సంక్రాంతి పండుగ ఎప్పుడు? | Sakshi
Sakshi News home page

సంక్రాంతి పండుగ ఎప్పుడు?

Published Fri, Jan 12 2018 1:58 AM

sankranthi special - Sakshi

జనవరి 14వ తేదీ మధ్యాహ్నం సూర్యభగవానుడు మకరరాశిలో ప్రవేశించడం వల్ల మకర సంక్రమణం సంప్రాప్తించింది. ఈ మకర సంక్రమణ పుణ్యకాలం పదహారు గంటలు. దీనినే ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు. దృక్‌ సిద్ధాంతం ద్వారా పండుగలు, గ్రహగతుల సంచారం స్పష్టంగా తెలుస్తాయి. సాయన సిద్ధాంతం మనకు వర్తించదు. సూర్యుడు మిగిలిన రాశులలో ప్రవేశించినప్పుడు కూడా పుణ్యకాలాన్ని తెలియజేసినప్పటికీ మకర సంక్రమణానికి ఉన్నంత ఆదరణ మిగిలిన వాటికి లేదు.

ఈ మకర సంక్రమణాన్ని అనుసరించే సంక్రాంతి పురుషుని నామం, వాహనం, గొడుగు, వస్త్రధారణ, ఆయుధ ధారణలు తెలియజేయడం జరుగుతుంది. వాటివల్ల కలిగే శుభాశుభ ఫలితాలు తెలియజేయడం ఆచారం. ఈ పండుగలలో వివాదాలు కొత్తగా వచ్చినవేమీ కాదు. గతంలో కృష్ణాపుష్కరాలు, గోదావరి పుష్కరాలు కూడా వివాదాస్పదమైనాయి. అన్ని విషయాలు పరిగణనలోకి తీసుకుని పరిశీలించగా జనవరి 14వ తేదీనే మకర సంక్రాంతి అని స్పష్టంగా తెలియజేయడమైనది. అసలు పండుగలలో వివాదాలు రాకుండా దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్‌ సెక్రటరీ, దేవాదాయ శాఖ కమిషనర్‌ సిద్ధాంతులందరినీ పిలిచి ఒక సమావేశం ఏర్పాటు చేసి, మెజారిటీ సిద్ధాంతుల అభిప్రాయాలను బట్టి పండుగ తేదీలను ప్రకటిస్తే ఎటువంటి ఇబ్బందీ ఉండదు.

సంక్రాంతి పండుగ 14న జరుపుకోవాలా? 15న జరుపుకోవాలా ? అని చాలామందికి సందేహం ఉత్పన్నమవుతున్నది. దానికి కారణం సాంఘిక మాధ్యమాలలో, పలు వార్తా పత్రికలలో వచ్చిన వార్తలు. సూర్యుడు ఏ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజును మకర సంక్రాంతిగా జరుపుకుంటాము. సూర్యుడు తేది: 14–01–2018, ఆదివారం మధ్యాహ్నం 01:46 నిమిషాలకు మకరరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. కావున అదేరోజు అనగా తేది : 14–01–2018 నాడే మకర సంక్రాంతి పండుగను ఆచరించాలి.
– స్వామి శాంతానంద పురోహిత్, శక్తి పీఠం వ్యవస్థాపకులు

2018 జనవరి 14న మకర సంక్రాంతి పర్వదినం అని తూర్పుగోదావరి జిల్లా పొడగట్లపల్లికి చెందిన పిడపర్తి గంటల పంచాంగకర్తలు బ్రహ్మశ్రీ పిడపర్తి వీరేశ్వర శాస్త్రి, సోదరులు వారి క్యాలెండర్‌లోనూ, పంచాంగంలోనూ సూచించారు. రాజమహేంద్రవరంలోని కోటగుమ్మంకు చెందిన మోహన్‌ పబ్లికేషన్స్‌ వెలువరించిన కాలచక్రం సూర్యసిద్ధాంత పంచాంగం ప్రకారం సిద్ధాంతి పొన్నలూరి శ్రీనివాస గార్గేయ జనవరి 14ననే మకర సంక్రమణం జరుగుతోందని చెప్పారు. గుంటూరు జిల్లా నారాకోడూరుకు చెందిన వంగిపురపు వీరబ్రహ్మ దైవజ్ఞ కూడా జనవరి 14ననే సంక్రాంతి అని పేర్కొన్నారు.
– ములుగు రామలింగేశ్వర వరప్రసాదు సిద్ధాంతి శ్రీకాళహస్తి దేవస్థాన ఆస్థాన సిద్ధాంతి

Advertisement
Advertisement