సరిగా కూర్చోబెడుతుంది..! | Sakshi
Sakshi News home page

సరిగా కూర్చోబెడుతుంది..!

Published Thu, Nov 27 2014 10:49 PM

సరిగా కూర్చోబెడుతుంది..! - Sakshi

చిన్నప్పుడు స్కూల్‌లో టీచర్లు, ఇంట్లో అయితే అమ్మానాన్నలు సరిగా కూర్చోవడం గురించి చెబుతారు. ‘సిట్ రైట్’ అంటూ గద్దిస్తూనే పద్ధతిగా కూర్చోవడాన్ని నేర్పిస్తారు. అయితే వయసొచ్చాక, బాధ్యతల్లో పడిపోయాక... ఆఫీసుల్లోనూ, ఇంట్లోనూ, వాహనం నడుపుతున్నప్పుడు మన శరీరాన్ని మనమే నిర్లక్ష్యం చేస్తాం. ఇష్టం వచ్చిన యాంగిల్స్‌లో కూర్చొంటూ దాన్ని కష్టపెడతాం. అయితే సరిగా కూర్చోవడంలో ఎంతో సౌలభ్యం ఉంటుంది. పద్ధతిగా కూర్చోకపోవడం వల్ల ఎన్నో నష్టాలుంటాయి. మరి ఇలాంటి సమయంలో మనల్ని సరిగా కూర్చోవడానికి తగిన విధంగా తీర్చిదిద్దేవాళ్లెవరైనా ఉంటే బావుటుందనిపిస్తుంది. ఇలాంటి అవసరాన్ని తీర్చడానికే వచ్చింది ‘లుమోబ్యాక్’ అనే గాడ్జెట్. దీన్ని ధరిస్తే చాలు... పద్ధతిగా, ఒద్దికగా కూర్చోవడం అనే విద్యను ప్రాక్టీస్ చేస్తున్నట్టే. శరీరానికి అనవసరమైన శ్రమను నిరోధిస్తున్నట్టే.

ఈ గాడ్జెట్   బ్లూటూత్ ద్వారా ఐఓఎస్ స్మార్ట్‌ఫోన్‌తో కనెక్ట్ అయ్యి పనిచేస్తుంది. బెల్ట్‌లా ఉండే దీన్ని నడుముకు కట్టుకొంటే చాలు ఇది ఎప్పటికప్పుడు కూర్చొన్న యాంగిల్ సరైనదో కాదో తెలుసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు సిగ్నల్స్ పంపుతూ వైబ్రేషన్స్ ద్వారా సరిగా కూర్చోమని సలహాలు ఇస్తుంటుంది. సరిచేసుకొనేంత వరకూ వదలదు. ఆఫీసు లో పనిచేస్తున్నప్పుడైనా, మరే పనిచేస్తున్ననప్పుడైనా ఇది తన పని తాను చేసుకుపోతుంటుంది. శరీరానికి ఇబ్బంది కలిగించని కోణంలో కూర్చోమని సూచిస్తుంటుంది. ఎప్పటికప్పుడు నియంత్రిస్తూ సరైన పద్ధతిలో కూర్చోవడం నేర్పించే ఈ గాడ్జెట్ నేటి జీవనశైలికి ఉపయోగపడేదని చెప్పవచ్చు. గాడ్జెట్‌తో పాటు ఏదో ఒక ఐఓఎస్ డివైజ్ చేతిలో ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
 

Advertisement
Advertisement