అమ్మాయిలూ... యు కెన్‌ డూ! | Sakshi
Sakshi News home page

అమ్మాయిలూ... యు కెన్‌ డూ!

Published Mon, Oct 9 2017 12:39 AM

 special story to Women's IPS  Meeran Chadha Borwankar

ఖాకీవనంలో ప్రతిచెట్టుకీ మీసాలే. ఆకులు.. అక్కడొకటీ ఇక్కడొకటీ! అంతే. వణికే చిగురుటాకులకు అసలే చోటు ఉండదు. అయితే ఐపీఎస్‌ మీరన్‌ మాత్రం ‘గర్ల్స్‌.. భయం లేదు. వచ్చేయండి. యు కెన్‌ డూ ఇట్‌’ అని వెల్‌కమ్‌ చెబుతున్నారు! తన అనుభవాలు నేర్పిన పాఠాలతో ‘లీవ్‌జ్‌ ఆఫ్‌ లైఫ్‌’ అనే పుస్తకం రాసి.. చిన్న పట్టణాల్లో ఉన్న అమ్మాయిలకు కెరీర్‌ వైపు పచ్చటి కార్పెట్‌ పరుస్తున్నారు.

ఒక మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌ రిటైర్‌ అయ్యాక తన సర్వీసులోని అనుభవాలను ఒక పుస్తకంగా రాస్తే... ఆ పుస్తకంలో ఏముంటుందో ఊహించడం కష్టం కాదు. పోలీస్‌ అకాడమీలో ట్రైనింVŠ  దగ్గర్నుంచి, సీనియర్‌ ఐపీఎస్‌ అధికారిగా రిటైర్‌ అయ్యే వరకు ఒక మహిళగా  ఆమెను అడుగడుగునా ‘నీ వల్ల కాదు కానీ, ఇక ఇంటికి పో’ అని మధ్యలోనే వెనక్కు లాగిన వివక్షలు, ‘చూస్తాం ఎంతకాలం ఈ ఉద్యోగంలో ఉంటావో’ అంటూ ఆమెకు నిరంతరం వెంటాడిన సవాళ్లు, వాటన్నిటినీ తట్టుకుని తనేంటో నిరూపించుకోవడం.. ఇలాంటివన్నీ ఆ పుస్తకంలో ఉంటాయి. జైళ్లు, క్రైమ్‌బ్యూరోల అధినేతగా కూడా పని చేసిన మీరన్‌ చద్ధా బొర్వాంకర్‌ వంటి మహిళా ఆఫీసర్‌కి అయితే.. ఒక పుస్తకం ఏంటి.. పుస్త కాల సీరీస్‌నే రాసినా తరగన ంత ‘టఫ్‌ సర్వీస్‌’ ఉంటుంది. కానీ మీరన్‌ వేరు!

లీవ్‌జ్‌ ఆఫ్‌ లైఫ్‌
మీరన్‌ చద్ధా సెప్టెంబర్‌ 30న బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ జనరల్‌ హోదాలో రిటైర్‌ అయ్యారు. అంతకు రెండు వారాల ముందే పుణె ఇంటర్నేషనల్‌ లిటరరీ ఫెస్టివల్‌లో మీరన్‌ పుస్తకం ‘లీవ్‌జ్‌ ఆఫ్‌ లైఫ్‌’ విడుదలైంది. ఇంగ్లిష్, మరాఠీలలో ఒకేసారి రిలీజ్‌ అయిన ఆ పుస్తకంలో ఉన్నవి 126 పేజీలే! ఆ సన్నటి పుస్తకంలో ఆమె తన నెగటివ్‌ అనుభవాల నుంచి అలవరుచుకున్న పాజిటివ్‌ భావాలను మాత్రమే పొందుపరిచారు. అదీ 14–25 ఏళ్ల వయసులో ఉన్న బాలికలు, మహిళల కోసం! మరీ ముఖ్యంగా.. చిన్న పట్టణాలలోని బి, సి కేటగిరీలకు చెందిన అమ్మాయిల కోసం మీరన్‌ ఈ బుక్‌ రాశారు. అందుకు కారణం ఉంది.  

