తెలంగాణ అన్నవరం | Sakshi
Sakshi News home page

తెలంగాణ అన్నవరం

Published Tue, Jun 6 2017 11:39 PM

తెలంగాణ అన్నవరం

గూడెం గుట్ట
పుణ్య తీర్థం


ప్రకృతి ఒడిలో.. దేవుని గుడిలో భక్తులను పులకరింపజేస్తుంది గూడెం గుట్ట.. ఎత్తయిన కొండలు... గోదావరి నీటి గలగల సవ్వడులు అలరిస్తున్నాయి. కొండపై వెలసిన శ్రీ రమాసహిత సత్యనారాయణస్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు. ఈ ప్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండో అన్నవరంగా పిలిచేవారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ‘తెలంగాణ అన్నవరం’గా పిలుచుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గూడెం గ్రామ శివారులో ఎత్తయిన కొండపై వెలసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం మంచిర్యాలకు 30 కిలోమీటర్లు, కరీంనగర్‌కు 70 కిలోమీటర్ల దూరంలో 63 వ జాతీయ రహదారికి పక్కనే ఉంది. ఆలయ సమీపాన పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది. దీంతో భక్తులు గోదావరినదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన గల శ్రీరమాసహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు. ఇక్కడ నిత్యపూజలతో పాటు, సత్యనారాయణ వ్రతాలు, పెళ్లిళ్లసీజన్‌లో పెళ్ళిళ్లు కూడా జరుగుతుంటాయి.

ఆలయ ప్రాశస్త్యం
సుమారుగా 53 సంవత్సరాల క్రితం గూడెం గ్రామానికి చెందిన గోవర్దన పెరుమాండ్లు అనే చాత్తాద వైష్ణవుడికి సత్యదేవుడు కలలో కనిపించాడు. మీ గ్రామ శివారులో గల రాట్నపు చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు. ఆ వైష్ణవుడు కొండపై వెదకగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది. ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరి నదికి వెళ్లి స్నానం ఆచరించి వచ్చాడు. గోదావరి జలంతో అభిషేకం నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించాడు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కొద్దిరోజుల తర్వాత చాత్తాద వైష్ణవుడు భక్తుల సహకారంతో గుట్టపైనే ఆలయం నిర్మించాడు. క్రోధి నామ సంవత్సర మాఘశుద్ధ దశమి రోజున (1964 లో) విగ్ర ప్రతిష్ట చేశారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర, కార్తీక పౌర్ణమికి భారీఎత్తున జాతర నిర్వహిస్తూ, ప్రతి ఏటా స్వామివారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తుంటారు.

అయ్యప్ప, ఆంజనేయ స్వామి, సాయిబాబా
సత్యనారాయణ స్వామి ఆలయం సమీపాన గల మరో ఎత్తయిన కొండపై శ్రీ అయ్యప్పస్వామి, పంచముఖ ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి. శబరిమలైలో ఉండే విధంగా అయ్యప్ప దేవాలయాన్ని నిర్మించడంతో భక్తులు గూడెం అయ్యప్ప ఆలయాన్ని తెలుగువాళ్ల శబరిమలగా పిలుచుకుంటారు. ప్రతి ఏటా అనేకమంది అయ్యప్ప, ఆంజనేయ స్వామి భక్తులు మాలధారణ చేసుకుంటారు. దీక్ష విరమణ కూడా చేస్తారు. వీటితోపాటు గుట్ట కింద శ్రీషిర్డిసాయిబాబా ఆలయం కూడా ఉంది. ఒకేచోట నాలుగు దేవాలయాలు ఉండటంతో ప్రతి నిత్యం ఇక్కడ భక్తుల రద్దీ ఉంటుంది. దీంతో గూడెం గ్రామం పుణ్య క్షేత్రాలకు నిలయంగా ప్రసిద్ధి గాంచింది.

ఇలా వెళ్లచ్చు..
గూడెం సత్యనారాయణస్వామి ఆలయానికి కరీంనగర్‌ నుంచి బస్సులు లేదా ప్రైవేటు వాహనాల్లో రావచ్చు. బస్సుల్లో వచ్చే వారు. లక్సెట్టిపేట మీదుగా ఆదిలాబాద్, మంచిర్యాల వెళ్లే బస్సులు ఆలయం ముందునుంచే వెళతాయి. నిజామాబాద్, జగిత్యాల వైపు నుంచి వచ్చే వాళ్లు లక్సెట్టిపేట, మంచిర్యాల వెళ్లేబస్సుల్లో రావచ్చు. ఈ బస్సులు కూడా ఆలయం ముందునుంచే వెళతాయి. ఆదిలాబాద్‌ నుంచి వచ్చే వాళ్లు మంచిర్యాల, లేదా వయా లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, వరంగల్, గుంటూరు, ఖమ్మం వెళ్ళే బస్సుల్లో రావచ్చు. మంచిర్యాల బస్సుల్లో వచ్చేవారు కరీంనగర్‌ టర్నింగ్‌  చౌరస్తా లో దిగితే అక్కడనుంచి బస్సుల్లో లేదా ప్రెవేటు వాహనాల్లో  వెళ్లచ్చు. మంచిర్యాల వైపు నుంచి వచ్చే వారు లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, హైదరాబాద్‌ వెళ్ళే బస్సుల్లో రావచ్చు.

రైలు మార్గం ద్వారా..
గూడెం సత్యనారాయణ స్వామి ఆలయానికి రైలు మార్గం ద్వారా వచ్చేవారు మంచిర్యాల రైల్వేస్టేషన్‌లో దిగాలి. అక్కడనుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాలు వెళతాయి. మంచిర్యాల నుంచి లక్సెట్టిపేట మీదుగా కరీంనగర్, హైదరాబాద్, జగిత్యాల, నిజామాబాద్‌ వెళ్లే బస్సుల్లో వస్తే ఆలయం ముందే దిగచ్చు.  
– మొదంపురం వెంకటేష్, దండేపల్లి, మంచిర్యాల

Advertisement
Advertisement