దక్షిణ ధ్రువానికి దక్షిణాన ఏముంటుంది? | Sakshi
Sakshi News home page

దక్షిణ ధ్రువానికి దక్షిణాన ఏముంటుంది?

Published Mon, Jan 8 2018 12:33 AM

Stephen is the British astronomer - Sakshi

ఈ ప్రశ్న ‘.. మీనింగ్‌లెస్‌’ అంటారు స్టీఫెన్‌ హాకింగ్‌. భూ మండలానికి ఆవల చిట్టచివర్న ఉన్నది దక్షిణ ధ్రువమే అయినప్పుడు, దానికి మళ్లీ దక్షిణం వైపు ఏమిటీ అని ఆయన చికాకు, లేదా చిరునవ్వు. సాధారణంగా స్టీఫెన్‌ ఎప్పుడూ చికాగ్గా కనిపించరు. పోప్‌లా ప్రశాంతంగా ఉంటారు! ఎప్పుడైనా ఆ చిరునవ్వుకు చికాకు కూడా తోడయిందంటే ‘లాజిక్‌’కి అందని అమాయకత్వం ఏదో ఆయన్ని ఎదురుగా వచ్చి ప్రశ్నించిందనే మనం అర్థం చేసుకోవాలి!

స్టీఫెన్‌ బ్రిటిష్‌ ఖగోళశాస్త్రవేత్త. ఇప్పుడున్న శాస్త్రవేత్తలలో మోస్ట్‌ రెస్పెక్టబుల్‌. ఇవాళ ఆయన పుట్టిన రోజు. 76వ బర్త్‌డే.  విశ్వాంతరాళాల్లో ఏముందో చెప్పగలరు స్టీఫెన్‌ హాకింగ్‌. అంతేకాదు, ఏం లేదో కూడా చెప్పగలరు! ఎంతటి శాస్త్రవేత్త అయినా ఉన్నదానిని శోధించి చెప్పగలడు కానీ, ఏం లేదో ఎలా చెప్పగలడు? కానీ స్టీఫెన్‌ చెప్పారు. ‘దేవుడు లేడు’ అని చెప్పాడు. ఆయన నాస్తికుడు. అందుకని దేవుడు లేడు అని చెప్పలేదు. ఆయన లాజిక్‌కి దేవుడు అందలేదు.

అందుకని చెప్పారు. ఎవరు దేనిని నమ్మితే దాని నుంచే కదా ప్రపంచాన్ని చూస్తారు. స్టీఫెన్‌ లాజిక్‌ని నమ్మారు. లాజిక్‌లోంచి ఈ విశ్వాన్ని చూశారు. అందులో దేవుడు కనిపించలేదు. అదే మాట చెప్పారు. అయితే ‘నాకు కనిపించలేదు’ అని చెప్పలేదు. ‘నేను నాస్తికుడిని’ అన్నారు. ‘నమ్మను’ అని ఆ మాటకు అర్థం. ‘ఒకవేళ దేవుడు నిజంగా కనిపించినా నేను నమ్మను’ అనేది అంతరార్థం. స్టీఫెన్‌ వంటి నిక్కచ్చి పరిశోధకులకు దేవుడు కనిపించినంత మాత్రాన సరిపోదు. తమ పరిశోధనల్లో దేవుడికి కనీసం పాస్‌ మార్కులైనా రావాలి. దేవుడికి అంటే.. దేవుడి ఉనికికి.

రెండేళ్ల క్రితం నవంబర్‌లో ఈ భూగోళంపై ఒక అపూర్వమైన ఘటన సంభవించింది. రెండు భిన్న ధ్రువాలు ఒకదానికొకటి బాగా సమీపానికి వచ్చాయి. ఒక ధ్రువం పోప్‌ ఫ్రాన్సిస్‌. ఇంకో ధ్రువం స్టీఫెన్‌ హాకింగ్‌. వాటికన్‌ సిటీలో సైన్స్‌ కాన్ఫరెన్స్‌ జరుగుతుంటే అక్కడికి ప్రత్యేక అతిథిగా వచ్చారు స్టీఫెన్‌. ఆయన్ని ప్రత్యేకంగా పలకరించడానికి వచ్చారు పోప్‌ ఫ్రాన్సిస్‌. పోప్‌ రావడానికి సాధారణ కారణం కూడా ఒకటి ఉంది. కాన్ఫరెన్స్‌ని నిర్వహిస్తున్న ‘పాంటిఫికల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌’.. పోప్‌ పరిధిలోనిదే. 1935లో అప్పటి పోప్‌ పాయెస్‌ ఆ అకాడమీని నెలకొల్పారు! మేథమేటిక్స్‌లో, ఫిజిక్స్‌లో, నేచురల్‌ సైన్సెస్‌లో అక్కడ నిరంతరం పరిశోధనలు జరుగుతుంటాయి. చాలా చిత్రంగా ఉంటుంది ఆలోచిస్తే. దేవుణ్ణి అంగీకరించని సైన్స్‌ని.. దేవుణ్ణి నమ్మేవారు అభివృద్ధి పరచడం!!

ఆ రోజు కాన్ఫరెన్స్‌లో ‘బిగ్‌ బ్యాంగ్‌’ థియరీపై మాట్లాడారు స్టీఫెన్‌. మహా విస్ఫోటనం (బిగ్‌ బ్యాంగ్‌) జరిగి ఈ సృష్టి ఏర్పడిందన్నది కదా... థియరీ, దానిని సమర్థిస్తూ మాట్లాడారు స్టీఫెన్‌. ఎవరో అడిగారు.. ‘బిగ్‌ బ్యాంగ్‌కి ముందు ఏముండేది ఈ విశ్వంలో మిస్టర్‌ స్టీఫెన్‌?’ అని. అప్పుడే ఆయన అన్నారు.. ‘‘సౌత్‌ పోల్‌కి సౌత్‌లో ఏముంటుందీ?’’ అని. ‘దేవుడు లేడు’ అని నిరూపించడానికి స్టీఫెన్‌ శాస్త్రవేత్త కాలేదు.

‘దేవుడు ఉన్నాడు’ అని చెప్పడానికే పోప్‌ ఫ్రాన్సిస్‌ ఈ భూమిపై జన్మించారేమో.. అదీ చెప్పలేం. ‘ఉంటే చూపించు’ అని అడగడం లాజిక్‌. ‘చూడు ఉంటాడు’ అని చెప్పడం విశ్వాసం. భూ మండలానికి ఆవల ఉన్నట్లే మానవులలోని రెండు వ్యతిరేక ధ్రువాలు.. తర్కం, విశ్వాసం. రెండిటినీ కలిపే మాట ఒకటి చెప్పారు పోప్‌ ఫ్రాన్సిస్‌. ‘బిగ్‌ బ్యాంగ్‌ ఈజ్‌ ఏన్‌ యాక్ట్‌ ఆఫ్‌ గాడ్స్‌ లవ్‌’ అని. పైకి వేర్వేరుగా ఉన్నా, లోపల ఎక్కడో ఒకచోట కనెక్ట్‌ అయి ఉండటమే మానవ జీవితంలోని సౌందర్యం, సంపూర్ణత్వం. ఈ రెండూ కలిసి ఉన్నదే దైవత్వం.
 


∙మాధవ్‌ శింగరాజు

Advertisement

తప్పక చదవండి

Advertisement