కేన్‌..సర్‌! | Sakshi
Sakshi News home page

కేన్‌..సర్‌!

Published Thu, Feb 2 2017 6:39 AM

కేన్‌..సర్‌!

ఈ ఏడాదికి కూడా క్యాన్సర్‌ డే ఫిలాసఫీ ‘వియ్‌ కెన్‌... ఐ కెన్‌’.
అంటే క్యాన్సర్‌తో ‘మనమూ పోరాడగలం...
నేనూ పోరాడగలను’ అన్నదే మన విధానం. మన నినాదం.
అంటే క్యాన్సర్‌ భయాలకు ఇక చరమగీతం పాడవచ్చు.
రీసెర్చ్, టెక్నాలజీ, అద్భుతమైన డాక్టర్ల టీమ్,
సైంటిస్టులు కనిపెట్టిన విధానాలు, ప్రక్రియలు,
మందులు.. క్యాన్సర్‌ కొమ్ములను విరిచేస్తున్నాయి.
శనివారం ‘ప్రపంచ క్యాన్సర్‌ డే’ సందర్భంగా
క్యాన్సర్‌ శస్త్రచికిత్స, రేడియేషన్, కీమోథెరపీలపై ఉన్న
అనేక అపోహలను నివృత్తి చేయడానికే ఈ కథనం.
ఇక అది క్యాన్సర్‌ కాదు.
‘వియ్‌ కెన్‌... ఐ కెన్‌’ సర్‌! 



రేడియేషన్
రేడియోధార్మిక కిరణాల సహాయంతో చేసే ప్రభావవంతమైన క్యాన్సర్‌ చికిత్సనే రేడియేషన్‌ చికిత్స అంటారు. ఇందులో శక్తిమంతమైన రేడియేషన్‌ను కేవలం క్యాన్సర్‌ గడ్డపైనే కేంద్రీకరించి దానిలోని కణాలను చంపివేస్తారు. క్యాన్సర్‌ కణాల్లోని డీఎన్‌ఏను దెబ్బతీయడం ద్వారా క్యాన్సరు కణాల పెరుగుదలను నిరోధించి, నిర్మూలిస్తారు. ఇంతటి ప్రభావవంతమైన కిరణాలను ఉపయోగించే క్రమంలో క్యాన్సరు గడ్డ పక్కనే ఉన్న ఆరోగ్యకరమైన శరీర కణాలకు ఏమాత్రం హాని జరగకుండా చూడటం ఈ చికిత్సా విధానంలోని ప్రత్యేకత.

