తెలుగులో నవ్వే హోవార్డ్‌ రోర్క్‌ | Sakshi
Sakshi News home page

తెలుగులో నవ్వే హోవార్డ్‌ రోర్క్‌

Published Mon, Nov 25 2019 1:10 AM

Review On Ayn Rands Fountainhead Novel - Sakshi

75 ఏళ్లుగా పాఠకులు చదువుతున్నారు. 20కి పైగా భాషలలోకి మార్చుకున్నారు. 70 లక్షల ప్రతులకు మించి కొన్నారు. కాలాలు దేశాలు దాటివచ్చిన పుస్తకం క్లాసిక్‌ కాక మరేమిటి?
ఇందులో కథ కొన్ని ఏళ్లపాటు జరిగిన కథ. హీరో పాత్రకి 22 ఏళ్లుండగా మొదలౌతుంది. అతనికి సుమారుగా 40 ఏళ్లు వచ్చేదాకా నడుస్తుంది.

1943లో అచ్చయిన ఈ పుస్తకంలో హీరో హోవార్డ్‌ రోర్క్‌ పాత్ర 1936 నాటికే పుట్టింది. 1937 నాటికే అయిన్‌ రాండ్‌కు టూహీ పాత్ర గురించి ఒక స్పష్టమైన అభిప్రాయం ఉంది. ఎంత చిన్న పాత్ర అయినా సరే వాళ్లని రూపురేఖలు దుస్తులతో సహా ఊహించింది అయిన్‌ రాండ్‌. ఉదాహరణకు టూహీ అర్భకంగా ఉండటం కేవలం వైచిత్రి కోసం చేసిన కల్పన కాదు. అతని మానసిక వైఖరికి కారణాల్లో అర్భకత్వం ఒకటి.
నేపథ్య చిత్రణ వాస్తవంగా లేకపోతే నవల సహజంగా పండదు. అందుచేత వాస్తవిక చిత్రణ కోసం ఆర్కిటెక్చర్‌ రంగం గురించి విస్తృతంగా అధ్యయనం చేసింది. ఒక సంవత్సరం పాటు ఒక ఆర్కిటెక్చర్‌ ఆఫీసులో ఉద్యోగం చేసింది. ఇది ఆమె శ్రద్ధ. ఇది ఆర్కిటెక్చర్‌ మీద పుస్తకం కాదు. కానీ చిత్రంగా ఈ నవలలో అయిన్‌ రాండ్‌ చేసిన ఊహలతో అమెరికన్‌ ఆర్కిటెక్చర్‌ రంగం ప్రభావితం అయిందంటున్నారు విశ్లేషకులు. అదీ ఆమె క్రియేటివిటీలోని లోతు

మనిషి అంటే ఏమిటో చూపించడానికి ఇది రాయాలనుకుంది అయిన్‌ రాండ్‌. మనిషి ‘అయినవాడు’ ఏం కోరుకుంటాడో, ఏ రకంగా ఆ కోరికను తీర్చుకుంటాడో రాయడానికి పూనుకుంది. ‘మనిషి చైతన్యం సాధించే గెలుపుకి ఒక ఇతిహాసంగా, మనిషిలోని ‘నేను’కు ఒక ‘హిమ్‌’గా (ప్రశంసా గీతంగా, కీర్తనగా) ఈ నవలను తీర్చిదిద్దాలని ఆవిడ సంకల్పం.
స్వార్థపరుడైన గొప్ప వ్యక్తి ఈ నవలలో హీరో. స్వార్థం అనేది తప్పు అని మనకు చెబుతూ వచ్చాయి మతాలు. అనేకమంది తత్వవేత్తలు కూడా స్వార్థ రాహిత్యం గొప్పదని బోధించారు. అయిన్‌ రాండ్‌ అదంతా తప్పు అంది. ఇంతవరకూ మనం స్వార్థమని భావిస్తున్నది ఎంత నిస్సా్వర్థమో అందువల్ల ఎంత నిస్సారమో చూపించింది.

