ఈ సమాజం రచయితలకి, కళాకారులకి స్వర్గం | Sakshi
Sakshi News home page

ఈ సమాజం రచయితలకి, కళాకారులకి స్వర్గం

Published Mon, Oct 3 2016 1:18 AM

ఈ సమాజం రచయితలకి, కళాకారులకి స్వర్గం - Sakshi

‘ప్రాతినిధ్య-2015’ ఆవిష్కరణ సభలో ప్రసంగిస్తున్న గౌతమ్ ఘోష్. చిత్రంలో అస్లాం హసన్, బి.నర్సింగరావు ఉన్నారు. సామాన్య(ఈ సంకలన సంపాదకుల్లో ఒకరు) మా ఇంటికి వచ్చి, తన ‘టీ తోటల ఆదివాసుల కథలు’ పుస్తకం ఇచ్చి, ‘ప్రాతినిధ్య’ ఆవిష్కరణకి రమ్మని కోరింది. నాకు తెలుగు సాహిత్యం పట్ల సంపూర్ణ అవగాహన లేకపోయినప్పటికీ, కొంత తెలుసు. ‘మా భూమి’ నా మొదటి సినిమా. తెలంగాణ అంటే ఎనలేని అభిమానం. ఆ రోజుల్లో నేను శ్రీశ్రీ, గోపీచంద్ మొదలైన రచయితల రచనలు చదివాను. అయితే, ఎక్కువగా అనువాదాలు చదివాను. తెలుగు సాహిత్యం సంపన్నమైనది. చలనశీలమైన ఈ సమాజంలో జరుగుతున్న మార్పులను రచయితలు రికార్డు చేస్తున్నారు.
 
 మనదేశంలో ఏకకాలంలో అనేక శతాబ్దాలు సహజీవనం చేస్తున్నాయి. ఇదే విషయాన్ని విచక్షణ కలిగిన యూరోపియన్లు కూడా పేర్కొన్నారు. మీరు యాత్రాస్థలాలకి వెళితే, అనేక పురాతన విశ్వాసాలతో మనుష్యులు కనిపిస్తారు. అవే విశ్వాసాలు ఈ దేశ అత్యాధునికులకి అప్రాసాంగికం కావొచ్చు. ఈ భారతీయ సమాజంలో అనేక పొరలు ఉన్నాయి. అందువలన ఈ సమాజం రచయితలకి, కళాకారులకి స్వర్గం వంటిది.
 
 ఈ ప్రాతినిధ్య సంకలనంలో మహిళల, దళితుల, ముస్లింల కథలు ఎక్కువగా ఉండటం సంతోషకరమైన విషయం. ఈ దేశ సబ్బండవర్ణాల అస్తిత్వం ఘనమైనది. అది ఇంకా ఎక్కువగా సాహిత్యంలో ప్రతిఫలించాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత అభివృద్ధి నమూనాలో ఎక్కువగా బాధితులు కూడా ఈ వర్గాలే. అది కూడా సాహిత్యంలో ఇంకా ఎక్కువగా రావాలి.

రచయితలు మన సమాజాన్నీ, చరిత్రనీ, సంస్కృతినీ, అంతః బాహ్య చేతనలనీ రికార్డు చేస్తారు. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా అసహనం పెరుగుతున్నది. మత అసహనం, సాంస్కృతిక అసహనం, రాజకీయ అసహనం పెరుగుతున్న ఈ తరుణంలో రచయితలు ముందుకు వచ్చి మార్గనిర్దేశనం చేయవలసిన అవసరం ఉన్నది. అయితే, శక్తిమంతమైన మూలాలు ఉన్న మన సమాజం ఈ అసహనాన్ని సమర్థవంతంగా ఎదుర్కోగలదు. అయితే, రచయితలు, కళాకారులు ఈ విషయంలో క్రియాశీల భూమిక నిర్వర్తించాల్సిన అవసరం ఉంది.
 (‘‘తెలుగులో మళ్లీ కచ్చితంగా సినిమా తీస్తాను. అవకాశం ఉంటే, ‘అంటరాని వసంతం’ని తెరకెక్కిస్తా’’నని సభానంతర సంభాషణలో చెప్పారు ఘోష్.)
  (సెప్టెంబర్ 25న ‘ప్రాతినిధ్య-2015’ ఆవిష్కరణ సభలో దర్శకుడు గౌతమ్ ఘోష్ చేసిన ప్రసంగం. పాఠం: జి.కిరణ్ కుమార్)

Advertisement
Advertisement