దూరం నుంచి ఒక రాయి | Sakshi
Sakshi News home page

దూరం నుంచి ఒక రాయి

Published Sun, Jul 29 2018 1:25 AM

Should all be aware of one thing - Sakshi

ఒకసారి యేసువద్దకు ఒక స్త్రీని కొందరు తీసుకొచ్చి ‘ఈమె వ్యభిచారం చేస్తూ పట్టుబడింది. ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి అని ధర్మశాస్త్రం చెబుతుంది కదా.. మరి నీవేమంటావు’ అని అడిగారు. ప్రభువు ఏం చెబుతాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. అప్పుడు యేసు ‘‘అవును... ఆమెను రాళ్లతో కొట్టి చంపవలసిందే... కానీ ఎవరిలోనైతే పాపం లేదో ఆ వ్యక్తి మాత్రమే ఆ శిక్షను అమలు చేయాలి’’ అని చెప్పారు. అప్పుడు అక్కడ ఉన్న వారంతా రాళ్లు అక్కడ పడవేసి ఒక్కొక్కరుగా చల్లగా జారుకున్నారు. ఇక్కడ మనమంతా ఒక విషయాన్ని గమనించాలి. ఎవరైనా తప్పో, పాపమో చేస్తే మనమంతా ఆ పని చేసిన వారిని శిక్షించాలని. దూరం నుంచైనా ఒక రాయి వారిమీద వేయాలని ప్రయత్నిస్తాం. ఒకవేళ ఆ శిక్షను అమలు చేసే అవకాశం వస్తే మనమే అమలు చేస్తాం. అది అమలు చేసేటప్పుడు మనం తప్పు చేసే వాళ్లం కాదని, అసలు పాపమే చేయలేదనే భావనతో ఆ పని చేస్తాం. కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తే మనమందరమూ కూడా తప్పో, పాపమో చేస్తూనే ఉంటాం. అది బయటకు కనిపించక పోవచ్చు. హృదయంలో మనం కూడా అదే తప్పు ఆలోచనలు కలిగి ఉండి ఆ పనిని బయటకు చేసిన వానిని మాత్రం శిక్షించడానికి ముందుంటాం.

ఒక్కసారి ఆలోచించాలి. యేసు తలయెత్తి చూసినప్పుడు ఆ స్త్రీ మీద నేరారోపణ చేసిన వారెవరూ కనిపించలేదు. అపుడు యేసు ఆ స్త్రీని చూసి ‘‘అమ్మా..!. నీవు కూడా వెళ్లు, అయితే మళ్లీ పాపం చేయకు’’ అని చెప్పాడు. అంటే శిక్షతో కాకుండా క్షమించడం ద్వారా ఆ స్త్రీని మార్చాలనుకున్నాడు. భావోద్వేగాలను తమ నియంత్రణలో ఉంచుకున్నవారు మాత్రమే ఇలా మాట్లాడగలరు. ఆ స్త్రీని వాళ్లు తీసుకొస్తున్నప్పుడు గానీ ఆమెను శిక్షించాలనే తలంపుతో రాళ్లు చేత పడుతున్నపుడు గానీ వారిలో ఏ విధమైన ఆలోచనా లేదు, ఈమె పాపం చేసింది, మేము చేయలేదు కనుక ఈమెను శిక్షించాలి ఆనే ఆలోచన తప్ప! కానీ యేసు మాట్లాడిన ఆ ఒక్క మాట వారిని ఆలోచింప జేసింది. ఒక్కసారి మనం ఎదుటి వ్యక్తిని క్షమించడం అలవాటు చేసుకుంటే అది ఎంత సంతోషాన్నిస్తుందో అర్ధమౌతుంది. అయినా శిక్షించడానికి ఆయుధం ఉంటే చాలు. అదే క్షమించాలంటే హృదయంలో చాలా ధైర్యం కావాలి, అనేక సందర్భాలలో శిక్షలకన్నా కూడా  ప్రేమ, క్షమాపణ తప్పు చేసిన వ్యక్తులలో మార్పులు తీసుకొస్తాయి. తప్పు చేసిన వ్యక్తి మారాలని కోరుకోవాలి కానీ మరణించాలని కోరుకోకూడదు. 
– రవికాంత్‌ బెల్లంకొండ

Advertisement
Advertisement