హోవార్డ్‌ రోర్క్‌ నిరుద్వేగి. దేనికీ కుంగిపోడు. దేనికీ ఉప్పొంగిపోడు. పోతపోసిన ఇనుము. అతని నిస్సందిగ్ధత మనల్ని ముగ్ధుల్ని చేస్తుంది. ఏ నిర్ణయంలోనూ పరాధీనత ఉండదు. అతనికి ప్రపంచంతో నిరంతర ఘర్షణ. కానీ తన లోలోపల పరిపూర్ణ శాంతి. ఘర్షణలో ఉంటూ అంతశ్శాంతిని నిలుపుకున్నవాళ్లు అరుదు. రోర్క్‌ ఎందరో మేధావులకి ప్రేరణగా నిలిచిన పాత్ర.
అయిన్‌ రాండ్‌ తన ఫిలాసఫీని ఆబ్జెక్టివిజం పేరుతో ప్రకటించింది. విభేదించడానికి అయినా చదవాల్సిన రచయిత్రి.

సోదర భాషల మధ్య ఫరవాలేదుకాని తెలుగు ఇంగ్లీషుల్లాగా రెండు ఏమాత్రం సంబంధం లేని భాషల మధ్య అనువాదం కష్టం. వీటిలో కర్త, కర్మ, క్రియల కూర్పు వేర్వేరు. జాతీయం వేరు. సంస్కృతి వేరు. అలవాట్లు వేరు. మర్యాదలు వేరు. వాళ్ల లివింగు రూములు, డ్రాయింగు రూములు, స్టడీ రూములు మనకు పరాయివి. అన్నింటినీ ‘తెలుగు చెయ్యడం’ కుదరదు. ఇంగ్లీషులో కన్నా తెలుగులో పదజాలం తక్కువ. అనేక అర్థచ్ఛాయల్ని ఇముడ్చుకున్న ఏకపదాలు ఇంగ్లీషులో ఉంటాయి. అంతవరకూ ఎందుకు, ఇంగ్లీషులో కామాలు, సెమీకోలన్లు, కోలన్లు, హైఫెన్లు కూడా అవిభాజ్యాలయిన భాషా భాగాలు. తెలుగులో వాటి వాడుకకు కచ్చితమైన వ్యవస్థ ఏర్పడలేదు. 

అవి అలా ఉండగా, అయిన్‌ రాండ్‌ నిర్దాక్షిణ్యంగా రాస్తుంది. ఎక్కడ ఏ పదం ఉచితం అనుకుంటే అక్కడ ఆ పదాన్ని నిస్సందేహంగా వాడుతుంది. ఆవిడ డిక్షన్‌ సామాన్యమయింది కాదు. ఆలోచనలో లోతెక్కువ. గాఢత సున్నితత్వం హెచ్చు. మెలికలు ఎక్కువ. పదక్లిష్టతని ఏ డిక్షనరీ సహాయంతోనో అధిగమిస్తాం. భావ క్లిష్టతని? సగటు పాఠకుడికి అర్థమయ్యేలా రాయమని ఒకరిద్దరు సూచించారు. రీ టెల్లింగులో సులభపరిచే స్వేచ్ఛ ఉంటుంది. కానీ లోతు పోతుంది. గొప్ప నవలని వట్టి కథ స్థాయికి దించకూడదు. కాబట్టి అనువాదమే దారి.
ఎంత దులుపుదామన్నా ఈ తెలుగు పుస్తకానికి భాషరీత్యా కూడా కొద్దో గొప్పో ఇంగ్లీషు అంటుకునే ఉండిపోయింది. తెలుగు భాషకి ఉన్న పరిమితులే కాక నా భాషాజ్ఞానానికి ఉన్న పరిమితులు కూడా ఉంటాయి. ప్రయత్న లోపం మటుకు లేదు.
- రెంటాల శ్రీవెంకటేశ్వరరావు 

Advertisement
Advertisement