బంగారు ఈతరం | Sakshi
Sakshi News home page

బంగారు ఈతరం

Published Fri, Dec 23 2016 10:43 PM

బంగారు ఈతరం

డార్విన్‌ సిద్ధాంతం ప్రకారం చేప నుంచి కోతి...
కోతి నుంచి మనిషి... పరిణామం చెందాడని మనకు తెలుసు!
చేప చెట్లెక్కలేదు.. కోతి ఈదలేదు.. మరి మనిషి?
మనిషి మనసు పెడితే రెండూ చేయగలడు..
నిజానికి మనిషి మనసు పెడితే ఏదైనా చేయగలడు!!
ఈ విషయం ఈతరానికి చెప్పడానికి ఈతను మించిన సాధనం లేదు!!
డిప్రెషన్‌లో మునగకుండా... సక్సెస్‌లో తేలడానికి
ఈత ఎంత అవసరమో ఈతరం చెబుతోంది!!


‘ఆంటీ.. అమ్మ నాలుగు టమాటాలిమ్మంది’ అంటూ పరిగెత్తుకొచ్చింది పదకొండేళ్ల సిరి. అప్పటికి ఆ పిల్ల అలా రావడం మూడోసారి ఒకటిస్తూ, ఒకటి తీసుకెళ్తూ!‘ఇలా మాటిమాటికీ వచ్చే బదులు ఒక్కసారే కావల్సినవి తీసుకెళ్లొచ్చుగదే.. అయినా లిఫ్ట్‌ ఉండగా అలా మెట్ల మీద నుంచి రాకపోతే యేం..?’ ప్రేమగా విసుక్కుంది శాంతి టమాటాల కవర్‌ సిరికి అందిస్తూ. ‘మెట్ల మీద నుంచి రావడమే నాకు ఇష్టం’ అంటూ ఆ కవర్‌ను చటుక్కున అందుకొని మెరుపు వేగంతో మాయమైంది ఆ పిల్ల అక్కడి నుంచి. హూ.. అని నిట్టూరుస్తూ వెనక్కి తిరిగిన శాంతికి... డ్రాయింగ్‌ రూమ్‌లో సోఫాలో చేరగిలపడి కంప్యూటర్‌ గేమ్స్‌ ఆడుతున్న కొడుకు కనిపించాడు. ఈ లోకంలో లేడు. ఆ గేమ్‌లో లీనమయ్యాడు. వాడిదీ సిరి వయసే. ఊబకాయం. కూర్చున్న చోటి నుంచి కదలడు. సోడాబుడ్డి కళ్లద్దాలు. టీవీ, లేకపోతే కంప్యూటర్‌ తప్ప ఇంకో వ్యాపకం లేదు. ఎప్పుడూ బద్ధకంగా.. నిస్సత్తువగా.. నీరసంగా కనిపిస్తాడు. ఇంకోసారి సిరి గుర్తుకొచ్చింది. పొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు ఒకే ఉత్సాహంతో కనిపిస్తుంది. ‘భలే చురుకైన పిల్ల.. ’ అనుకుంటూ వంటింట్లోకి వెళ్లింది శాంతి.  

సిరిని చూసి ఒక్క శాంతే కాదు.. ఆ కాంప్లెక్స్‌లో ఉన్న చాలా మంది పేరెంట్స్‌ ముచ్చట పడుతుంటారు. ఆటలు, పాటలు, చదువు అన్నిట్లో ఫస్టే! అందరితో కలివిడిగా ఉంటుంది. దేనికీ భయపడదు. పదిమందిలోనైనా జంకుగొంకు లేకుండా మాట్లాడుతుంది. పేరెంట్స్‌ అందరూ తమ పిల్లలకు సిరీనే ఎగ్జాంపుల్‌గా చూపిస్తుంటారు. కాని రెండేళ్ల కిందటి వరకు సిరి కూడా ఆ కాంప్లెక్స్‌లో ఉన్న అందరి పిల్లల్లాగే ఉండేది. లేజీనెస్‌కి సినానిమ్‌లా! 24 గంటలూ టీవీకి, కంప్యూటర్‌కి అతుక్కొని. నెలకు రెండుసార్లు జబ్బు పడేది. స్కూల్‌ అటెండెన్స్‌ కూడా సరిపోయేది కాదు.

ఎలా మారింది?
రెండేళ్ల కిందట వేసవి సెలవులకు నానమ్మ ఊరు వెళ్లింది. పల్లెటూరు. నెల రోజులు గడిపింది. అక్కడ ఈత నేర్చుకుంది. కొత్త ఉత్సాహంతో తిరిగివచ్చింది. సిరిని చూసి వాళ్లమ్మ, నాన్నే ఆశ్చర్యపోయారు... తమ బిడ్డలో ఇంత మార్పా అని! సిరిని తీసుకెళ్లి.. తిరిగి తీసుకొచ్చిన తన తమ్ముడిని అడిగింది సిరి తల్లి ‘ఏరా... అక్కడ నా కూతురికి అమ్మ ఏం పెట్టింది ఏంటి? అది లేడిపిల్లలా గెంతుతోంది’ అని.
‘ఈత నేర్పించాం అంతే’ అన్నాడు ఆమె తమ్ముడు. సీక్రెట్‌ ఆఫ్‌ ది యాక్టివ్‌నెస్‌ అర్థమైంది ఆమెకు. తమ ఇంటికి దగ్గర్లోని స్విమ్మింగ్‌ ట్రైనింగ్‌లో సిరిని చేర్పించింది. మూడు నెలల్లోనే... ముచ్చటైన మార్పు బద్ధకమే కాదు.. కోపం కూడా ఎక్కువే ఉండేది సిరికి. తనేదైనా అడిగిందంటే ఆ క్షణంలో ఇవ్వాల్సిందే. తోటి పిల్లలతో కూడా సరిగ్గా ఉండేది కాదు. ప్రతి పనినీ వాయిదా వేసేది. హోంవర్క్‌ కూడా. టీచర్ల నుంచి రోజూ కంప్లయింట్లే సిరి  మీద. అలాంటిది... వేసవి సెలవుల్లో నెల, హైదరాబాద్‌ వచ్చాక స్విమ్మింగ్‌లో చేరిన రెండు నెలలు.. అంటే మొత్తం మూడునెలల్లో.. సిరి ప్రవర్తన మారిపోయింది. స్టడీస్‌ పట్ల ఫోకస్, ఏకాగ్రత పెరగడం మొదలు.. తోటి పిల్లలతో సంయమనంతో ఉండడం వరకూ అన్నిట్లో మార్పే. ఒకసారి సైకియాట్రిస్ట్‌కి చూపించండి అని సలహాలిచ్చిన టీచర్లే.. ఎక్సలెంట్‌  బిహేవియర్‌ అని రిపోర్ట్‌లో రాశారు. మార్కులూ బాగా వస్తున్నాయ్‌.

కొంచెం టైమ్‌ దొరికినా బయటకు వెళ్లి ఆడుకుంటోంది. అన్నిటికన్నా వాళ్లమ్మ సంతోషించిన విషయం.. సిరి ఆరోగ్యం. మాటిమాటికీ జబ్బుపడడం లేదు. ఈ మూడు నెలల్లో గమనించదగ్గ పొడవు పెరిగింది. బలంగా అయింది. స్పోర్ట్స్‌ అంటే బోర్‌ అనే సిరి స్విమ్మింగ్‌లో జాయిన్‌ అయ్యాక స్పోర్ట్స్‌ పట్ల చాలా ఇంట్రెస్ట్‌ చూపించింది. స్కూల్లో బాస్కెట్‌ బాల్‌లో జాయిన్‌ అయింది – వాళ్ల అమ్మానాన్నకు చెప్పకుండానే. చేస్తున్న పని మీద శ్రద్ధ పెడుతోంది. పని పూర్తయ్యే వరకు పట్టువీడట్లేదు. ఇంట్లో అమ్మకూ సహాయం చేస్తోంది. నలుగురు కనపడితే చాలు జంకే పిల్ల పదిమందిని లీడ్‌ చేస్తోంది. అందరిచేత శభాష్‌ అనిపించుకుంది.

ఇది సిరి అనే అమ్మాయి విజయ రహస్యం మాత్రమే కాదు.. పిల్లలందరికీ  స్విమ్మింగ్‌ ఇచ్చే స్ఫూర్తి కూడా. బడి పాఠం కన్నా బలమైన పాఠం ఈత నేర్పుతుంది. కాలంతో పోటీపడే తత్వాన్ని ఇస్తుంది. సాగరం ఈదగలగడమంటే భవసాగారాన్ని ఈదగలగడమే! అందుకే ఈత.. అద్భుతమైన పాఠం! ఆత్మరక్షణ ఆయుధం కూడా అంటారా? అదొక్క భాగం మాత్రమే! ఏకాగ్రత కుదురుకోవడం దగ్గర నుంచి సహనం అలవడడం మొదలు.. భావోద్వేగాలను నియంత్రించుకునే శక్తి సంతరించుకోవడం వరకు ఒకటా రెండా.. జీవితానికి కావలసినన్ని క్వాలిటీస్‌నిస్తుంది. మైండ్‌ అండ్‌ బాడీ ఏకకాలంలో ఒకే వేగంలో కదలడం బహుశా ఈతలోనే సాధ్యమేమో. మైండ్‌ అండ్‌ బాడీ కో–ఆర్డినేషన్‌కు ఈతను మించిన ఆట లేదు. మనసును, శరీరాన్ని చురుకుగా ఉంచుతుంది.

