జినియా పువ్వు | Sakshi
Sakshi News home page

జినియా పువ్వు

Published Sun, Oct 22 2017 12:15 AM

Sakshi Special Story

‘‘ఇరవైలలో ఉన్న అమ్మాయిలు చీరల్లో బాగుంటారు. సన్నటి రెమ్మలుండే జినియా పువ్వుల్లా..’’ అన్నాడు మహర్షి. విసుగ్గా చూసింది మోహన. ‘‘నేనెలా ఉన్నానో చెప్పండి ముందు’’ అంది.
‘‘నీ గురించే మోహనా అంటున్నా.. చీరలో బాగుంటావ్‌’’ అన్నాడు.‘‘మనింట్లో జినియా పూలు లేవు. ఎక్కడ చూశారు వాటిని?’’ అంది.‘‘ఫ్రెండింట్లో’’ అన్నాడు.‘‘జినియా పువ్వులాంటి అమ్మాయిని కూడా ఫ్రెండింట్లోనే చూశారా’’ అంది.మహర్షికి అర్థమైంది. ‘‘సారీ’’ అన్నాడు. ‘‘పెళ్లయిన మొదటిరోజే చెప్పాను మహీ మీకు.. అమ్మాయిల అందం గురించి మాట్లాడటం నాకు ఇష్టం ఉండదని’’ అంది. ఫ్రెండ్స్‌ ఇళ్లల్లో పడుకోవడం, ఫ్రెండ్స్‌ వచ్చి ఇంట్లో పడుకోవడం కూడా మోహనకు నచ్చదు.‘‘నన్ను రైలెక్కించాక తిన్నగా ఇంటికొచ్చేయండి’’.. చెప్పింది మోహన. ఆ రాత్రే ఆమె ప్రయాణం.  

మోహన–మహర్షీ.. చక్కటి జంట. ఇద్దరికీ మంచి ఉద్యోగాలు. ఆ వయసులో ఎవరికో గానీ కుదరని సొంత ఇల్లు కూడా! ఆ ఇల్లంటే మోహనకు ప్రాణం. ఊరికి దూరంగా పాడుపడిన ఇల్లొకటి ఉంటే దాన్ని కొని, పడగొట్టించి అక్కడే తిరిగి ఇల్లు కట్టించింది మోహన. పక్కనే దిగుడుబావి, కాస్త దూరంగా కొండలు. అవంటే మోహనకు ఇష్టం.  ‘మీరు, నేను.. ఈ పూల మొక్కలు. ఇంతే మనింట్లో’ అంది మోహన.. గృహప్రవేశం చేసిన రోజు రాత్రి. అయితే అదే రోజు రాత్రి.. మోహన, తను మాత్రమే కాకుండా ఆ ఇంట్లో ఇంకొకరు కూడా ఉన్నట్లు అనిపించింది మహర్షికి! ఆ సంగతి మోహనకు చెప్పలేదు. ‘‘ఇంట్లో నువ్వు లేకపోతే నాకు నిద్ర పట్టదు’’.. ఎప్పుడూ చెప్పినట్లే రైలెక్కిస్తూ చెప్పాడు మహర్షి. మోహన నవ్వింది. ‘‘నమ్మను మహీ..’ అంది. మోహన ఇంకా చాలా వాటిని నమ్మదు. దెయ్యాల్ని అసలే నమ్మదు.  
∙∙
రాత్రి 2 గంటలు. మహర్షి మేల్కొనే ఉన్నాడు. టీవీలో న్యూస్‌ వస్తోంది. భార్య ఊళ్లో లేని రాత్రులలో అతడు న్యూస్‌ ఛానల్‌ మాత్రమే చూస్తాడు. సినిమాలు, సీరియల్స్‌ చూడడు. వాటిల్లో దెయ్యాలు కనిపిస్తాయని భయం. మొదట్లో పాటలు పెట్టుకునేవాడు. ఓసారెప్పుడో సడెన్‌గా ‘నందికొండ వాగుల్లో’ అనే దెయ్యాల పాట వచ్చింది. అప్పట్నుంచీ న్యూస్‌ మాత్రమే పెట్టుకుంటున్నాడు. చూడడు. వింటూ పడుకుంటాడు. నిద్ర వస్తే నిద్రలోకి జారుకుంటాడు. లేదంటే రాత్రంతా కళ్లు తెరుచుకునే ఉంటాడు. ఆ రోజు ఎలాగో తెల్లారింది. ఇంకో రోజు గడిపితే ధైర్యం వచ్చేస్తుంది.

అంటే మోహన వచ్చేస్తుంది. నిజానికి మహర్షి భయస్తుడు కాడు. కానీ గృహ ప్రవేశం రోజు ఆ భయం అలా ఫిక్స్‌ అయిపోయింది. ∙∙ రెండో రోజు రాత్రి. టీవీలో న్యూస్‌ రీడర్, టీవీ పెట్టుకుని మహర్షి.. ఆ ఇంట్లో ఇద్దరే మేల్కొని ఉన్నారు. అకస్మాత్తుగా కరెంట్‌ పోయింది. టీవీలో న్యూస్‌ రీడర్‌ కూడా మాయమైపోయాడు. ఉలిక్కిపడ్డాడు మహర్షి. అతడికి తోడుగా భయమొక్కటే మిగిలింది. టైమ్‌ ఎంతైందో తెలియడం లేదు. సెల్‌ఫోన్‌ పక్కమీదే ఉన్నా చీకట్లో చేతికి అందడం లేదు. భయంతో  కట్టెలా బిగుసుకుపోయాడు. సరిగ్గా అప్పుడే...

ఎవరో తలుపు తట్టారు! తడుతూనే ఉన్నారు!   దబ దబ.. దబ దబ.. దబ దబ!ఆ చీకట్లోనే మొండి ధైర్యంతో తడుముకుంటూ వెళ్లి దడేల్మని తలుపులు తీశాడు. ఎదురుగా.. మోహన! అతడిని తోసుకుంటూ లోపలికి వచ్చింది. వెంటనే కరెంటూ వచ్చింది. ఆమెను చూడకుండా టైమ్‌ ఎంతైందో చూశాడు మహర్షి. ఉదయం ఐదున్నర! ‘‘నేనేదో బయట తలుపు వేసుకుని వెళ్లినట్లు.. లోపల్నుంచి మీరు తలుపు కొడతారేమిటండీ దబ దబమని’’ అని ఆశ్చర్యంగా అడుగుతోంది మోహన!!నిశ్చేష్టుడయ్యాడు మహర్షి!నేను తలుపు తట్టానా.. అనబోయి, తమాయించుకున్నాడు. ‘‘ట్రైన్‌ త్వరగా వచ్చేసింది. క్యాబ్‌ మాట్లాడుకుని వచ్చేశా’’ అని బాత్రూమ్‌కి వెళ్లింది మోహన. ట్రైన్‌ త్వరగా రావడం ఏమిటో అర్థం కాలేదు మహర్షికి! అది ఉదయం ఏడు గంటలకు వచ్చే ట్రైన్‌.

మోహన బాత్రూమ్‌లోంచి ఇంకా బయటికి రాలేదు. పడుకుని టీవీ చూస్తున్నాడు మహర్షి. బ్రేకింగ్‌ న్యూస్‌! ఘోర రైలు ప్రమాదం! అది మోహన వస్తున్న రైలే! రైలు ఎక్కగానే ఫోన్‌ చేసింది కూడా! మహర్షి దిగ్గున లేచి కూర్చున్నాడు. చనిపోయిన వారి పేర్లు, బ్రాకెట్‌లో వారి వయసు.. వరుసగా స్క్రీన్‌పై కదులుతున్నాయి. కిరణ్, పద్మ, త్రిపుర, మనోజ్, అభినవ్‌. గీత, రాజు, స్వాతి..దేవుడా.. మోహన పేరు లేకుండా చూడు అని దేవుడిని వేడుకున్నాడు మహర్షి.కాంచన, ప్రహ్లాద్, సాకేత్, మో.. హ.. న.. ‘మోహనా’ అంటూ పెద్దగా అరిచి  పడిపోయాడు మహర్షి. కొద్ది „ý ణాలకు అతడికి ఏదో గుర్తుకొచ్చింది. మరి.. ఇందాక తలుపు తట్టిందెవరు? బాత్రూమ్‌లోకి వెళ్లిందెవరు? మోహన కాదా! టైమ్‌ చూశాడు. ఉదయం ఐదున్నర కాదు. రాత్రి రెండున్నర! స్పృహతప్పి పడిపోయాడు మహర్షి.  

కాలింగ్‌ బెల్‌ మోగుతోంది. నాలుగైదు మోతల తర్వాత లేచాడు మహర్షి. కిటికీ సందుల్లోంచి బాగా తెల్లారినట్లు కనిపిస్తోంది. వెళ్లి తలుపు తీశాడు. ఎదురుగా.. మోహన! మహర్షి ముఖం విప్పారింది. పాడు కల అనుకున్నాడు. ఆమె చేతిలోంచి లగేజీ అందుకున్నాడు. ‘స్టేషన్‌కి వద్దామనుకున్నాను మోహనా.. బాగా నిద్ర పట్టేసినట్లుంది. సారీ’’ అన్నాడు నొచ్చుకుంటూ. తన కల గురించి మోహనకు చెప్పలేదు.

వైదేహి గురించి కూడా మోహనకు చెప్పకూడదనుకున్నాడు. వీళ్లు రాక ముందు ఆ ఇంట్లో ఉన్నవాళ్ల అమ్మాయే వైదేహి. ప్రేమించినవాడు ఇంకొకర్ని పెళ్లి చేసుకున్నాడన్న వేదనతో పక్కనే ఉన్న బావిలో దూకి చనిపోయింది. ఆ సంగతి క్రితం రోజే మహర్షికి తెలిసింది. బిల్డర్‌ దగ్గర పనిచేసే బేల్దారితో మాట్లాడుతుంటే అనుకోకుండా వైదేహి విషయం వచ్చింది. ‘‘చక్కగా ఉంటుంది పిల్ల. అదిగో.. ఆ జినియా పువ్వులా’’ అన్నాడు ఎవరి పూలకుండీలోనో ఉన్న పువ్వును చూపించి. ఆ తర్వాతెప్పుడూ.. భార్య ఊరికి వెళ్లినప్పుడు దెయ్యాలకు భయపడుతూ పడుకోలేదు మహర్షి. మోహన మీద వచ్చిన దెయ్యంలాంటి కల.. మహర్షికి ఉన్న దెయ్యం భయాన్ని పోగొట్టింది. ఏ భయమైనా.. ఆ పీడకల కన్నా భయం కాదు కదా.. అని అతడి ధైర్యం.

Advertisement

తప్పక చదవండి

Advertisement