అపోహ:  క్యాన్సర్‌ రావడం అంటే మరణశాసనం వెలువడటమే.
వాస్తవం : గత రెండు దశాబ్దాల్లో క్యాన్సర్‌ చికిత్సలో అనూహ్యమైన మార్పులు వచ్చాయి.  ప్రధాన క్యాన్సర్లకు చికిత్స పొంది డాక్టర్ల సూచనల మేరకు జాగ్రత్తలు తీసుకుంటూ మిగతా అందరిలాగే సాధారణ జీవితం గడుపుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అపోహ: రేడియేషన్‌ చాలా బాధాకరమైన చికిత్స.
వాస్తవం : అదేమీ కాదు. రోజువారీ రేడియేషన్‌ చికిత్స జరుగుతున్నప్పుడు చాలామంది పేషెంట్లకు ఎలాంటి బాధా ఉండదు. కొద్దిమంది మాత్రం వేడిగా అనిపిస్తోంది చెబుతుంటారు. అటువంటి వారికి కొద్దిరోజుల తర్వాత చర్మం కొంత పొడిబారినట్లుగా అయి, దురదలు వస్తాయి. అయితే ఇవి తాత్కాలికమే. చికిత్స నిలిపివేయాల్సిందిగా రోగి కోరేంత తీవ్రతతో ఇవి ఉండవు.
అపోహ: ఛాతీ బరువుగా ఉండటం, దగ్గు, జ్వరం వస్తాయి.
వాస్తవం : రేడియేషన్‌ చికిత్స జరిగిన 2 నుంచి 16 వారాల మధ్య కనిపించే ఈ లక్షణాలు తాత్కాలికం. వీటిని అదుపు చేసి, శ్వాసకోశాలపైన దుష్ప్రభావం చూపకుండా డాక్టర్లు మందులు సూచిస్తారు.  
అపోహ:  బలహీనంగా అనిపిస్తే రేడియేషన్‌ చికిత్సను నిలిపివేయడం మేలు.
వాస్తవం : చికిత్సను మధ్యలో మానివేయడం ప్రమాదకరం. చాలాబలహీనంగా అనిపిస్తే డాక్టర్‌తో మాట్లాడితే ఆహారం (డైట్‌)లో మార్పులతో సహా ఇతర ప్రత్యామ్నాయ పరిష్కారాలను సూచిస్తారు. క్యాన్సరు చికిత్స శారీరకంగా, మానసికంగా కొంత అలసట కలిగించే మాట వాస్తవమే అయినా తగినంత విశ్రాంతి, బలవర్థకమైన ఆహారం వంటివి తీసుకోవడం, మంచి మానసిక స్థైర్యం ద్వారా ఈ చిన్న చిన్న ప్రతిబంధకాలను తేలిగ్గానే ఎదుర్కోవచ్చు.
అపోహ: సహజమైన రేడియేషన్‌ వల్ల నష్టం లేదు. కానీ యంత్రాల ద్వారా సృష్టించిన రేడియేషన్‌ ప్రమాదకరం.
వాస్తవం : రేడియేషన్‌ ప్రభావం అన్నది దాని తీవ్రతపైన ఆధారపడి ఉంటుంది తప్ప... అది ప్రకృతిలో స్వాభావికంగా ఉత్పన్నమైనదా లేక యంత్రాల నుంచి ఆవిర్భవించిందా అన్న విషయానికి ప్రాధాన్యం లేదు. ప్రాకృతిక రేడియేషన్‌లు గానీ లేదా యంత్రపరికరాల నుంచి వచ్చే రేడియేషన్‌లు గానీ భిన్నమైనవి కాదు.
అపోహ: క్యాన్సర్‌ చికిత్సకు ఉపయోగించే రేడియేషన్‌ చాలా తీవ్రమైనది. అందువల్ల ప్రమాదకరమైనది.
వాస్తవం : క్యాన్సరు గడ్డలలోని కణాల డీఎన్‌ఏ పై ఆడి చేసి చంపివేసేందుకు ఉద్దేశించినవి కావడం వల్ల వీటి తీవ్రత కొంత ఎక్కువే. అయితే ఎంపిక చేసిన ప్రాంతంపైన, కేవలం అవసరం అయినంత సమయం మేరకు మాత్రమే రేడియేషన్‌ నిర్వహిస్తారు. అందువల్ల ప్రమాదానికి అవకాశం ఉండదు.
అపోహ: సెల్‌ఫోన్స్‌ ఉపయోగించడం వల్ల క్యాన్సర్‌ వస్తుంది.
వాస్తవం : జీవకణాలలోని జన్యువుల (జీన్స్‌)లో జరిగే అసాధారణ మార్పుల కారణంగానే క్యాన్సర్‌ వస్తున్నట్లు పరిశోధనలు తేల్చిచెప్పాయి. అయితే సెల్‌ఫోన్‌ల నుంచి వెలువడే రేడియేషన్‌ పరిమాణాన్ని పరిగణనలోకి తీసుకుంటే అది చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ కలిగినది. అందువల్ల సెల్‌ఫోన్‌ నుంచి వెలువడే రేయడిషన్‌ కిరణాలు... మన జన్యువులను దెబ్బతీసే అవకాశం లేదు.
అపోహ: హైటెన్షన్‌ విద్యుత్‌ తీగలకు దగ్గరగా ఉన్న ఇళ్లలో నివసించడం వల్ల క్యాన్సర్‌ వస్తుంది.
వాస్తవం : హై టెన్షన్‌ విద్యుత్‌ తీగల నుంచి విద్యుత్‌ అయస్కాంత శక్తి వెలువడుతుంది. అయితే వాటి నుంచి వెలువడే విద్యుత్‌ శక్తి ఇంటి గోడలు, వాటిలోని ఇటుకలు తేలిగ్గా తటస్థీకరించగలుగుతాయి. ఇక ఆ తీగలు వెలువరిచే అయస్కాంత శక్తి... చాలా తక్కువ ఫ్రీక్వెన్సీ గల రేడియేషన్‌ మాత్రమే. కాబట్టి అది మన శరీర కణాల్లోని జన్యువులను ప్రభావితం చేయలేదు.

