కారం... ఉప్పూ... కల్చర్ | Sakshi
Sakshi News home page

కారం... ఉప్పూ... కల్చర్

Published Fri, Feb 6 2015 10:59 PM

కారం... ఉప్పూ...  కల్చర్

తెలుగు రాష్ట్రాల్లోనైనా, తమిళ క న్నడాల్లోనైనా.. బెండ బెండలానే ఉంటుంది. వంగ వంగలానే ఉంటుంది. మునక్కాడలూ అంతే. మరి టేస్ట్ ఎక్కడ వస్తుంది? కారం, ఉప్పుతో పాటు ఎవరి కల్చర్‌ని వారు జోడిస్తారు కదా. అక్కడ!  ఈవారం మనం మదురై పద్ధతిలో వండేద్దాం రండి...
 
పకోరా కర్రీ
 
కావలసినవి: సెనగ పప్పు - అర కప్పు; ఎండు మిర్చి - 4; మెంతులు - టీ స్పూను; ఉప్పు - తగినంత; నూనె - డీప్ ఫ్రైకి సరిపడా
 గ్రేవీ కోసం...: ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; వెల్లుల్లి తరుగు - 2 టీ స్పూన్లు; పచ్చి మిర్చి తరుగు - టీ స్పూను; ధనియాల పొడి - టేబుల్ స్పూను; కారం - టీ స్పూను; నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు - తగినంత; కొత్తిమీర తరుగు - 2 టేబుల్ స్పూన్లు

 పోపు కోసం: దాల్చినచెక్క పొడి - పావు టీ స్పూను; లవంగాలు - 2; ఏలకుల పొడి - టీ స్పూను; బిర్యానీ ఆకు - 2; మెంతులు - టీ స్పూను; కరివేపాకు - 2 రెమ్మలు

 గ్రైండింగ్ కోసం:  గసగసాలు - టీ స్పూను; కొబ్బరి తురుము - 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు - 8; వేయించిన సెనగ పప్పు - టేబుల్ స్పూను

తయారీ:  సెనగపప్పు సుమారు రెండు గంటలు నానిన తర్వాత నీళ్లు ఒంపేసి, ఎండు మిర్చి, మెంతులు, ఉప్పు జత చేసి మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా మిక్సీ పట్టాలి  బాణలిలో నూనె కాగాక, ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న పకోడీలలో వేసి వేయించాలి   గ్రైండ్ చేయడానికి చెప్పిన పదార్థాలకు కొద్దిగా నీళ్లు చేర్చి, మిక్సీలో వేసి
 
మెత్తగా ముద్దలా చేసి పక్కన ఉంచాలి  బాణలిలో నూనె కాగాక పోపు సామాన్లు ఒక దాని తరవాత ఒకటి వేసి వేయించాలి  ఉల్లి తరుగు, టొమాటో తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి తరుగు వేసి బాగా వేయించి సుమారు ఐదు నిమిషాలు టొమాటోలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి  మెత్తగా తయారుచేసి ఉంచుకున్న ముద్ద జత చేసి బాగా కలిపి ఐదు నిమిషాలు ఉడికించాలి  ఐదు కప్పుల నీళ్లు, కారం, పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి మంట కొద్దిగా తగ్గించి, ఉడికించాలి  వేయించి ఉంచుకున్న పకోరాలను జత చేసి మూత ఉంచాలి. (మధ్యలో ఏ మాత్రం కలపకూడదు) సుమారు ఐదు నిమిషాలయ్యాక దించేసి కొత్తిమీరతో అలంకరించి వడ్డించాలి.
 
ఆలూ మటర్
 
కావలసినవి: బంగాళదుంపలు - 1 (ఉడికించి తొక్క తీసి పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి); ఉల్లి తరుగు - అర కప్పు; టొమాటో తరుగు - అర కప్పు; కారం - రెండున్నర టీ స్పూన్లు; ధ నియాల పొడి - ఒకటిన్నర టీ స్పూన్లు; పసుపు - అర టీ స్పూను; గరం మసాలా పొడి - అర టీ స్పూను; నూనె - ఒకటిన్నర టీ స్పూన్లు; జీడిపప్పులు - 5; ఉడికించిన బఠాణీ - కప్పు; ఉప్పు - తగినంత; కసూరీ మేథీ - టీ స్పూను; కొత్తిమీర - కొద్దిగా

తయారీ:  బాణలిలో నూనె కాగాక ఉల్లి తరుగు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాక, టొమాటో తరుగు వేసి మెత్తగా అయ్యేవరకు ఉంచాలి  అన్ని మసాలా పొడులు, ఉప్పు వేసి బాగా వేయించి చల్లారాక, వీటికి జీడిపప్పు జత చేసి మిక్సీలో వేసి మెత్తగా చేసి ఉడుకుతున్న టొమాటో మిశ్రమంలో వేసి కలపాలి  బఠాణీలు, బంగాళదుంప ముక్కలు వేసి మంట బాగా తగ్గించి కొద్దిసేపు ఉంచాలి  చివరగా కసూరీ మేథీ, కొత్తిమీరలతో అలంకరించి అందించాలి.
 
మునగ కాడ  వంకాయ పులుసు
 
కావలసినవి: టొమాటో తరుగు - అర కప్పు; వంకాయ తరుగు - అర కప్పు; మునగకాడ ముక్కలు - 10; చిన్న ఉల్లి పాయలు - 10; వెల్లుల్లి రేకలు - 4 (కచ్చాపచ్చాగా చేయాలి); ఎండు మిర్చి - 2  (ముక్కలు చేయాలి); సాంబారు పొడి - 2 టీ స్పూన్లు; చింతపండు - కొద్దిగా (నీళ్లలో నానబెట్టి గుజ్జు తీయాలి); కాచిన పాలు - అర కప్పు  పోపు కోసం: నువ్వుల నూనె - 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు - టీ స్పూను; జీలకర్ర - టీ స్పూను; మెంతులు - అర టీ స్పూను; ఇంగువ - చిటికెడు; కరివేపాకు - రెండు రెమ్మలు

 తయారీ:  బాణలిలో నువ్వుల నూనె వేసి కాగాక పోపు సామాను ఒక్కటొక్కటిగా వేసి వేయించాలి  ఎండుమిర్చి, వెల్లుల్లి రేకలు జత చేసి వేయించాలి  ఉల్లి తరుగు జత చేసి వేగాక, టొమాటో తరుగు వేసి బాగా కలిపి, అన్నీ ముద్దలా అయ్యేవరకు ఉడికించాలి. సాంబారు పొడి , ఉప్పు వేసి బాగా కలిపాక మునగకాడ ముక్కలు, వంకాయ ముక్కలు వేసి బాగా వేయించాలి  చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు జత చేసి ముక్కలన్నీ మెత్తగా అయ్యేవరకు సుమారు ఆరేడు నిమిషాలు ఉడికించాలి  పాలు జత చేసి రెండు మూడు నిమిషాలు ఉంచాక, కరివేపాకు వేసి ఒక సారి కలిపి దించేయాలి.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement