జుట్టు రాలడం తగ్గుతుందా? | Sakshi
Sakshi News home page

జుట్టు రాలడం తగ్గుతుందా?

Published Mon, Feb 13 2017 12:02 AM

జుట్టు రాలడం తగ్గుతుందా?

హోమియో కౌన్సెలింగ్‌

నా వయసు 28 ఏళ్లు. గత కొంతకాలంగా జుట్టు విపరీతంగా రాలిపోతోంది. ఎన్ని  మందులు వాడినా ఫలితం కనిపించడం లేదు. పైగా వెంట్రుకలు పలుచబారడంతో బట్టతల వస్తుందేమోనని చాలా ఆందోళనగా ఉంది. హోమియో చికిత్స ద్వారా నా సమస్య తగ్గే అవకాశం ఉందా? సలహా ఇవ్వండి.    – రవికుమార్, టెక్కలి
ఈమధ్యకాలంలో జుట్టు రాలే సమస్యతో బాధపడేవారి సంఖ్య పెరుగుతోంది. అధిక మానసిక ఒత్తిడికి లోనవ్వడం, పోషకాహార లోపం, కొన్ని రకాల హార్మోన్ల సమస్యలు, కలుషిత వాతావరణం వంటి అంశాలన్నీ ఈ సమస్యకు కారణాలు. జుట్టు రాలే సమస్యకు హోమియోలో పరిష్కారం ఉంది.
జుట్టు పెరగడంలో మూడు దశలు ఉంటాయి. అవి...
1) అనాజెన్‌ : ఇది మొదటి దశ, జుట్టు బాగా పెరిగే దశ. ఇది 2 నుంచి 6 ఏళ్లు ఉంటుంది; 2) కెటజెన్‌ : ఇది రెండో దశ. ఈ దశలో జుట్టు పెరగకుండా ఆగిపోతుంది. ఇది 2 నుంచి 3 వారాలు ఉంటుంది; 3) టిలోజెన్‌ : ఈ మూడో దశ 2 నుంచి 3 నెలల వరకు ఉంటుంది. ఈ దశలో జుట్టు ఊడటం జరుగుతుంది.

జుట్టు రాలే సమస్యను నాలుగు రకాలుగా విభజించవచ్చు.
1) పురుషులలో జుట్టు రాలడం : కొందరు పురుషులలో జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. దీని వల్ల ముఖం మీద, నుదురు భాగంలో ఉండే జుట్టు సరిహద్దు క్రమంగా పలచబడి వెనక్కు వెళ్తుంది. పురుషుల్లో జుట్టు రాలడానికి వంశపారంపర్యత, డై హైడ్రాక్సీ టెస్టోస్టెరాన్‌ (డీహెచ్‌టీ) హార్మోన్, మానసిక ఒత్తిడి, ఆందోళన, చుండ్రు, తలలో సోరియాసిస్, పొగతాగడం, టైఫాయిడ్, థైరాయిడ్‌ సమస్యలు, జుట్టుకు రంగు వేసుకోవడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పవచ్చు.

2) స్త్రీలలో జుట్టు రాలడం : స్త్రీలలో ముఖ్యంగా తలస్నానం చేసిన తర్వాత దువ్వుకునేటప్పుడు ఎక్కువగా చిక్కుబడిపోయి జుట్టు ఊడటం జరుగుతుంది. ఇది ఎక్కువై జుట్టు పలుచబడి తల ముందు భాగం పూర్తిగా జుట్టు లేకుండా అవుతుంది. స్త్రీలలో జుట్టు రాలడానికి హార్మోన్‌ సమస్యలు, థైరాయిడ్‌ సమస్యలు, పీసీఓడీ, నెలసరి సమస్యలు, రక్తహీనత, ప్రసవం తర్వాత వాడే కొన్ని మందులు కారణమవుతాయి. నెలసరి ఆగిపోయే సమయంలో, మానసిక ఒత్తిడి, ఆందోళన కూడా జుట్టు రాలడానికి కారణమవుతుంది.

3) పేనుకొరకడం : కొందరిలో తల లేదా మీసం, గడ్డంలో జుట్టు వృత్తాకారంలో ఊడిపోతుంటుంది. దీనికి మానసిక ఒత్తిడి, శరీర రక్షణ వ్యవస్థ సొంత జుట్టుపై ప్రతికూలంగా పనిచేయడం, దాడిచేయడం వంటివి కారణాలు.

4) జుట్టు మొత్తం ఊడిపోవడం : కొందరిలో తలపైన ఉండే జుట్టు, కనుబొమలు, కనురెప్పలు సహా జుట్టు మొత్తం ఊడిపోతుంది. దీనికి కచ్చితమైన కారణాలు తెలియదు. కానీ మానసిక ఒత్తిడి, ఆటోఇమ్యూన్‌ కారణాల వల్ల ఇలా జరుగుతుందని అనుకోవచ్చు.

హోమియో చికిత్స :  హోమియో  వైద్యవిధానాలలో అనుసరించే చికిత్స ప్రక్రియలో జుట్టు రాలడానికి గల కారణాన్ని గుర్తించి మందులు ఇస్తారు. అయితే మందు ఇచ్చే మందు రోగి శారీరక, మానసిక తత్వాలను పరిగణనలోకి తీసుకొని ఈ ఔషధాలను ఇస్తారు. పురుషులలో మేల్‌ ప్యాటర్న్‌ బాల్డ్‌నెస్‌కూ కారణమైన హార్మోన్ల అసమతౌల్యతలను సరిచేయడం, మహిళల్లో వచ్చే ఫిమేల్‌ ప్యాటర్న్‌ బాల్డ్‌నెస్‌కు గల కారణాలను కనుగొని వాటిని సరిచేయడం ద్వారా జుట్టు రాలడాన్ని నివారింపజేసి, హెయిర్‌ఫాలికిల్‌ను తిరిగి దృఢంగా చేసి, జుట్టు రాలడాన్ని అదుపు చేస్తారు. ఇక దాదాపు 80 శాతం మందిలో రాలడం ద్వారా కోల్పోయిన జుట్టునైనా తిరిగి వచ్చేలా చేయవచ్చు. మీరు అనుభవజ్ఞులైన హోమియో నిపుణులను సంప్రదించండి.

డాక్టర్‌ శ్రీకాంత్‌ మోర్లావర్‌ సీఎండ్‌డి
హోమియోకేర్‌ ఇంటర్నేషనల్‌
హైదరాబాద్‌

Advertisement
Advertisement