డా. కె. కిరణ్‌ కుమార్, సీనియర్‌ రేడియేషన్‌
ఆంకాలజిస్ట్‌
యశోద హాస్పిటల్స్‌
హైదరాబాద్‌

సర్జరీ
శరీర భాగంలో గుర్తించిన క్యాన్సరు గడ్డను శస్త్రచికిత్స ప్రక్రియ ద్వారా ప్రత్యక్షంగా కోసి తీసివేయడం అన్నది చాలాకాలంగా వాడుకలో ఉన్న విశ్వసనీయ ప్రక్రియ. దశాబ్దాల పరిశోధన, అనుభవం వల్ల క్యాన్సరు సర్జరీ ప్రక్రియ అత్యంత ప్రభావశీలంగా రూపొందింది. ఇందులో ఆధునిక పోకడలూ ఎన్నో చోటు చేసుకుంటున్నాయి. శస్త్రచికిత్సకుల నైపుణ్యానికి, అత్యా«ధునిక వైద్య పరికరాలు, ఉపకరణాలు, రోబోలు కూడా తోడుకావడంతో చికిత్స ప్రక్రియల్లో సర్జరీ విభాగం అగ్రస్థానానికి పోటీపడుతోంది. సర్జరీ విషయంలో ఉండే అపోహలూ–వాస్తవాలివి...

అపోహ: క్యాన్సర్‌ సర్జరీ వల్ల... కత్తి గాటు పడగానే, వ్యాధి శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించే ప్రమాదం పెరుగుతుంది.
వాస్తవం : శస్త్రచికిత్సతో తొలగించాల్సిన క్యాన్సర్‌ గడ్డలో వ్యాధి ఉన్న భాగాన్ని ముందుగానే పరిశీలించి, దాన్ని నిర్దిష్టంగా ఏ మేరకు తొలగించాలో, అంత మేరకు స్పష్టంగా తొలగిస్తారు. శస్త్రచికిత్స కోసం కత్తి ఆనించగానే క్యాన్సర్‌ పక్కకు వ్యాపిస్తుందన్నది కేవలం అపోహ మాత్రమే.