పిల్లల కదలికలు టీవీ, కంప్యూటర్లకే పరిమితమైపోయిన ఈ కాలంలో నీళ్లతో ఆడుకుంటూ ఆకాశాన్ని గమనించే అవకాశాన్ని.. ప్రకృతిని ఆస్వాదించే వరాన్ని ఈతే అందిస్తుంది. దాంతో తెలియకుండానే పిల్లల్లో పర్యావరణ స్పృహను కల్పిస్తుంది. అలల రూపంలో వచ్చే అడ్డంకులతో పోరాడే లైఫ్‌ స్కిల్స్‌నూ బోధిస్తుంది. పిల్లల మెదళ్లలో ముసుగేసి పడుకున్న బద్ధకాన్ని చల్లటి నీళ్లతో చరిచి చప్పున పారదోలుతుంది. చేపపిల్లకున్న చురుకుదనాన్ని ఇస్తుంది. నేలను తన్ని పైకెగసే పట్టుదలను పెంచుతుంది. మెదడు, శరీరం – రెండిటికీ శ్రమనిచ్చి దృఢపరుస్తుంది. ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. అనాటమీని వివరిస్తుంది. విజయతీరాన్ని చేరడానికి అవసరమయ్యే స్థితప్రజ్ఞత అలవరుస్తుంది. అందుకే పిల్లలకు ఈత నేర్పాలి.  గ్రామాలు మొదలు.. నగరాల దాకా అన్నిటికీ,  అందరికీ అవసరమైన, అందుబాటులో ఉండే ఈ జలకాలాట,  అనారోగ్యం దరిచేరనివ్వని ఆట.. నేర్చుకుంటే జీవితం బంగారు బాటే! విజయాల మూటే!

స్వివ్‌ు ‘సిద్ధి’
ఈత నేర్చుకుంటున్న ఈ పిల్లలందరూ ఇష్టపడే కోచ్‌ జాన్‌ సిద్ధిఖీ. కేవలం కోచ్‌గా మాత్రమే కాదు ఫ్రెండ్‌గా దిశా నిర్దేశం చేసే గురువుగా కూడా సిద్ధిఖీ పిల్లల మనసు గెలుచుకున్నారు. ఈత వంటి క్రీడను ఇష్టంగా నేర్చుకోవాలంటే శిక్షణ ప్రదేశంలో కూడా ఇంటి వాతావరణం ఉండాలని నమ్ముతారాయన. అంతేకాదు సాయంత్రాలు తమ ఆవరణలోనే పిల్లలకు డిన్నర్‌ ఏర్పాటు చేస్తారు. వాళ్లతో కలిసి డిన్నర్‌ చేస్తారు. ఎవరికి ఎంత శిక్షణ ఇవ్వాలో ఎంచి ఇస్తారు. అందుకు కూడా సిద్ధిఖీ అంటే పిల్లలకు ఇష్టం. ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాన్‌ సిద్ధిఖీ (45) పాతికేళ్లుగా హైదరాబాద్‌లో ఉంటూ ఎయిర్‌ఫోర్స్‌ తరపున స్విమ్మింగ్‌ క్రీడాకారుడిగా, ఎయిర్‌ ఫోర్స్‌ నేవీ విభాగానికి కోచ్‌గా పని చేశారు. సరైన శిక్షణ ఇస్తే అంతర్జాతీయ స్థాయి ఈతగాళ్లు తయారవుతారని భావించి తన వంతుగా పాఠశాల చిన్నారులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు.  కూకట్‌పల్లి ప్రగతినగర్‌లో  స్విమ్మింగ్‌పూల్‌ కేంద్రంగా శిక్షణ ప్రారంభించి ఆరేళ్ల స్వల్ప వ్యవధిలోనే  జిల్లా, రాష్ట్ర. జాతీయ స్థాయిలో ఇప్పటిదాకా 400కుపైగా మెడల్స్‌ను తన విద్యార్థులు సాధించేలా శిక్షణనిచ్చారు. తదుపరి లక్ష్యం ఏషియన్‌ గేవ్స్‌ు, ఆ తర్వాత ఒలింపిక్‌ గేమ్స్‌ అని పేర్కొన్నారు.

