గట్టి విశ్వాసి కలకాలం నిలుస్తాడు

4 Aug, 2013 02:23 IST|Sakshi
గట్టి విశ్వాసి కలకాలం నిలుస్తాడు

 ఎంతటి విషమ పరిస్థితినుండైనా తమను దేవుడు గట్టెక్కిస్తాడన్న ఆశావాదాన్ని యూదులు ప్రతి ఏడాది ‘హనుక్కా’ అనే దీపాలు వెలిగించే పండుగ ద్వారా గుర్తు చేసుకుంటారు. యూదులను హిట్లర్ ఊచకోత కోస్తున్నప్పుడు జర్మన్ ‘మరణ శిబిరం’ (కాన్‌సన్ ట్రెమ్ క్యాంపు)లో ఒక యూదు మతబోధకుని కుటుంబం మరణానికి చేరువలో ఉండగా, ఆ పండుగ వచ్చింది. తండ్రి తమవద్ద ఉన్న కొద్ది వెన్నలో తన అంగీపేలికనొకదాన్ని వత్తిగా అమర్చి ‘హనుక్కా దీపం’ వెలిగించాడు. ‘నాన్నా, ఈ కొద్దివెన్న కూడా కరిగిపోతే మనకిక చావే గతి’ అన్నాడు కొడుకు. ‘తిండి లేకుండా కొన్ని రోజులు బతకొచ్చు కానీ విశ్వాసం, నిరీక్షణ కోల్పోతే ఒక్కక్షణం కూడా బతకలేము’ అన్నాడు తండ్రి. ఆయనన్నట్టే ఆ కుటుంబం ప్రాణాలతో బయటపడింది. ఆయన కొడుకులిద్దరూ గొప్ప వాణిజ్యవేత్తలయ్యారు.
 
 బబులోనురాజైన నెబకద్నెజరు అరవైమూరల బంగారు ప్రతిమను ప్రతిష్టించి, తన రాజ్యప్రజలంతా దానికే మొక్కాలని ఆదేశించాడు. ఆయనవద్దే అధికారులుగా ఉన్న షడ్రక్, మేషాకు, అవెద్నిగో అనే ముగ్గురు యూదు యువకులు, తమ దేవునికి తప్ప మరొకరికి సాగిలపడే ప్రసక్తే లేదంటూ రాజాజ్ఞను ధిక్కరిస్తే, రాజు ఉగ్రుడై ఏడింతల ఎక్కువ వేడి ఉన్న అగ్నిగుండంలో వారిని పడవేయించాడు. ‘మా దేవుడు మమ్మల్ని రక్షిస్తాడు. రక్షించకపోయినా సరే మేము మాత్రం నీ ప్రతిమకు నమస్కరించేది లేదు’ అన్నారు ఆ ముగ్గురూ. అగ్నిగుండంలో ఆ ముగ్గుర్నీ పడవేసినవాడు వేడికి తాళలేక చనిపోయాడు కానీ, ఆ ముగ్గురూ అగ్నిగుండంలో కూడా క్షేమంగానే ఉండిపోయారు. పైగా ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురికీ తోడుగా ఒక నాల్గవవ్యక్తి దేవుని సన్నిధికి ప్రతినిధిగా ఉండడం చూసి రాజు అచ్చెరువు పొంది వారిని వెలికి తీయించాడు. వారిని కాపాడిన దేవుడే నిజమైన దేవుడని అంగీకరించి, ప్రకటించి రాజ్యమంతా ఆయననే ఆరాధించాలని ఆదేశించాడు (దానియేలు 3:1-29).
 
 దేవుడు రోషం కలిగినవాడు. ఆ దేవుని సంతానమైన విశ్వాసి కూడా రోషంగానే బతుకుతాడు తప్ప ఎంత నష్టమైనా, కష్టమైనా శత్రువుకు తలవంచకూడదు. తనకు తలవంచని దాన్ని పాదాక్రాంతం చేసుకోవడానికి ఎన్ని ఉచ్చులు బిగించినా, సంకెళ్లు వేసినా, పన్నాగాలు చేసినా ‘ఇదిగో నేను యుగసమాప్తి పర్యంతం సదాకాలం మీతో కూడా ఉన్నాను (మత్త 28:20) అన్న యేసుక్రీస్తు వాగ్దానం ముందు అవన్నీ ఓడిపోవలసిందే. అగ్నిగుండంలో తన సన్నిధిని తోడుగా ఇచ్చిన దేవుడు విశ్వాన్ని చీకటిలోనైనా, లోయల్లోనైనా, కన్నీళ్లలోనైనా, జైలులోనైనా ఎడబాయడు.

 

అగ్నిగుండాలు, సంకెళ్లు, కుట్రలు దేవుని సంకల్పాలను నిర్వీర్యం చేయగలిగితే, లోకంలో మంచి ఎప్పుడో సమాధి ఉండేది. ఉన్న దీపాన్ని ఆర్పేసి శత్రువు చీకటిని కటికచీకటి చేయగలడేమో కాని సూర్యోదయాన్ని ఆపగలిగే శక్తి ఉంటుందా? మామూలు వ్యక్తుల జయాపజయాలు యుద్ధరంగంలో నిర్ణయమవుతాయి. కాని విశ్వాసి విజయం యుద్ధానికి ముందే ప్రార్థనానుభవంలో ప్రభువు సంకల్పంతో నిర్ణయమవుతుంది. గడ్డుకాలం ఎప్పుడూ ఉండదు కాని దాన్ని ప్రతిఘటించే గట్టి విశ్వాసి కలకాలం ఉంటాడు. ఉన్నట్టుండి ముగింపుకు వచ్చినట్టుగా కనిపించిన రహదారి దగ్గరికెళ్లేసరికి మరో మలుపు తిరుగుతుంది. ఆ మలుపే విజయమిస్తుంది. అడవిలో క్రూరమృగాలు పెడబొబ్బలు పెడితే మహావృక్షాలు మౌనంగా, నిశ్చలంగా నవ్వుకుంటాయి. ఎందుకంటే ఎప్పటికైనా అడవి తమదే, తామే కాబట్టి.
 
 - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్

 హితవాక్యం: దుర్మార్గంతో చేసే పోరాటంలో ఓడిపోయినా కిరీటమే దక్కుతుంది.
 - సి.ఎస్. లూయిస్
 

Read latest Family News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా