కోకిలత | Sakshi
Sakshi News home page

కోకిలత

Published Mon, Feb 1 2016 12:41 AM

కోకిలత

బయోగ్రఫీ

గాన కోకిల లతా మంగేష్కర్‌పై ఈ నెలలో రెండు పుస్తకాలు విడుదల అవుతున్నాయి. ఒకటి ‘సాంగ్ షీట్స్’. ఇంకొటి ‘ఎ మ్యూజికల్ జర్నీ’. అయితే అవి రెండూ కూడా ఆమె జీవితకథలు కావు. ఆమె పాటల బయోగ్రఫీలు! మరి లత ఆత్మకథ ఎప్పుడొస్తుంది? ఇంతవరకు మనకు తెలిసిన కథేమిటి?
 
‘మహారాష్ట్ర నవ నిర్మాణ సేన’ అధ్యక్షుడు రాజ్ థాకరే తన పార్టీ పేరుకు మరింత సార్థక్యం చేకూరే పని చేయబోతున్నారు! ప్రముఖ వ్యక్తుల జీవితాలను డాక్యుమెంటరీలుగా చిత్రీకరించే ఆసక్తి, అలవాటు ఉన్న ఈ మహారాష్ట్ర రాజకీయ నాయకుడు ప్రముఖ సినీ నేపథ్య గాయని లతామంగేష్కర్‌పై ఒక ఖరీదైన కాఫీ-టేబుల్ బుక్‌ను ముద్రణకు సిద్ధం చేశారు. లత పాడిన వేల పాటల్లోంచి 300 పాటలను ఎంపిక చేసుకుని, వాటిని గుదిగుచ్చి, వాటికో వ్యాఖ్యను చేర్చి రాజ్ థాకరే ఒక పుష్పగుచ్ఛంగా తెస్తున్న ఆ పుస్తకం పేరు ‘సాంగ్ షీట్స్’. ఆవిష్కరణ.. నేడో, రేపో.
         
లతపై ఇంకో పుస్తకం కూడా ఈ నెలలోనే విడుదల అవుతోంది. పేరు.. ‘లతా మంగేష్కర్: ఎ మ్యూజికల్ జర్నీ’. ప్రముఖ సాహితీవేత్త యతీంద్ర మిశ్రా ఆ పుస్తకాన్ని రాస్తున్నారని, దానిని సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఇరా పాండే ఇంగ్లీషులోకి అనువదిస్తారని గత ఏడాది సెప్టెంబర్ 28న లత 86వ జన్మదినం సందర్భంగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ప్రకటించింది. ఈ బయోగ్రఫీలో లత సక్సెస్ ఉంటుంది. స్ట్రగుల్ ఉంటుంది. ‘సాంగ్ షీట్స్’లో మాత్రం మనిషి జీవితంలో ప్రతి సందర్భానికీ తగిన లత పాట ఒకటి ఉంటుంది.
         
మరి లత ఆటోబయోగ్రఫీ ఎప్పుడు వస్తుంది? రాదు! ఎప్పటికీ రాదు. తన పాటల గురించి తప్ప, తన జీవితం గురించి ప్రపంచం తెలుసుకోవలసింది ఏమీ లేదని లత నమ్మకం! ‘ఆత్మకథలు వ్యక్తుల్ని, కుటుంబాలను బాధపెడతాయి. నాకెవరినీ బాధ పెట్టడం ఇష్టం లేదు. మంచి చెడు, నిజం అబద్దం జీవితాన్ని నడిపిస్తాయి. వాటిని మనసులోనే నిక్షిప్తం చేసుకోవాలి తప్ప ఆత్మకథలకి ఎక్కించేయకూడదు’. ఇదీ లత అభిప్రాయం. కాబట్టి లత పాటల బయోగ్రఫీనే... ఆమె లైఫ్ బయోగ్రఫీ. పాట తప్ప ఆమె జీవితంలో ఇంకేం లేదు.
         