డిసిప్లిన్‌ పెరిగింది
నేను నైన్త్‌ చదువుతున్నా. వన్‌ ఇయర్‌ నుంచి స్విమ్మింగ్‌ నేర్చుకుంటున్నా. స్విమ్మింగ్‌ వల్ల చదువు పట్ల ఓ ప్యాషన్‌ ఏర్పడింది. అదర్‌ హాబీస్‌ని, స్టడీస్‌ను బ్యాలెన్స్‌ చేసుకోవడం నేర్చుకున్నా. డిసిప్లిన్‌ కూడా పెరిగింది. నెగటివ్స్‌ను పాజిటివ్‌గా ఎలా మలచుకోవాలో అర్థమవుతోంది. – నతాషా పట్నాయక్, నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌

అర్థం చేసుకోగలుతున్నా
మూడేళ్ల నుంచి ఈత నేర్చుకుంటున్నా. ఈ మూడేళ్లలో నాలో చాలా మార్పులు వచ్చాయి. ఏకా్రVýæత పెరిగింది. ఏక కాలంలో చాలాపనులు చేయగల్గుతున్నా. స్విమ్మింగ్‌ చేసేటప్పుడు మ్యాథమెటిక్స్, న్యూట్రిషన్, బయాలజీ, ఫిజిక్స్‌ లాంటివాటితో లింకు అర్థం చేసుకోగలుతున్నా. – ట్రీనా తనూజ్, నేషనల్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌

సెల్ఫ్‌కాన్ఫిడెన్స్‌ వచ్చింది
సెవెన్త్‌ చదువుతున్నా. వన్‌ ఇయర్‌ నుంచి ఈత నేర్చుకుంటున్నా. అంతకుముందు చాలా బద్ధకంగా ఉండేదాన్ని. స్విమ్మింగ్‌లో జాయిన్‌ అయ్యాక .. ప్రతి సెకనూ చాలా విలువైనది అనిపిస్తోంది. సెల్ఫ్‌ కాన్ఫిడెన్స్‌ పెరిగింది. ఐ బిలీవ్‌ ఇన్‌ మై సెల్ఫ్‌ మచ్‌ మోర్‌ నౌ.
– ఇష్వి, స్టేట్‌ గోల్డ్‌ మెడలిస్ట్‌

కమ్యూనికేషన్‌ మెరుగైంది
నైన్త్‌ చదువుతున్నా. నాకు ఏడేళ్లున్నప్పుడు స్విమ్మింగ్‌ స్టార్ట్‌ చేశా. డేను, వీక్‌ను ప్లాన్‌ చేసుకోవడం, టైమ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా తెలుస్తోంది. కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ పెరిగాయి. కాన్ఫిడెన్స్‌ పెరిగింది. నేషనల్, ఇంటర్నేషనల్‌ స్విమ్మర్స్‌ను చూసి చాలా ఇన్‌స్పైర్‌ అవుతాం. ఎమోషన్స్‌ కంట్రోల్‌ చేసుకోవడం తెలుస్తోంది. మైండ్‌ అండ్‌ బాడీ మీద గ్రిప్‌ వచ్చింది. ఇమ్యూనిటీ పెరిగింది.
– జాహ్నవి, నేషనల్‌ మెడలిస్ట్‌

కొత్తవాళ్ళు ఫ్రెండ్స్‌ అవుతున్నారు
సెవెన్త్‌ చదువుతున్నా. వెన్‌ ఐ వజ్‌ సిక్స్‌.. అప్పటి నుంచి స్మిమ్మింగ్‌ నేర్చుకుంటున్నా. టైర్డ్‌ మేనేజ్‌మెంట్‌ బాగా తెలుస్తోంది. స్విమ్మింగ్‌ వల్ల జాయ్‌ఫుల్‌గా ఉండడమెలాగో తెలుస్తోంది. కొత్త కొత్త వాళ్లు ఫ్రెండ్స్‌ అవుతున్నారు. కొత్త ప్లేసెస్‌కు ఎక్స్‌పోజ్‌ అవుతున్నా.   – చంద్రిక, స్టేట్‌మెడలిస్ట్‌ స్వర్ణాలు సాధిస్తున్న  ఖుషి, శ్రీజ, ట్రీనా, జాహ్నవి (పై వరుస); ఇష్వి, హంసిని (కింది వరుస

– సరస్వతి రమ, ఎస్‌.సత్యబాబు

Advertisement

తప్పక చదవండి

Advertisement