స్మార్ట్ కొవ్వొత్తులే ఉద్యమ కాగడాలు | Sakshi
Sakshi News home page

స్మార్ట్ కొవ్వొత్తులే ఉద్యమ కాగడాలు

Published Thu, May 19 2016 12:13 AM

స్మార్ట్ కొవ్వొత్తులే   ఉద్యమ కాగడాలు

స్మార్ట్ ఫోన్! ప్రపంచాన్ని ఫాస్ట్‌గా నడిపిస్తోంది. మంచికీ, చెడుకు కూడా! ఆ చెడును కడిగేయడానికి కూడా మళ్లీ స్మార్ట్ ఫోనే ఉపయోగపడుతోంది. ఒకప్పుడు.. అన్యాయం జరిగిన చోట అక్రందన ఒక్కటే వినిపించేది. ఇప్పుడు ఆ ఆక్రందనకు ప్రతిధ్వనిగా నిరసన గళం విశ్వమంతా వెలుగెత్తుతోంది. ఉద్యమంలా రూపుదాల్చుతోంది. ఆ ప్రతిధ్వని, ఆ నిరసన గళం, ఆ ఉద్యమ గమనం యువతవి. దేశ భవితవి! యువత చేతిలోని ‘స్మార్ట్’ కొవ్వొత్తి.. ఉద్యమ కాగడాలను వెలిగిస్తోంది. సమాజంలోని అవకతవకలను, అవకరాలను, అక్రమాలను, అరాచకాలను, దగాలను, దౌర్జన్యాలను, మిహ ళలపై జరిగే లైంగిక దాడులను, అఘాయిత్యాలను బట్టబయలు చేసి, చట్టసభలను షేక్ చేస్తోంది. టచ్ స్క్రీన్‌పై పైపైన కదిలే చేతి వేలు.. వ్యవస్థలోని లోలోపలి లొసుగుల్ని సైతం చీల్చి చెండాడి, దోషుల మెడలో వేసి,  గుండు కొట్టి, సున్నం వేసి ఊరేగిస్తోంది. ఇదంతా యూత్ పవర్. యూత్ చేతిలోని ‘స్మార్ట్’ వెపన్ పవర్.

 

జాస్మిన్ విప్లవం

ఫేస్‌బుక్ సంచలనాల్లో జాస్మిన్ విప్లవం ఒకటి. ట్యునీషియాలో పురుడు పోసుకుంది. ట్యునీషియాలోని సిది బౌజిద్ అనే ఊళ్లో బౌజిజి అనే 26 ఏళ్ల కుర్రాడు బండి మీద కూరగాయలు అమ్ముకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఓ రోజు దారిలో పోలీసులు అడ్డగించారు. అతడిని వేధించారు. అవమాన భారంతో అప్పటికప్పుడే ప్రభుత్వ అధికార భవనం దగ్గరకు వెళ్లి పెట్రోల్‌తో ఆత్మహుతికి పాల్పడ్డాడు. ఈ వార్త రాత్రికిరాత్రే ఫేస్‌బుక్ ద్వారా ట్యునీషియా యువతకు చేరింది. తెల్లవారే సరికల్లా వేలల్లో జనం ట్యునీషియా వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జైన్ ఎల్ అబిదిన్ బెన్ అలీకి వ్యతిరేకంగా నినాదాలిస్తూ ధర్నాలు, ర్యాలీలు చేపట్టారు. ఆ ర్యాలీలు, ధర్నాలు దాదాపు 28 రోజుల పాటు కొనసాగాయి. చివరకు అధ్యక్షుడు గద్దెదిగక తప్పని పరిస్థితిని కల్పించాయి. 

 
ఈజిప్టు ఉద్యమం

వేల్ గోనిమ్ 29 ఏళ్ల కుర్రాడు. గూగుల్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగి. అనుకోకుండా 2010 జూన్ 8వ తేదీన ఫేస్‌బుక్‌లో ఒక ఫొటో అతడి దృష్టిని కట్టిపడేసింది. అది దవడ ఎముక విరిగి, రక్తమోడుతున్న యువకుడు ఖలేద్ మహమ్మద్ సయ్యద్ ఫొటో. అలెగ్జాండ్రియా నుంచి ఈజిప్టు వచ్చిన  ఖలేద్‌ను ఈజిప్టు పోలీసులు కొట్టి కొట్టి చంపేశారు. హృదయాన్ని పిండేసే ఆ చిత్రాన్ని చూసిన గోనిమ్ ఊరుకోలేకపోయాడు. ఫేస్‌బుక్ పేజీ ఓపెన్ చేసి ఖలేద్ ఫొటో పెట్టి, పోలీసుల అమానుషం మీద కామెంట్ పోస్ట్ చేశాడు. రెండు నిమిషాల్లో 300 మంది తోడయ్యారు. మూడు నెలల్లో ఆ సంఖ్య రెండున్నర లక్షలకు చేరింది. అందరూ కలిసి ఈజిప్టు డౌన్‌టౌన్‌లోని తెహ్రిర్ స్క్వేర్‌లో ర్యాలీ చేశారు. అదో చారిత్రక విప్లవ ప్రదర్శన. దేశాధ్యక్షుడు హోస్నీ ముబారక్ పదవికి రాజీనామా చేసే వరకు అది చల్లారలేదు.

 
విప్లవస్థాయి గల ఈ రెండు ఉద్యమాలకు; మనదేశంలోని నిర్భయ, వేముల రోహిత్ ఘటనల్లోని నిరసన ధ్వనులకు ఊపిరి యువశక్తి, ఆ యువత అందిపుచ్చుకున్న స్మార్ట్ టెక్నాలజీ. ఒకప్పుడు ఉద్యమం ఒకరి నుంచి వంద మందికి.. వంద నుంచి వేలకు.. వేల నుంచి లక్షకు చేరాలంటే కొన్ని వారాలు నెలలు పట్టేది. ఇప్పుడు... స్మార్ట్ ఫోన్‌లో క్షణాల్లో లక్షల మందిని చేరుతోంది. మొన్నటి వికీలీక్స్, నిన్నటి పనామా సమాచారం.. ఆలోచన, ఆవేశం కలగలిసిన యువకుల వల్ల, ఆయుధం లాంటి సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచాన్ని కదిలించిన ఉద్యమాలే.

 
యువ ప్రపంచం

ప్రపంచంలో ఇప్పుడు పాతికేళ్ల వయసులో ఎంత మంది ఉన్నారో తెలుసా? సుమారు 43 శాతం. వీరంతా డిజిటల్ వరల్డ్‌లో అందుబాటులోకి వచ్చిన సామాజిక మాధ్యమాలను నూటికి నూరు శాతం వాడుతున్నారు. ఈ వాడకంతో సమాజానికి ఎంతో మేలు జరుగుతోంది. ఫిలిప్పీన్స్‌లో యువకులు స్కూళ్లలో సమస్యల మీద స్మార్ట్‌గా ఉద్యమాన్ని ప్రారంభించారు. ‘చెక్ మై స్కూల్ ఓఆర్‌జి’ వెబ్‌సైట్ తెరిచారు. తమ తమ స్కూళ్లలో కొరవడిన సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ వివరాలను ఫేస్‌బుక్, ట్విట్టర్‌లలో విశేషంగా వ్యాప్తిలోకి తెచ్చారు. ఇతర స్కూళ్లలో ఏయే వసతులున్నాయి, తమ స్కూల్లో ఏం లేవనేది కూడా తెలుసుకున్నారు. వాటి కోసం ఉద్యమించి సాధించుకుంటున్నారు. తాము చదివి వచ్చిన పాఠశాలల కోసం వారు చేస్తున్న సేవా ఉద్యమం అది.


ఇదే స్మార్ట్ స్ఫూర్తిని.. మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా యువత కొనసాగించాలి. చట్టాలకన్నా, అధికారాల కన్నా, ప్రజా ప్రతినిధులకన్నా శక్తిమంతమైనది యువతరం. ఆ యువతరం అనుక్షణం మహిళలకు, బాలికలకు అండగా ఉండాలి.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement