ముక్కురంధ్రాలు మూసుకుపోతున్నాయి... | Sakshi
Sakshi News home page

ముక్కురంధ్రాలు మూసుకుపోతున్నాయి...

Published Thu, Mar 16 2017 11:10 PM

ముక్కురంధ్రాలు మూసుకుపోతున్నాయి...

ఈఎన్‌టీ కౌన్సెలింగ్‌

నా వయసు 34 ఏళ్లు. నాకు ముక్కులో ఎప్పుడూ ఏదో అడ్డం పడినట్లుగా అనిపిస్తుంది. చాలా ఇబ్బందికరంగా అనిపిస్తోంది. ఎంత ప్రయత్నించినా ఈ సమస్య వదలడం లేదు. మార్కెట్‌లో దొరికే చుక్కల మందు వాడినప్పుడు మాత్రం సమస్య తగ్గినట్లే తగ్గి మళ్లీ వస్తోంది. రాత్రిపూట రెండు ముక్కు రంధ్రాలు మూసుకుపోతున్నాయి. చాలాసార్లు నోటితో గాలి తీసుకోవాల్సి వస్తోంది. నా సమస్య ఏమిటి? దీనికి తగిన పరిష్కారం సూచించండి. – రామ్మోహన్‌రావు, ఏలూరు
ఇటీవల కాలుష్యం వల్ల, జీవనశైలిలో మార్పుల వల్ల చాలామందిలో అలర్జీ సంబంధిత సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలర్జీ సంబంధిత సమస్యలలో మొదట ఉండేది ముక్కుకు సంబంధించిన సమస్యలే. మీరు చెప్పిన వివరాలను బట్టి మీకు ముక్కుదూలం వంకరపోవడం లేదా అలర్జీ లేదా ముక్కులో పాలిప్స్‌ లేదా ఈ అన్ని సమస్యలు కలగలిసి ఉండవచ్చు. మీరు మొదట నిపుణులైన ఈఎన్‌టీ వైద్యులను సంప్రదించండి. ముక్కుకు సంబంధించిన పరీక్షలు చేయించి, అవసరమైతే సీటీ స్కాన్‌ (పీఎన్‌ఎస్‌) కూడా తీయించాక మీ వ్యాధిని నిర్ధారణ చేయాల్సి ఉంటుంది.

మీకు ముక్కుదూలం వంకరపోతే దాన్ని ఒక చిన్న ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. దీనినే సెప్టోప్లాస్టీ అంటారు. ముక్కులో పాలిప్స్‌ ఉన్నట్లయితే వాటిని కూడా ఆపరేషన్‌తో తొలగించవచ్చు. అలర్జీ వల్ల వచ్చే సమస్య అయితే... అందుకు కారణమైన అంశాలకు దూరంగా ఉండటం, ముఖ్యంగా కాలుష్యానికి దూరంగా ఉండటం, ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, తాజా పదార్థాలు మాత్రమే తినడం, చల్లటి వాతావరణానికి, వస్తువులను దూరంగా ఉండటం వంటి చేయడం వల్ల మీ సమస్యను నివారించవచ్చు. కొన్ని రకాల నేసల్‌ స్ప్రేలు వాడటం వల్ల మీ సమస్యను అదుపులో ఉంచవచ్చు. మీరు ఒకసారి మీకు దగ్గర్లోని ఈఎన్‌టీ నిపుణులను సంప్రదించండి.

