‘సెలైంట్’ గా మనసులు దోచిన ‘మెలడీ’ | Sakshi
Sakshi News home page

‘సెలైంట్’ గా మనసులు దోచిన ‘మెలడీ’

Published Thu, Jul 17 2014 12:13 AM

'Selaint as' probably 'meladi'

షార్ట్ ఫిల్మ్
 
పుష్పక్... ఈ సెలైంట్ సినిమా పేరు చాలామందికి ఇంకా గుర్తుండే ఉంటుంది... తెలుగు సినిమాలలో అదొక కొత్త ట్రెండ్... ప్రేక్షకుల మనసుల్ని నిశ్శబ్దంగా దోచేసింది... ఆ తరవాత తెలుగులో మళ్లీ సెలైంట్ మూవీ రాలేదు. అయితే లఘుచిత్రాలలో మాత్రం చాలామంది నిశ్శబ్ద చిత్రాలు తీస్తున్నారు. ప్రశాంత్ కూడా అలాంటిదే ఒక చిత్రం తీశారు.  ‘సెలైంట్ మెలడీ’ పేరుతో తీసిన ఈ చిత్రం మొదటి నెలలోనే పది లక్షల వ్యూస్‌తో ‘వైవా’ లఘుచిత్రం తరవాత అంత పేరు సంపాదించుకుంది.
 

పాలకొల్లుకి చెందిన 26 సంవత్సరాల ప్రశాంత్, హైదరాబాద్‌లోని సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ పట్టా పుచ్చుకున్నారు. తండ్రి బిల్డర్‌గా పని చేస్తున్నారు. తల్లి గవర్నమెంట్ స్కూల్‌లో టీచర్. ‘‘మా పేరెంట్స్ నేను సినిమాల్లోకి వెడతాననగానే ముందు షాకయ్యారు. తరవాత నాకు పూర్తిగా సపోర్ట్ ఇస్తున్నారు’’ అంటూ తల్లిదండ్రుల ఆశీస్సుల గురించి వివరించారు ప్రశాంత్.
 ఈ చిత్ర కథ గురించి -
 
‘‘ఒకసారి నేను హోటల్‌కి వెళ్లినప్పుడు, ఒక జంటను చూశాను. వారి మధ్య సంభాషణ చేతి సైగలతో నడుస్తోంది. మూగవారేమో అనుకున్నాను. అంతలోనే ఆయన వెయిటర్‌ని పిలిచి ఆర్డర్ ఇవ్వడంతో, ఆయనకు మాటలు వచ్చు, ఆవిడ మూగది అని అర్థం అయ్యింది. నా మనసు వారి వైపు ఆరాధనగా చూసింది. ఆ అంశాన్ని ఆధారంగా చేసుకుని లఘుచిత్రం తీయాలనిపించింది. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమా హీరో సందీప్ కిషన్‌కి కథ చెప్పాను. తనకి బాగా నచ్చి ఈ సినిమాని తనే ప్రొడ్యూస్ చేస్తానన్నాడు. అలా ఈ చిత్రం తీశాం’’ అంటారు ప్రశాంత్.
 
సెలైంట్ మెలడీ’ లఘుచిత్రానికి యాహూ, ఎన్‌డిటివి వాళ్లు ‘బెస్ట్ మూవీ’ అంటూ పబ్లిసిటీ ఇచ్చారు. ఇందులో సినిమాలకి వాడే కెమెరాలు వాడారు. ‘‘సినిమా బడ్జెట్ రూ. 75000 వేలు. రెండు రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేశాను. ఇందులో హీరోయిన్‌గా నటించిన ప్రాచీ థాకరేను ఫేస్‌బుక్ ద్వారా సంప్రతించాను. అయితే ఆ అమ్మాయికి తెలుగు రాదని చెప్పింది. ఇది ఏ భాషా అవసరం లేని సెలైంట్ మూవీ అని చెప్పడంతో ఆ అమ్మాయి అంగీకరించింది’’ అన్నారు ప్రశాంత్.
 ప్రాచీ థాకరే నిఫ్ట్‌లో చదువుతున్నారు. అందువల్ల తన కాస్ట్యూమ్స్‌ను తానే సొంతంగా డిజైన్ చేసుకున్నారు.

 ప్రొడ క్షన్ వర్క్ బాగా నేర్చుకున్న ప్రశాంత్, చదువుతూన్న రోజుల్లోనే మ్యూజిక్ ఆల్బమ్స్ చేశారు. ‘ఆడపిల్లల్ని చంపుకోవడం’ గురించి సందేశాత్మకమైన పాట ఒకటి తీశారు. కొన్ని డాక్యుమెంటరీలూ చేశారు. చాలా సినిమాలకు యాడ్స్ చేశారు.

 ‘‘బీటెక్ పూర్తవ్వగానే అమెరికాలోని ఫిల్మ్ స్కూల్‌లో చేరదామనుకున్నాను. కానీ, నేను అనుకున్న యూనివర్శిటీలో సీటు రాకపోవడంతో ఇక్కడే ఉండిపోయాను’’ అంటున్న ప్రశాంత్... సినిమా రంగానికి చెందిన వారితో పరిచయాలు పెంచుకుని, సినిమాల గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ సంపాదించుకున్నారు.

 ‘‘నేను చేసిన లఘుచిత్రాలను కాంపిటీషన్‌కి పంపినప్పుడు అక్కడ ఐదుగురు న్యాయనిర్ణేతలు నన్ను ప్రశంసించారు. అయితే నా చిత్రం వారు ఇచ్చిన అంశానికి భిన్నంగా ఉండటంతో బెస్ట్ కన్సొలేషన్ ప్రైజ్ ఇచ్చారు. దాసరిగారు నన్ను ప్రత్యేకంగా ప్రశంసించారు’’ అని వివరించారు ప్రశాంత్.

 ప్రస్తుతం రెండు పెద్ద చిత్ర నిర్మాణ సంస్థల సినిమాలకు డెరైక్టర్‌గా సంతకం చేశారు ప్రశాంత్. చదువులో టాపర్ అయిన ప్రశాంత్ తన వెండి తెర కలల్ని నిజం చేసుకొనే ప్రయత్నంలో కృషి చేస్తున్నారు.

‘‘నాటాలో నిర్వహిస్తున్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ‘సెలైంట్ మెలడీ’ ఫైనలిస్ట్‌లోకి చేరడం, అందులో నేను మోస్ట్ ప్రామిసింగ్ బడ్డింగ్ డెరైక్టర్ అవార్డు అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంకా 18వ పుచోన్ ఇంటర్నేషనల్ ఫెన్‌టాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ‘సైలంట్ మెలడీ’ని స్క్రీనింగ్‌కి ఎంపిక కావడం నేను నా జీవితంలో మర్చిపోలేని సంఘటన’’ అంటారు ప్రశాంత్.

- డా. పురాణపండ వైజయంతి
 

Advertisement

తప్పక చదవండి

Advertisement