చిన్నపేగుల్లో అల్సర్... మందులతో తగ్గుతుంది | Sakshi
Sakshi News home page

చిన్నపేగుల్లో అల్సర్... మందులతో తగ్గుతుంది

Published Tue, Jan 19 2016 11:22 PM

Small intestinal ulcer medications to reduce ...

హోమియో కౌన్సెలింగ్
 

నాకు కొంతకాలంగా మోచేతి నొప్పి వస్తోంది. చిన్న బరువును కూడా ఎత్తలేకపోతున్నాను. ఎక్స్‌రే తీయిస్తే, ఇది టెన్నిస్ ఎల్బో అన్నారు. దీనికి హోమియోపతిలో చికిత్స ఉందా?
 - ఎస్వీఆర్, గుంటూరు

 టెన్నిస్ ఎల్బో అన్న మాట వినగానే ఇది క్రీడాకారులకు సంబంధించిన ఆరోగ్య సమస్యగా అనుకుంటారు. క్రీడాకారులకేగాక చాలామంది మోచేతితో ఎక్కువగా పని చేసేవారిలో ఈ సమస్యలు చూస్తుంటాము. ఇది  కొన్ని భంగిమలలో పని చేస్తున్నప్పుడు ఒక్కోసారి తీవ్రంగా ఉంటుంది. కొన్ని పరిశోధనలలో తేలిన విషయమేమిటంటే, ఈఎల్‌ఆర్బీ అనే కండరం బలహీనపడటం వల్ల ఈ సమస్య వస్తుంది. ఈ సమస్య సాధారణంగా 30 నుంచి యాభై సంవత్సరాల వారికి వస్తుంది.
 
టెన్నిస్ ఎల్బో పార్శ్వ మోచేతి ముడుకు శోధను ల్యాటరల్ ఎపికాన్ డైలిటిస్ అని కూడా అంటారు. ఇది సాధారణంగా నలభై నుండి 60 ఏళ్ల వయసు వారికి వస్తుంది. ఇది మోచేతి చుట్టూ నొప్పిని కలిగిస్తుంది. మోచేతి ఎముక భాగం బయట నొప్పిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా కుడిచేతిని వాడే వారిలో వస్తుంది. ఒక్కోసారి రెండు మోచేతుల్లోనూ సంభవించవచ్చు. ఎల్బో సాధారణంగా క్రీడాకారులకు, వెయిట్‌లిఫ్టింగ్‌లో పాల్గొనేవారికి, కార్పెంటింగ్ పనులు చేసేవారికి, పెయింటర్లకు, రోడ్డు నిర్మాణ కార్మికులకు, అల్లికల పని చేసేవారికి, చెఫ్‌లకు, వెయిటర్లకు వస్తుంది. టెన్నిస్ క్రీడాకారుల్లోనే కాకుండా రిపీటెడ్ మూవ్‌మెంట్స్ ఎక్కువగా చేసేవారిలో కనిపిస్తుంది.
 కారణాలు: టెన్నిస్ రాకెట్‌తో ఆడటం, ఎక్కువ బరువులు ఎత్తటం, కార్పెంటింగ్ పని చేయడం, టైపింగ్ ఎక్కువగా చేయటం, రోడ్డు నిర్మాణ పనులు చేయడం.

లక్షణాలు: మోచేయి చుట్టూ నొప్పి, చేతులు వణకటం, చేయి కింది నుంచి పై వరకు తీవ్రమైన నొప్పి, కొన్ని వస్తువులు (కత్తి, ఫోర్క్, టూత్‌బ్రష్ వంటివి) మోచేతిలో నొప్పి, బలంగా డబ్బా మూతలు తెరిచినప్పుడు, బరువులు ఎత్తినప్పుడు
 నిర్ధారణ: ఎక్స్‌రే, ఎమ్మారై, రక్తపరీక్షలు, ఈఎంజీ

