ఆటిజమ్‌ నయమవుతుందా? | Sakshi
Sakshi News home page

ఆటిజమ్‌ నయమవుతుందా?

Published Tue, Feb 7 2017 10:31 PM

ఆటిజమ్‌ నయమవుతుందా?

హోమియో కౌన్సెలింగ్‌

మా అబ్బాయికి ఐదేళ్లు. మాటలు సరిగా రావడం లేదు. పలికినవే పలుకుతున్నాడు. డాక్టర్‌కు చూపిస్తే ఆటిజమ్‌ అంటున్నారు. హోమియోలో చికిత్స ఉందా? – ఎమ్‌. జగన్మాథరావు, తెనాలి
మాటలు సరిగా రాకపోవడం అన్నది ఆటిజమ్‌ ఉన్నపిల్లల్లోని ఒక లక్షణం. వారిలో చాలా ఇతర సమస్యలు కూడా కనిపిస్తాయి. అందుకే ఆటిజమ్‌ నిర్ధారణ చేయాలంటే ఇతర సమస్యలు ఉన్నాయేమో చూడాలి. ఆటిజమ్‌ లక్షణాల తీవ్రత అందరిలోనూ ఒకేలా ఉండకపోవచ్చు. కొందరిలో ఈ లక్షణాలు స్పష్టంగా, నిర్దిష్టంగా ఉంటాయి. దాన్ని క్లాసికల్‌ ఆటిజమ్‌ అంటారు. కొందరిలో లక్షణాల తీవ్రత తక్కువగా ఉంటుంది. అది వారి జీవనశైలిపై ఎలాంటి ప్రభావం చూపించదు. దీన్ని మైల్డ్‌ ఆటిజమ్, ఆస్పర్జర్‌ సిండ్రోమ్‌ అని అంటారు. తీవ్రల ఎలా ఉన్నా ఆటిజమ్‌ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలు ఇవి...

మాట్లాడటం, భావవ్యక్తీకరణలో, ఏకాగ్రతను చూపలేకపోవడం, అందులో ఇబ్బందులు ఎదుర్కోవడం ∙పిల్లలు స్నేహితులను చేసుకులేకపోవడం ∙ఎదుటివారి మనోభావాలను అర్థం చేసుకోలేకపోవడం ∙నలుగురిలో కలవలేకపోవడం; ఆనందాలను, బాధలను పంచుకోలేకపోవడం ∙ఒకేమాటను పదే పదే ఉచ్చరించడంలేదా అడిగిన ప్రశ్ననే మళ్లీ తిరిగి అడగటం దీనిని ‘ఇకోలేలియా’ అంటారు ∙ఎప్పుడూ రొటీన్‌నే కోరుకోవడం... అంటే ఒకేరకమైన ఆహారం లేదా దుస్తులు వేయమని అడగడం. వయసుకు తగినంత మానసిక పరిపక్వత చూపలేకపోవడం ∙చేతులు, కాళ్లు విచిత్రంగా ఆడించడం, కదపడం, చుట్టూ తిరగడం, గజిబిజిగా నడవడం, శరీరంలో జర్క్‌ ఇచ్చినట్లుగా కదలికలు ఉండటం. ఇవన్నీ ‘ఆటిజమ్‌’ను గుర్తించడానికి బాగా తోడ్పడతాయి.

కారణాలు: ఆటిజమ్‌ అన్నది మెదడు, నాడీ వ్యవస్థ సరిగా ఎదగకపోవడం వల్ల పుట్టుకతో వచ్చే సమస్య అయినా కొంతమంది పిల్లల్లో దీన్ని పిల్లలకు మూడో ఏడు వచ్చే వరకూ గుర్తించలేకపోవచ్చు.

తల్లి గర్భవతిగా ఉన్న సమయంలో వచ్చే రుబెల్లా, సైటోమెగాలో వైరస్‌ వంటి ఇన్ఫెక్షన్లు రావడం ∙గర్భంతో ఉన్న సమయంలో తల్లి మాదక ద్రవ్యాలు, మద్యం వంటి అలవాట్ల వల్ల ∙గర్భం దాల్చిన సమయంలో అధిక రక్తస్రావం, థైరాయిడ్, డయాబెటిస్‌ వంటి జబ్బులు ఉన్నా పిల్లలకు ఆటిజమ్‌ వచ్చే అవకాశం ఎక్కువ ∙పిల్లలు పుట్టిన తర్వాత కొన్ని రకాల అలర్జీల వల్ల, కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్‌ రావడం కారణంగా, కొన్ని మందులు వాడటం వల్ల కూడా ఆటిజమ్‌ వచ్చే అవకాశం ఉంది ∙బాల్యంలో తీవ్రమైన మానసిక సంఘర్షణ అనుభవించి, తల్లిదండ్రుల నుంచి సరైన ఆప్యాయతా, అనురాగాలు పొందలేని పిల్లల్లో కూడా ఈ సమస్య రావచ్చు.