అపోహ:  రొమ్ము క్యాన్సర్‌ సర్జరీలో క్యాన్సర్‌ గడ్డ ఉన్న రొమ్మును తొలగించక తప్పదు.
వాస్తవం : ఇప్పుడు కేవలం క్యాన్సరు గడ్డను మాత్రమే తొలగించే సౌకర్యం ఉంది.  వ్యాధి బాగా ముదిరాక కనుగొంటే... ఒకవేళ రొమ్ములోని కొంత భాగాన్ని గానీ లేదా  రొమ్మును తొలగించాల్సి వచ్చినా... శరీరంలోని మరో భాగం నుంచి కొంత కణజాలాన్ని సేకరించి ఏమాత్రం లోపం కనిపించకుండా రొమ్మును రిపేరు చేయడం లేదా తేడా తెలియని విధంగా పూర్తిగా రొమ్మును పునర్నిర్మించడం ఇప్పుడు సాధ్యమే.
అపోహ: సర్జరీ వల్ల అవయవాల రూపం, వ్యక్తి రూపం మారిపోతుంది.
వాస్తవం : క్యాన్సర్‌ గడ్డను తొలగించే సందర్భంలో శరీర రకూపంలో ఏమాత్రం మార్పు కనిపించే అవకాశం ఉన్నా దాన్ని నివారించేందుకు ఇతర భాగాల నుంచి కణజాలాన్ని తెచ్చి ఆ అయవాన్ని పునర్నిర్మించేందుకు ఇప్పుడు పూర్తిగా అవకాశం ఉంది.
అపోహ: సర్జరీ సమయంలో క్యాన్సరు గడ్డకు గాలి సోకడంతో మిగిలిన భాగానికి క్యాన్సర్‌ వ్యాపించే అవకాశం ఉంటుంది.
వాస్తవం : గాలి సోకడం వల్ల క్యాన్సరు ఇతర భాగాలకు విస్తరిస్తుందనడం పూర్తిగా అశాస్త్రీయం. అవాస్తవం. అవగాహన లేనివారు ఊహించికునే పూర్తి అపోహ ఇది.
అపోహ: క్యాన్సర్‌ సర్జరీ చాలా బాధాకరమైనది.
వాస్తవం : ఆధునిక పరికరాలు, మెళకువలు ఉపయోగించి ఈ ఆపరేషన్‌ నిర్వహిస్తారు. ఇతర వ్యాధులకు సంబంధించిన సర్జరీల్లాంటిదే ఇది కూడా. ఇదేమీ బాధాకరం కాదు.
అపోహ: అన్ని రకాల క్యాన్సర్లకు సర్జరీ ఒక్కటే పరిష్కారం.
వాస్తవం : కొన్ని రకాల క్యాన్సర్లు సర్జరీతో అదుపులోకి వస్తాయి. మరికొన్ని రకాల క్యాన్సర్లలో, వాటి విస్తృతితో పాటు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని రేడియేషన్, కీమోథెరపీలను కూడా డాక్టర్లు సిఫార్సు చేస్తారు. వీటిని ఏ క్రమంలో నిర్వహించాలన్నది ఆయా రకాల క్యాన్సర్లు, వాటి తీవ్రతను బట్టి డాక్టర్ల బృందంలోని సభ్యులు సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటారు.
అపోహ: క్యాన్సర్‌ సర్జరీ చేయించుకున్న వారు తేలికగా ఇతర వ్యాధులకు, ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంది.
వాస్తవం : క్యాన్సర్‌ సోకిన వ్యక్తికి రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. దాంతో ఇన్ఫెక్షన్‌లు  సోకే అవకాశాలు ఎక్కువ. అందువల్ల ఆపరేషన్‌ తర్వాత రోగిని కొంతకాలం ఆసుపత్రిలో ఉంచి, ఎలాంటి వ్యాధులు సోకకుండా డాక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తారు. అంతేగానీ క్యాన్సర్‌ శస్త్రచికిత్సకూ... ఇతర రోగాలు సోకడానికి నేరుగా  ఎలాంటి ప్రత్యక్ష సంబంధమూ లేదు.
అపోహ: ఊబకాయం తగ్గకుండా సర్జరీ వల్ల పెద్దగా ప్రయోజనం లేదు.
వాస్తవం : ఊబకాయం ఉన్నవారికి సైతం ఇతరుల లాగానే సర్జరీ వల్ల ఉపశమనం కలుగుతుంది. అయితే ఊబకాయం అన్నది క్యాన్సర్‌ వచ్చేందుకు ఉన్న ముప్పులలో  (రిస్క్‌ ఫ్యాక్టర్లలో) ఒకటి. కాబట్టి శరీరం బరువును అదుపులో పెట్టుకోవడం అన్ని విధాలా ఆరోగ్యానికి మేలు.
అపోహ: డాక్టర్లు క్యాన్సర్‌ గడ్డను తొలగించడానికి సర్జరీని సిఫార్సు చేశాక తొందరపడాల్సిందేమీ లేదు. సావకాశంగా శస్త్రచికిత్స చేయించుకోవచ్చు.
వాస్తవం : క్యాన్సరును అదుపు చేయడంలో వ్యాధి నిర్ధారణకూ, చికిత్సకూ మధ్య ఎంత తక్కువ సమయం ఉంటే... ఫలితాలు అంత మెరుగ్గా ఉంటాయి. అందుకే క్యాన్సర్‌ శస్త్రచికిత్సల్లో వ్యాధి నిర్ధారణ తర్వాత సమయం చాలా కీలకం. సాధారణంగా క్యాన్సర్ల గుర్తింపు జరిగే సమయానికే చాలా సందర్భాల్లో అవి సెకండ్‌ స్టేజ్‌లో ఉంటాయి. కాబట్టి మనం ఎంత జాప్యం చేస్తే పరిస్థితి అంతగా దిగజారి తీవ్రమైన నష్టానికి దారితీసే ప్రమాదం ఉంది.

