సైనసైటిస్ తగ్గేదెలా? | Sakshi
Sakshi News home page

సైనసైటిస్ తగ్గేదెలా?

Published Fri, Sep 4 2015 1:03 AM

Saina taggedela saitis?

సైనసైటిస్ తగ్గేదెలా?

 నా వయసు 34 ఏళ్లు. చాలాకాలంగా సైనసైటిస్‌తో బాధపడుతున్నాను. ఎన్నో మందులు వాడాను. కానీ సమస్య తగ్గడం లేదు.  శాశ్వతంగా తగ్గేందుకు  చికిత్స హోమియోలో చికిత్స ఉందా?
 - రంగారెడ్డి, భువనగిరి

 సైనస్ అంటే గాలి గది. మన ముఖంలోని ఎముకల మధ్యల్లో నాలుగు జతలుగా ఖాళీగా ఉండే గాలి గదులు ఉన్నాయి. సైనస్‌ల లోపలివైపున మ్యూకస్ మెంబ్రేన్ అనే లైనింగ్‌పొర ఉంటుంది. సైనస్‌లు అన్నీ ఆస్టియం అనే రంధ్రం ద్వారా ముక్కులోకి తెరచుకుంటాయి. మనం పీల్చుకునే గాలి ఉష్ణోగ్రతను మన శరీర ఉష్ణోగ్రతకు దగ్గరగా ఉండేలా చేయడానికి సైనస్‌లు ఉపయోగపడతాయి. సైనస్‌లలోకి అంటే... ఖాళీ గదుల్లో ఇన్ఫెక్షన్ వస్తే అది సైనసైటిస్‌కు దారితీస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ ఫ్యారింగ్స్ లేదా టాన్సిల్స్‌కు వ్యాపిస్తే ఫారింజైటిస్, టాన్సిలైటిస్‌కు దారితీయవచ్చు. ఒకవేళ చెవికి చేరితే ఒటైటిస్ మీడియా అనే చెవి ఇన్ఫెక్షన్ వస్తుంది.

సైనసైటిస్ వచ్చిన వారికి  తరచూ జలుబుగా ఉండటం  ముక్కుద్వారా గాలిపీల్చుకోవడం కష్టం కావడం  ముక్కు, గొంతులో కఫం లేదా చీముతో కూడిన కఫం చేరడం కొందరిలో ఈ కఫం చెడువాసన రావడం  నుదుటి పైభాగంలో లేదా కళ్లకింద, కనుబొమల మధ్య తలనొప్పి రావడం      తల ముందుకు వంచినప్పుడు లేదా దగ్గినప్పుడు తలనొప్పి ఎక్కువ రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి వచ్చినప్పుడు సైనస్‌ల నుంచి ఇతర భాగాలకు అంటే... గొంతు, శ్వాసనాళాలకు ఇన్షెక్షన్ వ్యాపించవచ్చు. ఎక్స్-రే, సీటీస్కాన్ వంటి పరీక్షల ద్వారా సైనసైటిస్‌ను నిర్ధారణ చేస్తారు.

సైనస్ వ్యాధిని సరైన సమయంలో గుర్తిస్తే ఎలాంటి ఆపరేషన్ లేకుండానే హోమియో మందుల ద్వారా సమర్థంగా  నివారించవచ్చు. హోమియో ప్రక్రియలో రోగి వ్యక్తిగత ఆహార అలవాట్లు, ఆలోచన విధానం, నడవడిక, వ్యాధి లక్షణాలు... ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని మందులు సూచిస్తారు. ఈ వ్యాధికి వాడే కొన్ని ముఖ్యమైన మందులివి...

 హెపార్ సల్ఫూరికమ్ : అతికోపం, చికాకు ఉండేవారిలో, చల్లగాలికి తిరిగే సైనస్ లక్షణాలు ఎక్కువయ్యే వారికి ఇది మంచి మందు.  మెర్క్‌సాల్ : రక్తహీనత ఉండి, అతినీరసం, అల్సర్లు త్వరగా మానకపోవడం, నోటిపూత, నోరు తడిగా ఉన్నప్పటికీ దాహంగా అనిపించడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఈ మందు మేలు. ఈ మందులేగాక... మరిన్ని రకాల మందులను వ్యక్తుల శరీరక, మానసిక లక్షణాల ఆధారంగా ఇస్తారు. ఇందులో ఫాస్ఫరస్, ఆర్సినికమ్ ఆల్బ్, కాలీ కార్బ్, సైలీషియా, రస్టక్స్ మొదలైనవి ఉన్నాయి. అయితే నిపుణులైన హోమియో వైద్యుల ఆధ్వర్యంలో మందులు తీసుకోవాలి. వాళ్లు రోగిని చూసి తగిన మందును, మోతాదును నిర్ణయిస్తారు.
 
నెఫ్రాలజీ కౌన్సెలింగ్

 
షుగర్ వల్ల నా కిడ్నీ దెబ్బతిన్నదా?

 నాకు 65 ఏళ్లు. గత ఎనిమిదేళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఇటీవల ప్రయాణాలు చేసేప్పుడు కాళ్లకు వాపులు వస్తున్నాయి. బ్లడ్ టెస్ట్ చేయిస్తే క్రియాటినిన్ 10 ఎంజీ/డీఎల్ అని వచ్చింది. యూరియా 28 మి.గ్రా. అని చూపిస్తున్నది. యూరిన్ టెస్ట్‌లో ప్రోటీన్ విలువ 3 ప్లస్‌గా ఉంది. నాకు షుగర్ వల్ల కిడ్నీకి సంబంధించిన వ్యాధి ఏమైనా వచ్చిందా?
 - శ్రీనివాసరావు, సామర్లకోట

మీరు తెలిపిన వివరాలను, మీ రిపోర్టుల్లో నమోదైన అంశాలను బట్టి చూస్తే మీకు మూత్రంలో ప్రోటీన్లు ఎక్కువగా పోతున్నాయి. అయితే ఇది డయాబెటిస్ వల్ల వచ్చిన మూత్రపిండాల సమస్యా లేక ఇతర కారణాల వల్ల వచ్చిందా అన్న విషయాన్ని తెలుసుకోవాలి. సాధారణంగా మూత్రంలో ప్రోటీన్లు పోవడానికి డయాబెటిస్ వ్యాధే కారణమవుతుంది. ఈ సమస్య ఉన్నవాళ్లు భవిష్యత్తులో కిడ్నీలు పాడుకాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు తమలో చక్కెరపాళ్లను అదుపులో ఉంచుకోవడం అత్యవసరం. మీరు తినకముందు బ్లడ్ షుగర్ 110 మి.గ్రా/డీఎల్ లోపు తిన్న తర్వాత 160 మి.గ్రా/డీఎల్ లోపు ఉండేటట్లుగా చూసుకోవాలి. బీపీ 115/75 లోపు ఉంచుకోవాలి. ఇవే కాకుండా మనం తీసుకునే భోజనంలో ఉప్పు తగ్గించుకోవాలి. పొగతాగడం, ఆల్కహాల్ తీసుకోవడం పూర్తిగా మానేయాలి. నొప్పినివారణ మందుల (పెయిన్‌కిల్లర్స్)ను సొంతవైద్యంగా వాడకూడదు. మీరు ఒకసారి వెంటనే దగ్గర్లోని నెఫ్రాలజిస్ట్‌ను సంప్రదించండి.
 
నా వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆకలి బాగా తగ్గిపోయింది. డాక్టర్‌ను సంప్రదించి పరీక్షలు చేయించుకున్నాను. వాటిలో క్రియాటినిన్ విలువ 12 మి.గ్రా/డీఎల్. యూరియా 280 మి.గ్రా/డీఎల్ గా ఉంది. స్కానింగ్ తీయించాను. అందులో కిడ్నీ సైజు బాగా తగ్గింది అని చెప్పారు. ప్రస్తుతం క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఐదో దశలో ఉన్నాననీ, కిడ్నీ మార్పిడి అవసరమని చెప్పారు. కిడ్నీ మార్పిడి తప్ప మరో ప్రత్యామ్నాయం ఏదైనా ఉందా? కిడ్నీ మార్చుకోవాలంటే ఎవరిదగ్గర తీసుకోవాలి?
 - కరుణాకర్, పాల్వంచ

మీరు తెలిపిన వివరాల ప్రకారం మీకు కిడ్నీ మార్పిడి ఒక్కటే ఉత్తమమైన పరిష్కారం. మీ తోడబుట్టినవాళ్లు లేదా మీ భార్య వంటి దగ్గరి సంంధీకుల నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. కిడ్నీ మార్పిడి చేయించుకునే ముందు దాతకు అన్నిరకాల పరీక్షలు చేయించి, కిడ్నీదానం చేయడం వల్ల దాతకు ఎలాంటి సమస్యలు లేకపోతేనే వారి నుంచి కిడ్నీని స్వీకరిస్తారు. ఇక పేషెంట్‌కు దాత ఎంత దగ్గరి బంధువైతే అంతమంచిది. కిడ్నీ మార్పిడి తర్వాత క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ఒకవేళ దాత అందుబాటులో లేకుంటే క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకుంటూ, కెడావర్ దాతల కోసం రిజిష్టర్ చేయించుకోవాలి. బ్రెయిన్‌డెడ్ అయిన సందర్భాల్లో వాళ్ల దగ్గర కిడ్నీ దొరికితే అది మీకు అమర్చుతారు.
 