ఇంగ్లిష్‌ రాని అమ్మాయి
మీరన్‌ ఫాజిల్కా అమ్మాయి. పంజాబ్‌లోని ఒక చిన్న పల్లె లాంటి పట్టణం ఫాజిల్కా. పంజాబీ తప్ప ఇంగ్లిష్‌ రాదు. సివిల్స్‌లో ఎంపికై సర్వీసులో చేరిన కొత్తలో మీరన్‌ చుట్టూ చక్కగా ఇంగ్లిష్‌ మాట్లాడుతుండే పట్టణ ప్రాంతాల సహోద్యోగులు ఉండేవారు. వాళ్లవి కాన్వెంట్‌ చదువులు. చాలా కాన్ఫిడెంట్‌గా ఉండేవారు. మీరన్‌ కూడా వాళ్లతో ఇంగ్లిషులో మాట్లాడేవారు కానీ, అది సొగసైన ఇంగ్లిష్‌ కాదు. ట్రైనింగ్‌లో అయితే ఆమె బ్యాచ్‌మేట్స్‌.. ‘మీరన్‌ పంజాబీలో ఇంగ్లిష్‌ మాట్లాడుతుంది’ అని ఆటపట్టించేవారు. అది పెద్ద సంగతేం కాదు. కానీ.. మాఫియాతో తలపడడం, అక్రమ రవాణా కేసులను శోధించడం, సీక్రెట్స్‌ ఆపరేషన్స్‌ని నిర్వహించడం వంటì  కఠిన పరిస్థితులు మీరన్‌ ఆత్మవిశ్వాసానికి పెట్టేవి! ఆ సందర్భాల నుంచి ఆమె అనేక పాఠాలను నేర్చుకున్నారు. వాటిని మాత్రమే పుస్తకంలో రాశారు.

ఒక రోజు సెలవుకే సంశయం!
పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో మగవాళ్లు ఉంటారు. ఆడవాళ్లు ఉంటారు. మగవాళ్లకు యూనిఫామ్‌ పవర్‌ను ఇస్తుంది. అదే పవర్‌ను ఆడవాళ్లకు వాళ్ల ‘కమిట్‌మెంట్‌’ ఇస్తుంది. ఈ మాట మీరన్‌దే. అనుభవంతో ఆమె ఈ విషయాన్ని తెలుసుకున్నారు. ఒక్క పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ అనే ఏముందీ.. ఏ రంగమైనా మహిళలు రాణిస్తున్నారంటే వృత్తి పట్ల వారికి ఉండే అంకితభావమే అందుకు కారణం అవుతుంది. మీరన్‌కు ఒక్కోసారి పిల్లల కోసం ఒక రోజు సెలవు పెట్టవలసి వచ్చేది. ఆ ఒక్కరోజు సెలవు అడగడానికి ఆమె  సతమతమయ్యేవారు. అందుకే ఆమె పనితీరుపై డిపార్ట్‌మెంట్‌కు అంత గౌరవం. అంత నమ్మకం. ఆ గౌరవం, నమ్మకం ఆమెను సూపర్‌ కాప్‌ను చేశాయి.

జల్‌గావ్‌ సెక్స్‌ స్కాండల్‌
35 ఏళ్ల వయసుకే కెరియర్‌లో కీలకమైన స్థానంలోకి వచ్చేశారు మీరన్‌. అంతేకాదు, 1993–95 మధ్య దేశాన్ని కుదిపేసిన ‘జల్‌గావ్‌ సెక్స్‌ స్కాండల్‌’ కేసులో ఆమె ఒక ముఖ్య విచారణ అధికారి. జల్‌గావ్‌ ప్రాంతానికి చెందిన దాదాపు 300 మంది మైనర్‌ బాలికలను, యువతులను అక్రమంగా రవాణా చేసి, వారిని సెక్స్‌ బానిసలుగా చేసిన ఈ హేయమైన నేరంలో పెద్ద పెద్ద రాజకీయ నాయకుల ప్రమేయం కూడా ఉండడంతో మీరన్‌ విచారణపై అనేక రకాలైన ఒత్తిళ్లు వచ్చాయి. మీరన్‌ భయపడలేదు. చివరి వరకు విచారణ కొనసాగించారు. మీరన్‌ రాసిన పుస్తకంలో ఈ యాంగిల్‌ ప్రధానంగా ఉంది. ‘అమ్మాయిలూ.. మీరు ఎంత ఎక్కువమంది ఉద్యోగాలలో ఉంటే, అంత ఎక్కువగా మహిళలకు సమాజంలో న్యాయం జరుగుతుంది’ అని.

