Sakshi News home page

ధన్యవాదాలు మిత్రమా

Published Thu, Jan 18 2018 12:46 AM

special story on Karnataka CM Ramakrishna Hegde - Sakshi

1980ల నాటి మాట. తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.జి.రామచంద్రన్‌. కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే. రెండు రాష్ట్రాల మధ్య కావేరీ జలాల వివాదం. అప్పటికే వందేళ్ల వివాదం అది! కావేరీ కర్ణాటకలో పుట్టింది. ఆ నీళ్లను దిగువన ఉన్న తమిళనాడు వాడుకుంటుండటంతో వివాదం పుట్టింది. రామచంద్రన్, రామకృష్ణ.. ఇద్దరు రాముళ్లు. రెండూ రామరాజ్యాలు. ప్రజలు కోరింది కాదనలేనివారే ఇద్దరూ. ప్రజలకు ఇష్టం లేనిది చేయలేనివారే ఇద్దరూ. 

‘నీళ్లు కావాలి’ అంటోంది తమిళనాడు. ‘ఇచ్చేది లేదు’ అంటోంది కర్ణాటక. నీళ్లు తెమ్మని రామచంద్రన్‌ మీద, నీళ్లివ్వొద్దని రామకృష్ణ హెగ్డే మీద ఒత్తిడి పెరుగుతోంది. ఎన్ని ఒత్తిళ్లున్నా ప్రజల్ని పొత్తిళ్లలో పెట్టుకుని చూడడం నాయకుల లక్షణం. ఓ ఉదయం రామచంద్రన్‌ అకస్మాత్తుగా బెంగళూరులోని రామకృష్ణ హెగ్డే ఇంటి ముందు దిగారు. రామచంద్రన్‌ వస్తున్నట్లు హెగ్డేకు కనీసం కబురు కూడా లేదు! హెగ్డే ఆశ్చర్యపోయారు. ‘‘రండి.. మిత్రమా’’ అని నవ్వుతూ రామచంద్రన్‌ను ఆహ్వానించారు. 

అల్పాహారం సిద్ధం అయింది. నాయకులిద్దరూ ఆహ్లాదంగా మాట్లాడుకుంటూ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకుంటున్నారు. ‘‘పదార్థాలు రుచిగా ఉన్నాయి మిత్రమా’’ అన్నారు రామచంద్రన్‌. అలా అంటుండగానే ఆయనకు  వెక్కిళ్లు మొదలయ్యాయి. వెంటనే హెగ్డే మంచినీళ్ల గ్లాసు అందించారు. 

‘‘ధన్యవాదాలు మిత్రమా.. నా ప్రజలకు కూడా వెక్కిళ్లు వస్తున్నాయి. వాళ్లక్కూడా నీళ్లు అందివ్వగలవా?’’.. అడిగారు రామచంద్రన్‌. 

పెద్దగా నవ్వి, రామచంద్రన్‌ భుజం తట్టారు హెగ్డే. 

రామచంద్రన్‌ చెన్నై వెళ్లిపోయారు. ఆ మధ్యాహ్నం బ్రేకింగ్‌ న్యూస్‌! ‘కర్ణాటక రిలీజెస్‌ కావేరీ వాటర్‌ టు తమిళనాడు’. మీడియా కార్యాలయాలలో టెలీప్రింటర్‌లు ఆ రోజంతా టపటపమని ఊపిరి సలపకుండా కొట్టుకుంటూనే ఉన్నాయి.

రౌండ్‌ టేబుళ్లే కాదు, కొన్నిసార్లు డైనింగ్‌ టేబుళ్లు కూడా ప్రజా సమస్యల్ని పరిష్కరిస్తాయి. ‘తగ్గే’ చొరవ ఆ లీడర్‌లో ఉండాలంతే. (నిన్న.. జనవరి 17 ఎం.జి.రామచంద్రన్‌ జయంతి). 
– మాధవ్‌ శింగరాజు
 

Advertisement

తప్పక చదవండి

Advertisement