డాక్టర్‌ ఇ.సి. వినయకుమార్‌
హెచ్‌ఓడి –ఈఎన్‌టి సర్జన్, అపోలో హాస్పిటల్స్,
జూబ్లీ హిల్స్, హైదరాబాద్‌


ఫ్యాటీ లివర్‌... ప్రమాదకరమా?
గ్యాస్ట్రోఎంటరాలజీ  కౌన్సెలింగ్‌


నా వయసు 52 ఏళ్లు. ఇటీవల ఆఫీసులో నిర్వహించిన జనరల్‌ హెల్త్‌ చెకప్‌లో భాగంగా స్కానింగ్‌ చేయించుకున్నాను. నాకు ఫ్యాటీ లివర్‌ ఉన్నట్లు తెలిసింది. ఇది ప్రమాదకరమా? ఈ విషయంలో నాకు తగిన సలహా ఇవ్వండి.– విఠల్‌రావు, హైదరాబాద్‌
లివర్‌ కొవ్వుకు కోశాగారం లాంటిది. ఇది కొవ్వు పదార్థాలను గ్రహించి శరీరానికి ఉపయోగపడేలా చేస్తుంటుంది. కాలేయం కూడా కొన్ని రకాల కొవ్వుపదార్థాలను ఉత్పత్తి చేస్తుంటుంది. ఇది ఒక సంక్లిష్టమైన చర్య. ఏమాత్రం తేడా వచ్చినా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇదే ఫ్యాటీ లివర్‌కు దారితీస్తుంది. సాధారణంగా రెండు రకాలుగా ఫ్యాటీలివర్‌ వస్తుంది. మొదటిది మద్యం అలవాటు లేనివారిలో కనిపించేది. రెండోది మద్యపానం వల్ల కనిపించే ఫ్యాటీలివర్‌. ఇవే కాకుండా స్థూలకాయం, కొలెస్ట్రాల్స్, ట్రైగ్లిజరైడ్స్‌ ఎక్కువగా ఉండటం, హైపోథైరాయిడిజమ్‌ వంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఫ్యాటీ లివర్‌కు దారితీయవచ్చు.

సాధారణంగా కాలేయంలో నిల్వ ఉన్న కొవ్వుల వల్ల కాలేయానికి గానీ, దేహానికి గానీ 80 శాతం మంది వ్యక్తుల్లో ఎలాంటి ప్రమాదం ఉండకపోవచ్చు. కానీ అది లివర్‌ సిర్రోసిస్‌ అనే దశకు దారితీసినప్పుడు కాలేయ కణజాలంలో మార్పులు వచ్చి స్కార్‌ రావచ్చు. అది చాలా ప్రమాదానికి దారి తీస్తుంది. కొందరిలో రక్తపు వాంతులు కావడం, కడుపులో నీరు చేరడం వంటి ప్రమాదాలు రావచ్చు.
మీకు స్కానింగ్‌లో ఫ్యాటీలివర్‌ అనే రిపోర్టు వచ్చింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. స్థూలకాయులైతే బరువు నెమ్మదిగా తగ్గించుకోవాలి.

ఆహారం విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఆహారంలో కొవ్వుల పాళ్లు ఎక్కువగా ఉంటే వాటిని తగ్గించుకోవాలి. ∙లినోలిక్‌ యాసిడ్‌ ఎక్కువగా ఉండే ఆకుపచ్చని ఆకుకూరలు, కూరగాయలు, మొలకెత్తిన విత్తనాలు కూడా వాడవచ్చు.
►వారానికి  100–200 గ్రాముల చేపలు తీసుకోవడం మంచిది.
►మటన్, చికెన్‌ తినేవారు అందులోని కాలేయం, కిడ్నీలు, మెదడు వంటివి తీసుకోకూడదు. మిగతా మాంసాహారాన్ని పరిమితంగా తీసుకోవాలి.
►ఏవైనా వ్యాధులు ఉన్నవారు... అంటే ఉదాహరణకు డయాబెటిస్‌ ఉంటే రక్తంలో చక్కెరపాళ్లు అదుపులో ఉండేలా చూసుకోవాలి. ►హైపోథైరాయిడిజమ్‌ ఉంటే దానికి తగిన మందులు వాడాలి. డాక్టర్‌ సలహా మేరకు కాలేయం వాపును తగ్గించే మందులు కూడా వాడాల్సి రావచ్చు.

డాక్టర్‌ భవానీరాజు,సీనియర్‌
గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,కేర్‌ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement