బెటర్ గార్డ్ | Sakshi
Sakshi News home page

బెటర్ గార్డ్

Published Sat, Apr 11 2015 12:27 AM

బెటర్ గార్డ్

రీడర్స్ కిచెన్
 
తీపి చేదులు కలిస్తేనే జీవితానికి అసలైన అర్థం తెలుస్తుంది అంటారు పెద్దలు. ఆహారం కూడా అంతే. తీపితో పాటు చేదు కూడా అప్పుడప్పుడూ తగులుతూ ఉంటేనే ఆహారంలోని మాధుర్యం అర్థమవుతుంది.  అయినా సరిగ్గా వండాలే కానీ... కాకరలోని చేదు కూడా జిహ్వకు తీయగానే తగులుతుంది అంటున్నారు మన పాఠకులు  కొందరు. కాకరకాయతో మీదైన ఓ వెరైటీ వంటకాన్ని రాసి పంపమని కోరగానే అందరూ ఎంతో ఉత్సాహంగా పంపించారు. వాటిలో నాలుగు ఉత్తమ వంటకాలు ఈవారం ‘రీడర్స్ కిచెన్’లో మీకోసం...
 
 1. కాకరకాయ వడలు


కావలసినవి: కాకరకాయలు - 2, మైదా - అర కప్పు, కార్న్‌ఫ్లోర్ - 2 చెంచాలు,  పెరుగు - అరకప్పు, ఉల్లిపాయ - 1, తరిగిన పుదీనా - 2 చెంచాలు, తరిగిన కొత్తిమీర - 2 చెంచాలు, కారం - 2 చెంచాలు, వేయించిన వేరుశనగల పొడి - 2 చెంచాలు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, జీలకర్ర - 1 చెంచా, గరం మసాలా - అర చెంచా, ధనియాల పొడి - అర చెంచా, పసుపు - చిటికెడు, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ: కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, గుండ్రని చక్రాల్లా కోసుకోవాలి; ఓ బౌల్‌లో పెరుగు, ఉప్పు, కారం, పసుపు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా  వేసి కలపాలి; ఈ మిశ్రమంలో కాకరకాక ముక్కల్ని వేసి అరగంటపాటు ఉంచాలి; ఆ తర్వాత మైదా, కార్న్‌ఫ్లోర్, వేరుశనగ పొడి, జీలకర్ర, పుదీనా, కొత్తిమీర, ఉల్లిపాయ ముక్కలు వేసి వడల పిండి మాదిరిగా కలుపుకోవాలి; స్టౌమీద బాణలి పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేయాలి; వేడెక్కాక... పిండిని చిన్న చిన్న వడల్లాగా ఒత్తుకుని నూనెలో దోరగా వేయించాలి.
 
 2. కాకరకాయ టిక్కీ

కావలసినవి:    కాకరకాయలు (పెద్దవి) - 2, క్యారెట్ - 1, బఠాణీలు - పావుకప్పు, బియ్యపు పిండి - 1 కప్పు, బొంబాయి రవ్వ - పావుకప్పు, కొత్తిమీర - పావుకప్పు, ఉల్లిపాయ - 1, పచ్చిమిర్చి - 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 చెంచా, ధనియాల పొడి - 1, ఉప్పు - తగినంత, నూనె - వేయించడానికి సరిపడా

తయారీ: క్యారెట్‌ను తురుముకుని పక్కన పెట్టాలి; బఠాణీలు, కొత్తిమీర, పచ్చిమిర్చి కలిపి పేస్ట్ చేయాలి; ఉల్లిపాయల్ని, గింజలు తీసేసిన కాకరకాయల్ని వేర్వేరుగా మిక్సీలో వేసి ముద్ద చేసుకోవాలి (మరీ మెత్తగా అవ్వకూడదు); ఓ బౌల్‌లో ఉల్లి ముద్ద, కాకరకాయ ముద్ద, బఠాణీ-కొత్తిమీర-పచ్చిమిర్చి ముద్ద, క్యారెట్ తురుము వేసి బాగా కలపాలి; తర్వాత బియ్యపు పిండి, బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఉప్పు వేసి కలుపుకోవాలి; ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుని, టిక్కీల్లాగా ఒత్తుకోవాలి; స్టౌ మీద అట్ల రేకు పెట్టి, కాసింత నూనె వేసి, రెండు వైపులా ఎరుపురంగు వచ్చేవరకూ కాల్చుకోవాలి.
 
 3. కాకరకాయ ఉల్లికారం

 కావలసినవి: కాకరకాయలు - 4, ఉల్లిపాయలు (పెద్దవి) - 2, ఎండుమిర్చి - 7, జీలకర్ర - 2 చెంచాలు, నువ్వులు - 2 చెంచాలు, చింతపండు - నిమ్మకాయంత, ఉప్పు - తగినంత, నూనె - తగినంత
 
తయారీ: ముందుగా మిక్సీలో ఉల్లిపాయలు, చింతపండు, జీలకర్ర, ఎండుమిర్చి, ఉప్పు వేసి మెత్తని పేస్టులా చేసుకోవాలి; కడాయిలో కొద్దిగా నూనె వేసి, ఉల్లిపాయ పేస్టును పచ్చి వాసన పోయేవరకూ వేయించి పక్కన పెట్టుకోవాలి; కాకరకాయల్ని శుభ్రంగా కడిగి, నాలుగు పాయలుగా చీలి, గింజలు తీసేయాలి; తర్వాత ఈ కాయల్లో ఉల్లిపాయ పేస్టును కూరాలి; స్టౌ మీద బాణలి పెట్టి నూనె వేయాలి; వేడెక్కాక కాకరకాయ ముక్కలు వేసి మూత పెట్టాలి; అప్పుడప్పుడూ కలుపుతూ సన్నని మంట మీద వేయించుకోవాలి; ఎరుపురంగులోకి మారాక ఓ ప్లేటులోకి తీసుకుని, పైన నువ్వుల్ని చల్లి వడ్డించాలి.
 