హోమియో చికిత్స: హోమియోపతిలో టెన్నిస్ ఎల్బోకి మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. రోగి శారీరక, మానసిక తత్వాన్ని పూర్తిగా విశ్లేషించి, వైద్యులు అందుకు తగిన మందులను సూచిస్తుంటారు. దీనికి సాధారణంగా ఆర్నికా యెన్‌టానా, బెల్లడోనా, బ్రయోనియా, ఫెరమ్ ఫాస్పారికమ్, కాల్మియా ల్యాటిఫోలియా, రస్ టాక్సికోడెన్, రస్‌టాక్సికోడెన్ డ్రావ్, సాన్‌గునేరియా, సల్ఫర్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. వీటితోపాటు ఫిజియోథెరపీ కూడా చేయిస్తే మంచిది. తద్వారా టెన్నిస్ ఎల్బోకి శాశ్వత పరిష్కారం లభిస్తుంది.
 
 డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
 ఎండీ (హోమియో)
 స్టార్ హోమియోపతి
 హైదరాబాద్
 
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్

 నా వయసు 28 ఏళ్లు. నా కళ్లు చిన్నప్పట్నుంచీ పచ్చగా ఉంటాయి. మా దగ్గరలోని డాక్టర్‌కు చూపిస్తే లివర్ ఫంక్షన్ టెస్ట్, అబ్డామినల్ స్కానింగ్ చేయించి, ఎలాంటి సమస్యా లేదని చెప్పారు. పుట్టుకతోనే కళ్లు పచ్చగా ఉన్నాయి. వాటి వల్ల సమస్య ఏమీ ఉండదని చెప్పారు. నిజమేనా? భవిష్యత్తులో ఎటువంటి సమస్యా రాదంటారా?
 - జలజ, ఈ-మెయిల్

 మీరు ‘గిల్‌బర్ట్ సిండ్రోమ్’ అనే వ్యాధితో బాధపడుతున్నారు. ఈ సమస్యతో బాధపడేవారిలో కామెర్ల శాతం పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా జ్వరం వచ్చినప్పుడు కామెర్లు ఎక్కువ అవుతాయి. ఎక్కువ ఒత్తిడికి గురైనప్పుడు, ఉపవాసం చేస్తున్నప్పుడు కామెర్లు ఎక్కువ కావడం, ఆ తర్వాత వాటంతట అవే తగ్గడం జరుగుతుంటుంది. ఒక్కోసారి కామెర్లు 5 ఎంజీ/డీఎల్ వరకూ వెళ్లే ప్రమాదం ఉంది. అయినప్పటికీ దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. ఎలాంటి మందులూ వాడాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులోనూ ఎలాంటి సమస్యా రాదు. కాబట్టి మీరు నిశ్చింతగా ఉండవచ్చు.
 
నా వయసు 35 ఏళ్లు. గత ఆర్నెల్లుగా నాకు కడుపులో మంట, నొప్పి వస్తోంది. ఒక నెల రోజులుగా వాంతులు కూడా అవుతున్నాయి. ఎండోస్కోపీ చేయించుకుంటే చిన్నపేగుల్లో అల్సర్ ఉందని చెప్పారు. నేను ఏదైనా ఆపరేషన్ చేయించుకోవాల్సిన అవసరం ఉందా లేక నా సమస్య మందులతో తగ్గుతుందా తెలియజేయగలరు.
 - సుధాకర్, శ్రీకాకుళం

 మీరు చెప్పిన లక్షణాలు ‘క్రానిక్ డియోడినల్ అల్సర్’ అనే వ్యాధితో బాధపడుతున్నవారిలో కనిపిస్తాయి. ఈ అల్సర్ సాధారణంగా ‘హెలికోబ్యాక్టర్ పైలోరీ’ అనే బ్యాక్టీరియాతో వస్తుంది. దీన్ని పూర్తిగా నశింపజేయడానికి ప్రస్తుతం మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా వాడటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు... ఈ మందుల వల్ల మళ్లీ మళ్లీ అల్సర్ వచ్చే అవకాశాలతో పాటు అల్సర్ వల్ల వచ్చే ఇతర సమస్యలూ తగ్గుతాయి. ఎండోస్కోపీలో చిన్నపేగుల్లోని దారి మూసుకుపోయినట్లయితే ఈ చికిత్స ద్వారా అది తగ్గుతుంది. ఆపరేషన్ అవసరం లేదు. మీరు గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్‌ను కలిసి మందులు వాడితే సరిపోతుంది.
 