 
కార్డియాలజీ కౌన్సెలింగ్
 
 అవి గుండెజబ్బు సూచనలు కాదు.!
 నా వయసు 32 ఏళ్లు. నాకీమధ్య తరచూ చెమటలు పోస్తూ, గుండెదడ వస్తోంది. ఛాతీలో గుచ్చినట్లుగా కూడా ఉంది. ఇలా ఎక్కువగా ఖాళీ సమయాల్లోనూ, కూర్చొని ఉన్నప్పుడూ అవుతోంది. ఆఫీసులో పని అంతా మామూలుగానే చేసుకోగలుగుతున్నాను. దయచేసి నా సమస్యకు పరిష్కారాన్ని సూచించండి.
 - రవికుమార్, వెంకటాపురం

మీరు వివరించిన అంశాలను బట్టి మీకు గుండెజబ్బు ఉండే అవకాశం చాలా తక్కువ అనిపిస్తోంది. ఏదైనా గుండెజబ్బు ఉంటే, అది తొలిదశలో ఉన్నప్పుడూ, ఏదైనా పనిచేసినప్పుడూ నొప్పి వస్తుంది. కానీ మీరు ఆఫీసులో బాగానే ఉంటున్నారు. కానీ  ఇంట్లో ఖాళీ సమయాల్లో మాత్రమే నొప్పి, దడ వస్తున్నాయి. కాబట్టి ఇది కేవలం యాంగ్జైటీ వల్లనే అనిపిస్తోంది. ఇంకొక విషయం ఏమిటంటే గుండెజబ్బు ఎప్పుడూ సూదులతో గుచ్చినట్లుగా రాదు. కాబట్టి మీరు మీ భయాలను వదిలిపెట్టండి. ఆరోగ్యకరమైన జీవనశైలి అనుసరిస్తూ, వ్యాయామాల్లో భాగంగా యోగా, వాకింగ్ లాంటి చేయండి. వేళకు భోజనం చేయడం లాంటి నియమాలు పాటిస్తూ, నిర్భయంగా ఉండండి.
 
నా వయసు 45 ఏళ్లు. నాకు ఇటీవలే గుండెపోటు వచ్చింది. ఆ తర్వాత నాకు అన్ని పరీక్షలూ చేసి మందులు ఇచ్చారు. అయితే గుండెపోటు వచ్చాక నేను, నా భార్య చాలా ఆందోళన చెందుతున్నాము. ఎప్పుడు ఏమైపోతుందో అన్న ఆందోళన. ఇకపై బరువైన పనులు చేయకూడదు కదా, మరి జీవనోపాధి ఎలా అన్న బెంగ. ఈ పరిస్థితులను అధిగమించడానికి మార్గాలు చెప్పండి.
 - రామ్మోహన్‌రావు, కరీంనగర్

గుండెపోటు వచ్చినంత మాత్రాన ఏ పనీ చేసుకోకుండా ఉండాలనేది సరికాదు. పైగా అది అపోహకూడా. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే చికిత్స చేయించుకొని ఉంటే, గుండెకు హాని జరిగే అవకాశాలు చాలా తక్కువ. కాబట్టి కొన్ని మందులు వాడుతూ, జీవనాన్ని ముందులాగే గడపవచ్చు. ఒకసారి మీ గుండె పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోడానికి 2-డీ ఎకో పరీక్ష చేయించుకోండి. గుండె పంపింగ్ ప్రక్రియ నార్మల్‌గా ఉంటే, టీఎమ్‌టీ పరీక్ష చేయించుకొని, మీరు ఎంత మేరకు శారీరకమైన పనులు చేయగలుగుతారో తెలుసుకోవచ్చు. కాబట్టి మీకు దగ్గర్లోని గుండె నిపుణులను సంప్రదించి, వారి సలహాలు తీసుకోండి. అయితే ఒక్క విషయం గుర్తుంచుకోండి. మీకు మరోసారి గుండెపోటు రాకుండా ఉండాలంటే డాక్టర్ ఇచ్చిన మాత్రలను క్రమం తప్పకుండా వాడండి. యోగా, వాకింగ్ వంటి వ్యాయామలు చేస్తూ, ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి.
 

Advertisement
Advertisement