సాహియరింగ్ ఈజీ | Sakshi
Sakshi News home page

సాహియరింగ్ ఈజీ

Published Sun, Mar 8 2015 10:56 PM

సాహియరింగ్ ఈజీ - Sakshi

వినికిడి సమస్య చాలా విచిత్రమైంది. చక్కటి చుక్కల్లా ఉండే చిన్నారులు వినికిడి, మూగ... సమస్యల బారిన పడి వికలాంగులవుతారు. ఇలాంటి సమస్య ఆడపిల్లలకు వస్తే అది మరింత వేదనకు కారణమవుతుంది. కారణం... మన సమాజంలోని వివక్ష. ఆడపిల్లలంటే చిన్నచూపు. వైద్యంలోగానీ, విద్యావకాశాల్లోగానీ... ముందుగా మగపిల్లలకే ప్రాధాన్యం ఇస్తారు. దాంతో ఆడపిల్లలకు మూగ, చెవుడు సమస్యలు వస్తే వారు మరింతగా కుంగిపోవాల్సిన పరిస్థితి.

ఇకపై అలాంటి సమస్యలకు అడ్డుకట్ట వేసేందుకు ఒక కొత్త ప్రాజెక్టును చేపట్టింది ‘సాహీ’. ‘సొసైటీ టు ఎయిడ్ ద హియరింగ్ ఇంపెయిర్‌డ్’ అనే స్వచ్ఛంద సంస్థకు సంక్షిప్త రూపమే ఈ ‘సాహి’.  ఇది చేపట్టిన సరికొత్త కార్యక్రమమే  ‘హియరింగ్ ఇంపెయిర్‌డ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్’. ఈ కార్యక్రమ వివరాలు ఇవి...

 
- యాసీన్
పదేళ్ల కిందట 2004 నవంబర్‌లో సాహి సంస్థ ప్రముఖ ఈఎన్‌టీ సర్జన్ డాక్టర్ ఈ.సీ. వినయకుమార్ నేతృత్వంలో రూపుదిద్దుకుంది. కొంతమంది ఈఎన్‌టీ సర్జన్లు, ఆడియాలజిస్టులు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యం, సేవా దృక్పథం గల కొందరు ప్రముఖులతో ఈ సేవా సంస్థ ఆవిర్భవించింది. వినికిడి, మూగ సమస్యలను పరిష్కరిస్తూ... వారికి ఉచిత వైద్యసహాయం అందిస్తోందీ సంస్థ.
 
అనేక సహాయ కార్యక్రమాల్లో ‘సాహి’
‘సాహి’ ఆవిర్భవించిన నాటి నుంచి సమాజంలో... మరీ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పిల్లల్లో వినికిడి శక్తి లేని వారిని గుర్తించి, వారికి వైద్య సహాయం అందించడంలో తోడ్పడుతూ వస్తోంది. కాక్లియర్ ఇంప్లాట్స్ అమర్చి శస్త్రచికిత్స చేయడం, చెవికి సంబంధించిన మైక్రో సర్జరీలను నిర్వహించడం, వినికిడి మిషన్లు ఉచితంగా ఇవ్వడం, బోన్ యాంకర్డ్ హియరింగ్ ఎయిడ్ (బాహా) వంటి శస్త్రచికిత్సలను చేయడం, అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం, అప్పుడే పుట్టిన చిన్నపిల్లలకు కూడా వినికిడి సమస్య ఉందో లేదో తెలుసుకునే స్క్రీనింగ్ పరీక్షలు చేయడం వంటి కార్యకలాపాలను చేపట్టారు.

