టీవీ చర్చలలో మహిళల స్థానం ఎక్కడ? | Sakshi
Sakshi News home page

టీవీ చర్చలలో మహిళల స్థానం ఎక్కడ?

Published Tue, Feb 19 2019 2:06 AM

The survey shows that women are very small in discussion programs - Sakshi

ట్రిపుల్‌ తలాక్‌ వంటి విషయాల మీద చర్చలు జరుగుతుంటే, అందులో మహిళల కంటే పురుషులే అధికంగా ఉంటున్నారు. మతాలు, నేరాలకు సంబంధించిన వాటిలో 30 శాతం మంది పాల్గొంటుంటే, ఒక్క మహిళను కూడా ఆహ్వానించటం లేదని ఈ సర్వే చెబుతోంది. క్రీడల విభాగం, వ్యవసాయానికి సంబంధించిన అంశాలలో కూడా స్త్రీలకు స్థానం కల్పించట్లేదు. పోలీసు విభాగం నుంచి ఒక్కరిని కూడా ఆహ్వానించట్లేదని, చర్చా కార్యక్రమాలలో మహిళలు చాలా తక్కువగా ఉంటున్నారని ఈ సర్వే చెబుతోంది.

పస్తుతం టీవీ యుగం నడుస్తోంది. వార్తా చానెల్స్‌లో నిత్యం ఏదో ఒక అంశం మీద చర్చాకార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఇందులో ఎంతోమంది పాల్గొంటూనే ఉంటారు. కానీ, వారిలో మహిళలు మాత్రం చాలా తక్కువగా ఉంటున్నారు. ఈ విషయం మీద ఎన్‌డబ్ల్యూఎంఐ (నెట్‌వర్క్‌ ఆఫ్‌ ఉమెన్‌ ఇన్‌ మీడియా ఇన్‌ ఇండియా) ఒక సర్వే నిర్వహించింది.12 భాషలకు చెందిన 28 చానెల్స్‌లో ఈ సర్వే చేశారు.

ఇంగ్లీషు – 6, హిందీ – 4, గుజరాతీ, పంజాబీ, ఉర్దు, తమిళం, తెలుగు, మలయాళం, బంగ్లా, ఒడియా, అస్సామీస్, మరాఠీ భాషలన్నీ కలిపి 18 చానెల్స్‌లోను ఈ సర్వే నిర్వహించారు. ప్రతి చానెల్‌ నుంచి ఒక ప్రైమ్‌టైమ్‌ న్యూస్‌ షో, ఒక టాప్‌ వీక్లీ టాక్‌ షోల ఆధారంగా రివ్యూ చేశారు. ఇందులో అహ్మదాబాద్, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, ఢిల్లీ, అస్సాం, కోల్‌కతా, ముంబై, పుణేలకు చెందిన 11 మంది ఎన్‌డబ్ల్యూ ఎంఐ సభ్యులు పాల్గొన్నారు. ఈ సర్వేలో, మూడు వంతులమంది మేల్‌ యాంకర్లే ఉన్నారని తేలింది. ఈ వివక్ష హిందీ చానెల్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంది. 

భారతీయ టీవీ న్యూస్‌ చానల్స్‌లో...
ప్రముఖ వ్యాఖ్యాతలుగా మహిళలు 13.6 శాతం, పురుషులు 86 శాతం ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. సాధారణంగా చర్చాకార్యక్రమాలలో చర్చలో కేవలం ఒక్క మహిళను మాత్రమే ప్రతినిధిగా పిలుస్తున్నాయి చానల్స్‌. గుజరాతీలో 21 శాతం, తమిళం, పంజాబీలలో 5 శాతం మాత్రమే. బంగ్లా, తెలుగులలో 11 శాతం, మలయాళంలో 10 శాతం ఉన్నారు. మహిళా సమస్యల మీద చర్చించే వారిలో మహిళలు తక్కువగా ఉండటం చాలా ఆశ్చర్యం. రాజకీయాలకు సంబంధించిన చర్చలలో కేవలం 8 శాతం మాత్రమే ఉంటున్నారు. 

వివక్ష తగ్గాలి...
చానెల్స్‌లో ఈ వివక్ష తగ్గేలా చూడాలని, మహిళలను అన్ని అంశాలకు చెందిన చర్చలలోకి ఆహ్వానించాలని, చర్చలో మహిళల గొంతు ఎక్కువగా వినిపించాలని ఈ సర్వే చేసిన మహిళలు ఆశిస్తున్నారు. సీనియర్‌ మేల్‌ యాంకర్లతో ప్రోగ్రాములు చేయిస్తుంటారు కాని, సీనియర్‌ మహిళలను మాత్రం విధుల నుంచి తొలగిస్తుంటారని, ఇది ఎంతవరకు న్యాయమని వీరు ప్రశ్నిస్తున్నారు. 13.6 శాతం మహిళలు, 86 శాతం పురుషులు ఈ చర్చలలో పాల్గొంటున్నారు. దీనిని బట్టి మహిళలు గొంతు విప్పి తమ సమస్యలను చెప్పుకోలేకపోతున్నారని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం సున్నితమైన అంశాలకు మాత్రమే కాకుండా, అన్ని అంశాల మీద చర్చకు మహిళలను ఆహ్వానించాలని చెబుతున్నారు ఈ సర్వే ద్వారా.
డా. వైజయంతి
(ఢిల్లీలో ఇటీవల జరిగిన 14వ జాతీయ మహిళా జర్నలిస్టుల సదస్సు నుంచి)

Advertisement
Advertisement