లివర్‌ పెరిగిందంటున్నారు... ఎందుకిలా? | Sakshi
Sakshi News home page

లివర్‌ పెరిగిందంటున్నారు... ఎందుకిలా?

Published Sat, Apr 15 2017 12:41 AM

sakshi family health counseling

గ్యాస్ట్రోఎంటరాలజీ  కౌన్సెలింగ్‌

నా వయసు 35 ఏళ్లు. రాత్రివేళల్లో కడుపునొప్పిగా అనిపిస్తుంటే డాక్టర్‌ను సంప్రదించాను. లివర్‌ సైజు పెరిగిందని చెప్పారు. లివర్‌ సైజు ఎందుకు పెరుగుతుందో దయచేసి తెలియజేయండి.
– కె. రామమూర్తి, ఇంకొల్లు

మీరు రాసిన విషయాలను బట్టి చూస్తే మీ కాలేయ పరిమాణం పెరిగిందనే తెలుస్తోంది. దీనికి వివిధ రకాల కారణాలు ఉండవచ్చు. ఆల్కహాల్‌ ఎక్కువ మోతాదులో తీసుకునేవారిలో, స్థూలకాయం ఉన్నవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి లివర్‌ సైజ్‌ పెరిగే అవకాశం ఉంది. ఇక మీరు స్థూలకాయులా లేదా మీకు ఆల్కహాల్‌ అలవాటు ఉందా లేదా అనే వివరాలు తెలియజేయలేదు.

కొన్నిరకాల వైరల్‌ ఇన్ఫెక్షన్లు, హైపటైటిస్‌–బి, హెపటైటిస్‌–సి వంటి ఇన్ఫెక్షన్స్‌ వల్ల కూడా లివర్‌ పెరిగే అవకాశం ఉంది. కానీ మీరు రాసిన కాలేయం పరీక్షలో అన్నీ నార్మల్‌గా ఉన్నాయి కాబట్టి అలాంటివి ఉండే అవకాశం తక్కువ.

ముందుగా మీలో లివర్‌ పరిమాణం ఎంత పెరిగిందో తెలుసుకోడానికి అల్ట్రా సౌండ్‌ స్కానింగ్‌ పరీక్ష చేయించండి. అలాగే ఒకసారి ఎండోస్కోపీ కూడా చేయించగలరు. ఈ రెండు పరీక్షల వల్ల మీలో కాలేయం పరిమాణం పెరగడానికి కారణంతో పాటు మీకు కడుపునొప్పి ఎందుకు వస్తోంది అన్న విషయం కూడా తెలిసే అవకాశం ఉంది. మీకు మద్యం తాగడం, పొగతాగడం వంటి అలవాట్లు ఉంటే వాటిని వెంటనే మానేయండి.

నా వయసు 35 ఏళ్లు. నాకు తరచూ ఛాతీ ఎడమభాగంలో నొప్పి వస్తోంది. గత మూడేళ్ల నుంచి ఈ నొప్పితో బాధపడుతున్నాను. తొలుత గుండెకు సంబంధించిన సమస్యేమోనని అనుమానించి, కార్డియాలజిస్టును కలిసి గుండె సంబంధించిన అన్ని పరీక్షలూ చేయించుకున్నాను. సమస్య ఏమీ లేదని అంటున్నారు. కానీ నొప్పి మాత్రం తగ్గడం లేదు. రాత్రివేళల్లో నొప్పి మరీ ఎక్కువ అవుతోంది. సమస్య ఏమై ఉంటుంది? ఈ నొప్పి తగ్గే మార్గం లేదా?
– ధరణికుమార్, నూజివీడు


మీరు తెలిపిన వివరాల ప్రకారం... మీరు ఆహార వాహికకు సంబంధించిన ‘రిఫ్లక్స్‌ డిసీజ్‌’తో బాధపడుతున్నట్లు అర్థమవుతోంది. ఇది సాధారణంగా స్థూలకాయం ఉన్నవారిలో ఎక్కువగా కనిపిస్తుంది. మీరు ఒకసారి ఎండోస్కోపీ పరీక్ష చేయించుకోండి. అందులో మీ రిఫ్లక్స్‌ డిసీజ్‌ తీవ్రత తెలుస్తుంది. రాత్రివేళల్లో నొప్పి ఎక్కువ అంటున్నారా కాబట్టి గ్యాస్ట్రో ఎంటరాలజిస్టును కలసి, ఆ నొప్పిని తగ్గించుకునే మందులు వాడండి. మంచి ఫలితం ఉంటుంది. దీంతోపాటు జీవనశైలిలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాలు మీ సమస్యను తీవ్రతరం చేస్తాయి. వాటిని వాడటం వల్ల లక్షణాలు పెరుగుతాయి. వాటిని గుర్తించి, వాటినుంచి దూరంగా ఉండాలి. ఇటువంటి మార్పులతో మీ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.

డాక్టర్‌ భవానీరాజు
సీనియర్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్‌ హాస్పిటల్స్,బంజారాహిల్స్, హైదరాబాద్‌

Advertisement
Advertisement