ఇప్పటికే ఇరురాష్ట్రాల్లోనే గాక... పాకిస్థాన్ వంటి  ఇరుగుపొరుగు దేశాల నుంచి కూడా దాదాపు 2,500కు పైగా పిల్లలకు వినికిడి సమస్యను శాశ్వతంగా దూరం చేశారు ‘సాహీ’ నిర్వాహకులు. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి సహకారంతో అత్యంత వ్యయభరితమైన (దాదాపు ఏడున్నర నుంచి ఎనిమిది లక్షల విలువైన) కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సలను ‘ఆరోగ్యశ్రీ’ జాబితాలో చేర్చేలా చొరవతీసుకుంది సాహి. ‘‘మొదటిసారిగా అప్పటి ఆంధ్రప్రదేశ్ సంయుక్తరాష్ట్రంలో ఈ కాక్లియర్ ఇంప్లాంట్ శస్త్రచికిత్సను ఆరోగ్యశ్రీలో భాగం చేశాక... ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాలూ... అప్పటి మన సంయుక్తరాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుని... తమ తమ రాష్ట్రాల్లోనూ ఈ శస్త్రచికిత్సను వారి వైద్య సహాయ కార్యక్రమాల జాబితాలో చేర్చారు.

మేం శస్త్రచికిత్స నిర్వహించి... వినికిడి, మాట శక్తిని ప్రసాదించిన ఒక అమ్మాయి... యువతిగా ఎదిగి, ఎన్నో విజయాలను నమోదు చేస్తూ ఇటీవల సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో మెయిన్స్ పాసయ్యింది’’ అని సంతోషంగా వివరించారు ‘సాహి’ కార్యదర్శి, ఈఎన్‌టీ శస్త్రచికిత్సా నిపుణులు, అపోలో ఆసుపత్రుల ఈఎన్‌టీ విభాగాధిపతి అయిన ఈ.సీ. వినయకుమార్. సాహీ సేవల వల్ల ప్రయోజనం పొందుతున్న వారు సాధిస్తున్న విజయాలకు ఇదొక తార్కాణం.
 
మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం...
ప్రస్తుతం ‘సాహి’ని స్థాపించి దశాబ్దం గడిచిన సందర్భంగా మరో కొత్త ప్రాజెక్టును చేపట్టిందీ సంస్థ. ‘హియరింగ్ ఇంపెయిర్‌డ్ గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్ ఇన్ రూరల్ ఏరియాస్’ అనే పేరుతో చేపట్టిన ఈ కొత్త ప్రాజెక్టు కింద 15 ఏళ్ల లోపు అమ్మాయిలకు వినికిడి సమస్యలుంటే వారికి కాక్లియార్ ఇంప్లాంట్ పరికరాలు అమర్చడం వంటి ఉపకరణాలతో కూడిన శస్త్రచికిత్సలు చేయడం, అత్యంత సంక్లిష్టమైన మైక్రో ఇయర్ సర్జరీలు నిర్వహించడం వంటి వైద్య సహాయాలను పల్లెల్లోని ఆడపిల్లలకు అందిస్తారు. ‘‘వినికిడి లోపాలు అనేక రకాలు.

అది ఏరకమైన వినికిడి సమస్య అయినప్పటికీ ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఆధునికమైన వైద్య పురోగతితో అన్నిరకాల వినికిడి సమస్యలకూ పరిష్కారాలున్నాయి. అయితే లోపించిందల్లా... ఈ సమస్యలకు వైద్యపరమైన పరిష్కారాలు ఉన్నాయనే విషయంపై అవగాహన మాత్రమే. అది కూడా గ్రామీణ ప్రాంతాల్లో మరీ తక్కువ. అందుకే మేం ఈ ప్రత్యేకమైన ప్రాజెక్టును చేపట్టాం’’ అని వివరించారు డాక్టర్ ఈ.సీ. వినయకుమార్. పైగా వినికిడి సమస్యను పిల్లల్లో ఎంత త్వరగా గుర్తించి, అది ఏరకానికి చెందినదన్న అంశాన్ని తెలుసుకుని, ఎంత త్వరగా చికిత్స అందిస్తే, అంతే త్వరగా వారికి వినికిడి సమస్య తీరుతుందీ... అందరిలాగే మాటలూ బాగా వస్తాయి.
 