డా. కె. శ్రీకాంత్,సీనియర్‌ సర్జికల్‌ ఆంకాలజిస్ట్‌
యశోద హాస్పిటల్స్‌
హైదరాబాద్‌

కీమోథెరపీ
మెడికల్‌ ఆంకాలజీగా ఎక్కువ ప్రాచుర్యం పొందిన విభాగం ఉంది. క్యాన్సరు చికిత్సలో కీమోథెరపీ (మందులతో చికిత్స) ఓ ముఖ్యమైన పద్ధతి. మందులు, ఇంజెక్షన్లతో ప్రారంభమైన ఈ చికిత్స ప్రక్రియ ఇప్పుడు ట్రాన్స్‌ఫ్యూజన్, ఇమ్యూనోథెరపీ వరకు విస్తరించి అద్భుతమైన చికిత్సావిధానంగా అభివృద్ధి చెందింది. సర్జరీ, రేడియేషన్‌ కంటే ముందుగా శక్తిమంతమైన మందులతో వ్యాధిని అరికట్టి, క్యాన్సర్‌ గడ్డలను నిర్మూలించే అవకాశం ఉందని గుర్తించినప్పుడు డాక్టర్లు కీమోథెరపీని సూచిస్తారు.

అపోహ: నిజానికి క్యాన్సర్‌ కలిగించే బాధ కంటే చికిత్సలు కలిగించే బాధే ఎక్కువ.
వాస్తవం : ఇది కేవలం అపోహ మాత్రమే. ఒకరకంగా చెప్పాంటే ఇది భయంకరమైన ఆరోపణ. ప్రపంచవ్యాప్తంగా వైద్యనిపుణులు క్యాన్సరును ఎదుర్కొనేందుకు, దాని నుంచి మానవాళిని విముక్తులను చేసేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కొత్త అత్యాధునిక చికిత్స ప్రక్రియలు కనుగొంటున్నారు. గతంతోపోలిస్తే ఆధునిక మందులతో నొప్పి, బాధ తక్కువ. దుష్ప్రభావాలూ తక్కువ. ఉపశమనం ఎక్కువ. పెరుగుతున్న జీవనవ్యవధి కూడా ఎక్కువ.
అపోహ: కీమోథెరపీ క్యాన్సరు వ్యాధిగ్రస్తులను మరింత బలహీన పరుస్తుంది.
వాస్తవం : చికిత్స ప్రారంభంలో కనిపించే నీరసం కొద్ది రోజుల్లోనే తగ్గిపోతుంది.
అపోహ: కీమోథెరపీ సూచించారు అంటే పరిస్థితి పూర్తిగా దిగజారినట్టే.
వాస్తవం : చాలా సందర్భాల్లో క్యాన్సరు రకాన్ని బట్టి కొన్ని క్యాన్సర్ల చికిత్సను కీమోతోనే ప్రారంభిస్తారు. అందువల్ల ఇది కేవలం అపోహ మాత్రమే.
అపోహ: కీమోథెరపీ వల్ల తీవ్రమైన సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉంటాయి.
వాస్తవం : కీమోథెరపీలో ఇటీవల చాలా ప్రభావవంతమైన, తక్కువ సైడ్‌ఎఫెక్ట్స్‌ ఉన్న ఔషధాల ఆవిష్కరణ జరిగింది. జరుగుతోంది. ఇటీవల కీమోథెరపీ తీసుకుంటున్న రోగులు కేవలం నిస్సత్తువగా, నీరసంగా ఉండటాన్ని మాత్రమే ఫిర్యాదు చేస్తున్నారు. రోగి తగిన పోషకాహారం తీసుకుంటూ రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటే ఈ ఫిర్యాదు కూడా ఉండదు.
అపోహ: కీమోథెరపీ వల్ల సాధారణ జీవితం కుంటుపడుతుంది.