క్లాసికల్‌ ఆటిస్టిక్‌ డిజార్డర్‌ ఉన్న పిల్లలు బాహ్యప్రపంచంతో సంబంధం లేకుండా పదే పదే ఒకేపనిని చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలు చిన్న శబ్దాలకు, వాసనలకు అవసరమైన దానికంటే ఎక్కువగా స్పందిస్తారు. మానసిక ఎదుగుదల, తెలివితేటల విషయంలో ఒకరి నుంచి మరొకరికి తేడా ఉంటుంది. అయితే యాస్పర్జర్‌ డిజార్డర్‌ ఉన్న పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, పదే పదే చేసే పని వల్ల అందులో మంచి నైపుణ్యం కనబరుస్తారు. అయితే ఈ పిల్లల్లో భావవ్యక్తీకరణ శక్తి తక్కువగా ఉంటుంది. రెట్స్‌ సిండ్రోమ్‌ అనే మరొకరకం ఆటిజమ్‌ ఆడపిల్లల్లో ఎక్కుగా కనిపిస్తుంది. ఈ పిల్లల శరీరం చిక్కిపోయినట్లుగా ఉండి, మానసిక వైకల్యానికి గురువుతారు.
ఆటిజమ్‌ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. మాటలు రాని వారికి స్పీచ్‌ థెరపీ ఉపయోగపడుతుంది. బిహేవియరల్‌ థెరపీ వంటి చికిత్స ప్రక్రియల వల్ల పిల్లల ప్రవర్తనలో మార్పు వస్తుంది. హోమియోలో పిల్లల లక్షణాలు,  కారణాల వంటి అనేక అంశాను పరిగణనలోకి తీసుకుని ఔషధాలను సూచిస్తారు.

డాక్టర్‌ టి.కిరణ్‌ కుమార్‌
డైరక్టర్, పాజిటివ్‌ హోమియోపతి
విజయవాడ, వైజాగ్‌

మాటిమాటికీ కామెర్లు..!
పీడియాట్రిక్‌ కౌన్సెలింగ్‌

మా అబ్బాయికి రెండున్నర ఏళ్లు.  కేవలం ఆర్నెల్ల వ్యవధిలో అతడికి మూడు సార్లు కామెర్లు వచ్చాయి. దీంతో మా ఊళ్లో డాక్టర్‌కు చూపించి చికిత్స చేయించాం. గత వారం రోజుల నుంచి మళ్లీ కళ్లు పచ్చగా కనిపిస్తున్నాయి. మా వాడికి ఎందుకు ఇలా జాండీస్‌ పదే పదే వస్తున్నాయి. ఇక్కడ స్థానికంగా ఉన్న డాక్టర్‌కు చూపించి కొన్ని పసరు మందులు, ఇంగ్లిష్‌ మందులు వాడుతున్నాం. చాలా మంది డాక్టర్లను సంప్రదించాం. ప్రయోజనం కనిపించడం లేదు. ఇలా ఇవి తగ్గినట్టే తగ్గి మళ్లీ వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. మాకు తగిన సలహా ఇవ్వండి. – సుదర్శన్, చౌటుప్పల్‌
మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ అబ్బాయికి దీర్ఘకాలిక కామెర్లు ఉన్నాయని   చెప్పవచ్చు. పసిపిల్లల నుంచి వివిధ వయసుల వారిలో వచ్చే దీర్ఘకాలిక  కామెర్లకు అనేక కారణాలుంటాయి. వీటిలో కొన్ని చాలా ప్రమాదకరంగా పరిణమించే అవకాశం కూడా ఉంది.
పిల్లల్లో కొన్ని ఎంజైమ్‌ లోపాలు, నాటుమందులు వాడటం, వైరల్‌ హెపటైటిస్, థలసేమియా వంటి రక్తానికి సంబంధించిన జబ్బులు, కాపర్‌ మెటబాలిజమ్‌లో లోపం, కొన్ని ఆటోఇమ్యూన్‌ డిసీజెస్‌ వల్ల కూడా కామెర్లు రావచ్చు. కొన్నిసార్లు  హెపటో బిలియరీ సిస్టమ్‌లోని కొన్ని అనటామికల్‌ (శరీర నిర్మాణపరమైన లోపాలతో వచ్చే) సమస్యల వల్ల కూడా జాండీస్‌ వచ్చే అవకాశం ఉంది. మీరు ఇచ్చిన కొద్దిపాటి సమాచారంతో మీ బాబు దీర్ఘకాలిక జాండీస్‌కు కారణం ఇదీ అని నిర్ధారణగా చెప్పడం కష్టమే. కాబట్టి మీరు కొన్ని ప్రాథమిక రక్తపరీక్షలు, థైరాయిడ్‌ పరీక్షలు, ఎంజైమ్‌ పరీక్షలు చేయించాలి. దానితో పాటు వైరల్‌ ఇన్ఫెక్షన్స్‌ ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడం, ఇతర మెటబాలిక్‌ సమస్యలను కనుగొనేందుకు అవసరమైన పరీక్షలు చేయించడం ప్రధానం. ఎందుకంటే పైన పేర్కొన్న కొన్ని మెడికల్‌ కండిషన్స్‌కు అవసరమైతే లివర్‌ బయాప్సీ వంటి పరీక్షలు చేసి తక్షణమే తగు చికిత్స చేయాల్సి ఉంటుంది. థైరాయిడ్‌ లేదా కొన్ని ఆటోఇమ్యూన్‌ సమస్యల కారణంగా వచ్చే కాలేయ వ్యాధులకు పరిష్కారం ఒకింత తేలిక.

వాటిని సరైన చికిత్సతో పూర్తిగా విజయవంతంగా పరిష్కరించవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో తీవ్రమైన లివర్‌ సమస్యల పురోగతిని నియంత్రించడంతో పాటు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ లివర్‌ ఫెయిల్‌ కాకుండా కాపాడుకోవాల్సి ఉంటుంది.  మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే అదృష్టవశాత్తు మీ అబ్బాయికి లివర్‌ ఫెయిల్యూర్‌ సూచనలు ఏమీ కనిపించడం లేదు.  కాబట్టి మీరు మీ అబ్బాయి విషయంలో తక్షణం మీ పిల్లల వైద్యనిపుణుడితో పాటు పీడియాట్రిక్‌ గాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ నేతృత్వంలో పూర్తి చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం.

డాక్టర్‌ రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్,విజయనగర్‌ కాలనీ,
హైదరాబాద్‌
 

Advertisement
Advertisement