అచ్చతెలుగు భావన | Sakshi
Sakshi News home page

అచ్చతెలుగు భావన

Published Fri, Sep 8 2017 12:07 AM

అచ్చతెలుగు భావన

నాటి  సినిమా

‘డామిట్‌. ఏమిటి ఇదంతా. ఇక మీదట ఎవరికి వారం వేరే వేరే’ అంటాడు రేలంగి ఆ ఊరికి వచ్చి. అతడు పారిస్‌ చూశాడట. రంగూన్‌లో ఉన్నాడట. అమెరికా గురించి తెలుసట. అక్కడ పెళ్లిళ్లు కాగానే పిల్లల్ని వేరే కాపురాలు పెట్టించేస్తారట. అన్నదమ్ములు పెద్దవాళ్లు కాగానే ఎవరికి వారు చలో అని ఎటుకటు వెళ్లిపోతారట. మొగుడూ పెళ్లాలు వాళ్ల దారి చూసుకుంటారట. ముసలి తల్లిదండ్రులు వారి గోల వారు పడతారట. ‘ఒక్క ఇండియాలోనే ఇలా ఉమ్మడి కుటుంబాలు కలిసి కాపురాలు’ అని ఈసడించుకుంటాడతడు. ఆ మాట చెప్పి ఆ ఇంట్లో విషబీజం నాటుతాడు.

అదొక అందమైన పల్లెటూరు. ఇద్దరు అన్నదమ్ములు– ఎస్‌.వి. రంగారావు, పెరుమాళ్లు. వాళ్లు తమ వంశ పెద్దలు చెప్పినట్టుగా చిన్నప్పటి నుంచి కలిసే ఉంటున్నారు. పెద్దయ్యాక కూడా కలిసే బతుకుతున్నారు. అన్న మాట అంటే తమ్ముడికి గౌరవం. తమ్ముడి ఉనికిని చూసి అన్నకు అభిమానం. కాని అన్న భార్య సూర్యకాంతంకు ఈ అభిమానాలూ పాశాలూ లేవు. ఆమెకు నోటి కారం ఉంది కాని కడుపు చల్లదనం లేదు. పిల్లలు పుట్టలేదు. అందువల్ల ఎస్‌.వి.రంగారావు తన తమ్ముడి పిల్లలను అభిమానిస్తుంటే సహించలేకపోతుంటుంది. ఆ తమ్ముడి పిల్లల్లో పెద్దవాడు చెయ్యీ కాలూ వంకర ఉన్నవాడు అయిన ఎన్‌.టి.రామారావును చూస్తే ఇంకా ఈసడింపు.

ఎన్‌.టి.రామారావు పుట్టడం సజావుగానే పుట్టాడు. కాని తన ఎనిమిదో ఏట కరెంటు తీగకు అల్లుకున్న గాలిపటం కోసం ఎక్కి కరెంటు షాకు తగిలి కాలూ చేయీ నష్టపరుచుకున్నాడు. అతని అవయవాలు మాత్రమే వంకర. కాని మనసుకు వంక పెట్టడానికి లేదు. పెదనాన్నను, పెద్దమ్మను అభిమానిస్తుంటాడు. తమ్ముడిని ప్రాణంలా చూసుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులను ఆరాధిస్తుంటాడు. ఏవో చిన్న చిన్న సమస్యలు తప్ప వారంతా కలసి ఉండి జీవిస్తున్నారు.

అలాంటి సమయంలో సూర్యకాంతం అన్నకుమారుడు రేలంగి రంగూన్‌ నుంచి చెల్లెలితో సహా ఊడి పడతాడు. సూర్యకాంతంను ‘అల్తై’ అని పిలుస్తూ ‘నాకు నువ్వు తప్ప ఎవరున్నారు అల్తై’ అంటూ దిగిపోతాడు. ఇంతకీ ఇతడి దగ్గర ఏముంది? వంచన ఉంది. మోసం ఉంది. అల్పత్వం ఉంది. దగుల్బాజీతనం దండిగా ఉంది. దొంగనోట్లు మార్చి వారినీ వీరిని ఏమార్చి బతుకుతున్న ఇతను ఆ కల్లాకపటం లేని పల్లెటూరికి వచ్చి తిష్ట వేస్తాడు.

