బాబుకు తరచూ కడుపునొప్పి... ఏం చేయాలి? | Sakshi
Sakshi News home page

బాబుకు తరచూ కడుపునొప్పి... ఏం చేయాలి?

Published Thu, Aug 29 2013 12:17 AM

బాబుకు తరచూ కడుపునొప్పి... ఏం చేయాలి?

మా అబ్బాయి వయసు ఆరేళ్లు. కొన్ని నెలలుగా వాడికి తరచు కడుపు నొప్పి వస్తోంది. డాక్టర్లకు చూపించాం. కొన్ని పరీక్షలు చేసి అన్నీ నార్మల్‌గానే ఉన్నాయంటున్నారు. అయితే స్కాన్‌లో కొన్ని లింఫ్‌గ్రంథులు పెద్దవి అయినట్లుగా రిపోర్టులో వచ్చిందని చెప్పారు. మా బాబు విషయంలో ఆందోళనగా ఉంది. వాడికి ఉన్న సమస్య ఏమిటి? మాకు సరైన సలహా ఇవ్వండి.
 - రాజ్యలక్ష్మి, తుని

 
 మీ బాబు రికరెంట్ అబ్డామినల్ పెయిన్ అనే సమస్యతో బాధపడుతున్నట్లు చెప్పవచ్చు. పిల్లల్లో తీవ్రమైన కడుపునొప్పి తరచూ వస్తూండటానికి చాలా కారణాలు ఉంటాయి. కడుపుకు సంబంధించిన రుగ్మతలు, లివర్‌కు సంబంధించిన రుగ్మతలు, మూత్ర విసర్జన వ్యవస్థకు సంబంధించిన సమస్యలు, కొన్ని సందర్భాల్లో కొన్ని విషాలు శరీరంలో వ్యాపించడం (పాయిజనింగ్), శారీరక  జీవవిధులు (మెటబాలిక్ ఫంక్షన్స్), మానసిక సమస్యల వల్ల కడుపునొప్పి  రావచ్చు.
 
 మీ బాబు విషయంలో పరీక్షలు చేసి, అవన్నీ నార్మల్‌గా ఉన్నాయని చెప్పారు కాబట్టి పైన పేర్కొన్న అంశాలు అతడి కడుపునొప్పికి కారణం కాకపోవచ్చు. ఇక రిపోర్ట్స్‌లో లింఫ్‌నోడ్స్ పెరిగినట్లుగా రాశారు. కాబట్టి అతడి సమస్యను మిసెంట్రిక్ లింఫెడినైటిస్‌గా చెప్పవచ్చు. కడుపులో ఏవైనా ఇన్ఫెక్షన్స్ (అబ్డామినల్ ఇన్ఫెక్షన్స్) వచ్చినప్పుడు, అక్కడి కణజాలం ఏదైనా ఇన్ఫెక్షన్‌తో పోరాడుతున్నప్పుడు ఇలా గ్రంథుల సైజ్ పెరుగుతుంది. అంతేకాదు... గొంతు, కడుపు, కిడ్నీకి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, అపెండిసైటిస్‌లో కూడా లింఫ్ గ్రంథుల సైజ్  పెరుగుతుంది. ఈ పరిస్థితి రెండు నుంచి పదేళ్ల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మధ్యమధ్యన ఎలాంటి లక్షణాలూ కనిపించకుండా ఉండటం, మందులు వాడగానే నొప్పి తగ్గడం వంటివి చూస్తుంటే దీన్ని నాన్-స్పెసిఫిక్ లింఫెడినోపతిగా చెప్పవచ్చు. అంటే ఇది అంత తీవ్రమైనది కాదని తెలుస్తోంది. అయితే చాలా అరుదుగా ట్యూబర్క్యులోసిస్ ఉన్నప్పుడు కూడా గ్రంథులు పెద్దవి కావచ్చు. అయితే అలాంటి పిల్లల్లో దీనితో పాటు మరికొన్ని లక్షణాలు కూడా కనిపిస్తాయి.
 
 మీ అబ్బాయికి మరికొన్ని రోజులు ఆగి మరోసారి స్కాన్ తీసి చూడాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మీ అబ్బాయి సమస్య తీవ్రతను అంచనా వేయడం మంచిది. దాదాపు 80 శాతం నుంచి 90 శాతం పిల్లల్లో ఆ గ్రంథుల సైజ్ దానంతట అదే తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే సీటీ స్కాన్, అవసరమైన సందర్భాల్లో వాటి బయాప్సీ చేసి వాటి పెరుగుదలకు కారణం ఏమిటో చూడవచ్చు. ఈలోపు మీ బాబుకు మీ డాక్టర్ సలహా మేరకు నొప్పినివారణ మందులు వాడితే సరిపోతుంది.
 
 అయితే ఎవరికైనా సరే... నొప్పి లేకుండా గ్రంథుల పరిమాణం 20 మిల్లీమీటర్ల కంటే ఎక్కువైతే మరిన్ని పరీక్షలు అవసరమవుతాయి. అలాంటప్పుడు మరింత తీవ్రమైన, దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితి కావచ్చు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మీరు మీ పిడియాట్రీషియన్ ఆధ్వర్యంలో మీ బాబుకు తగిన చికిత్స చేయించుకోండి.
 
 డాక్టర్ రమేశ్‌బాబు దాసరి
 పీడియాట్రీషియన్,
 స్టార్ హాస్పిటల్స్, హైదరాబాద్

 

Advertisement
Advertisement