వాస్తవం : కీమోథెరపీ వల్ల రోజువారీ జీవితానికి ఎలాంటి ఆటంకం ఏర్పడదు. ఆహార అలవాట్లకు సంబంధించి కొన్ని మార్పులతో కీమోథెరపీ పేషెంట్లు తమ వృత్తి,ఉద్యోగాలను ఎప్పటిలాగే చేసుకోవచ్చు.
అపోహ: కీమో చేయించుకునే వ్యక్తిని ఇంట్లో కుటుంబ సభ్యులు దూరంగా ఉంచాలి.
వాస్తవం : కీమోథెరపీ వల్ల రోగి ఇతరులకు హానికరంగా ఏమీ పరిణమించడు. రోగి వల్ల ఇతరులకు వచ్చే ప్రమాదం ఏమీ ఉండదు. చికిత్స పొందుతున్న వ్యక్తి ఇన్ఫెక్షన్‌ల బారిన, పర్యావరణపరమైన సమస్యలతో వచ్చే ఆరోగ్య సమస్యల బారిన పడకుండా జాగ్రత్త తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. కేవలం ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే చాలు. రోగి పూర్తిగా స్వేచ్ఛగా తన సామాజిక జీవనం గడపవచ్చు.
అపోహ: కీమోథెరపీ వల్ల వికారం, వాంతుల వంటివి చివరి వరకూ కొనసాగుతాయి.
వాస్తవం : కీమోథెరపీ ప్రారంభంలోనే ఇటువంటి సైడ్‌ఎఫెక్ట్స్‌ను అదుపు చేసేందుకు మందులు ఇవ్వడంతో పాటు డాక్టర్లు కొన్ని సూచనలు చేస్తారు. ఫలితంగా కొద్దిరోజుల్లోనే ఈ లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి.
అపోహ: కీమోథెరపీ వల్ల తలవెంట్రుకలు రాలిపోతాయి.
వాస్తవం :  కీమోథెరపీలో భాగంగా ఇచ్చే మందులన్నీ వెంట్రుకలు రాలిపోవడానికి దారితీయవు. క్యాన్సర్‌ గడ్డల పెరుగుదలను అరికట్టేందుకు ఉద్దేశించిన కొన్ని మందులు... తల వెంట్రుకల పెరుగుదలకు కారణమైన హెయిర్‌ ఫాలికిల్స్‌ విభజనను దెబ్బతీయడంతో తల వెంట్రుకలు పలచబడతాయి. అయితే ఇది కేవలం తాత్కాలికమైన పరిణామం మాత్రమే. అయితే సౌందర్యపరమైన సమస్యలు తలెత్తకుండా చూసే అనేక ప్రక్రియలు, విధానాలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
అపోహ: కీమోథెరపీ శరీరంలోని ఇతర కణజాలంపైన కూడా దాడి చేసి నష్టపరుస్తుంది.
వాస్తవం : అత్యాధునికమైన కీమోథెరపీ... కేవలం క్యాన్సరు కణజాలంపైనే దాడి చేసేట్లుగా రూపొందింది. ఈ విధంగా ఎంపికచేసిన కణజాలంపైన మాత్రమే దాడిచేయడమే కీమోథెరపీ ఇంతకుముందు ఎన్నడూ లేని స్థాయిలో ఫలితాలు ఇవ్వడానికి కారణమవుతోంది.
అపోహ: వెంట్రుకలకు వేసుకునే రంగు క్యాన్సర్‌ కారకం.
వాస్తవం : వెంట్రుకలకు వేసుకునే రంగులోని రసాయన పదార్థాలు క్యాన్సర్‌కు దారితీయగలవనే అంశం నిరూపితం కాలేదు.

డా. నిఖిల్‌ గద్యాల్‌ పాటిల్,సీనియర్‌ మెడికల్‌ ఆంకాలజిస్ట్‌
యశోద హాస్పిటల్స్‌
హైదరాబాద్‌

Advertisement
Advertisement