కొన్ని ఇతర దేశాల ఎన్జీవోలతో సంయుక్తంగా...
సాహి చేపట్టిన ఈ ‘‘హియరింగ్ ఇంపెయిర్‌డ్ గర్ల్ ఛైల్డ్ ప్రాజెక్టుకు చెక్ దేశానికి (గతంలోని చెకొస్మోవేకియాలో ఒకటైన చెక్ రిపబ్లిక్) చెందిన స్వచ్ఛంద సేవా సంస్థ అయిన ‘‘పింక్ క్రోకడైల్’’ కూడా తనవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చింది. మన దేశపు రాక్‌బ్యాండ్స్‌లో ప్రముఖమైన ‘‘ఇండియన్ ఓషియన్’’ రాక్‌బ్యాండ్ గ్రూపు వారు ‘సాహి’ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్లుగా వ్యవహరిస్తున్నారు.
 
ఆడపిల్లలకు సహాయం చేయడానికి కారణాలివే...
మన సమాజంలో ఆడపిల్లలంటే ముందునుంచే కాస్త వివక్ష ఉంది. విద్యావకాశాలను కల్పించడంలో, వైద్యసహాయాలను అందించడంలో మొదటి ప్రాధాన్యాలను మగపిల్లలకే ఇస్తారు. దాంతో వినికిడి సమస్యలున్న వారు, మాటలు రాని మూగ అమ్మాయిలు వివక్ష తాలూకు వేదనను మౌనంగా అనుభవించాల్సిన పరిస్థితి. పైగా వారి వైకల్యాన్ని వెక్కిరిస్తూ సమాజపు సూటిపోటి మాటలను ఎదుర్కొనాల్సిన దుస్థితి. ఇక యుక్తవయసుకు వచ్చాక వాళ్లకు ఉపాధి కల్పనలోనూ, ఉద్యోగ విషయాల్లోనూ సమాజం వివక్ష చూపుతుంది.

ఇలాంటి పిల్లల పెళ్లిళ్లు కావడం కూడా చాలా కష్టం. ఈ వైకల్యంతో పిల్లలను కన్నందుకు వాళ్ల తల్లిదండ్రులపైనా సమాజం వివక్ష చూపుతుంది. ఇలాంటి పిల్లలను పెళ్లి చేసుకోడానికి సాధారణంగా ఎవరూ ముందుకు రారు. ఒకవేళ వచ్చినా... వైకల్యం ఉన్న అమ్మాయిని వివాహం చేసుకుంటున్నందుకు వారి తల్లిదండ్రులనుంచి పెద్ద ఎత్తున కట్నాన్ని ఆశిస్తారు. దాంతో ఆర్థికంగా కూడా ఈ పిల్లలు తల్లిదండ్రులకు భారమయ్యే అవకాశాలున్నాయి. వినికిడి సమస్యలున్న అమ్మాయిలు ఈ  వెతలను అనుభవించే అవసరం లేకుండా చూసేందుకే ఈ బృహత్తరమైన ప్రాజెక్ట్‌ను చేపట్టింది సాహి.
 
సహాయం పొందండి ఇలా...
వినికిడి సమస్యలతో బాధపడుతున్న గ్రామీణ ప్రాంతపు ఆడపిల్లలలో వీలైనంత ఎక్కువ మందికి సహాయం అందించేందుకు ‘సాహి’ నిశ్చయించుకుంది. ఈ సమస్యలతో బాధపడుతున్న పదిహేనేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులు సాహీని సంప్రదించవచ్చు. ‘సాహీ’ ఫోన్ నెంబర్లు 040-23607777 ఎక్స్‌టెన్షన్ 3737/ 5805. మొబైల్ నెం. 9949044276. ఈ ఫోన్లు  ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తాయి. ఇక ఈ-మెయిల్ ద్వారా సంప్రదించాలంటే sahiearcare2004 @gmail.com కు తమ విజ్ఞాపనలు పంపవచ్చు. సాహి వెబ్‌సైట్ చిరునామా: www.sahiearcare.org.

Advertisement
Advertisement