దేశంలోనే రెండో పెద్ద క్యాంపస్ | Sakshi
Sakshi News home page

దేశంలోనే రెండో పెద్ద క్యాంపస్

Published Sun, Dec 14 2014 10:36 PM

దేశంలోనే రెండో పెద్ద క్యాంపస్ - Sakshi

మై క్యాంపస్ లైఫ్
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) - రూర్కెలా.. దేశంలో ఉన్న  30 ఎన్‌ఐటీల్లో టాప్-10లో నిలుస్తున్న విద్యా సంస్థ. అంతేకాకుండా బీటెక్ - ఎంటెక్ (డ్యుయెల్ డిగ్రీ), ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్‌డీ వంటి కోర్సులను అందిస్తూ విద్యార్థుల ప్రశంసలు దక్కించుకుంటోంది. ఇక్కడ కంప్యూటర్సైన్స్ అండ్ ఇంజనీరింగ్‌లో బీటెక్-ఎంటెక్‌డ్యుయెల్ డిగ్రీ చదువుతున్న ధరహాస్ తన క్యాంపస్ కబుర్లను మనతో పంచుకుంటున్నాడిలా..
 
మాది నల్గొండ జిల్లాలోని సూర్యాపేట. ఇంటర్మీడియెట్ తర్వాత జేఈఈ-మెయిన్‌లో ర్యాంకు సాధించి ఎన్‌ఐటీ - రూర్కెలాను ఎంచుకున్నాను. ఇక్కడ బీటెక్‌లో అన్ని బ్రాంచ్‌లు కలుపుకుని తెలుగు విద్యార్థులు 600 మంది వరకు ఉంటారు. క్యాంపస్ మొత్తం 1200 ఎకరాల్లో ఉంది. ఐఐటీ-ఖరగ్‌పూర్ తర్వాత దేశంలోనే రెండో అతిపెద్ద క్యాంపస్ ఇది. ప్రవేశం లభించిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి ఉంటుంది. సాధారణంగా ఉదయం 8.00 నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు తరగతులు, ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. ఈ సమయంలో ఆయా బ్రాంచ్‌లు, సబ్జెక్టులను బట్టి క్లాసులు ఉంటాయి. ప్రతి సెమిస్టర్‌లో మిడ్ టర్మ్, ఎండ్ టర్మ్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు.
 
పరిశోధనల దిశగా ప్రోత్సాహం
ఫ్యాకల్టీ అంతా వారివారి సబ్జెక్టుల్లో అత్యంత నిష్ణాతులు. స్నేహపూరిత వాతావరణంలో అన్ని విషయాలపైనా అవగాహన కల్పిస్తారు. పరిశోధనలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తారు. సబ్జెక్టుపరంగా ఏవైనా సందేహాలు ఎదురైతే మెయిల్ ద్వారా ఫ్యాకల్టీని సంప్రదించే వీలుంది లేదా స్వయంగా ఎప్పుడైనా ఫ్యాకల్టీని కలవొచ్చు. క్యాంపస్‌లో తెలుగు ఫ్యాకల్టీ కూడా ఉన్నారు. వారు కూడా తెలుగు విద్యార్థులకు అన్ని విధాలా సహాయసహకారాలు అందిస్తారు. ప్రముఖ విద్యా/పరిశోధన సంస్థల నుంచి గెస్ట్ లెక్చరర్లు కూడా వస్తారు.
 
హ్యుమానిటీస్ కోర్సులు చదవాలి
సోమవారం నుంచి శుక్రవారం వరకు తరగతులు ఉంటాయి. బోధన వినూత్నంగా ఉంటుంది. నిజ జీవితంలో ఎదురవుతున్న సమస్యలకు పరిష్కారాలు కనుగొనడం లేదా పాఠం చెప్పి.. ప్రాక్టికల్స్ చేయిస్తారు. విద్యార్థులే ఆయా అంశాలపై సొంతంగా ఆలోచించేలా, నేర్చుకునేలా ప్రోత్సహిస్తారు. వివిధ అంశాలపై అవగాహన కల్పించడానికి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్స్, ప్రొజెక్టర్, ఆన్‌లైన్‌ను వినియోగిస్తారు.

ఇంజనీరింగ్ సబ్జెక్టులతోపాటే ప్రతి విద్యార్థీ హ్యుమానిటీస్/సోషల్ సెన్సైస్ కోర్సులను అభ్యసించాలి. నేను హ్యూమన్ సెన్సైస్‌ను అధ్యయనం చేశాను. పాఠ్యేతర కార్యక్రమాలకు కూడా పెద్దపీట వేస్తారు. విద్యార్థులు అన్ని రంగాల్లో నిష్ణాతులుగా తయారయ్యేలా ఎన్‌సీసీ, ఎన్‌ఎస్‌ఎస్, ఫిజికల్ ఎడ్యుకేషన్స్, గేమ్స్‌లలో శిక్షణనిస్తారు.
 
స్టార్టప్స్‌కు సలహాలు
యువ పారిశ్రామికవేత్తలుగా రాణించాలనుకునేవారికి క్యాంపస్‌లో మంచి అవకాశాలున్నాయి. ప్రత్యేకంగా ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ సెంటర్ ఉంది. సొంత స్టార్టప్ ఏర్పాటు చేయాలనుకునేవారికి ఈ-సెల్ ఆధ్వర్యంలో సూచనలు, సలహాలు అందిస్తారు. అంతేకాకుండా ఐడియా కాంపిటీషన్స్, వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు.
 
క్యాంపస్.. కలర్‌ఫుల్
ఏటా క్యాంపస్‌లో టెక్నికల్ ఫెస్ట్, కల్చరల్ ఫెస్ట్, స్పోర్ట్స్ ఫెస్ట్‌లు నిర్వహిస్తారు. కల్చరల్ ఈవెంట్స్‌లో భాగంగా డ్యాన్స్, పాటలు, డ్రామాలు, చిన్నచిన్న స్కిట్‌లు వంటి వి ఉంటాయి. ఇక టెక్నికల్ ఫెస్ట్‌లో భాగంగా టెక్నికల్ ఈవెంట్స్, రోబో కాంపిటీషన్స్‌తోపాటు వివిధ పరిశోధన సంస్థల నుంచి వచ్చే శాస్త్రవేత్తల లెక్చర్స్ ఉంటాయి.
 
సదుపాయాలెన్నో..
క్యాంపస్‌లో రుచికరమైన ఆహారాన్ని అందించే భోజనశాలలు, విద్యార్థులు సేదతీరడానికి క్రీడా మైదానాలున్నాయి. అత్యాధునిక పరికరాలతో లేబొరేటరీలున్నాయి. వివిధ పుస్తకాలు, జర్నల్స్‌తో అతిపెద్ద లైబ్రరీ కూడా ఉంది. ఈ ఏడాది క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఏడాదికి సగటున రూ. 8 లక్షలు, గరిష్టంగా రూ.40 లక్షల వేతనాలు కంపెనీలు ఆఫర్ చేశాయి. నా కోర్సు పూర్తయ్యాక క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో మంచి ఆఫర్ వస్తే జాబ్ చేస్తా లేదంటే ఎంఎస్ చదువుతా.

Advertisement
Advertisement