జీవనవేదం | Sakshi
Sakshi News home page

జీవనవేదం

Published Tue, Jun 9 2015 12:03 AM

జీవనవేదం

ప్రతి రచయితకీ కలం అందించే చేయి ఒకటి ఉంటుంది. సాధారణంగా ఆ చేయి భార్యది అయినప్పుడే ఆ రచయిత రచనాజీవనం
 ఒడుదొడుకులు లేకుండా సాగిపోతుంది. దాశరథి రంగాచార్య ఎన్ని వేల పుటలు రాశారో ఆయనకే తెలియదు. కాని ఆయన అక్షరం అల్లుకుంటున్న ప్రతి సందర్భంలోనూ ఆయన భార్య కమల గొడుగు అయ్యింది. గోడ అయ్యింది. నీడ అయ్యింది. ఒక చక్కని చిరునవ్వుతో- ఇవాళ ఏదైనా రాస్తే బాగుండు అనే ఉత్సాహాన్ని కలిగించింది. కథలు, నవలలు,
 
అనువాదాలు, వేద పరిచయాలు...

 తెలుగువారికి దాశరథి అందించిన సాహితీ రతనాలు ఎన్నో. కూర్చిన వచన రాశులు మరెన్నో. ఇవాళ ఆయన దిగంతాలలో దప్పికగొన్న దేవతలకు తన రచనామృతాన్ని పంచడానికి బయలుదేరి వెళ్లారు. కాని ’సాక్షి ఫ్యామిలీ’కి ఈ అపురూప జ్ఞాపకాన్ని మిగిల్చారు. గతంలో ‘బెటర్ హాఫ్’ శీర్షిక కోసం దాశరథి పంచుకున్న జ్ఞాపకాలను మరోసారి
 పాఠకులకు అందిస్తున్నాం.
 
సికింద్రాబాద్ వెస్ట్‌మారేడ్‌పల్లిలోని దాశరథి రంగాచార్య నివాసంలోకి అడుగు పెడుతుండగా ఎనభై ఆరేళ్ల రంగాచార్యను ఆయన భార్య ఎనభై ఏళ్ల కమల తన రెండు చేతుల్తో పదిలంగా పొదువుకొని జాగ్రత్తగా కూర్చోబెడుతూ కనిపించారు. ఇద్దరినీ ఆ క్షణంలో చూస్తే ఫలాలు ఇచ్చీ ఇచ్చీ పరిపూర్ణతతో మిగిలిన రెండు మామిడివృక్షాలు గుర్తుకువచ్చాయి. పిందె, పత్రం, శాఖ, కాండం అన్నీ అనుభవాలను నింపుకున్నవే. భావితరాలకు విలువైనవి. భార్యను పక్కనే కూచోబెట్టుకుని పాత జ్ఞాపకాల వెలుగు కళ్లలో ప్రసరిస్తుండగా ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు.

 ‘పెళ్లప్పుడు కమల వయసు ఆరు. నా వయసు 12. శారదా చట్టం ప్రకారం బాల్య  వివాహం నేరంగా పరిగణించే రోజులు. పోలీసులొస్తే గుమ్మం దగ్గరే ఆపి, ఏదో పూజ అని చెప్పి, మా పెళ్లి చేశారు పెద్దలు. తర్వాత పదహారేళ్ల వయసులో కమల మా ఇంట అడుగు పెట్టింది. అప్పటికే కమ్యూనిస్టు ఉద్యమాలలో ఉన్నాను. జైలుకు కూడా వెళ్లాను’ అన్నారాయన.

 కమల అందుకున్నారు - ‘అత్తింట అడుగుపెట్టాక నాకు ఈయన గురించి అర్థమైన సంగతి ఒకటే ఒకటి. అది ఈయనకు పుస్తకాలు ఇష్టమని. టీచర్ ఉద్యోగమైతే ఇంకా చదువుకోవడానికి వ్యవధి ఉంటుందని మెట్రిక్యులేషన్ పాసై, ఆ ఉద్యోగం తెచ్చుకున్నారు కూడా. అప్పుడే నిశ్చయించుకున్నాను ఈయన చదువుకు నేనో దీపంలా మసలాలని. నాలుగైదు ఊర్లు మారి హైదరాబాద్‌కు వచ్చాం. పగలంతా ఉద్యోగం చేయడం, సాయంత్రాలు రాసుకోవడం ఈయన పని. ఇంటిపనులు, పిల్లల వ్యవహారాలు నా బాధ్యత. ముందు వైపు నుంచి చూస్తే ముఖం కనపడుతుంది. వెనుక నుంచి చూస్తే వీపు. ఏదీ ఒక దాని కంటే ఒకటి తక్కువ కాదు. రెండూ ఉంటేనే మనిషి’ అన్నారామె.

 ఆయన మాట కలిపారు.
 ‘మాకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు.  పిల్లల చదువులు, నా తోబుట్టువుల పెళ్లిళ్లు, కూతుళ్ల పెళ్లిళ్లు, వారి బారసాలలు.. అన్నీ కమలే చూసుకునేది. నా కోసం కుటుంబం కోసం ఇంత కష్టపడిన నా భార్యకు ఏమివ్వగలను అనిపించేది’ అని రంగాచార్య చెబుతుంటే ఆమె-

 ‘ఈయన షష్టిపూర్తి అయిన ఆరేళ్లకు నాకు అరవై ఏళ్లు వచ్చాయి. వెంటనే ‘మా ఆవిడకు షష్టిపూర్తి’ అని పెద్ద ఎత్తున వేడుక మొదలుపెట్టారు. ‘అదేమిటి, ఆవిడకు షష్టిపూర్తి ఏమిటి?’ అని అందరూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు. అన్నేళ్లయినా మా  అనురాగం పదిలం అని చెప్పడానికే అని ఈయన జవాబు. ఇంతకన్నా ఏం కావాలి’ అన్నారు సంతోషం నిండిన హృదయంతో.

రంగాచార్య స్పందించారు...
‘ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. వీల్‌చెయిర్‌కే పరిమితం అయ్యాను. ఈవిడ ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే! అయినా నా ఆరోగ్యం కోసం తహతహలాడుతుంది. ఈ వయసులో అంతకుమించిన బాంధవ్యం ఎవరి ద్వారా లభిస్తుంది? భార్య కాకుండా ఇలా ఎవరైనా అంతడగా నిలువగలరా’ అంటుంటే - ‘సంసారం నడపడానికి ఎన్నో పరుగులు తీశాం. ఇప్పుడు తీరిక దొరికింది.  పిల్లలకు సంబంధించిన విషయాలు, రచనలు, సమకాలీన పరిస్థితులు ముచ్చటించుకుంటూ ఉంటాం.  గతం తాలూకు జ్ఞాపకాలను కలబోసుకోవడంలో ఆనందాన్ని పొందుతుంటాం. మొదటినుంచి ఈయన ఏది చెప్పినా నేను ‘సరే’ అనే అన్నాను. ఆయన కూడా అంతే. అందుకే ఇన్నేళ్లలో ఒకరి మీద ఒకరం విసుక్కున్నది లేదు. కోపమన్నదే ఎరగం’ అన్నారు కమల. కాని విషాదాలు లేవా? ఆ సమయాలను ఎలా దాట గలిగారు? ఆ ప్రశ్నే అడిగితే రంగాచార్య కళ్లల్లో ఒకరమైన విచారం కమ్ముకుంది. ఆమె కళ్లల్లో పల్చటి కన్నీటి తెర. ఆయన గొంతు గద్గదమవుతుండగా జ్ఞాపకం బయటకు వచ్చింది.

 ‘మొదటి కాన్పు సమయంలో డెలివరీకని బెజవాడ ఆసుపత్రికి బయల్దేరాం. దారిలో ట్రెయిన్‌లో నొప్పులు. ఏం చేయాలో తోచలేదు. పాతరోజులు. నలుగురూ సాయం పట్టి కదులుతున్న ట్రెయిన్‌లోనే పురుడు పోశారు. కాని బిడ్డ మమ్మల్ని కరుణించలేదు. పుడుతూనే చనిపోయింది. తీవ్ర రక్తస్రావంతో ఈమె అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయింది. ఆ సమయంలో ఏం చేయాలి?  వేరే మార్గం కనిపించక, ఆ బిడ్డ కాయాన్ని కృష్ణానది ఒడిలో వదిలేయాల్సి వచ్చింది’ ఆ తర్వాత ఆయన మాట్లాడలేకపోయారు.

 ‘నేను ఎన్నిసార్లు అడిగినా మూడురోజుల వరకు బిడ్డ బతికుందనే చెప్పారు. నా ఆరోగ్యం పర్వాలేదనుకున్నాక అసలు విషయం చెప్పి ఎంతో బాధపడ్డారు’ అంటూ కమల భర్త చేతిపై తన చేయుంచారు. ఉద్యోగరీత్యా నగరానికి వచ్చాక ఇల్లు కట్టుకోవడంలో పడిన కష్టాన్ని రంగాచార్య గుర్తుచేసుకుంటూ- ‘యాభై ఏళ్ల క్రితం ఇప్పుడున్న ఈ ఇల్లు కట్టాలని నిశ్చయించుకున్నాం. అయితే ఇల్లు గోడల వరకు లేచి ఆగిపోయింది. పై కప్పు వేయడానికి పైకం లేదు. పిల్లలు చిన్నవారు. నిలవనీడ లేదు. ఇద్దరికీ ఏం చేయాలో అర్థం కాలేదు. ఇల్లు కట్టడానికి పోసిన ఇసుకలో కూర్చొని కన్నీరు పెట్టుకున్నాం. జీవితంలో దుఃఖపూరితమైన సంఘటనలు ఏవేవో వస్తూనే ఉంటాయి. అలాంటి సమయంలోనే ఆలుమగలు ఒకరికొకరు ఓదార్చు కోవాలి. పంచుకునే హృదయం తోడుంటే ఎంతటి కష్టమైనా తట్టుకొని నిలబడవచ్చు. గాలిని ఎవరైనా తట్టుకుంటారు. వానను కూడా. కాని గాలీ వానా కలగలిసి వచ్చినప్పుడు తట్టుకుని నిలుచునేవారే భార్యాభర్తలు’ అని ముగించారాయన.

 తిరిగి వచ్చే ముందు వారి పాదాలను తాకాలనిపించింది. కాని - వారిని కలవడమే ఒక ఆశీర్వాదం కదా అని చిర్నవ్వుతో సాగనంపుతున్న ఆ ఇరువురిని చూసినప్పుడు అనిపించింది.
 - సాక్షి ఫ్యామిలీ
 
 నా రచనా వ్యాసంగానికి ఎలాంటి అడ్డంకి రానివ్వని నా భార్య కమల వల్లనే నాకు పేరుప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు అందాయి.
 - దాశరథి రంగాచార్య
 
 

Advertisement
Advertisement