భావన గుర్తుంది కదూ! | Sakshi
Sakshi News home page

భావన గుర్తుంది కదూ!

Published Wed, Jul 22 2015 12:31 PM

భావన గుర్తుంది కదూ! - Sakshi

స్పాట్‌లైట్: భావన గుర్తుంది కదూ! అదేనండీ...‘కేరింత’లో చాలా లవ్లీగా, లైవ్లీగా నటించిన కొత్త అమ్మాయి. ఆమె అసలు పేరు సుకృతి అంబటి. ఫ్రమ్ ఢిల్లీ. అలాగని తను నార్త్ ఇండియన్ అనుకునేరు. పక్కా పదహారణాల తెలుగమ్మాయి. అదే తనని అడిగితే ‘‘మాది నెల్లూరు జిల్లా కావలి. నాన్నగారు సివిల్ ఇంజనీర్. ఆయన ఉద్యోరీత్యా 27 ఏళ్ల క్రితమే ఢిల్లీలో స్థిరపడిపోయాం. అందుకే నా బార్న్ అండ్ బ్రాటప్ అంతా ఢిల్లీలోనే’’ అని చెప్పారు సుకృతి.

మరి ఈ బీటెక్ భామకు ‘కేరింత’లో నటించే అవకాశం ఎలా వచ్చింది... అంటే అంతా యాదృచ్చికంగా జరిగిందంటారు సుకృతి. ‘కల్చరల్ యాక్టివిటీస్ ఏవో ఉన్నాయంటే కురుక్షేత్ర యూనివర్శిటీకి వెళ్లా. అక్కడ మా బంధువుల ద్వారా ‘కేరింత’ స్టార్ హంట్ గురించి తెలిసింది. సరదాగా నా ఫొటోలు, నేను యాక్ట్ చేసిన వీడియోలు పంపించా. వాళ్లకు నచ్చేసి నన్ను భావన పాత్రకు ఎంపిక చేసేశారు’’ అంటూ గలగలా చెప్పేశా. ‘నిజంగా... సినిమాల్లో యాక్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదా?’’ అని  అడిగితే , ‘‘సినిమాలు చూడటం ఇంట్రస్టే కానీ, యాక్ట్ చేయాలని ఎప్పుడూ అనుకోలేదు.

అయితే మొదట్నుంచీ నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం. స్కూల్లో, కాలేజీలో ఎక్కడైనా డాన్స్ కాంపిటీషన్ జరిగినా నేను కంపల్సరీగా ఉండాల్సిందే’’ అని చెప్పారు. మరి ఈ సినిమా ప్రయాణం ఎలా మొదలైందని అడిగితే -‘‘నాకు భావన పాత్ర గురించి చెప్పి ఓ రెండు సీన్స్‌లో యాక్ట్ చేయించారు. ఇక నా ఫస్ట్ షాట్‌లో నాకసలు డైలాగ్స్ లేవు. మా ఫ్రెండ్స్ అందరం కలిసే సన్నివేశం అది. అలా ‘యాక్షన్’ అన్నారో లేదో... వెంటనే ‘కట్’ చెప్పేశారు. మా అల్లరి కైతే అంతుండేది కాదు... చాలా హాయిగా గడిచిపోయింది. నా తెలుగులో అక్కడక్కడా హిందీ పదాలు దొర్లేవి. ఇక నేను డైలాగ్స్ చెబుతూ ఉంటే అందరూ నవ్వేసేవారు.

ఈ సినిమా పుణ్యమా అని తెలుగు చాలా బాగా వచ్చేసింది. సినిమాలో ఎలాగైతే నూకరాజు (పార్వతీశం)ను ఆటపట్టిస్తానో...సెట్‌లో కూడా అంతే.. ఈ సినిమాలో నా కో-యాక్టర్స్ అందరూ నాకు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ’’ అని సెట్‌లో విశేషాలు చెబుతూ మురిసిపోయారు. సౌందర్య, మహేశ్‌బాబు, నిత్యామీనన్ అంటే చాలా ఇష్టమని చెబుతున్న సుకృతిని తన నటన మీద ఎవరి ప్రభావమైనా ఉందా అని అడిగితే- ‘‘లేదు.. ఒకవేళ నిజజీవితంలో అలాంటి సంఘటనలు ఎదురైతే నేనెలా ప్రవర్తిస్తానో గుర్తు తెచ్చుకుని దర్శకుడు చెప్పినట్టు నటిస్తానంతే’’ అంటూ సింపుల్‌గా చెప్పేశారు.

ఈ సినిమా విడుదలయ్యాక తన ఫ్యామిలీ రెస్పాన్స్ గురించి చెబుతూ-‘‘మా బంధువులు, స్నేహితులందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ సినిమా ప్రీమియర్ షో చూస్తున్నంత సేపు మా నాన్నగారు చప్పట్లు కొడుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ‘దిల్’ రాజు గారు షో అయిపోయాక చెప్పారు’’ అని అన్నారు. మరి ఆఫర్లు  వస్తున్నాయా అంటే-‘‘ బాగానే వస్తున్నాయి కానీ రెండో సినిమా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నా. సినిమాలో నాకంటూ ఓ ప్రాధాన్యం ఉండాలి. కథ మీద  ప్రభావం చూపించాలి. అలా వచ్చి ఇలా వెళిపోతే ఇంకెందుకు నటించడం అని నా ఫీలింగ్’’ అని తన మనసును ఆవిష్కరించారీ సరికొత్త తెలుగు కృతి-సుకృతి.
 - శశి

Advertisement

తప్పక చదవండి

Advertisement