స్లీప్‌ కౌన్సెలింగ్స్‌ | Sakshi
Sakshi News home page

స్లీప్‌ కౌన్సెలింగ్స్‌

Published Mon, Jul 2 2018 1:29 AM

Sleep Counseling - Sakshi

గట్టిగా గురక... పరిష్కారం చెప్పండి
న వయసు 45 ఏళ్లు. అప్పుడప్పుడూ మద్యం తాగుతాను. రాత్రివేళల్లో మద్యం తాగే అలవాటు ఉంది. నేను గురకతో బాధపడుతున్నాను. ఇటీవల ఫ్రెండ్స్‌తో టూర్‌కు వెళ్లాను. గదిలో, కారులో పడుకున్న వెంటనే గురకపెట్టడం మొదలుపెట్టాను. ఆ టూర్‌ మొత్తంలో నాతో పాటు గదిలో ఉండటానికి ఫ్రెండ్స్‌ ఎవరూ ఇష్టపడలేదు. ఇంట్లోనూ ఇదో సమస్య అవుతోంది.  మానసికంగా బాగా కలత చెందుతున్నాను. నా సమస్య తగ్గేదెలా? – ఎన్‌. సూర్యనారాణయ, ఖమ్మం
శ్వాసతీసుకోవడంలో కలుగుతున్న అంతరాయానికి గురక ఒక గుర్తు. దీన్ని మనం తేలిగ్గా తీసుకోకూడదు. మన జనాభాలో 45 శాతం మంది అప్పుడప్పుడూ, 25 శాతం మందిలో రోజూ గురక పెడుతుంటారు. స్థూలకాయుల్లో ఈ సమస్య తీవ్రత మరింత ఎక్కువ.   మనం నిద్రపోగానే అన్ని అవయవాలూ రిలాక్స్‌ అయినట్లే శ్వాసనాళమూ మెత్తబడుతుంది. అలా మెత్తబడిన శ్వాసనాళంతో పాటు, నాలుక చివరి భాగం, అంగిలిలోన, గొంతు ముందు భాగం వద్ద గాలి ప్రకంపనలు సంభవిస్తాయి. ఆ కంపన వల్ల నోటి నుంచి, ముక్కు నుంచి ఒకరకమైన శబ్దం వస్తుంది. అదే గురక.