మీరన్‌ కెరీర్‌ గ్రాఫ్‌
►1981 నుంచి 2017 వరకు ఈ 36 ఏళ్ల కాలంలోనూ మీరన్‌ చద్ధా మహారాష్ట్ర కేడర్‌ తొలి ఐపీఎస్‌ ఆఫీసర్‌గా అనేక కీలకమైన బాధ్యతలను నిర్వర్తించారు.
►ముంబై డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీస్‌గా, ఔరంగాబాద్, సతారా జిల్లాల ఎస్పీగా, సి.ఐ.డి. క్రైమ్‌ బ్రాంచ్‌ ఆఫీసర్‌గా పనిచేశారు.
►మహారాష్ట్ర జైళ్ల శాఖ చీఫ్‌గా, న్యూఢిల్లీలోని సి.బి.ఐ. యాంటీ–కరప్షన్‌ బ్యూరోకు డి.ఐ.జి.గా, ముంబైలోని ఐ.బి.ఐ. ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌ హెడ్డుగా అతి ముఖ్యమైన విధులను నిర్వహించారు.
►1997లో మీరన్‌కు మెరిటోరియస్‌ సర్వీసుకు రాష్ట్రపతి అవార్డు లభించింది.

మీరన్‌ ఎడ్యుకేషన్‌
►1971–72 ప్రాంతంలో మీరన్‌ కాలేజీలో ఉన్నప్పుడు కిరణ్‌ బేడీ తొలి మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌గా వార్తల్లోకి వచ్చారు. అది చూసి మీరన్‌ కాలేజీ లెక్చరర్‌ ఒకరు, ‘అమ్మాయ్, నీలో కూడా ఆ క్వాలిటీస్‌ ఉన్నాయి.
►పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు పనికొస్తావు’ అనడంతో మీరన్‌ ఆలోచనలు ఐపీఎస్‌ వైపు మళ్లాయి. అప్పటి వరకు మీరన్‌కు తన ఫ్యూచర్‌ పై స్పష్టత లేదు. బాగా చదివేది, బాగా ఆడేది. అంతవరకే.

మీరా? మీరన్‌?
పిలవడం మీరా అనే. పేరు మాత్రం మీరన్‌ చద్ధా. తండ్రి ఓ.పి.చద్ధా. సరిహద్దు భద్రతా దళంలో పనిచేశారు. మీరన్‌ భర్త అభయ్‌ బొర్వాంకర్‌. ఐ.ఎ.ఎస్‌. అధికారి. రాజీనామా చేసి, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ బిజినెస్‌ పెట్టుకున్నారు. ఇద్దరు మగ పిల్లలు.వ్యక్తిత్వ వికాస గ్రంథాలను చదవడానికి ప్రముఖులు చిన్నతనంగా భావిస్తారు. మీరన్‌ మాత్రం ఇష్టంగా చదువుతారు. కెన్నెత్‌ బ్లాంకార్డ్‌ రాసిన ‘హూ మూవ్డ్‌ మై చీజ్‌’ ఆమెకు నచ్చిన పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌ పుస్తకాలలో ఒకటి.

కసబ్‌.. మెమన్‌.. సంజయ్‌దత్‌!
మహారాష్ట్ర జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌గా ఉన్నప్పుడు మీరన్‌ సామర్థ్యానికి మూడు కఠినమైన పరీక్షలు ఎదురయ్యాయి.