అత్తకు పిల్లలు లేరు కనుక ఆ ఆస్తిని అనుభవించాలని ఆమెను రెచ్చగొడతాడు. తన చెల్లెలు గిరిజతో ఎన్టీఆర్‌ తమ్ముడు హరనాథ్‌కు గేలం వేయిస్తాడు. హరనాథ్‌ బాగా చదువుకుని వృద్ధిలోకి రాబోతూ ఉన్నాడు. కుటుంబానికి అండగా ఉండబోతున్నాడు. అలాంటి వాడు గిరిజతో పెళ్లి కోసం రేలంగి మాయలో పడి తల్లిదండ్రులకు దూరమైపోతాడు. అన్నదమ్ముల గుండెలు బద్దలు కొడుతూ ఇంటి మధ్య ఒక గోడ వెలుస్తుంది. అటు వైపు తమ్ముడు కుటుంబం. ఇటు వైపు అన్న కుటుంబం. అన్న కుటుంబంలో శనిలా రేలంగి. తమ్ముడి కుటుంబంలో నిస్సహాయంగా వికలాంగుడైన ఎన్టీఆర్‌.

కాని మనసు మంచిగా ఉన్నవాళ్లకు అంతా మంచే జరుగుతుంది. ఎన్టీఆర్‌కు అనాథ పిల్ల అయిన సావిత్రి భార్యగా వస్తుంది. వారు పట్నం చేరుకుని వైద్యం చేయిస్తే ఎన్టీఆర్‌కు కాలూ చేయీ కూడా వస్తుంది. మరో వైపు రేలంగి మాయలో పడ్డ సూర్యకాంతం నాశనం అవుతుంది. సర్కస్‌ పెడతానని చెప్పి ఆమె దగ్గర పాతికవేలు అతడు కాజేశాడు. అంతటితో ఆగక హరనాథ్‌ ఆఫీసు నుంచి అతడి చేత మరో పాతిక వేలు తెప్పించి అతణ్ణి కష్టాల్లో పడేశాడు. ఆ మొత్తం డబ్బు వేరెవరో ఎగరేసుకుపోతే తానూ కష్టాల్లో పడ్డాడు. చివరకు మోసం తెలుస్తుంది. రేలంగి, సూర్యకాంతం, హరనాథ్‌ అందరూ బుద్ధి తెచ్చుకుంటారు. ఇంటి మధ్య గోడ బద్దలవుతుంది. కలిసి మెలిసి ఉన్న ఆ కుటుంబాన్ని చూస్తే ప్రేక్షకులకు ఆనందం కలుగుతుంది.

1961లో తాపీ చాణక్య దర్శకత్వంలో వచ్చిన ‘కలసి ఉంటే కలదు సుఖం’ సినిమా వాస్తవానికి తమిళంలో శివాజీ గణేశన్‌ నటించిన ‘భాగ పిరవినై’ సినిమాకి రీమేక్‌. తమిళంలో సూపర్‌హిట్‌ అయిన ఆ సినిమాను తెలుగులో ఎన్టీఆర్‌ను పెట్టి తీయాలనుకోవడం సాహసమే. ఎందుకంటే ఎన్టీఆర్‌ వంటి మాస్‌ హీరో కాలూ చేయీ వంకరగా పెట్టి నటించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోవచ్చు. కాని ఎన్టీఆర్‌ ఎంతో గొప్పగా ఈ సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటారు. ఒక అమాయకత్వం, మొండి తనం, మొరటుదనం ఆయన పాత్రలో కనిపిస్తాయి. ఆయనకు జోడీగా సావిత్రి కనిపిస్తారు. వీళ్లిద్దరి మీద చిత్రీకరణ జరుపుకున్న డ్యూయెట్‌ ‘ముద్దబంతి పూలు బెట్టి మొగలి రేకులు జడన చుట్టి’ పాట ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది.

ఎస్‌.వి.రంగారావు నటన చెప్పే పని లేదు. సూర్యకాంతం పేరు ‘సౌభాగ్యం’ అయితే ఆమెకు జడిసే భర్తగా ఆమె వైఖరి నచ్చని భర్తగా ఆమెను ‘దౌర్భాగ్యం’ అని పిలుస్తూ మనం బాగా ఎరిగిన మనిషిలా కనిపిస్తాడు. తెలుగులో రేలంగి వేసిన పాత్రను తమిళంలో ప్రఖ్యాత కేరెక్టర్‌ ఆర్టిస్ట్‌ ఎం.ఆర్‌. రాధ వేశాడు. ఆయన తరహా నటన తెలుగులో నాగభూషణం చేయగలరు. కాని రేలంగి కూడా ఈ పాత్రను సవాలుగా తీసుకుని చేయడం మనం చూస్తాం. ఎం.ఆర్‌.రాధా పొడుగు పొడుగు డైలాగులు గుక్క తిప్పుకోకుండా చెప్పడంలో స్పెషలిస్ట్‌. రేలంగి చాలా చిన్న డైలాగులు చెప్తారు. అయినప్పటికీ రాధాలాగే రేలంగి కూడా ఈ సినిమాలో చాలా పెద్ద డైలాగులు వేగంగా ఒడుపుగా చెప్పి తనేం తక్కువ తినలేదు అని నిరూపిస్తారు.

కలసి ఉంటే కలదు సుఖం ప్రభావం ఆ తర్వాత వచ్చిన చాలా సినిమాలలో ఉంది. ‘పండంటి కాపురం’, ‘దసరా బుల్లోడు’ సినిమాల్లో ఈ కథ ఛాయలు కనిపిస్తాయి. అలాగే ఎనభైలలో వచ్చిన ‘సంసారం ఒక చదరంగం’ సినిమాలో కూడా ఇంటి మధ్యలో గీత గీసి తండ్రీ కొడుకులు వేరు పడటం చూడవచ్చు. ఇవాళ తెలుగులో వస్తున్న సీరియల్స్‌ కూడా ఇలాంటి గోడలు, గీతలను ఫాలో అవుతున్నాయి.

ఒకటి వాస్తవం. దగ్గరగా ఉండి మానసికంగా దూరంగా మసిలే కన్నా దూరంగా ఉన్నా కూడా మానసికంగా దగ్గరగా ఉండటమే పెద్ద ఆస్తి. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి వారు వేరు వేరుగా ఉంటున్నా కనీసం మానసికంగా దగ్గరగా ఉండాల్సిన అవసరం చాలా ఉంది. అది కూడా లేకపోతే జీవితం విషాదకరం అవుతుంది. మనవాళ్లు... మనం.. అదే కలసి ఉంటే కలదు సుఖం.

భారతీయులు దగ్గరగా జీవించడం తెలిసినవారు. దగ్గరి తనంలోని గొప్పతనానికి వేల ఏళ్ల క్రితం తెలుసుకుని బతికినవారు. విడి విడిగా ఉండే యూరప్‌ సంస్కృతి మన దేశంలో నెమ్మదిగా ప్రవేశించింది. విడివిడిగా ఉండటంలోని సౌకర్యాలను భారతీయులు గ్రహించారు. గత యాభై ఏళ్లలో ఈ ధోరణి బాగా పెరిగింది. కాని దీని వల్ల నిజమైన ఆనందం నిజమైన సౌకర్యం పొందగలుగుతున్నారా? అమ్మమ్మలు నానమ్మలు లేని ఇల్లు, బాబాయ్‌లు పిన్నమ్మలు లేని ఇల్లు, చిన్నాన్నలు పెదనాన్నలు కలిసి ఉండని ఇల్లు నిజంగానే సౌకర్యంగా ఉంటున్నాయా? శుభ కార్యాలలో అశుభ కార్యాలలో కష్టాలలో వేడుకులలో మనిషి తోడు లేకపోవడం గురించి ఈ ఇళ్లు ఆలోచించడం లేదా? అయిన వాళ్ల ఆబ్సెన్స్‌ వల్ల అవస్థ పడటం లేదా? పాతవన్నీ మళ్లీ వస్తాయి కాబోలు. కొత్తొక రోత అని గ్రహించి పాతను అక్కున చేర్చుకుంటారు కాబోలు. మళ్లీ ఉమ్మడి కుటుంబాలు వస్తాయి కాబోలు. అలాంటి స్ఫూర్తిని అందించడానికి ‘కలిసి ఉంటే కలదు సుఖం’లాంటి నాటి సినిమాలు ఎప్పుడూ ఉంటాయి.
-  కె

Advertisement
Advertisement