గురక వస్తుందంటే ఈ కింది సమస్యలకు అది సూచన కావచ్చు:
గొంతులోని శ్వాసకు సంబంధించిన కండరాల బలహీనత. ఒకవేళ ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు ఉంటే ఆ కండరాలు మరింతంగా రిలాక్స్‌ అయిపోవడం వల్ల గురక మరింత ఎక్కువగా రావచ్చు. సమస్య తీవ్రం కావచ్చు
కొందరిలో గొంతులోని కండరాలు  మందంగా మారడం వల్ల గాలి ప్రవహించే నాళం సన్నబడవచ్చు. కొన్నిసార్లు అంగిలి వెనక మృదువుగా ఉండే భాగం పొడవు పెరగవచ్చు
కొన్నిసార్లు ముక్కులో ఏవైనా అడ్డంకులు వచ్చినందువల్ల శ్వాస తీసుకోవడానికి మరింత గట్టిగా గాలి పీల్చాల్సి రావచ్చు. ఇలాంటి సమయంలోనూ శబ్దం వస్తుంది. కొన్నిసార్లు జలుబు చేయడం, సైనస్‌లలో ఇన్ఫెక్షన్లు, ఆ కారణంగా వచ్చే జ్వరం వల్ల గాలిని మరింత బలంగా పీల్చడంతోనూ గురక రావచ్చు
ఇక మరికొందరిలో ముక్కు దూలం కాస్త వంకరగా ఉండటం వల్ల కూడా గురక రావచ్చు. ఇక మీలాగే న్యూనతకు గురయ్యే వ్యక్తులు కొందరు కునుకు తీయడానికి కూడా భయపడి నిద్రలేమితో బాధపడతారు. గురకలో శ్వాస అందని పరిస్థితిని అబ్‌స్ట్రక్టివ్‌ స్లీప్‌ ఆప్నియా అంటారు. దాంతో రక్తంలో ఆక్సిజన్‌ తగ్గి, గుండెపై చాలా భారం పడుతుంది. గుండె రక్తసరఫరా కోసం ఆక్సిజన్‌ కోసం మరింత ఎక్కువ శ్రమిస్తుంది.
చికిత్సలు:   గురకకు అనేక రకాలుగా చికిత్స చేస్తుంటారు. ఉదాహరణకు కొందరిలో ముక్కుకు ఒక ప్రత్యేకమైన మాస్క్‌ను తొడుగుతారు. దీన్ని సీపాప్‌ చికిత్స అంటారు. ∙ఇక మరికొందరిలో ‘ఉవాలోపాలటోఫ్యారింజియల్‌ ప్లాస్టీ’ అనే శస్త్రచికిత్స చేస్తారు. ఇంకొందరిలో థెర్మల్‌ అబ్లేషన్‌ చికిత్స ద్వారా ముక్కులో, గొంతులో, అంగిలిలో  అడ్డంకులు ఏవైనా ఉంటే వాటిని తొలగిస్తారు.
నివారణ: గురకను నివారించడానికి కొన్ని సూచనలు
మీ బరువును అదుపులో పెట్టుకోడానికి వాకింగ్‌ వంటి వ్యాయామాలతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించండి
నిద్రకు  ముందు మత్తు కలిగించే పదార్థాలు, స్లీపింగ్‌ పిల్స్, అలర్జీని అదుపులో ఉంచే మందులైన యాంటీహిస్టమైన్స్‌ తీసుకోకండి
మీరు ఆల్కహాల్‌ మానేయండి. అలా చేయలేకపోతే కనీసం నిద్రవేళకూ, మద్యం తీసుకోడానికీ మధ్య నాలుగు గంటలూ, నిద్రకూ, కడుపు నిండుగా భోజనానికి (హెవీ మీల్‌కు) మధ్య మూడు గంటల వ్యవధి ఉండేలా చూసుకోండి ∙నిద్రవేళలు క్రమబద్ధంగా ఉండాలి
వెల్లకిల పడుకోడానికి బదులుగా ఒకవైపునకు ఒరిగి పడుకోండి
మీ తలను మీ పడకకంటే నాలుగు అంగుళాల ఎత్తుగా ఉండేలా తలగడ అమర్చుకోండి.


మెలకువ రాగానే కదలలేక పోతున్నాను!
నా వయసు 50. నాదో చిత్రమైన సమస్య. నేను నిద్రలేచాక చాలాసేపటి వరకు నా శరీరం, చేతులు, కాళ్లు ఇవేవీ కదలడం లేదు. కేవలం కళ్లు మాత్రమే తెరిచి చూడగలుగుతున్నాను అంతే. నా చుట్టూ ఏం జరుగుతుందో తెలుస్తోంది. కానీ నా అవయవాలేవీ నా స్వాధీనంలో ఉండటం లేదు. ఈ స్థితి కొద్ది సెకన్లపాటు ఉంటోంది. కొద్దిసెకన్లే అయినా నాకు చాలా ఆందోళనగా ఉంది. నా సమస్య ఏమిటి? ఇది తగ్గెదెలా? – ఆర్‌. సర్వేశ్వరరావు, కాకినాడ
మీరు చెప్పినదాన్ని బట్టి చూస్తే మీరు స్లీప్‌ పెరాలసిస్‌ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఉన్నవారు నిద్రలేచాక తాత్కాలికంగా కాసేపు కదలడం, మాట్లాడటం, చదవడం... ఇలాంటి పనులేవీ చేయలేరు. పూర్తిగా నిద్రనుంచి పూర్తిగా మెలకువ స్థితికి వచ్చే మధ్య సమయంలో కండరాల బలహీనత వల్ల ఇలా జరుగుతుంది.

ఒక్కోసారి ఈ స్థితిలో ఉన్నప్పుడు మనం భ్రాంతులకు (హేలూసినేషన్స్‌కు) కూడా లోనుకావచ్చు. అంటే మన గదిలోకి ఎవరో అపరిచితులు ప్రవేశించినట్లుగా అనిపించడం, దానికి తగినట్లు మనం స్పందించాలనుకున్నా ప్రతిస్పందించలేకపోతున్నట్లుగా అనిపించవచ్చు. ఈ స్లీప్‌ పెరాలసిస్‌ అన్నది రెండు సమయాల్లో కలుగుతుంది. మొదటిది... నిద్రకు ఉపక్రమిస్తున్నప్పుడు; రెండోది నిద్రనుంచి మెలకువ స్థితిలోకి వస్తున్నప్పుడు.

స్లీప్‌ పెరాలసిస్‌ అన్నది చాలా అరుదైన రుగ్మత కాదు. ప్రతి పదిమందిలో నలుగురికి ఈ విధమైన సమస్య ఉంటుంది. పిల్లలు తమ కౌమారస్థితిలో (అడాలసెన్స్‌లో) ఉన్నప్పుడు సాధారణంగా దీన్ని మొదటిసారిగా గుర్తించడం జరుగుతుంటుంది. అయితే ఏ వయసువారిలోనైనా, పురుషుల్లోనూ, స్త్రీలలోనూ ఇది సంభవించవచ్చు. స్లీప్‌ పెరాలసిస్‌ అన్నది సాధారణంగా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. ఇది వచ్చేందుకు దోహదపడే మరికొన్ని అంశాలివి...

నిద్రలేమి 
మాటిమాటికీ నిద్రవేళలు మారుతుండటం
బైపోలార్‌ డిజార్డర్‌ వంటి మానసిక వ్యాధులు
ఎప్పుడూ పక్కకు ఒరిగిపడుకోకుండా కేవలం వీపు మీదే భారం మోపి పడుకోవడం
నిద్ర సంబంధమైన ఇతర సమస్యలు ఉండటం
కొన్ని మందులు వాడటం (ముఖ్యంగా ఏడీహెచ్‌డీకి వాడేవి)
తీవ్ర అవమానానికి గురికావడం

చికిత్స:  స్లీప్‌ పెరాలసిస్‌ వచ్చిన చాలామందికి ఎలాంటి చికిత్సా అవసరం లేకుండా దానంతట అదే తగ్గిపోతుంది. స్లీప్‌ పెరాలసిస్‌కు దోహదం చేస్తున్న అసలు కారణానికి చికిత్స చేస్తే ఇది తగ్గిపోతుంది. అంటే బాగా నిద్రపోవాలని ఉన్నా ఒకపట్టాన నిద్రపట్టకపోవడం వంటివి. కనీసం 6 – 8 గంటలపాటు గాఢనిద్రపోవడం వంటి మంచి నిద్ర అలవాట్లతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఏవైనా మానసిక సమస్యలు ఉంటే వాటికి చికిత్స చేయడం ద్వారా కూడా దీనికి చికిత్స చేయవచ్చు.

నిద్రలో కాళ్లు కదులుతున్నాయి ఎందుకు?
నా వయసు 52 ఏళ్లు. ఒకింత స్థూలకాయంతో ఉంటాను. గత 12 ఏళ్లుగా డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. ఇటీవల నేను గమనించిన అంశం ఏమిటంటే... రాత్రివేళ నా ప్రయత్నం లేకుండానే నేను కాళ్లను కుదుపుతున్నట్లు కదిలిస్తున్నాను. దాంతో నిద్రాభంగం అవుతోంది. పైగా పగలంతా చాలా మగతగా, డల్‌గా ఉంటున్నాను. నా సమస్యకు కారణాలేమిటి? తగ్గే మార్గం ఉందా? – డి. హనుమంతరావు, అనంతపురం
మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు పీఎల్‌ఎమ్‌డీ అనే సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీలా నిద్రలో ఇలా కాళ్లు వేగంగా కదిలించడాన్ని ‘పీరియాడిక్‌ లింబ్‌ మూవ్‌మెంట్‌ డిజార్డర్‌ (పీఎల్‌ఎమ్‌డీ) అంటారు. సాధారణంగా నిద్రపోతున్న సమయంలో మన శరీరంలో శ్వాస తప్ప మరే కదలికా ఉండదు. కానీ నిద్రజబ్బులో ఇలా కదలికలు కనిపించే జబ్బు ఇదే. ఇక్కడ ‘పీరియాడిక్‌’ అనే పదం కదలికలు ఎంత ఫ్రీక్వెన్సీతో వస్తున్నాయనేందుకు ఉపయోగిస్తారు.

