శ్రీ సత్యదేవుని కల్యాణం చూతము రారండీ...

24 Apr, 2015 00:34 IST|Sakshi
శ్రీ సత్యదేవుని కల్యాణం చూతము రారండీ...

నిత్యం కల్యాణాలతో.. పచ్చని పెళ్లి పందిళ్లతో.. పసుపు బట్టలతో తిరుగాడే నవ దంపతులతో కళకళలాడే రత్నగిరిక్షేత్రం అది.. దేశంలో ఎక్కడా జరగని విధంగా నిత్యం వేల సంఖ్యలో వ్రతాలు జరిగే మండపమది..... కొత్తగా పెళ్లైన జంటలు పసుపుబట్టలతోనే నేరుగా అక్కడకు చేరుకుని వ్రతమాచరించే పుణ్య వేదిక. భక్తితో వచ్చిన ప్రతివ్యక్తికి కడుపునిండుగా భుక్తిదొరికేలా నిత్యాన్నదానానికి పేరుగాంచిన సత్రమది... భక్తజనకోటి బారులుతీరి మైమరచి పరవశించే ప్రాంతంగా విరాజిల్లుతోన్న అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామివారి ఆలయం గురించి తెలియని వారుండరు. అటువంటి సత్యదేవునికి నిత్యకల్యాణంతో పాటు వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలు కూడా ప్రసిద్ధి చెందినవే.

వ్రతానికి ఉన్న విశిష్టతే కల్యాణోత్సవాలకు కూడా ఉంది. ఏడాదికొకసారి నిర్వహించే సత్యదేవుని వార్షిక దివ్యకల్యాణ మహోత్సవాలు ఈనెల 28 నుంచి ప్రారంభమై మే 5వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగనున్నాయి. ఈ నెల 29 రాత్రి 9-30 గంటల నుంచి సత్యదేవుని దివ్యకల్యాణ మహోత్సవం వైభవోపేతంగా జరుగనుంది. స్వామివారు రత్నగిరిపై ఆవిర్భవించినప్పటి నుంచి అంటే గత 124 సంవత్సరాలుగా ఏటా ఈ వార్షిక కల్యాణ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు.  స్వామివారికి  ప్రతినిత్యం దేవేరి శ్రీ అనంతలక్ష్మీ సత్యవతీ అమ్మవారితో కల్యాణం జరుగుతుంది. భక్తులు చూసి తరించేందుకు, వారే కల్యాణకర్తలుగా ఉండి స్వామి కల్యాణం జరిపే అవకాశం దశాబ్దాలుగా  భక్తులకు కలుగుతోంది.

నిత్య కల్యాణం పచ్చతోరణం

శ్రీసత్యదేవుడు, దేవేరి శ్రీఅనంతలక్ష్మీ సత్యవతీదేవి అమ్మవార్లు కొలువైన రత్నగిరిపై స్వామి అమ్మవార్లకు ప్రతీరోజూ కల్యాణం జరగడం ఈ క్షేత్ర విశేషం. నిత్యకల్యాణం పచ్చతోరణంగా ఈ క్షేత్రంలో ప్రతీరోజూ ఉదయం తొమ్మిది గంటల నుంచి 11-30 గంటల వరకూ స్వామి, అమ్మవార్లకు కల్యాణం నిర్వహించడం గత 60 సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది.  స్వామి, అమ్మవార్లకు ప్రతీఏటా వైశాఖమాసంలో శుద్ద ఏకాదశి పర్వదినం నాడు దివ్య కల్యాణాన్ని పండితులు ఘనంగా నిర్వహిస్తారు. వారం రోజుల పాటు కల్యాణ వేడుకలు జరుగుతాయి. ఈ కల్యాణం తిలకించలేక తీవ్ర నిరాశకు గురయ్యే భక్తుల కోసం స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని ప్రతినిత్యం దేవస్థానంలో నిర్వహిస్తూ వస్తున్నారు.

వైశాఖమాసంలో వార్షిక కల్యాణం

శ్రీసత్యదేవుడు, అమ్మవార్లకు దేవస్థానం వారు వైశాఖ శుద్ద దశమి నుంచి బహుళ పాడ్యమి వరకూ (ఈ నెల 28 నుంచి మే5 వరకు) స్వామివారి దివ్యకల్యాణ మహోత్సవాలు నిర్విహ స్తున్నారు. వైశాఖ శుద్ద ఏకాదశి నాడు నిర్వహించే ఈ కల్యాణ వేడుకలను రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చే భక్తులు తిలకించి ముక్తి పొందుతుంటారు. అనంతరం భక్తులకు సత్యదేవుని తలంబ్రాలు పంపిణీ చేస్తారు. ఈ వార్షిక కల్యాణోత్సవాలు జరిగే వారం రోజులు స్వామివారికి నిత్యకల్యాణం నిర్వహించరు. శ్రీసత్యదేవుని కల్యాణానికి పెళ్లి పెద్దలుగా రత్నగిరి క్షేత్రానికి పాలకులైన శ్రీసీతారాములు వ్యవహరిస్తే, శ్రీరామనవమి నాడు జరిగే శ్రీ సీతారాముల కల్యాణానికి శ్రీసత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా వ్యవహరించడం విశేషం.
 - లక్షింశెట్టి శ్రీనివాసరావు, సాక్షి, రాజమండ్రి

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా