Sakshi News home page

రేణుక... గోల్డ్‌మెడలిస్ట్‌!

Published Thu, Aug 31 2017 12:22 AM

రేణుక... గోల్డ్‌మెడలిస్ట్‌! - Sakshi

∙ వెన్నాడిన ఫ్లోరైడ్‌ భూతం  ∙చదువుకు వెళ్లిన చోటల్లా అవమానాలు
∙కష్టాలను అధిగమించి పీజీ, బీఎడ్‌ చదివింది  ∙యూనివర్సిటీ టాపర్‌గా బంగారు పతకం సాధించింది
∙వెక్కిరించిన నోళ్లే ఇప్పుడు వెరీగుడ్‌ అంటున్నాయ్‌.... ∙సర్కారు కరుణించాలంటున్న చదువుల తల్లి


రేణుక... పసి ప్రాయంలోనే ఫ్లోరోసిస్‌ భూతం బారిన పడింది. వయస్సుకు తగ్గట్టుగా ఎదగలేకపోయింది. కనీసం నడవడానికి కూడా కాళ్లు సహకరించవు. కన్నవారికి భారమైనా కడుపుతీపి ఆమెను కాపాడింది. బిడ్డను కంటికి రెప్పలా చూసుకున్న తల్లిదండ్రులు ఆమె సంకల్పానికి ఊపిరినిచ్చారు. ఆమె చదువు కోసం ఎన్నో త్యాగాలు చేశారు. కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూనే బిడ్డ ఆశయానికి అండగా నిలిచారు. తల్లిదండ్రులు అందించిన ధైర్యంతో, వెక్కిరించిన విధిని, అవమానించిన సమాజాన్ని చాలెంజ్‌ చేసింది. తన సంకల్పాన్ని నెరవేర్చుకుంది. ఎంఏ, బీఈడీ చదివిన రేణుక యూనివర్సిటీ టాపర్‌గా గోల్డ్‌మెడల్‌ అందుకుంది. ఉన్నత చదువులతో వెక్కిరించిన నోళ్లను మూయించింది. వారితోనే వెరీగుడ్‌ అనిపించుకుంది. కాని సర్కారు కొలువు దొరికితేనే తన సంకల్పం నెరవేరినట్టవుతుందని ఉద్యోగం కోసం తపిస్తోంది. సర్కారు కరుణ కోసం ఆరాటపడుతోంది.

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌ మండలంలోని ఆరెపల్లి పంచాయతీ పరిధిలో గల ‘ఆరేడు’ గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి–గంగ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు. వ్యవసాయంపైనే ఆధారపడ్డ ఆ కుటుంబం సాగునీటి వేటలో అనేక కష్టాలను ఎదుర్కొంది. అయితే లక్ష్మారెడ్డి కూతురు రేణుక చిన్నతనంలోనే ఫ్లోరోసిస్‌ వ్యాధి బారిన పడి ఇబ్బందులపాలైంది. కూతురికి వైద్యం చేయించడం కోసం తల్లిదండ్రులు ఎన్నో ప్రయత్నాలు చేసినా లాభం లేకుండాపోయింది. అయితే కూతురికి చదువుపై ఉన్న ఆసక్తిని గుర్తించిన తల్లిదండ్రులు కష్టాలెన్నింటినో ఎదుర్కొంటూ ఆమెకు ఉన్నత చదువులు చెప్పించారు. సొంత ఊరైన ఆరేడులో నాలుగో తరగతి వరకే ఉండడంతో అక్కడ నాలుగో తరగతి దాకా చదివింది. తరువాత ఐదు, ఆరు తరగతులు పక్క గ్రామమైన అచ్చంపేటలో చదువుకుంది. ఏడోతరగతి నుంచి పదోతరగతి వరకు నిజామాబాద్‌ పట్టణంలోని వివేకానంద హైస్కూల్‌లో చదివించారు. పదో తరగతిలో 400 మార్కులు సాధించింది. తరువాత ఇంటర్మీడియల్‌ మెదక్‌ పట్టణంలో చదివింది. 658 మార్కులు సంపాదించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్శిటీకి అనుబంధమైన ఆంధ్రమహిళా సభ కళాశాలలో డిగ్రీ చదివి కాలేజ్‌ టాపర్‌గా నిలిచింది. బీఈడీ కూడా అదే కళాశాలలో అభ్యసించింది. యూనివర్సిటీ టాపర్‌గా నిలిచిన రేణుకకు గోల్డ్‌మెడల్‌ అందించారు.

పీజీ ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాలలో పూర్తి చేసింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) కూడా క్వాలిఫై అయ్యింది. కూతురి చదువు కోసం తల్లి ఆమె వెంటే ఉండేది. కూతురు ఎక్కడ ఉంటే అక్కడ తల్లి ఉండి ఆమెను చదువుకోసం తీసుకెళ్లడం, తిరిగి ఇంటికి తీసుకురావడం జరిగేది. తండ్రి అటు వ్యవసాయం చూసుకుంటూ పిల్లల చదువుల కోసం ఆరాటపడేవారు. తల్లిదండ్రులు తన కోసం పడుతున్న శ్రమను చూసిన రేణుక పట్టుదలతో ధైర్యాన్ని కూడగట్టుకుని మరీ ఉన్నత చదువులు పూర్తి చేసింది. చదువుల్లో ఏనాడూ వెనుకబడకుండా అందరికన్నా తనే ఎక్కువ మార్కులు సాధించే ప్రయత్నం చేసింది. ఆంధ్రమహిళా సభ కళాశాలలో బీఈడీ చదివిన రేణుక గోల్డ్‌మెడల్‌ కూడా సాధించిందంటే ఆమె పట్టుదలకు ఇదే నిదర్శనంగా చెప్పవచ్చు.

సర్కారు కరుణ కోసం....
ఎంఏ; బీఈడీ పూర్తి చేసిన రేణుక ఉద్యోగం కోసం ఎదురు చూస్తోంది. డీఎస్సీ నోటిఫికేషన్లు పడకపోవడంతో ఆమె ఆశయం నెరవేరడం లేదు. కనీసం ప్రభుత్వం తన పరిస్థితిని గుర్తించి ఏదైనా ఉద్యోగం ఇస్తే కుటుంబానికి ఆసరా అవుతానంటూ ఇటీవలే కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ను కలిసి విన్నవించింది. ఫ్లోరోసిస్‌ బారిన పడిన తను నిత్యం ఎన్నో కష్టాలను ఎదుర్కొంటోంది. తల్లిదండ్రులు ఆమెకు అన్ని రకాల సేవలు చేస్తూ ధైర్యాన్నివ్వడం వల్లే ఆమె ఇంతదాక నెట్టుకువచ్చింది. అయితే ప్రభుత్వం తనకు ఉద్యోగం ఇచ్చి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది. సాధారణంగా వికలాంగులు ఏదో ఒక పనిచేసుకుని బతకగలుగుతారని, తాను పూర్తిస్థాయిలో ఫ్లోరోసిస్‌తో బాధపడుతున్నందున ఏ పనీ చేసుకునే పరిస్థితి లేదని, తనకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు వెంట ఉంటేనే బయటకు వెళ్లే పరిస్థితి ఉందని తెలిపింది. తనను ఆదుకోవాలని వేడుకుంటోంది రేణుక.
– సేపూరి వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి
 

Advertisement
Advertisement