పాల మనసులు | Sakshi
Sakshi News home page

పాల మనసులు

Published Mon, Feb 5 2018 12:27 AM

Special Newborn Care Unit - Sakshi

ఆ పాపకు అమ్మ లేదు. వారంత అమ్మ అయ్యారు. నాన్న విడిచి పెట్టాడు. అక్కడి సిబ్బందే నాన్న అయ్యారు. అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు ముఖ్యం. వెచ్చని ఒడి ముఖ్యం. దగ్గరకు తీసుకునే భద్రత అవసరం. అవన్నీ వారే అయ్యారు. సంవత్సరం పాటు కంటికి రెప్పలా కాపాడిన వారి మనసులో ఉన్నది స్వచ్ఛమైన పాల వంటి కరుణ. కష్టాల కడలిలో ఉండాల్సిన పాపను పాల కడలిపై ఉంచినగొప్ప మనసులు వారివి.


ఆసుపత్రికి అంటే చాలా సందర్భాల్లో నిర్లక్ష్యానికీ, నిర్దాక్షిణ్యానికి మారుపేరు అనే ప్రచారం ఉంది. కాని ఆ ఆసుపత్రి గురించి వింటే ముఖ్యంగా అందులోని ఆ విభాగం గురించి తెలుసుకుంటే కరుణ ఇంకా మనిషిలో మిగిలే ఉందనీ మానవత్వం సజీవంగా ఉందని తెలుసుకుంటాం. నల్లగొండ ప్రభుత్వాసుపత్రిలోని ‘స్పెషల్‌ న్యూబోర్న్‌ కేర్‌ యూనిట్‌’ (ఎస్‌.ఎన్‌.సి.యు) గత సంవత్సరంగా ఒక పాపాయిని తన యూనిట్‌లో కంటికి రెప్పలా కాపాడుతోంది. పెంచి పెద్ద చేస్తోంది. ఊపిరి పోసి, ఉయ్యాలలూపి నేడు  ప్రభుత్వానికి అపురూపంగా అప్పజెప్పనుంది. ఇది మానవత్వానికి మెచ్చుతునక.

ఆ తల్లి ఆ బిడ్డ...
ఏడాది క్రితం... నల్లగొండ జిల్లా చిట్యాల మండలానికి చెందిన అనురాధ కాన్పుకోసం  నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. 2017 ఫిబ్రవరి 2న  కవలలకు జన్మనిచ్చింది. ఇద్దరు ఆడశిశువులు. కాని ప్రిమెచ్యూర్‌ డెలివరీ కావడంతో శిశువులు తక్కువ బరువుతో  జన్మించారు.

మరుసటిరోజు ఒక ఆడశిశువు మరణించగా, మూడవ రోజున తల్లి కూడా రక్తస్రావంతో చనిపోయింది. ప్రాణంతో ఉన్న శిశువును తండ్రి విడిచి పెట్టి వెళ్లిపోయాడు.  900 గ్రాముల బరువుతో అన్ని రకాల ఆరోగ్య సమస్యలు ఉన్న ఆ చిన్నారిని వేరే ఎక్కడైనా అయితే ఎలా చూసేవారో. కాని ఆ  చిన్నారికి మాత్రం ఎస్‌.ఎన్‌.సి.యునే అన్నీ అయ్యింది.

నవీనగా నామకరణం
పాప ఆరునెలల వయసుకు మూడు కిలోల బరువుకు చేరుకుంది. ఆరునెలల తరువాత ఆరోగ్యంగా ఉంటే ఆ చిన్నారిని శిశు గృహాలకు అప్పగించే అవకాశం ఉంటుంది. కానీ చిన్నారికి చిన్నచిన్న ఆరోగ్య సమస్యలు ఉండటం ఒక కారణమైతే  చిన్నారిపై పెంచుకున్న మరో కారణం కావడాన యూనిట్‌ నర్సులు, సిబ్బంది పాపను పంపించలేకపోయారు.

అంతేకాదు చిన్నారికి నామకరణ మహోత్సవాన్ని నిర్వహించి నవీనగా నామకరణం చేశారు. డోలారోహణ కార్యక్రమాన్ని నిర్వహించి తొట్టెను ఏర్పాటు చేసి అందులో ఊపారు. అన్నప్రాసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. చిన్నారి నవీనకు ప్రతి రోజూ ఒకరు చొప్పున ఆహారం, కోడిగుడ్డును తీసుకువచ్చి అందజేస్తున్నారు.

ప్రస్తుతం నవీన వయసు ఏడాది
ప్రస్తుతం నవీనకు ఏడాది వయసు వచ్చింది. ఏడు కిలోల బరువుతో సంపూర్ణ ఆరోగ్యంతో  ఉంది. వాకర్‌లో  యూనిట్‌ మొత్తం తిరుగుతుండటంతో సిబ్బంది ఆనందాలకు అవధులు లేకుండా ఉన్నాయి. దాంతోపాపను ‘శిశుగృహ’కు అప్పగించడానికి ఏర్పాట్లు చేశారు.

పాపతో అనుబంధం వల్ల ఇది కొంచెం బాధించే విషయమే అయినా పాప భవిష్యత్తు రీత్యా తప్పడం లేదని యూనిట్‌ నోడల్‌ అధికారి డాక్టర్‌ దామెర యాదయ్య, వైద్యులు డాక్టర్‌ జిలాని, డాక్టర్‌ ప్రభాకర్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ అంబేడ్కర్, డాక్టర్‌ వసుంధర, డాక్టర్‌ శ్రీకాంత్‌రెడ్డితో పాటు నర్సింగ్‌ సిబ్బంది పేర్కొన్నారు.
– ఆవుల లక్ష్మయ్య, సాక్షి ప్రతినిధి, నల్లగొండ టౌన్‌


తల్లి కంటే మిన్నగా...
చిన్నారిని కాపాడుకోవడానికి రంగంలో దిగిన ఎస్‌.ఎన్‌.సి.యు సిబ్బంది పాపకు ఆధునిక వైద్యసేవలను అందించారు. 70 రోజులు కంటికి రెప్పలా కాపాడితే బరువు 1కిలో 200 గ్రాములకు వచ్చింది. చిన్నారికి  డోనర్‌ ద్వారా సేకరించిన పాలు, ఫార్ములా ఫీడ్‌ను ఆహారంగా అందించారు. ఇక నెలలు నిండని, బరువు తక్కువ చిన్నారులకు ‘కంగారూ మదర్‌ కేర్‌’ (కేఎంసీ) పద్ధతిన ట్రీట్‌మెంట్‌ను అందించాలి. 

చిన్నారిని తల్లి ఎదపై బోర్లా పడుకోబెట్టుకుని వెచ్చదనాన్ని అందించే విధానాన్ని ‘కంగారూ మదర్‌కేర్‌ ట్రీట్‌మెంట్‌’ అంటారు. అయితే చిన్నారికి తల్లికాని, బంధువులుకాని లేకపోవడంతో అద్దెతల్లిని తీసుకున్నారు. చర్లపల్లికి చెందిన సరిత అనే మహిళ చిన్నారికి మూడు నెలల పాటు కేఎంసీ ట్రీట్‌మెంట్‌ను అందించి తన మానవత్వాన్ని చాటుకుంది.  కేఎంసీకి అద్దెతల్లులను వినియోగించడం దేశ చరిత్రలోనే మొదటిదని యూనిట్‌ పేర్కొంటుంది.

Advertisement
Advertisement