లత గురించి ముందొక కర్ణక ఠోరమైన సంగతి. లతా మంగేష్కర్ చదువుకోలేదు! ఇప్పుడొక వినసొంపైన విషయం. పాడిన ప్రతి పాటనూ లత  అచ్చులు, హల్లులు పొల్లు పోకుండా రాసుకుని ఆ కాగితాలను భద్రపరచుకున్నారు. లత జీవితంలోని ఒక చిన్న వైరుధ్యం మాత్రమే ఇది. అక్షరం రాకపోయినా జీవితాన్ని క్రమబద్ధం చేసుకున్నారు లత.లత పేరులో కూడా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. లత నాన్నగారు పండిట్ దీననాథ్.. గోవా దగ్గరి మంగేషీలో పుట్టారు. మంగేషీ మీద మమకారంతో ఆ ప్రాంతాన్నే ఆయన తన ఇంటిపేరుగా (మంగేష్కర్‌గా) మార్చుకున్నారు. లత అసలు పేరు  కూడా లత కాదు. హేమ. అమ్మ పేరు శేవంతి. దీననాథ్ రెండో భార్య. బాగా చిన్నప్పుడు చిన్న నాటకంలో యాక్ట్ చేసింది హేమ. అందులో హేమ పాత్ర పేరు లత. ఆ తర్వాత లతే ఆమె పేరు అయింది. ఫేమ్ అయింది. ఇంట్లో పెద్దమ్మాయ్ లత. తర్వాత మీనా ఖరీకర్ (84). తర్వాత ఆషా భోస్లే (82). తర్వాత ఉషా మంగేష్కర్ (80). తర్వాత హృదయనాథ్ మంగేష్కర్ (78). లత, ఆష, ఉష, మీనా నలుగురూ సింగర్సే. హృదయనాథ్ స్వరకర్త. మొత్తం మీద సరిగమల ఫ్యామిలీ. తండ్రి క్లాసికల్ సింగర్. ఆ నదివే ఈ నాలుగు ఉప నదులు. మధ్య ప్రదేశ్‌లోని ఇండోర్ వీటి జన్మస్థలం.
 
నదిగా... ఉపనది!
1942లో లత తండ్రి గుండె జబ్బుతో చనిపోయి నప్పుడు లతకు 13 ఏళ్లు. కుటుంబ భారం లతపై పడింది. అంత వరకు ఉపనదిగా ఉన్న లత నదిగా మారవలసి వచ్చింది. కుటుంబానికి తనే జీవనది కావలసి వచ్చింది.  డబ్బులొస్తాయంటే ‘కితి హసాల్’ సినిమాలో ఒక పాట పాడింది. ‘నాచు యా గావో’ అనే మరాఠీ పాట అది. డబ్బులొచ్చాయి. కానీ పాటే.. సినిమాలో లేదు. కట్ అయింది! ఆ పసి మనసు ఉసూరుమంది. అదే ఏడాది...  తండ్రి పోయిన ఏడాది.. లతకు ఇంకో చాన్స్ వచ్చింది. ‘పెహలీ మంగళ గౌర్’ అనే మరాఠీ సినిమాలో చిన్న పాత్ర. దాంతో పాటే చిన్న పాట. తండ్రి స్నేహితుడు మాస్టర్ వినాయక్‌కి  సినిమా కంపెనీ ఉంది. ఆయన ఇచ్చిన అవకాశం ఇది. అవకాశంతో పాటు, కొంత డబ్బు కూడా.

లత జీవితంలోని మరో వైరుధ్యం... ఆమె హిందీ కెరీర్ కూడా మరాఠీ చిత్రం నుంచే మొదలవడం! తొలిసారి 1943లో ‘గజాభావ్’ అనే మరాఠీ చిత్రంలో ‘మాతా ఏక్ సపూత్ కి దునియా బదల్ దే తు’ అనే హిందీ పాట పాడారు లత. తర్వాత రెండేళ్లకు మాస్టర్ వినాయక్ కంపెనీతో పాటు ఇండోర్ నుంచి బొంబాయికి వచ్చేసింది లత ఫ్యామిలీ. బొంబాయికి రాగానే లత చేసిన మొదటి పని.. హిందూస్తానీ సంగీతంలో మెళుకువల కోసం ఉస్తాద్ అమానత్ అలీ ఖాన్ దగ్గర చేరడం. స్వరాలతో గొంతు శ్రావ్యమైతే.. పాటలు వరాలై కురుస్తాయని లత ఆశ.

ఆయేగా.. అనేవాలా..
‘మహల్’ సినిమాలో లత పాడిన ‘ఆయేగా ఆనేవాలా...’ అమె కెరీర్‌లో ఫస్ట్ హిట్. తర్వాతి దశాబ్దమంతా లతదే! అనిల్ బిస్వాస్, శంకర్ జైకిషన్, ఎస్.డి.బర్మన్, ఖయ్యూమ్ వంటి దిగ్గజ సంగీత దర్శకుల రాగాలతో ఆమె స్వరం సుసంపన్నమైంది.   ఆ తర్వాతి టర్నింగ్ పాయింట్ లతకు 1958లో వచ్చింది. ‘మధుమతి’ సినిమాలో ‘ఆజారే పర్‌దేశీ’ పాటకు వచ్చిన బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ ఫిల్మ్‌ఫేర్ అవార్డు బాలీవుడ్‌లో లతకొక గుర్తింపు తెచ్చిపెట్టింది. 1960లో.. ఆ ఒక్క ఏడాది వచ్చిన రెండు హిట్లు.. ‘ప్యార్ కియా తో డర్‌నా క్యా’ (మొఘల్-ఎ-అజామ్), ‘అజీబ్ దాస్తాన్ హై యే’ (దిల్ అప్‌నా ఔర్ ప్రీత్ పరాయా) హిందీ ఇండస్ట్రీలో తిరుగులేని స్వరరాణిగా నిలబెట్టాయి. లత కమ్మటి నాన్-సినీ గాయని కూడా. 1963లో అప్పటి భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ సమక్షంలో లత ఆలాపించిన దేశభక్తి గేయం ‘యే మేరే వతన్ కె లోగో’ ఆయన చేత కంటతడి పెట్టించింది. ఆ పాట అర్థానికి, ఆ గొంతులోని మార్ధవానికి నెహ్రూ కదిలిపోయారు.  
శిఖరాగ్ర దశాబ్దాలు
లత కెరీర్‌లో 1960, 1970, 1980.. మూడూ శిఖరాగ్ర దశాబ్దాలు. ఈ ముప్పై ఏళ్లలోనూ ఒక్క లక్ష్మీకాంత్-ప్యారేలాల్‌ల దర్శకత్వంలోనే లత 700లకు పైగా పాటలు పాడారు. ఇవిగాక కచేరీలు, విదేశీల టూర్‌లకైతే లెక్కేలేదు. 1990లలో కొత్త గాయనిలు రావడంతో లత వేగం కొంత తగ్గినా, స్వరంలో వాడి తగ్గలేదు. ఆమె స్థానం ఆమెకే సుస్థిరంగా ఉండిపోయింది. లత ప్రస్తుతం పాటల వ్యాపకాలతో, పాత జ్ఞాపకాలతో  కలిసి సాగుతున్నారు.             
 
రెండు జీవితాలు

 నాన్నగారు బతికున్నప్పుడు ఇంటికి వచ్చే అతిథులకు భోజనం పెట్టకుండా పంపించేవాళ్లం కాదు. ఆయన పోయాక మా కుటుంబం అంతా పస్తులున్న రోజులు చాలా ఉన్నాయి. ఒక్కోసారి నాకు, నా చెల్లెళ్లకు, తమ్ముడికి  రోజంతా తినడానికి ఏమీ ఉండేది కాదు. అమ్మ సంగతి సరేసరి.
 
నా పాటలు నేను వినను
 వింటే, ‘ఇంకా బాగా పాడి ఉండాల్సిందేమో’ అనిపిస్తుంది. అందుకే వినను. సాంగ్ రికార్డింగ్ అయ్యాక కూడా వెంటనే రికార్డింగ్ రూమ్ నుంచి వచ్చేస్తాను. పాట ఎలా వచ్చిందని కూడా చూసుకోను. ఈ ధోరణి నా మ్యూజిక్ డెరైక్టర్‌లను అప్పుడప్పుడు చికాకు పరుస్తుండేది.
 