డాక్టర్ భవానీరాజు
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్
కేర్ హాస్పిటల్స్
బంజారాహిల్స్
హైదరాబాద్
 
డర్మటాలజీ కౌన్సెలింగ్
నా వయసు 50 ఏళ్లు. నా ఒంటి రంగు గోధుమ వర్ణంలో ఉంటుంది. అయితే గత ఏడాది కాలం నుంచి నా నుదుటి మీద చర్మం నల్లగా మారుతోంది. మందంగా కూడా అవుతోంది. కణతల వద్ద, మెడ మీద, చంకల వద్ద, నడుము దగ్గర ఇలాగే అవుతోంది. ప్రధానంగా చర్మం మడతలు పడ్డ చోట ఇలా జరుగుతోంది. నాకు కొంచెం ఆందోళనగా ఉంది. దయచేసి నాకు తగిన సలహా ఇవ్వండి.
 - సుదర్శన్ రావు, నిడదవోలు

 మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీరు ‘ఆకాంథోసిస్ నైగ్రిక్యాన్స్’ అనే కండిషన్‌తో బాధపడుతున్నారు. ఇది ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ వల్ల జరుగుతున్న పరిణామం. సాధారణంగా స్థూలకాయుల్లో ఇలా జరుగుతుంది. దీన్ని ‘హెచ్‌ఓఎమ్‌ఏ-ఐఆర్’ అనే పరీక్షతో నిర్ధారణ చేయవచ్చు. రక్తంలోని సీరమ్ ఇన్సులిన్ ఎక్కువ కావడం వల్ల దీన్ని నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అలా ఇది రక్త పరీక్షలో బయటపడుతుంది. దీనికి చికిత్స ఈ కింది విధంగా జరుగుతుంది.
 
బరువు తగ్గించుకోవడం  జీవనశైలిని మార్చుకోవడం (అంటే సరైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వేళకు నిద్రపోవడం, ఒత్తిడి తగ్గించుకోవడం  మేని రంగును చక్కబరిచేందుకు మందులు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మేని ఛాయ క్రమంగా మెరుగువుతుంది. ఇందుకోసం పూత మందుగా ఉపయోగించాల్సినవి... ఆర్బుటిన్ - లికోరైస్ - కోజిక్ యాసిడ్   పైన పేర్కొన్న మందులతో పాటు క్లిగ్‌మెన్స్ రెజీమ్ అనే ప్రక్రియను రోజు విడిచి రోజు రాత్రివేళ అమలు పరచాలి.
 
యాభైకు ఎక్కువగా ఎస్‌పీఎఫ్ ఉన్న సన్‌స్క్రీన్‌ను రోజూ ఉదయం తొమ్మిది నుంచి మధ్యాన్నం రెండు వరకు రాసుకుంటూ ఉండాలి.
 ఒంటి లోపలి వ్యవస్థలను చక్కబరచడానికి యాంటీ ఆక్సిడెంట్ మాత్రలు, విటమిన్ సి కాప్స్యూల్  వంటివాటితో పాటు డాక్టర్ సలహా మేరకు మెట్‌ఫార్మిన్ -500ఎంజీ ప్రతిరోజూ వాడాలి.
 
ఇతర ప్రక్రియలు:  ఫీనాల్, టీసీఏ వంటి మందులతో కెమికల్ పీలింగ్ 4 - 6 సెషన్ల పాటు చేయించుకోవాలి  లేజర్ టోనింగ్ కూడా పిగ్మెంట్‌ను తగ్గించడంతో పాటు మందమైన చర్మం మామూలుగా కావడానికి, నలుపు తగ్గడానికి ఉపయోగపడుతుంది.
 
 డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ
 చీఫ్ డర్మటాలజిస్ట్
 త్వచ స్కిన్ క్లినిక్
 గచ్చిబౌలి
 హైదరాబాద్
 

Advertisement

తప్పక చదవండి

Advertisement