Sakshi News home page

మా అబ్బాయి ఆచూకీ తెలుస్తుందా?

Published Tue, Aug 2 2016 12:05 AM

మా అబ్బాయి   ఆచూకీ తెలుస్తుందా? - Sakshi

నిరీక్షణ


శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో గొల్లవీధి. తిరువీధుల నారాయణరావు, సరస్వతి దంపతులు. నారాయణ రావుకు ఏడు పదుల వయసు. భార్య సరస్వతికి ఆరుపదుల వయసు దాటింది. ‘మా అబ్బాయి గోపీకృష్ణ ఆచూకీ ఏమైనా తెలుస్తుందంటారా..!’ అంటూ కనిపించిన ప్రతి ఒక్కరినీ ఆశగా అడుగుతుంటారు. ఏడాది క్రితం కిడ్నాపైన తమ బిడ్డ ఏమైపోయాడో తెలియడం లేదని,  ఉగ్రవాదుల చెర నుంచి తమ కుమారుడిని విడిపించాలని ప్రభుత్వాలకు వీళ్లు మొరపెట్టుకుంటున్నారు.


ఇంతకీ ఏమైందంటే...
లిబియా దేశం నుంచి స్వదేశానికి తిరిగి వస్తున్న నలుగురు భారతీయులను కిందటేడాది జూలై 29న ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. వారిలో కర్ణాటకకు చెందిన ఇద్దరిని విడిచి పెట్టగా, హైదరాబాద్‌కు చెందిన బలరాం కిష న్‌తో పాటు శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన కంప్యూటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ తిరువీధుల గోపికృష్ణ ఉన్నారు. దీంతో అప్పట్లో ఆంధ్ర, తెలంగాణాకు చెందిన ప్రభుత్వాలు హడావుడి చేసి ఆ తరువాత వారి గురించి మరచిపోయాయి. కుమారుడి ఆచూకీ కోసం వృద్ధులైన గోపికృష్ణ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతూ ఎదురు చూస్తున్నారు. ‘‘మాకు వచ్చిన కష్టం పగవారికి కూడా రాకూడదు’’ అంటూ కనపడని దేవుళ్లకి మొక్కుతూ.. తన ఆవేదనను పంచుకున్నారు నారాయణరావు.


కళ్ల ముందు ఉండాలని...
‘‘మాకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. పెద్దవాడు మురళీ కృష్ణ హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో చిరుద్యోగి. రెండవవాడు గోపీకృష్ణ వయసు 39 ఏళ్లు. లిబియా దేశంలో ఉద్యోగం. ఎనిమిదేళ్లుగా అక్కడే ఉంటున్నాడు. వాడికి భార్య కళ్యాణి, 5 ఏళ్ల కొడుకు కృష్ణసాయీశ్వర్, పదేళ్ల కూతురు జాహ్నవి... ఉన్నారు. పిల్లల చదువుల కోసం కళ్యాణి మూడేళ్ల నుంచి హైదరాబాద్‌లోనే ఉంటోంది. అప్పటి వరకు అంతా లిబియాలోనే ఉండేవారు. గోపీకృష ఏడాదికి ఒకసారి ఇండియాకు వచ్చి వెళ్లేవాడు. ‘ఎందుకురా అంతంత దూరాలు మమ్మల్ని అంతా వదిలి వెళ్లి! నీ చదువుకు తగ్గ ఉద్యోగం ఇక్కడ రాదా..!’ అని అంటుండేవాడిని. ‘ఈ ఏడాది వరకు బాండ్ ఉంది నాన్నా! అది పూర్తవగానే వచ్చేస్తాను..’ అనేవాడు. నాకు ఆరేళ్ల క్రితం గుండెపోటు వచ్చి బైపాస్ సర్జరీ అయ్యింది. పిల్లలు కళ్లముందు ఉండాలని నా మనసు ఆరాటపడుతోంది.


నాన్నెప్పుడు వస్తాడు?
నా మనమడు, మనవరాలు.. ‘అమ్మా, తాతయ్యా.. నాన్న ఎప్పుడొస్తారు?’ అని అడుగుతున్నారు. ‘ఇప్పుడు నాన్నకు సెలవుల్లేవు రా.. అయిపోగానే వచ్చేస్తాడు’ అని అబద్ధం చెబుతుంటాం. సరైన ఆదాయం లేక పిల్లల పోషణకు, చదువులకు కావల్సిన సర్దుబాట్లు చేయలేక మా కోడలు కళ్యాణి ఎన్నో ఇబ్బందులు పడుతోంది. నేను కార్పోరేషన్ బ్యాంక్ ఉద్యోగిగా రిటైర్ అయ్యి పదేళ్లు అయ్యింది.  నాకు పెన్షన్ రాదు. నిలకడగా వచ్చే ఆదాయమూ లేదు. నా మందుల ఖర్చులు, కుటుంబ

 
పోషణ వాడే చూసుకునేవాడు. ఎప్పుడు ఫోన్ చేసినా ‘ఆరోగ్యం ఎలా ఉంది నాన్నా! సమయానికి మందులు వేసుకుంటున్నారా!’ అని అడిగేవాడు. ఇప్పుడు వాడెలా ఉన్నాడో.. ఎక్కడ ఉన్నాడో తలుచుకుంటేనే దుఃఖం పొంగి వస్తోంది. ఈ వయసులో కొడుకు ఆసరాతో జీవితాన్ని గట్టెక్కించేద్దాం అనుకున్నవాడిని. ఇప్పుడు వాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో! వాడిని తీసుకెళ్లినవాళ్లు ఒక్క ఫోన్ అయినా నా కొడుకుచేత చేయిస్తే బాగుండేది. ఏం ఫర్వాలేదు అని... ధీమాగా ఉండేవాడిని. (నారాయణరావు మాట్లాడుతున్నంతసేపూ కన్నీరే తప్ప సరస్వతి ఏమీ మాట్లాడలేకపోయారు). మా కోడలు, పెద్ద కొడుకు మురళీ కృష్ణ ప్రధానమంత్రి నరేంద్ర మోడిని కలిసి విషయాన్ని చెప్పి, మా అబ్బాయిని ఉగ్రవాదుల చెర నుంచి విడిపించమని కోరారు. వారు హామీ ఇచ్చారు. కానీ, ఇప్పటి వరకూ ఎలాంటి ధీమా రాలేదు. ఎం.పీలను కలుస్తున్నాం... ఎవరైనా హామీ ఇస్తున్నారే తప్ప ఎప్పటికి మా అబ్బాయి విషయం తెలుస్తుందో చెప్పడం లేదు. మా రోదన అరణ్యరోదనే అవుతోంది. మీరంతా పూనుకొని మా కష్టం ప్రభుత్వాలకు తెలియజేస్తే.. వారు త్వరగా ఈ సమస్యను పరిష్కరిస్తే మా అబ్బాయి మాకు దక్కుతాడు. ఉగ్రవాదాన్ని పూర్తిగా అణచివేయగలిగితే మాలాగా ఏ కుటుంబానికీ ఇంత కష్టం రాదు’’ అంటూ చేతులెత్తి దణ్ణం పెడుతున్నారు నారాయణరావు.  - ఎల్.వి.రమణ, సాక్షి, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా

 

Advertisement

తప్పక చదవండి

Advertisement