ఇవి క్రమబద్ధంగా ప్రతి 20 – 40 సెకండ్ల పాటు వస్తూ ఉంటాయి. పీఎల్‌ఎమ్‌డీ అనేది నిద్రకు సంబంధించిన వ్యాధి. దీనితో బాధపడేవారు రాత్రివేళ నిద్ర తక్కువ కావడం వల్ల పగలు మగతగా ఉంటారు. పీఎల్‌ఎమ్‌డీ అనేది ఏ వయసు వారిలోనైనా రావచ్చు. అయితే సాధారణంగా మధ్యవయస్కుల్లో ఇది ఎక్కువ. పీఎల్‌ఎమ్‌డీలో ప్రైమరీ, సెకండరీ అని రెండు రకాలున్నాయి. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీ అనేది అంతర్గతంగా ఇతర వ్యాధులు ఉన్నవారిలో కనిపిస్తుంది.

లేదా కొందరిలో దీనికి కారణం కూడా తెలియదు. మెదడు నుంచి కాళ్లు, చేతులకు వెళ్లే నరాల్లో సమస్యల వల్ల ఇది వస్తుందని తెలుసుకానీ, ఆ సమస్యలేమిటో ఇంకా పరిశోధనల్లో వెల్లడికాలేదు. సెకండరీ పీఎల్‌ఎమ్‌డీకి చాలా కారణాలు ఉన్నాయి. అవి...

డయాబెటిస్‌
ఐరన్‌ లోపం
వెన్నెముకలో కణుతులు
వెన్నెముక దెబ్బతినడం
స్లీప్‌ ఆప్నియా (గురక సమస్య)
నార్కోలెప్సీ (క్రమమైన వేళల్లో నిద్రపట్టడం, నిద్రలేవడం జరగకపోవడం)
యురేమియా (రక్తంలో యురియా, నైట్రోజన్‌ సంబంధిత వ్యర్థపదార్థాల పాళ్లు పెరగడం), రక్తహీనత మొదలైనవి.

పీఎల్‌ఎమ్‌డీతో బాధపడే చాలామందిలో కాళ్ల కదలికలు లేకుండా నిద్రపట్టకపోవడం, దాంతో పగటినిద్ర ఎక్కువగా ఉంటాయి. కొందరిలో ఒక కాలు, లేదా మరికొందరిలో రెండుకాళ్లూ కదులుతూ ఉండవచ్చు. దీని నిర్ధారణకు నిర్దిష్టంగా పరీక్షలేవీ లేకపోయినా, రక్తహీనత వంటి వాటి ద్వారా కారణాన్ని ఊహించవచ్చు. ఈ సమస్య ఉన్నవారికి బెంజోడయజిపైన్స్, క్లోనోజెపామ్, డోమమినెర్జిక్‌ ఏజెంట్స్, యాంటీకన్వల్జెంట్‌ ఏజెంట్స్, గాబా ఆగోనిస్స్‌ వంటి మందులతో చికిత్స చేయవచ్చు.


- డాక్టర్‌ రమణ ప్రసాద్‌ ,కన్సల్టెంట్‌ స్లీప్‌ స్పెషలిస్ట్‌ అండ్‌ పల్మునాలజిస్ట్‌ కిమ్స్, సికింద్రాబాద్‌

Advertisement
Advertisement