Sakshi News home page

ఉప్పు...నిప్పు

Published Mon, Aug 8 2016 11:17 PM

ఉప్పు...నిప్పు - Sakshi

ఒక కష్టం వస్తే... తీరే దారి కోసం చూస్తారు
ఆ కష్టాన్ని తీర్చే వారి కోసం చూస్తారు
కష్టాన్ని కాల్చేసే నిప్పులాంటి మంత్రం కోసం వెదుకుతారు
అందుకే... నిప్పుల మీద నడిచే మంత్రగాడే దిక్కనుకున్నారు
కష్టాల పెనం మీద నుంచి తప్పిస్తాడనీ అనుకున్నారు
కానీ... అతగాడు... ద్వేషం అనే నిప్పుల్లోకి తోసేశాడు
నాణేనికి రెండువైపులూ తెలిసిన మాయగాడతడు ఊరిని రెండుగా చీల్చాడు
ఒకరికి బొమ్మ చూపించాడు ఒకరికి బొరుసు చూపించాడు
ఊరిని ఉప్పు - నిప్పులా కణకణ మండించాడు

‘‘అయ్యో... అయ్యో! ఎంత ఘోరం!! అయినా గట్టిగా ఉన్న మనిషి పిట్టపిడుగున పోయాడు పాపం’’ సుందరయ్య పార్థివ దేహాన్ని చూస్తూ నొచ్చుకున్నది వరలక్షమ్మ.

 ‘‘పొద్దున పొలానికి మా ఇంటి ముందు నుంచే పోతూ నన్ను పలకరించాడొదినా. ఇంతలో మనిషిని ఇలా చూడాల్సి వచ్చింది’’ రమణమ్మ మాటల్లో ఆవేదన.

 ‘‘కాలువ మళ్లించి వస్తానని వెళ్లాడు’’ అంటూ కన్నీరు మున్నీరవుతోంది సుందరయ్య భార్య ఈశ్వరమ్మ. ఇంటి బయట మగవాళ్లు ఉత్తరక్రియల ఏర్పాట్లలో ఉన్నారు. అంతుబట్టని మరణం అని సరిపెట్టుకున్నారు కొడుకులిద్దరూ. తండ్రితో అనుబంధాన్ని దేవుడు అంతవరకే రాశాడని కళ్లు తుడుచుకున్నది కూతురు. అల్లుడు దగ్గరుండి ఇంట్లో వాళ్లకు ధైర్యం చెబుతున్నాడు. దశదిన కర్మలు పూర్తయ్యాయి. గుండెల్లో గూడు కట్టుకున్న బాధను అదిమి పెట్టుకుని డైలీ రొటీన్‌కు సిద్ధమవుతున్నారు సుందరయ్య భార్యాపిల్లలు. అయితే... సుందరయ్య మరణం ఇంటికే కాదు ఊరంతటికీ మానని గాయంగా మారుతుందని ఎవరూ ఊహించలేదు.

 ‘‘నిజమేనా రమణమ్మా! నువ్వు వాళ్లింటికి వెళ్తుంటావుగా! పాపం సుందరయ్యకు చేతబడి చేశార్ట. అందుకే పోయాడంటున్నారు’’ గుసగుసగా అడిగింది పద్మావతి.

 ‘‘ఏమోనమ్మా. అప్పుడెప్పుడో కోటయ్యకి- సుందరయ్యకి పొలం గట్ల తగాదా ఉండేది. పంటలు పెట్టాక ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారాయె. అయినా కోటయ్య అంత పాపానికి ఒడిగట్టి ఉంటాడా? ఆ... కొడుకులు అంతటి కాలాంతకులే మరి’’ అంటూ ఆశ్చర్యపోతూనే సమాచారకథనాన్ని చిక్కబరిచింది రమణమ్మ. రెండో రోజు సాయంత్రానికి సుందరయ్య చేతబడి వల్లనే పోయాడని ఊరంతా గుప్పుమంది.

 ప్రతీకారపు రంకెలు!
మంత్రగాడి ముందు దీనంగా కూర్చుని ఉంది ఈశ్వరమ్మ. పక్కనే కొడుకులు. ‘‘ఎవరైనా ఊరికే ఎందుకు చేయిస్తారు. వినాశం కోరుకునే వాళ్లే చేయిస్తారు. రోగాన పడి కోలుకునే చేత కూడా కాదది. ఏకంగా మనిషిని రక్తం కక్కించి ప్రాణం పీల్చుకునే చేతబడి చేశారు’’ ఆజ్యం పోశాడు మంత్రగాడు. పెద్ద కొడుకులో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. ఈశ్వరమ్మ కొడుకు భుజం మీద చేయి వేసింది తొందర పడకూడదన్నట్లు.

నిప్పుల నడకలో ట్రిక్కు!
పాదం చర్మం మందంగా ఉంటుంది. నిప్పు మీద కాలు పెట్టిన వెంటనే కాలదు. చర్మం కాలడానికి కొన్ని సెకన్ల సమయం పడుతుంది. ఈ లోపు అడుగు తీసేస్తాం. నిప్పు వేడి చర్మాన్ని కాల్చేలోపే అడుగు తీసేస్తామన్నమాట. అయితే కాలి పిక్కలకు తగిలే వేడిని భరించగలగాలి. అది ప్రాక్టీస్‌తో వస్తుంది.






ఒక్క సుందరయ్య ఇల్లే కాదు. ఊరిలో ప్రతి ఒక్కరికీ ఏదో ఓ సమస్య. తమ మీద ఎవరో కుట్ర పన్నారనే ఆందోళన. ఎవరనే అన్వేషణతో ఒకరి మీద మరొకరికి ఈర్షాసూయలు చాపకింద నీరులా పాకిపోయాయి. కనిపిస్తే కత్తులు దూసుకునేటంత కోపంగా ఉంటున్నారు.

 ‘‘రమణమ్మా! మనం అనుకున్నది నిజమే. స్వాములోరు కూడా అదే చెప్పార్ట. ఇంకేం అనర్థం వస్తుందోనని ఈశ్వరమ్మ కంటికి మింటికి ఏకధారగా ఏడుస్తోంది. ఆ పిల్లాడేమో తిరుగుబడి చేయిస్తానని రంకెలు వేస్తున్నాడు’’ అన్నది పద్మావతి.

 ‘‘అయినా ఒకూళ్లో ఉండేటోల్లం. ఇట్లా చేసుకుని ఏం బావుకుంటారో’’ అన్నది పద్మావతి ఒకింత బాధగా.

 నిప్పులు కురిసే ఆగ్రహం!
ఇదేమీ రెండు వర్గాల పోరు కాదు. ఒక కుటుంబం వాళ్లు ఫలానా కుటుంబం పట్ల ద్వేషంతో రగిలిపోతుంటే, మరొకరు వాళ్లకు అనుమానం ఉన్న వాళ్ల మీద కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒకరికొకరు ఎదురుపడితే కళ్లలో నిప్పులు కురిపించుకుంటున్నారు. వెరసి గ్రామంలో ఎవరూ నిశ్చింతగా జీవించడం లేదు.

ఊరు ఎందుకలా మారింది?
మంత్రగాడి దగ్గరకు వచ్చిన వాళ్లు తమ కష్టాలను చెప్పుకున్నప్పుడు... ‘మీ మీద కోపంతో ఉన్న వారెవరో మీ మీద చేతబడి చేయించారు. అందుకే మీ ఇంట్లో ఇన్ని కష్టాలు వచ్చాయి. మీ కష్టాలు తొందరగా తీరిపోవాలంటే వారి మీద తిరిగి చేతబడి చేయవచ్చు. లేదంటే మీరు శాంతి పూజలు చేయించుకుంటూ ఉంటే మెల్లగా కష్టాలు పోతాయి’ వంటి మాటలతో నమ్మించేవాడు. నీ శత్రువుల ఆటకట్టించి నీ చుట్టూ తిరిగేలా చేస్తానని ఒకరిని, నీ మీద చేతబడి జరిగింది తిరుగుబడి చేయాలని మరొకరిని నమ్మించేవాడు. ఊరి వాళ్లను మానసికంగా విడగొట్టి పూజలు, దక్షిణ పేరుతో డబ్బు గుంజుతూ హాయిగా బతికేసేవాడు. స్వామివారు(మంత్రగాడు) చెప్పినట్లు చేయకుండా ఎదురు ప్రశ్నిస్తే అనర్థాలు జరుగుతాయని శిష్యగణం భజన మరో వైపు. ఈ డ్రామాకు తెరపడడానికా అన్నట్లు ఓ రోజు సుందరయ్య కొడుకు కోటయ్య మీద దాడి చేశాడు. కోటయ్య కొడుకు అదే స్థాయిలో సవాల్ చేయడంతో దావానలం బహిర్గతమైంది.

కొమ్ములు తిరిగిన కోపం!
‘‘పొద్దున సాములోరి దగ్గరకు వెళ్లిన. పెద్ద బావ చేతబడి చేయించడంతోనే మన బర్రె చచ్చిపోయిందంట. మన ఇంటిని ఇంకా పీడ పట్టి పీడిస్తూనే ఉందంట’’ భర్తతో చెప్పింది నూకాలమ్మ. ‘‘దాని పాడితోనే ఇంటిని వెళ్లబార్చిన. అది పోయిన కాణ్నించి చేతిలో రూపాయాడడం లేదు...’’ స్వగతంగా అనుకుంటోంది.
భర్తలో ఆమె కోరుకున్న ప్రతిస్పందన కనిపించకపోవడంతో గొంతు పెంచి... ‘‘వాళ్లకు తగ్గ శాస్తి జరగాలి, తిరుగు తిరుగుబడి చేయిద్దాం’’ అన్నది కసిగా.

‘‘మా అన్న అట్లా చేయడు. నువ్వూరుకో. ఈ మాట ఎక్కడా అనకు’’ అన్నాడామె భర్త మందలింపుగా.

‘‘అంతా నీకు మల్లేనే ఉంటారా? అన్న చేయకపోతే వదిన చేయదా? పెళ్లయినప్పటి నుంచి చూస్తున్నా...  మీ వదినకు నా మీద కొరకొరే ఆమె పుట్టింటికంటే కలిగిన ఇంటి నుంచి వచ్చాగా మరి’’ భర్తను కసురుకుంటూ తన వాదనను సమర్థించుకుంటోంది. ఇక భర్తతో కుదిరే పని కాదని రానున్న మంగళవారం స్వాములోరి దగ్గరకు వెళ్లి తిరుగుబడి చేయించాల్సిందేనని మనసులోనే తీర్మానించుకుంది నూకాలమ్మ.

 మంటల చీలికలు!
దాదాపుగా అన్ని ఇళ్లలోనూ ఇలాంటి ఆవేశకావేషాలే. ఒకరి మీద మరొకరు చాడీలు చెప్పుకోవడంలోనే రోజు సరిపోతోంది. ఇలా ఉండగా ఓ రోజు... సుందరయ్య పెద్ద కొడుకు పక్క పొలం యజమాని కోటయ్య మీద దాడి చేసి గాయపరిచాడు. నివురు గప్పిన నిప్పులా ఉన్న ఊరు ఒక్కసారిగా భగ్గుమన్నది. తిరుగు దాడి చేసి తీరుతామని కోటయ్య కొడుకు సవాల్ చేశాడు. ఊరు రెండుగా చీలిపోయింది. ఉద్రిక్తత ఏర్పడింది. గ్రామం పోలీసు పహారాలోకి వెళ్లింది. సంకెళ్లతో, బూట్ల నాడాలతో అదుపు తెచ్చే సమస్య కాదని అర్థం కాగానే హేతువాద బృందం సహాయం కోరారు పోలీసులు.

ఎత్తుకు పై ఎత్తు!
నల్గొండ జిల్లా, నకిరేకల్ దగ్గర జరిగింది. మేము ఊళ్లో అడుగుపెట్టినప్పటి నుంచి మా కదలికలన్నీ మంత్రగాడికి చేరుతూనే ఉన్నాయి. ఊరి వారి ద్వారా మంత్రగాడు గ్రామస్తులను నమ్మించడానికి ఎలాంటి మాయలు చేశాడో తెలుసుకున్నాం. నిప్పుల మీద నడవడం వంటివన్నీ మేము కూడా చేసి చూపించాం. ప్రతి దానికీ శాస్త్రీయతను విడమరిచి చెప్పాం. సమావేశం మొదలుపెట్టినప్పుడు పది మంది కూడా లేరు. గ్రామస్తులంతా తలుపులేసుకుని కిటికీల నుంచి చూస్తూ ఉండిపోయారు. జనం మా ఎదురుగా ఉన్నట్లే ప్రసంగం మొదలుపెట్టాం. మా కార్యకర్తలందరి ప్రసంగాలు పూర్తయ్యేసరికి మూడు వందల మంది పోగయ్యారు. మోసపోయామని గ్రహించగానే ఆవేశంతో మంత్రగాడి ఇంటికి పరుగులు తీశారు. పోలీసుల జోక్యంతో దాడి ఆగింది. మంత్రగాడిని అదుపులోకి తీసుకున్నారు. సుందరయ్య మరణానికి నాలుగు రోజుల ముందు నుంచి నీళ్ల విరేచనాల వల్ల బిపి పడిపోవడమేనని అక్కడి ఆర్‌ఎంపి అన్నాడు.
- టి. రమేశ్, జనరల్ సెక్రటరీ ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్‌వర్క్

పారని మంత్రం!
‘‘సుశీలా! మనూళ్లో అందరూ నిప్పుల మీద నడుస్తున్నారే! చూద్దాం రా’’ వగరుస్తూ వచ్చింది కళ్యాణి. మరో నలుగురు పిల్లలు పరుగు తీస్తూ వెళ్లి విచిత్రంగా చూశారు.

‘‘హత్తెరికి! మనూరి స్వాములోరు చేసేవి కూడా ఇవ్వేగా మరి’’ నోరెళ్లబెట్టాడు సతీశ్.
ఇదంతా సైన్స్ తెలుసుకున్న వాళ్లు శాస్త్రీయ పరిజ్ఞానం లేని వారిని మోసం చేయడానికి చేస్తున్న మాయ అని పిల్లలకు త్వరగానే అర్థమైంది. అతీంద్రియ శక్తులేవీ ఉండవని, నిప్పుల మీద నడవవచ్చని తెలుసుకున్నారు. పిల్లలతో మొదలై ఒకరి తర్వాత మరొకరుగా దాదాపుగా నలభై మంది నిప్పుల మీద నడిచారు. ఊరంతా కలిసి కరడుకట్టిన మూఢత్వాన్ని కళ్లగంతలను విప్పినట్లు విప్పేశారు.
- వాకా మంజులారెడ్డి (గమనిక: పేర్లు మార్చడమైంది)

Advertisement
Advertisement