నాలుగు ముంజెలు చారెడు చక్కెర.... | Sakshi
Sakshi News home page

నాలుగు ముంజెలు చారెడు చక్కెర....

Published Thu, May 12 2016 12:31 AM

నాలుగు ముంజెలు చారెడు చక్కెర....

వేసవి జ్ఞాపకం...
ఎండాకాలంలో వీధుల్లో తాటిముంజల మనిషి తిరగడం ఒక కళ. పచ్చివాసనలేసే తాటి ఆకుల్లో వొలిచిన తాటి ముంజెల్ని చుట్టి కావడి బద్దకు వేళ్లాడగట్టి అటూ ఇటూ పచ్చటి కట్టలను భుజాన మోస్తూ ‘తాటి ముంజలో’ అని తిరగడం ఎండ పూట మెరిసే ఒక ఊరి కళ. కాని అమ్మేవాళ్లలో చాలా మందికి ఈ ఓపిక ఉండదు. చెట్టు నుంచి దించిన గెలల్ని నేరుగా తీసుకొని బజారుకు వచ్చేస్తారు. కొడవలితో తీపి చిలకరింతలు పెట్టడానికి సిద్ధమవుతారు. తినేవారికి కొదవా? చుట్టూ మూగుతారు. నాకొకటి నాకొకటి అని తాటిముంజెల్ని అందుకుని పొడిచి తినడానికి బొటనవేలును స్పూన్‌లా మార్చేస్తారు. మూడు కన్నులు తేలిన తాటికాయను ఒక చేతిలో బౌల్‌లాగా పట్టుకొని మరో చేతి బొటనవేలుతో ఒక్కో ముంజెను పొడిచి పొడిచి తింటారు.

కొన్ని ముంజెల్లో నీళ్లు నిండుగా ఉంటాయి. వేలు పొడవగానే చివ్వున లేచి ముఖాన కొడతాయి. అవి నేల పాలు కాకుండా నోటికి పట్టి గుటకాయస్వాహా చేయడం పెద్ద నైపుణ్యం. ఇక పిల్లలకైతే ముంజెల బండి దగ్గర నిలుచోవడం సరదా. ఎండ పూట ఏదో ఒక కూడలిలో చెట్టు నీడన బండి ఆపి ముంజెలమ్మే మనిషి ఒక్కో తాటికాయను కోరిన వారికి కొట్టి కొట్టి ఇస్తూ ఉంటే చూడటం పిల్లలకు వేడుక. ఒక్కోసారి దయదలిచిన వారు వాళ్లకూ ఒక కాయ ఆఫర్ చేయవచ్చు. రెండు ముంజెలు తిని మూడోదాన్ని వాళ్లకు వదిలిపెట్టవచ్చు. ఖాళీ చేసిన తాటికాయను బండి చక్రంగా మార్చుకోవడం ఒక ఆట. రెండు తాటికాయలను రెండు చక్రాలుగా చేసి మధ్యలో పుల్ల గుచ్చి తాటి ఆకు చీలికను పుల్లకు ముడి వేసి ముడి చివరన పురికోస కట్టి లాక్కూంటూ వెళ్లడం ఇన్నోవా క్రిస్టా కంటే తక్కువ లగ్జరీ కాదు.

కొందరు ఒక పంగా కర్ర చివరన ఒక తాటికాయను గచ్చి దానిని స్టీరింగ్‌లా వాడుతూ పంగతో బండి తోసుకెళ్లడం కూడా ముద్దులొలికే ఆట. ముదురు బెండకాయే కాదు ముదురు తాటిముంజ కూడా తినడానికి పనికి రాదు. తింటే కడుపులో నొప్పి పడుతుంది. అసలు వైభోగం అంటే ఏమిటంటే మంచి ఎండపూట తాటి ముంజెలు కొనుక్కొని వచ్చి భోజనం చేశాక తీరిగ్గా వొలిచి చిన్న ముక్కలుగా చేసి ఒక స్టీలు పాత్రలో పోసి పైన చక్కెర జల్లి ఫ్రిజ్‌లో పెట్టి మధ్యాహ్నం కునుక్కు ఉపక్రమించాలి. నిద్ర లేచే సరికి ముంజెలు చల్లబడి చక్కెరపట్టి నోటికి హాయిగా కడుపుకు చల్లగా సిద్ధంగా ఉంటాయి.

కెఎఫ్‌సి, మెక్‌డొనాల్డ్స్‌లా తాటిముంజెలు ప్రచారం చేసుకోలేకపోవచ్చు. సమ్మర్ ఆఫర్స్ ప్రకటించకపోవచ్చు. కాని వేళ్లు దిగిన సంస్కృతి వందలఏళ్లైనా పోదు. కాకుంటే గుర్తు పెట్టుకొని ఒక తరం నుంచి ఇంకో తరానికి అందించాలి. ఈ వేసవిలో పిల్లలకు తాటి చెట్టు చూపించండి. తాటి ఆకు చూపించండి. తాటి ముంజె చూపించండి. బండి దగ్గర ఆగి కొట్టిన తాటి ముంజెన చేతికి ఇస్తే బొటన వేలు గుచ్చగానే నీళ్లు వారి ముఖాన జివ్వున కొడుతూ ఉంటే వారు నవ్వుతూ ఉంటే మీరూ ఫక్కున నవ్వండి. వేసవికి ఇవ్వదగ్గ మర్యాద ఇదే అని గ్రహించండి.

Advertisement
Advertisement