మీ ఆర్థిక లక్ష్యాలను అందుకోవడమిలా... | Sakshi
Sakshi News home page

మీ ఆర్థిక లక్ష్యాలను అందుకోవడమిలా...

Published Wed, Jan 21 2015 12:04 AM

మీ ఆర్థిక లక్ష్యాలను  అందుకోవడమిలా...

పొదుపు సలహా
 
మా పొలం అమ్మితే దాదాపు పది లక్షలు వచ్చాయి. అందులో మా తక్షణావసరాలు పోను ఆరేడు లక్షల వరకు మిగిలాయి. వాటిని మదుపు చేసేందుకు సురక్షితమైన మార్గం చెప్పగలరు. మా పిల్లలు సెవెన్త్, టెంత్ చదువుతున్నారు.
 - ఎస్. పుష్పలత, కైకలూరు
 
మీ పిల్లల ఉన్నత చదువులు.. వివాహాల ఖర్చుల కోసం, మీ రిటైర్మెంట్ కోసం తగినంత నిధిని సమకూర్చుకోవడం మీ లక్ష్యాలు. దీనిప్రకారం చూస్తే  కింది పేర్కొన్న విధంగా ఇన్వెస్ట్ చేస్తే మీ ఆర్థిక లక్ష్యాలు నెరవేరగలవు.
 
1. మీ దగ్గరున్న మొత్తంలో 40 శాతాన్ని అధిక రాబడులు అందించగలిగే షేర్లు, షేర్ల ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ మొదలైన వాటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. స్టాక్స్‌కి సంబంధించి ప్రైమరీ మార్కెట్ అంటే ఐపీవోల్లో లేదా సెకండరీ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ విషయానికొస్తే.. డీమ్యాట్ పద్ధతిలో స్టాక్ బ్రోకర్ ద్వారా గానీ లేదా మ్యూచువల్ ఫండ్ ఏజంట్ల ద్వారా గానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అయితే నిపుణుల సలహా తీసుకోండి. దశలవారీగా ఇన్వెస్ట్ చేయండి.
 
2. మరో 30 శాతం మొత్తాన్ని బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లు/ కార్పొరేట్ ఫిక్సిడ్ డిపాజిట్లు/ పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్లలో ఉంచండి.
 
3. ఇక రిటైర్మెంట్ ప్లానింగ్ కోసం మీ వద్ద ఉన్న డబ్బులో 20 శాతాన్ని పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్/ న్యూ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్)/ యాన్యుయిటీ ప్లాన్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. పీపీఎఫ్‌లో రిస్కులు ఉండవు, రాబడులు గ్యారంటీ.  మీరు నిర్దేశించుకున్న వ్యవధి తర్వాత యాన్యుయిటీ ప్లాన్ల ద్వారా పింఛను అందుకోవచ్చు.
 
4. చివరిగా మిగిలిన 10 శాతం మొత్తాన్ని అత్యవసర పరిస్థితుల కోసం బ్యాంక్ సేవింగ్స్ అకౌంటు/లిక్విడ్ మ్యూచువల్ ఫండ్ స్కీమ్‌లలో ఉంచండి. బ్యాంక్ పొదుపు ఖాతాల కన్నా వీటిపై కాస్త ఎక్కువ వడ్డీ రేటు లభిస్తుంది.
 
- రజనీ భీమవరపు సీఎఫ్‌పీ, జెన్‌మనీ
 
 
 
 
 

Advertisement
Advertisement