుక్కుంటే అంత మంచిదనుకుంటుంటారు. దానికి తగ్గట్లే.. తక్కువ ఎన్‌ఏవీ ఉందనో, డివిడెండు ప్రకటించిందనో, కొంగొత్త ఫండ్ (ఎన్‌ఎఫ్‌వో) అనో కొనేస్తుంటారు. అలాగే, అమ్మేటప్పుడు కూడా అదే పద్ధతి పాటిస్తుంటారు. వీటి గురించి కూడా కొద్దో గొప్పో అధ్యయనం చేయాలన్న విషయాన్ని పట్టించుకోరు. ఉదాహరణకు న్యూ ఫండ్ ఆఫర్ విషయానికొస్తే.. చాలా మంది పది రూపాయలే కదా చాలా చౌకగా వస్తోంది, ఇన్వెస్ట్‌మెంట్‌కి బ్రహ్మాండమైన అవకాశం అనుకుంటారు.

అది వాళ్ల తప్పు కాదు. ఫండ్స్‌ని విక్రయించే కొందరు ఈ తరహా ప్రచారం చేయడమే ఇందుకు కారణం. ఎన్‌ఎఫ్‌వో చౌకగా దొరికినా... ఇప్పటికే పోర్ట్‌ఫోలియోలో ఉన్న యూనిట్లతో పోలిస్తే వీటి వ్యయాలు ఎక్కువగా ఉంటాయి కనుక.. ఆ మేరకు రాబడులు దెబ్బతింటాయని గుర్తుంచుకోవాలి. చౌకగా వస్తోంది కదాని మీ లక్ష్యానికి అనుగుణంగా ఉండని ఎన్‌ఎఫ్‌వోలలో ఎంచుకుంటే తర్వాత తిప్పలు తప్పవు. అమ్మాల్సి వచ్చినప్పుడు ఫండ్‌కి కూడా షేర్ల సూత్రమే వర్తిస్తుందనుకోకూడదు.

ముందుగానే చెప్పుకున్నట్లు రెండూ వేర్వేరు సాధనాలు కదా. సముచిత విలువ ఉన్నవి లేదా తక్కువ రేటులో దొరుకుతున్నవి కొనడం .. ఉండాల్సిన ధర కన్నా ఎక్కువ రేటు పలుకుతున్న వాటిని అమ్మడం అనేది ఫండ్ మేనేజరు పని. కనుక, కొద్దో గొప్పో లాభం వచ్చింది చాలని పరిస్థితులను బేరీజు వేసుకోకుండా మన యూనిట్లను అమ్మేసుకుంటే.. దీర్ఘకాలికంగా మంచి రాబడులు అందుకునే అవకాశాలను కోల్పోతాం.
 
మరి ఏం చేయాలి ...

మీ పోర్ట్‌ఫోలియోలో రెండు, మూడు ఫండ్స్ ఉన్నప్పుడు.. అవసరానికి అమ్మాల్సి వస్తే ఒక పద్ధతి పాటించవచ్చు. పనితీరు అంత బాగా లేని వాటిని, పెద్దగా పన్నుపరమైన ప్రయోజనాలు కల్పించలేకపోతున్న వాటిని విక్రయించవచ్చు. లేదా సదరు పెట్టుబడులు మంచి రాబడులే ఇస్తున్నప్పుడు అట్టే పెట్టుకుని తాత్కాలికంగా రుణం తీసుకోవడమూ మంచిది.

పనితీరు అంచనా ఎలా..
 
ప్రస్తుతం షేర్లలో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఫండ్లు 200 పైచిలుకు ఉన్నాయి. ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది. సాధారణంగా ఏడాది, మూడేళ్లు, అయిదేళ్లు పాటు ఆయా ఫండ్లు ఎలాంటి రాబడులు ఇస్తున్నాయో చూడాలి. ఒడిదుడుకులు ఉంటాయి కనుక స్వల్పకాలికంగా ఏ ఫండ్‌కైనా ఒక్కోసారి సమస్యలు తప్పకపోవచ్చు. కానీ, సదరు ఫండ్ నిరంతరంగా అదే పద్ధతిలో కొనసాగుతుంటే.. వైదొలిగి వేరే మెరుగైన ఫండ్‌ని ఎంచుకోవడం మంచిది. వీలైతే ఆ ఫండ్ పనితీరు ఎందుకు ఘోరంగా ఉందో అధ్యయనం చేయగలిగితే.. మార్కెట్లపైనా కాస్త అవగాహన పెరుగుతుంది.
 
పోర్ట్‌ఫోలియోలో మార్పులు, చేర్పులు..

ఆర్థిక పరిస్థితులు, పెరిగే వయసు తదితర అంశాలు పెట్టుబడి పోర్ట్‌ఫోలియోని ప్రభావితం చేస్తుంటాయి. ఉదాహరణకు.. మంచి జీతం అందుకుంటూ.. ఎటువంటి బాధ్యతలు లేనివారై, అవివాహితులై ఉన్న పక్షంలో ఈక్విటీ ఫండ్స్‌లో కొంత ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేయొచ్చు. అదే పెళ్లయి, పిల్లలు బాధ్యతలు పెరిగినప్పుడు రిస్కు సామర్థ్యమూ తగ్గుతుంది కనుక.. ఈక్విటీ ఫండ్‌లలోనూ పెట్టుబడుల పరిమాణాన్ని సముచిత స్థాయికి తగ్గించుకోవాలి. ప్రస్తుతం ఉన్న ఫండ్ కన్నా మరింత మెరుగైన రాబడి అందించే సాధనం వస్తే.. కొన్ని యూనిట్లను విక్రయించి.. సదరు కొత్త సాధనంలో ఇన్వెస్ట్ చేయొచ్చు.
 
ఇవే కాకుండా.. మరికొన్ని అంశాలు కూడా ఫండ్ విషయాల్లో నిర్ణయాలను ప్రభావితం చేస్తాయి.. వాటి గురించి వచ్చే వారం..
 

Advertisement
Advertisement