 4. కాకరకాయ పోళీ


 కావలసినవి: కాకరకాయలు - పావుకిలో, ఉల్లిపాయ ముక్కలు - 1 కప్పు, ఎండుమిర్చి - 6, పచ్చి శనగపప్పు - 2 చెంచాలు, ధనియాలు - 2 చెంచాలు, వేయించిన కొబ్బరిపొడి - 2 చెంచాలు, వేయించిన నువ్వుల పొడి - 2 చెంచాలు, మెంతులు - 1 చెంచా, చింతపండు గుజ్జు - 4 చెంచాలు, బెల్లం తరుగు - 1 చెంచా, ఉప్పు - తగినంత, పసుపు - చిటికెడు, నూనె - తగినంత

 తయారీ: స్టౌమీద బాణలి పెట్టి, కొద్దిగా నూనె వేయాలి; వేడెక్కాక గుండ్రంగా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి; పచ్చి శనగపప్పు, ఎండుమిర్చి, ధనియాలు, మెంతుల్ని దోరగా వేయించి పొడి చేసుకోవాలి; బాణలిలో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేయాలి; బ్రౌన్ కలర్ వచ్చాక కాకర కాయ ముక్కలు వేయాలి; రెండు నిమిషాలు వేయించాక... మిక్సీ పట్టిన పొడితో పాటు కొబ్బరిపొడి, నువ్వుల పొడి కూడా వేయాలి; కాస్త మగ్గాక బెల్లం తరుగు, చింతపండు గుజ్జు వేసి, కొద్దిగా నీరు పోసి కలిపి మూతపెట్టాలి; నీరు ఇగిరిపోయి బాగా దగ్గరగా అయ్యేవరకూ సన్నని మంటమీద ఉడికించుకుని దించేసుకోవాలి.
 
 కాకరలో పోషకాలు ఎక్కువే!

 కాకరకాయలో క్యాలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువ ఉంటాయి. బీ1, బీ2, బీ3, సీ విటమిన్లతో పాటు మెగ్నీషియం, ఫోలేట్, జింక్, ఫాస్ఫరస్, మాంగనీస్, ఫైబర్ మెండుగా ఉంటాయి. బ్రకోలీ కంటే రెండు రెట్లు ఎక్కువ బీటా కెరోటిన్, పాలకూరలో కంటే రెండు రెట్లు ఎక్కువ కాల్షియం, అరటిపండులో కంటే రెండు రెట్లు ఎక్కువ పొటాషియం ఉంటాయి. ఇందులో ఉండే ‘పోలీపెప్టైడ్ పి’.. ఇన్సులిన్ స్థానాన్ని భర్తీ చేస్తుంది. అందుకే మధుమేహ రోగులు తరచుగా తినాలి. కాకరకు ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు... కడుపులో మంట, గుండె మంట, అల్సర్ల వంటివి తగ్గుతాయి.

అయితే గర్భవతులు, బిడ్డలకు పాలిచ్చే తల్లులు కాకరను తినకపోవడం ఉత్తమం. ఇందులో ఉండే క్వినైన్, మోరోడైసిన్, సపోనిక్ గ్లైకోసైడ్స్ వంటివి  పడక కొందరికి ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. స్వల్ప మోతాదులో ఉండే విషపూరిత టాక్సిన్లు కడుపునొప్పి, వాంతులు, డయేరియా, నరాల బలహీనత తదితర ఇబ్బందులు కలిగించవచ్చు. కాబట్టి వండే ముందు ఓ పది నిమిషాలు ఉప్పునీటిలో నానబెట్టి వండుకుంటే మంచిది.
 - సుజాత స్టీఫెన్, న్యూట్రిషనిస్ట్
 
 రీడర్స్ కిచెన్

 
ఇంతవరకూ సాక్షి ‘ఫ్యామిలీ’ అందించిన వైవిధ్యభరితమైన వంటకాలను చూశారు, నేర్చుకున్నారు, వండుకుని ఆస్వాదించారు. ఇక ఇప్పుడు మీ రుచులను అందరికీ అందించే సమయం ఆసన్నమైంది. ప్రతివారం మేము అడిగే ప్రధాన దినుసుతో మీదైన వంటకాన్ని వివరంగా రాసి, దాని ఫొటోను, మీ ఫొటోను జతచేసి మాకు పంపించండి. కూర, వేపుడు, స్వీట్, స్నాక్ ఏదైనా సరే... మీరు పంపే వంటకం వినూత్నంగా, వైవిధ్యంగా ఉంటే దాన్ని కుకరీ పేజీలో ప్రచురిస్తాం. అయితే ప్రతివారం బుధవారానికల్లా మీ వంటకం మాకు అందాలి.
 ఈ వారం ‘పచ్చి మామిడికాయ’తో ఓ వెరైటీ వంటకాన్ని పంపించండి. అది కచ్చితంగా మీరు కనిపెట్టిన వంటకమై ఉండాలన్న విషయం మర్చిపోకండి.
 
 మా చిరునామా:
 రీడర్స్ కిచెన్, సాక్షి దినపత్రిక, 2-3-249/1,
 సాక్షి టవర్స్, రోడ్ నం. 1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34
 ఈ మెయిల్: sakshi.cookery@gmail.com
 

Advertisement

తప్పక చదవండి

Advertisement