తల మీద బరువు
ముంబై బాంబు పేలుళ్ల (2008) ఉగ్రవాది అజ్మల్‌ కసబ్‌ను అత్యంత రహస్యంగా ఉరి తీయించే బాధ్యతను ప్రభుత్వం మీరన్‌ మీద ఉంచింది. 2012లో పుణెలోని ఎరవాడ జైల్లో నవంబర్‌ 21 ఉదయం 7. 30 నిముషాలకు ఉరితీశారు. కసబ్‌ ఉరికి ముందు ఆ పనులన్నిటినీ పర్యవేక్షించిన మీరన్‌ గంభీరంగానే ఉండగలిగారు కానీ, ఉరి తర్వాత రెండు మూడు రోజుల పాటు తల మీద పెద్ద బరువేదో ఇంకా మిగిలే ఉన్నట్లు ఆమె నలిగిపోయారు. ఉరి తీసేందుకు జరిగే లాంఛనాలు కూడా ఆమెను మానసికంగా చాలా వేధించాయట. నేరస్థులకు ఉరి శిక్ష విధించకుండా, కౌన్సెలింగ్‌తో వారిని మార్చాలన్నది మీరన్‌ వ్యక్తిగత అభిప్రాయం.

మొరాయించిన ఖైదీ
ముంబై బాంబు పేలుళ్లలో (1993) నిందితుడైన సంజయ్‌ దత్‌ పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేశాక అతడిని 2014లో ముంబై జైలు నుంచి ఎరవాడ జైలుకు తరలించవలసి వచ్చింది. అయితే అదంత తేలిగ్గా జరగలేదు. ముంబై జైలు నుంచి కదిలేందుకు మొరాయించాడు. అప్పుడు మీరన్‌ మీడియా కంట పడకుండా ఒక డి.ఐ.జి.ని పంపించి సంజయ్‌ను ఎరవాడకు తెప్పించారు. జైల్లో సంజయ్‌ సభ్యతగా, చట్టంపై గౌరవభావంతో ఉండడాన్ని ఆమె గమనించారు. వారం క్రితం మీరన్‌ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నప్పుడు తన వెనుక ఎవరో ఉన్నట్లు అనిపించి తిరిగి చూశారు. సంజయ్‌ దత్‌! ‘మీరు నన్ను గుర్తు పట్టారా?’ అని దత్‌ని అడిగారు మీరన్‌. ‘ఓ మేమ్‌.. మీరా!’ అని ఆశ్చర్యపోయాడు దత్‌. అంతేకాదు, ‘మేమ్‌ కెన్‌ ఐ ప్లీజ్‌ హగ్‌ యు’ అని కూడా అడిగాడు.

ఉరి ఫోటోలు లీక్‌!
ముంబై బాంబు పేలుళ్ల కేసు (1993)లో దోషిగా నిర్ధారణ అయిన యాకూబ్‌ మెమన్‌ను 2015 జూలై 30న నాగపూర్‌ జైల్లో ఉరితీశారు. అతడిని ఉరితీయించే బాధ్యత కూడా మీరన్‌ మీదే ఉంచింది ప్రభుత్వం. కస ఉరి రహస్యంగా జరిగితే మెమన్‌ ఉరి బహిరంగ రహస్యంగా జరిగింది. చివరి నిమిషం వరకు మెమన్‌ ఉరి రద్దు కోసం ఆయన కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. రాష్ట్రపతి క్షమాభిక్షను తిరస్కరించినప్పుడు ఆ వార్త, ఆ అర్ధరాత్రి మీరన్‌కే ముందు తెలిసింది. అంటే ఉరి తంతుకు సిద్ధంగా ఉండమని. ఆ ఉదయాన్నే మెమన్‌ని ఉరి తీశారు. మీరన్‌ ఇంటికి చేరుకున్నారు! ఆ తర్వాత కొద్దిసేపటికే చీఫ్‌ మినిస్టర్‌ ఆఫీస్‌ నుంచి ఫోన్‌. ఉరి తీస్తున్న ఫొటోలు ఎలా లీక్‌ అయ్యాయి? వాట్సాప్‌లో రౌండ్స్‌ కొడుతున్నాయి చూళ్లేదా అని! మీరన్‌ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత తెలిసిందేమింటే ఏదో సినిమాలో లేడీ ఆఫీసర్‌ దగ్గరుండి ఉరి తీయిస్తున్న సన్నివేశమే ఇలా సోషల్‌ మీడియాలోకి వచ్చిందని!

Advertisement
Advertisement