లతాజీ.. ఒక పరిమళం
లతకు కుకింగ్, రీడింగ్, ఫొటోగ్రఫీ, క్రికెట్ ఇష్టం.  లత పేరుతో 1999లో ఒక పెర్‌ఫ్యూమ్ మార్కెట్‌లోకి వచ్చింది. లత అవివాహితగా ఉండిపోయారు.లత ఫీల్డ్‌లోకి వచ్చిన కొత్తలో నూర్‌జహాన్, షంషాద్‌బేగం గాయనీమణులుగా బాలీవుడ్‌ను ఏలుతున్నారు. ఆ నిండైన గొంతుల ముందు లత వాయిస్ పీలగా అనిపించేది డెరైక్టర్లకు, నిర్మాతలకు. అంతెత్తున ప్రౌఢల్లా ఉండే హీరోయిన్‌లు లత గొంతులో ఎలా ఇమిడిపోగలరని వారి సంకోచం!  అలా ఆమెకు చాలా చాన్స్‌లు పోయాయి. పోయాయి కాదు.. అసలుకే రాలేదు.ఆల్‌టైమ్ అందాల నటి మధుబాలకు నమ్మకం... లత గొంతు మాత్రమే తనకు చక్కగా సరిపోతుందని. అందుకే ఆమె ఏ సినిమాకు ఒప్పుకున్నా, తనకు లతే పాడాలని కండిషన్ పెట్టేవారు. అయితే సైరా బానుకు తన గొంతు బాగుంటుందని లత అనుకునేవారు.లతకు ‘భారతరత్న’ (2001), పద్మవిభూషణ్ (1999), దాదాసాహెబ్ ఫాల్కే (1989) తదితర అవార్డులు అసంఖ్యాకంగా వచ్చాయి.
 
నాన్నకు ప్రేమతో...
సినిమాల్లో పాటలు పాడేందుకు వచ్చినంత తేలిగ్గా, నాన్న దగ్గర పాట పాడే చాన్స్ రాలేదు నాకు. ఆయన సంగీతం మాస్టారు. కానీ బయటి పిల్లలకే. నేను కూనిరాగం తీసినా అమ్మ కోప్పడేది. నాన్నకు, అమ్మకు తెలీకుండా నా రాగాలు నేను తీసుకునేదాన్ని. పాటంటే నాకు ఇష్టం. కానీ నాన్నంటే భయం. ఆయన ముందు పాడేదాన్ని కాదు. ఓరోజు నాన్న బయటికి వెళితే ఆయన శిష్యుడు చంద్రకాంత్ గోఖలే (తర్వాత ఆయన మరాఠీలో పెద్ద నటుడు అయ్యారు) పాఠాలు చెప్తున్నారు. ఒక రాగాన్ని ఆలాపిస్తున్నారు. అది అంతకు మునుపు నాన్న పాడుతుండగా నేను విన్నదే. అయితే అది నాన్న పాడినట్లు లేదు. క్లాసులోకి వెళ్లి మీరు తప్పు పాడారు అన్నాను. ‘ఏదీ నువ్వు పాడు’ అన్నారు గోఖలే. పాడాను. ఆ సంగతి నాన్నకు తెలిసింది. మర్నాడు నన్ను క్లాస్‌రూమ్‌కి తీసుకెళ్లారు. అదే పాటను మళ్లీ పాడమని అడిగారు. పాడాను. ఆయన ముఖంలో సంతోషం. ‘సంగీతం నేర్చుకుంటావా?’ అని అడిగారు. తలూపాను. తంబూరా తెచ్చి చేతికి ఇచ్చారు. అలా నా సంగీత అభ్యాసం మొదలైంది. ఆ తర్వాత నాన్నకు నమ్మకం ఏర్పడింది... ఎప్పటికైనా నేనో గొప్ప గాయని అవుతానని. నాన్నకు భవిష్యత్తు కూడా తెలుసు. నువ్వు గొప్పదానివయ్యాక చూసేందుకు నేనుండను అని ఓసారి అన్నారు. అన్నట్లే అయింది. నా చిన్నప్పుడే ఆయన చనిపోయారు. (గత ఏడాది తన  పుట్టిన రోజు సందర్భంగా లత పంచుకున్న ఓ జ్ఞాపకం)

Advertisement
Advertisement